కరోనావైరస్: స్పుత్నిక్‌ వి టీకాలు భారత్‌ వచ్చాయ్‌ - Press Review

కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రతీకాత్మక చిత్రం
ప్రచురణ

కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు రష్యాలో అభివృద్ధి చేసిన కోవిడ్‌ స్పుత్నిక్‌ వి టీకాలు భారత్‌కు వచ్చాయని ఈనాడు ఓ కథనంలో తెలిపింది.

భారత్‌లో ఈ వ్యాక్సిన్‌పై 2-3 దశల క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు అనుమతులు దక్కిన సంగతి విధితమే. త్వరలోనే పరీక్షలు మొదలుపెట్టనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ అధికారి ఒకరు తెలిపారు.

డాక్టర్‌ రెడ్డీస్‌, స్పుత్నిక్‌ వి అన్న లోగోలున్న వాహనం నుంచి చిన్న పాటి కంటైనర్లను కిందకు దించుతూ ఒక వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌ వి’వ్యాక్సిన్‌ కోవిడ్‌ నిరోధానికి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని గమలేయా, రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) ఒక ప్రకటనలో తెలిపాయి.

దాదాపు 40,000 మంది వాలంటీర్లపై రష్యాలో నిర్వహించిన అతిపెద్ద మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన తొలి మధ్యంతర డేటా ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఆ సంస్థలు వివరించాయి.

డాక్టర్‌ రెడ్డీస్‌, ఆర్‌డీఐఎఫ్‌, రష్యా సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌లు భారత్‌లో ఈ వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి సెప్టెంబరు 2020న ఒప్పందం కుదుర్చుకున్నాయి.

భారత నియంత్రణ సంస్థల అనుమతుల అనంతరం 10 కోట్ల డోసులను డాక్టర్‌ రెడ్డీస్‌కు ఆర్‌డీఐఎఫ్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 11, 2020న రష్యాలో స్పుత్నిక్‌ వి ని రిజిస్టర్‌ చేశారు.

సైబర్ నేరాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

హెర్బల్‌ ఆయిల్‌ పేరుతో రూ. 52 లక్షలకు టోకరా

హెర్బల్‌ ఆయిల్‌ సరఫరా చేస్తామంటూ హైదరాబాద్‌కు చెందిన ఒకరి నుండి సైబర్‌ మోసగాళ్లు రూ. 52 లక్షలు స్వాహా చేసినట్లు సాక్షి పత్రిక ఓ వార్త ప్రచురించింది.

ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కె. కొండల్‌ రెడ్డి వీఎస్‌ఏ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలను అవసరమైన సామగ్రిని ఆయన సరఫరా చేసేవారు. ఆయనకు ఆన్‌లైన్‌ ద్వారా జుమాక్‌ ఫార్మాస్యుటికల్స్‌ ప్రతినిధిగా చెప్పుకున్న జాన్‌ డానియల్‌తో పరిచయం ఏర్పడింది.

ఆక్సోనో హెర్బల్‌ ఆయిల్‌ లిక్విడ్‌ కావాలని ఆయన కొండల్‌రెడ్డిని కోరాడు. అయితే జుమాక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా చెప్పుకున్న మరో వ్యక్తితో లావాదేవీలు నిర్వహించిన కొండల్‌ రెడ్డి సదరు ఆయిల్‌ కొటేషన్‌ను అతనికి పంపాడు. తర్వాత వారు తమకు తొలివిడతగా 500 లీటర్ల ఆక్సోనో హెర్బల్‌ ఆయిల్‌ కావాలని కొండల్‌రెడ్డికి ఆర్డర్‌ చేశాడు.

జుమాక్‌ సంస్థ ప్రతినిధులు సూచించిన విధంగా ఈ ఆయిల్‌ కోసం కొండల్‌ రెడ్డి మణిపూర్‌లోని ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధిగా చెప్పుకున్న రాకేష్‌ కుమార్‌ను సంప్రదించారు. ఆయిల్‌ సరఫరా కోసం రూ. 42.63 లక్షలను రాకేష్‌ చెప్పిన ఖాతాలకు పంపాడు.

అయినా వారు ఆయిల్‌ను పంపలేదు. ఈలోగా ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధిగా చెప్పకున్న హరిప్రీత్‌... కొండల్‌ రెడ్డికి ఫోన్‌ చేసి మరో రూ. 10 లక్షలు పంపాలని లేని పక్షంలో ఆర్డర్‌ క్యాన్సిల్‌ అవుతుందని చెప్పాడు. దీంతో వారు చెప్పినట్టుగానే రూ.10 లక్షలు పంపినా ఆయిల్‌ రాకపోగా... ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధిలుగా చెప్పుకున్న రాకేష్‌ కుమార్, హరిప్రీత్‌ల ఫోన్లు స్విచాఫ్‌ అయ్యాయి.

మోసపోయానని గ్రహించిన బాధితుడు కొండల్‌రెడ్డి మంగళవారం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌కుమార్‌ తెలిపారు.

