అర్ణబ్ గోస్వామికి బెయిల్ మంజూరు - Newsreel

అర్ణబ్ గోస్వామి

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి, మరో ఇద్దరు నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గోస్వామి బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం ఆయన, మిగతా ఇద్దరు నిందితులను రూ. 50 వేల పూచీకత్తుపై మధ్యంతర బెయిలుపై విడుదల చేయాలని ఆదేశించింది.

ధర్మాసనం ఆదేశాలను వెంటనే అమలు చేయాలని పోలీస్ కమిషనర్‌ను జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కాగా అంతకుముందు గోస్వామి బాంబే హైకోర్టులో బెయిలుకు దరఖాస్తు చేసుకోగా అక్కడ ఆయనకు బెయిలు నిరాకరించారు.

దీంతో బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో అర్ణబ్, మరో ఇద్దరిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.

కాగా విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు అర్ణబ్, మిగతా ఇద్దరు నిందితులకు సూచించింది.

నెట్ ఫ్లిక్స్

ఫొటో సోర్స్, Getty Images

కేంద్ర ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌

ప్రస్తుతం ఎలాంటి చట్టాలకుగానీ, ప్రభుత్వ సంస్థలకుగానీ లోబడకుండా ప్రసారాలు కొనసాగిస్తున్న అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌లాంటి ఓవర్‌ ది టాప్‌ ప్రసారాలు, వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు బుధవారంనాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సంతకంతో ఒక గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ గెజిట్‌ ప్రకారం ఆన్‌లైన్‌ సినిమాలు, డిజిటల్‌ న్యూస్‌, కరెంట్‌ ఎఫైర్స్‌కు సంబంధించిన ప్రసారాలన్నీ ఇక నుంచి కేంద్ర ప్రభుత్వనిబంధనల పరిధిలోకి వస్తాయి.

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో ప్రసారమవుతున్న కొన్ని అభ్యంతరకరమైన కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఆయా సంస్థలను హెచ్చరిస్తూ రావడమే కాక, ఈ ప్రసారాల విషయంలో స్వీయ నియంత్రణ, నిబంధనలు రూపొందించుకోవాలని సూచించింది.

ఈ మేరకు గత ఏడాది అక్టోబర్‌లో ఎనిమిది ఓటీటీ సంస్థలు స్వీయ నిబంధనలను కూడా రూపొందించుకున్నాయి. అయితే ఆ నిబంధనలను తిరస్కరించిన కేంద్రం ఇప్పుడు వాటి ప్రసారాలను ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది.

మొజాంబిక్

ఫొటో సోర్స్, AFP

మొజాంబిక్‌లో మారణహోమం.. 50 మందిని చంపేసిన ఇస్లామిక్ తీవ్రవాదులు

ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో ఇస్లామిక్ తీవ్రవాదులు 50 మందికి పైగా ప్రజలను ఊచకోత కోసారని ప్రభుత్వ మీడియా తెలిపింది.

ఒక గ్రామంలోని ప్రజలను ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు లాక్కొచ్చి ఊచకోత కోశారని, మరొక గ్రామంలో అనేకమంది తలలు నరికారని ఈ రిపోర్టులు తెలుపుతున్నాయి.

గ్యాస్ అధికంగా లభ్యమయ్యే కాబో డెల్గాడో ప్రావిన్స్‌లో 2017 నుంచీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 2,000 మంది ప్రాణాలు కోల్పోగా, 4,30,000 మంది నిరాశ్రయులయ్యారు.

ఈ మిలిటెంట్లు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కు చెందివారని, దక్షిణ ఆఫ్రికాలో తమ బలాన్ని పెంచుకోవడం కోసం ఈ దాడులు జరుపుతున్నారని సమాచారం.

Map of Mozambique

పేదరింకం, నిరుద్యోగంలో మగ్గుతున్న యువకులను తమవైపు తిప్పుకుంటూ ఆ ప్రాంతంలో ఇస్లామిక్ పాలనను స్థాపించే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తీవ్రవాదులు "అల్లాహో అక్బర్" అని అరుస్తూ కాల్పులు జరిపారని, శుక్రవారం నాడు రాత్రి నంజబా గ్రామంలో ఇళ్లను తగలబెట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారంటూ ప్రభుత్వ మీడియా సంస్థ మొజాంబిక్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించింది.

డోనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం సిగ్గుచేటు: జో బైడెన్

జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం సిగ్గుచేటని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ ఓటమిని అంగీకరించకపోయినా.. అధికార మార్పిడిని అడ్డుకోలేరని బైడెన్ అన్నారు.

అమెరికాలో అన్ని ప్రధాన టీవీ చానల్స్ తను ఓడిపోయానని చెప్పినప్పటికీ.. చివరికి గెలిచేది తానేనని ట్రంప్ ట్వీట్ చేశారు. దీనిపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జో బైడెన్ స్పందించారు.

''నిజానికి ఇది సిగ్గుచేటు. నేను ఒకటే చెప్పగలను.. దీని వల్ల ఆయనేమీ సాధించలేరు. చివరగా జనవరి 20న ఇది ముగుస్తుంది. అంతా సవ్యంగానే జరుగుతుంది'' అని బైడెన్ చెప్పారు.

శ్వేతసౌధంలోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధం అవుతున్న బైడెన్‌కు పలువురు విదేశీ నాయకులు ఫోన్‌చేసి అభినందిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఐర్లాండ్ ప్రధాని మిఖాయెల్ మార్టిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ తదితరులతో ఇప్పటికే ఆయన మాట్లాడారు.

''సుప్రీంకోర్టులో అర్ణబ్‌ గోస్వామికి ప్రత్యేక ప్రాధాన్యం ఎందుకు?''

అర్ణబ్ గోస్వామి

ఫొటో సోర్స్, Getty Images

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి బెయిల్ అభ్యర్థనను వెంటనే విచారణకు స్వీకరించడంపై సీనియర్ అడ్వొకేట్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అసోసియేషన్ అధ్యక్షుడు దుశ్యంత్ దవే నిరసన వ్యక్తంచేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు ఆయన ఓ లేఖ రాశారు.

''సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈ లేఖ రాస్తున్నాను. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం బుధవారం అర్ణబ్ కేసును విచారణకు స్వీకరించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాను'' అని దవే పేర్కొన్నారు.

''అర్ణబ్‌పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలూ లేవు. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసే హక్కులను అడ్డుకోవాలని నేను భావిచడం లేదు. అందరి పౌరుల్లానే ఆయన కూడా న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ కొన్ని ఎంపిక చేసిన అభ్యర్థనలనే విచారణ కోసం పరిగణలోకి తీసుకోవడం తీవ్రమైన అంశం. వేల మంది జైళ్లలో గడుపుతున్నారు. తమ పిటిషన్లను పరిగణలోకి తీసుకోవాలని వారాలు, నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. అర్ణబ్ కేసు మాత్రం ప్రతిసారి అభ్యర్థన వచ్చిన వెంటనే పరిగణలోకి తీసుకుంటున్నారు’’ అని దవే ప్రస్తావించారు.

‘‘ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాస్టర్ ఆఫ్ ద రోస్టర్‌ నుంచి ఏమైనా ప్రత్యేక ఆదేశాలు వచ్చాయా? ఎందుకంటే అలాంటి ఆదేశాలు లేకుండా ఇలా వెంటవెంటనే విచారణకు తీసుకోరు కదా.. లేకపోతే అర్ణబ్ కేసుకు రిజిస్ట్రార్ లేదా పరిపాలనా విభాగం అధిపతి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారా?'' అని ప్రశ్నించారు.

అర్ణబ్ గోస్వామి

''ఉదాహరణకు సీనియర్ అడ్వొకేట్, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం కేసునే తీసుకోండి. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బెయిల్ అభ్యర్థన విచారణ కోసం ఆయన నెలలపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరగా ఆయనకు బెయిల్ ఇవ్వొచ్చంటూ సుప్రీం కోర్టు చెప్పింది. ఇలా అందరూ వారాలు, నెలలపాటు ఎదురుచూస్తుంటే అర్ణబ్‌కు మాత్రం ప్రత్యేక ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారు?'' అని దవే వ్యాఖ్యానించారు.

ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ మృతి కేసులో అర్ణబ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అన్వర్ ఆత్మహత్యతో అర్ణబ్‌కు సంబంధముందని ఆరోపిస్తూ ముంబయి పోలీసులు ఇటీవల ఆయన్ను అరెస్టు చేశారు.

ఈ కేసులో అర్ణబ్‌కు బెయిలు ఇచ్చేందుకు బాంబే హైకోర్టు తిరస్కరించడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)