'తెలంగాణ సరిహద్దుల వరకూ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు.. పండుగ ప్రయాణికుల కోసం ప్రత్యేక సేవలు' - ప్రెస్ రివ్యూ

పేర్ని నాని
ప్రచురణ

పండగ సమయంలో తెలుగురాష్ట్రాల సరిహద్దుల వరకూ బస్సులు నడపనున్నట్లు ఏపీ ప్రకటించినట్లు సాక్షి దిన పత్రిక కథనం ప్రచురించింది.

ఏపీ–తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. దసరాను పురస్కరించుకుని సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఆర్టీసీ సేవలందిస్తుందన్నారు.

పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టుల వద్ద ఏపీ బస్సులు ఉంటాయన్నారుని సాక్షి రాసింది.

జూన్‌ 18 నుంచి టీఎస్‌ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నాం. 1.61 లక్షల కిలోమీటర్లకే పరిమితం అవుతూ వారి డిమాండ్లకు అనుకూలంగానే ప్రతిపాదనలు పంపాం. రూట్ల వారీగా కూడా స్పష్టత ఇచ్చాం. ఏపీఎస్‌ఆర్టీసీ లాభనష్టాలు చూడడం లేదు. ప్రజలు ఇబ్బంది పడకూడదనేదే మా అభిమతం అని మంత్రి చెప్పారు.

ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణ సరిహద్దుల వరకు బస్సులు నడుపుతోంది.

ఇందుకోసం 6 జిల్లాల రీజియన్లకు సంబంధించి సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద 38 బస్‌ సర్వీసులను అందుబాటులో ఉంచింది.

కర్నూలు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, తూర్పుగోదావరి, విశాఖ రీజియన్లకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేకాధికారులను కూడా నియమించిందని సాక్షి వివరించింది.

పోలవరం ప్రాజెక్టు ప్రాంతం

ఆ నిధులతో ఎలా కట్టాలి

కేంద్రం ఇచ్చే నిధులతో పోలవరం ప్రాజెక్టు నిర్మించడం అసాధ్యమని ఏపీ ముఖ్యమంత్రి అన్నట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

కేంద్రం చెబుతున్నట్లుగా రూ.20,398 కోట్లతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

భూసేకరణ, పునరావాసాలకే రూ.29 వేల కోట్లు అవసరమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తేల్చిచెప్పగా కేవలం రూ.20వేల కోట్లతో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారని పత్రిక చెప్పింది.

పోలవరం తాజా పరిణామాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు.

ఒకానొక దశలో ఈ నిధులతో ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమన్న ముఖ్యమంత్రి.. కేంద్రాన్నే నిర్మాణ బాధ్యత తీసుకోమందామని కూడా వ్యాఖ్యానించినట్లు తెలిసిందని కథనంలో రాశారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సర్వసభ్య సమావేశంలో కూడా రాష్ట్రం తరఫున ఇదే వాదన వినిపించనున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు రూ.47,725.74 కోట్లు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు లేఖ రాయాలని ఈ సమావేశంలో నిర్ణయించారని ఈనాడు రాసింది.

మూడేళ్లుగా పోలవరం ప్రాజెక్టు అంచనాల సవరణపై సాగిన పరిణామాలు, పోలవరం అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా కమిటీ, రివైజ్డు కాస్ట్‌ కమిటీ 2017-18 ధరలతో ఆమోదించిన అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరనున్నారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2017-18 ధరలతో, కొత్త క్వాంటిటీలతో ఆమోదించి పంపిన ప్రతిపాదనలను కేంద్ర జలసంఘం క్షుణ్ణంగా పరిశీలించి, సాంకేతిక సలహా కమిటీ ముందు అంచనాల సవరణ ప్రతిపాదనలు ఉంచింది.

కేంద్ర జలశక్తి కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన సాంకేతిక సలహా కమిటీ ఆ ప్రతిపాదనలను రూ.55,448.87 కోట్లకు ఆమోదించింది.

తర్వాత రివైజ్డు కాస్ట్‌ కమిటీ ఇవే ప్రతిపాదనలను రూ.47,725.74 కోట్లకు ఆమోదించి సిఫార్సు చేసిన విషయాలను ప్రస్తావిస్తూ అన్ని స్థాయిల్లో ఆమోదం లభించిన ఈ మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాలని కేంద్ర పెద్దలను కోరాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారని ఈనాడు వివరించింది.