పులి

ఫొటో సోర్స్, AFP

గిరిజన విద్యార్థిపై దాడిచేసి చంపిన పులి

‘‘పెద్దపులి ఓ గిరిజన విద్యార్థిపై దాడి చేసింది. ఆపై కిలోమీటరు దూరం లాక్కెళ్లి ప్రాణం తీసింది. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహేగాం మండలం దిగిడ గ్రామానికి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది’’అని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

మృతుడి కుటుంబీకుల వివరాల ప్రకారం.. దిగిడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సిడాం విఘ్నేశ్‌(21) బుధవారం ఉదయం పెద్దవాగు సమీపంలోని తమ చేనుకు కాపలా కోసం వెళ్లాడు. పెద్దవాగులో తన స్నేహితులు పొరితెట్టి నవీన్‌, సిడాం శ్రీకాంత్‌తో కలిసి చేపలు పట్టాడు. కొన్ని చేపలు చిక్కిగా వాటిని ఉంచేందుకు ఆకుల కోసం విఘ్నేశ్‌ అడవి దగ్గర్లోకి వెళ్లాడు.

అక్కడే నక్కి ఉన్న పులిని చూసిన విఘ్నేశ్‌ దాని నుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న పొదల్లో దాక్కున్నాడు. ఆకుల కోసం వెళ్లిన విఘ్నేశ్‌ తిరిగిరాకపోవడంతో శ్రీకాంత్‌, నవీన్‌ అతడిని వెతుక్కుం టూ వెళ్లారు. పులిని దూరం నుంచి గమనించిన వీళ్లు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు.

భారీ సంఖ్యలో జనం పెద్దవాగు వద్ద వెతికారు. విఘ్నేశ్‌పై దాడి చేసిన పులి అతడిని కిలోమీటరు దూరం వరకు అడవిలోకి లాక్కెళ్లింది. గ్రామస్థుల అలికిడిని గ్రహించి విఘ్నేశ్‌ను వదిలి అడవిలోకి వెళ్లింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడ్డ విఘ్నేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసిన విఘ్నేశ్‌, డిగ్రీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం కాలేజీలు సాగకపోవడంతో ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. విఘ్నేశ్‌ చెల్లెలు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నది.

విఘ్నేశ్‌పై దాడి చేసింది ‘మ్యాన్‌ ఈటర్‌' పులి రాజూరా కాదని అటవీశాఖ స్పష్టంచేసింది. మహారాష్ట్ర చంద్రాపూర్‌ నుంచి కవ్వాల్‌ కారిడార్‌లోకి వచ్చి మనుషులను చంపడానికి అలవాటు పడ్డ రాజూరా ఈ దాడికి పాల్పడ్డట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ‘రాజూరా’కు చంద్రాపూర్‌ వద్ద అక్కడి అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి బంధించి గోరేవాడ ‘జూ’కు తరలించారని అధికారులు పేర్కొన్నారు.

శృంగారం

ఫొటో సోర్స్, BBC THREE / PARYS GARDENER

అశ్లీల వెబ్‌సైట్ లింకు పెట్టి.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు

ఓ ప్రేక్షకుడికి అశ్లీల వెబ్‌సైట్ లింకు పెట్టిన శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌(SVBC) ఉద్యోగిని బుధ‌వారం విధుల నుండి తొల‌గించారని వెలుగు ఓ కథనం ప్రచురించింది.

ఈ ఏడాది సెప్టెంబ‌రు నెల‌లో వెంక‌ట క్రిష్ణ అనే భ‌క్తుడు శ‌‌త‌మానం భ‌వ‌తి కార్యక్రమానికి సంబందించిన వివ‌రాల‌ను ఇ-మెయిల్ ద్వారా కోరారు. అయితే, ఎస్వీబీసీ ఉద్యోగి sb@svbcttd.org నుండి భక్తుడికి అశ్లీల‌ వెబ్ సైట్ కు సంబంధించిన లింక్ పంపించారు. దీనిపై భ‌క్తుడు టిటిడి ఛైర్మ‌న్‌, ఈవోల‌కు పిర్యాదు చేశారు.

ఈ విష‌యంపై స్పందించిన‌ టిటిడి చైర్మ‌న్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో డా.కె.ఎస్‌.జవహర్ రెడ్డి విచార‌ణ‌కు ఆదేశించారు. విచారణలో భాగంగా టిటిడికి చెందిన 25 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ అడిట్ చేశారు.

సైబర్ సెల్ టీం దర్యాప్తులో మరో ముగ్గురు లేదా నలుగురు ఉద్యోగులు ఇలాంటి పనులు చేసినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది ఉద్యోగులు ఇలాంటి పనులు చేశారో పరిశీలించి వారిని కూడా ఉద్యోగం నుండి తొలగిస్తామని తెలిపారు ఎస్వీబీసీ సిఇవో. ఈ విచార‌ణ‌లో వాస్త‌వాలు రుజువు అయినందున ఎస్వీబీసీ ఉద్యోగి వెంక‌ట క్రిష్ణని వెంటనే ఉద్యోగం నుండి తొల‌గించామన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)