లద్ధాఖ్ ఇక కేంద్రపాలిత ప్రాంతంగా మారబోతోంది.
ఫొటో క్యాప్షన్, లద్ధాఖ్ ఇక కేంద్రపాలిత ప్రాంతంగా మారబోతోంది.

కశ్మీర్ పై భారత్ చర్చలు దాదాపు ముగిసినట్లే

కశ్మీర్‌పై ఇక చర్చలు జరపడానికి భారత్ సుముఖంగా లేదని ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కశ్మీర్‌ అంశంపై ఇక పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారత్‌ దాదాపుగా తేల్చిచెప్పింది.

పాక్‌ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు ఇక విలువ లేదనీ, ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్‌) జరపడం అసాధ్యం కాబట్టి- ఆనాటి తీర్మానాలు వ్యర్థమన్న విషయాన్ని కూడా స్పష్టం చేసిందని పత్రిక చెప్పింది.

గత ఏడాది కాలంగా మారిన పరిణామాలతో భారత్‌ కశ్మీర్‌ విషయంలో తన వైఖరిని మరింత కఠినం చేసి పదును దేల్చింది. పాక్‌పై దూకుడు ప్రదర్శించింది.

ఈ వారంలో జరిగిన కామన్వెల్త్‌ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాక్‌ మంత్రి షా మెహమూద్‌ ఖురేషీ కశ్మీర్‌ను ప్రస్తావించి...గత ఆగస్టు 5 నుంచి- అంటే ఆర్టికల్‌ 370 రద్దు నాటినుంచి ఇప్పటిదాకా అక్కడ హత్యలు, మానవహక్కుల హననం జరుగుతోందని ఆరోపించడంతో భారత్‌ విరుచుకుపడిందని కథనంలో రాశారు.

’కశ్మీర్‌ మా అంతర్గత వ్యవహారం. దీన్ని లేవనెత్తే అర్హత, హక్కు మీకెక్కడివి? కశ్మీర్లో కొంత భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారే? మత పరమైన మైనారిటీలను ఊచకోత కోసిన చరిత్ర మీది. 49 ఏళ్ల కిందట తూర్పు పాకిస్తాన్‌ (నేటి బంగ్లాదేశ్‌) లో మీ ప్రజలను మీరే చంపుకున్న చరిత్ర మీది’ అని విదేశాంగ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని తెలిపింది.

ఆ తరువాత ఏషియా సొసైటీ సమావేశంలో మాట్లాడిన విదేశాంగమంత్రి ఎస్‌ జయశంకర్‌ కూడా- ’ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పాక్‌లో ప్రభుత్వ విధానంగా మారింది. దీన్ని ఆ ప్రభుత్వాలు బహిరంగంగానే అంగీకరించి సమర్థించుకుంటున్నాయి. అలాంటి వారితో మామూలు సంబంధాలు నెలకొల్పడం చాలా కష్టంతో కూడిన పని’’ అని పరోక్షంగా ఇక చర్చల ఊసేలేదన్న సంకేతాలను ఇచ్చారు.

గతం లో మాదిరిగా మళ్లీ శాంతి చర్చలకు సిద్ధపడేది లేదన్న విషయం కూడా ఆయన మాటల్లో ధ్వనించిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఐపీఎల్ 2020 పంజాబ్ వర్సెస్ సన్‌రైజర్స్

ఫొటో సోర్స్, BCCI/IPL

ఆవిరైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలు

పంజాబ్ చేతిలో ఓటమి పాలవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు ఆవిరైనట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసిన సన్‌రైజర్స్‌.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. సీజన్‌లో ఏడో పరాజయంతో ప్లే ఆఫ్స్‌కు దూరమైంది.

ఇక ఇక్కడి నుంచి వార్నర్‌ సేన ప్లే ఆఫ్స్‌ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే! శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో గెలుపొందింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన రాహుల్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది.

రషీద్‌ ఖాన్‌ (2/14), హోల్డర్‌ (2/27), సందీప్‌ (2/29) ధాటికి.. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. నికోలస్‌ పూరన్‌ (32 నాటౌట్‌) జట్టులో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు‌.

అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ 19.5 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది.

డేవిడ్‌ వార్నర్‌ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చినా మిగిలిన వారు ఘోరంగా విఫలమవడంతో పరాజయం వైపు నిలిచింది. జోర్డాన్‌ (3/17)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కిందని పత్రిక రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)