You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎన్టీఆర్: ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్ ఫస్ట్ లుక్... టీజర్ ఆలస్యంపై రామ్‌చరణ్ ఫన్నీ ట్వీట్స్ : ప్రెస్ రివ్యూ
రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ లుక్‌ను రాజమౌళి విడుదల చేశారని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.
జల్ జంగిల్ జమీన్’ నినాదంతో తిరుగుబాటు బావుటా ఎగరేసిన మన్యం వీరుడు... కొమురం భీమ్. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ యోధుడి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.
‘ఆర్.ఆర్.ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో! ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు.
కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో టీజర్‌ని విడుదల చేశారు. అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్న రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ సాగింది.
ఎన్టీఆర్‌లాగే రామ్‌చరణ్ కూడా మలయాళం మినహా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో వాయిస్ ఓవర్ చెప్పారు.
‘భీమ్ శక్తియుక్తుల్ని మన రామరాజు కాకుండా అత్యుత్తమంగా ఎవరు వర్ణిస్తారు’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ కండలు పెంచి కనిపించిన విధానం, విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి.
ఎన్టీఆర్ పాత్రలో రెండో కోణాన్నీ టీజర్‌లో చూపించారు. రామ్‌చరణ్ పాత్రని నిప్పుతో, ఎన్టీఆర్ పాత్రని నీటితో పోల్చుతూ స్క్రిప్టుని డిజైన్ చేశారు రాజమౌళి.
ఎన్టీఆర్: ఆర్ఆర్ఆర్‌లో కొమరం భీమ్ ఫస్ట్ లుక్... టీజర్ ఆలస్యంపై రామ్‌చరణ్ ఫన్నీ ట్వీట్స్
బుధవారం... ‘నీలా ఆలస్యం చేయను... టైం అంటే టైం’ అని రామ్‌చరణ్ ట్వీట్ చేస్తే..!
‘ఇప్పటికే ఆరునెలలు ఆలస్యమైంది. నువ్వు పెట్టుకున్నది రాజమౌళితో..’ అని ఎన్టీఆర్ సమాధానమిచ్చారు.
గురువారం... 10.50 నుంచి అభిమానులంతా భీమ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ‘మరో అరగంట’ అని దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
దీనికి కౌంటర్‌గా రామ్‌చరణ్ ‘ముఖం మూసుకున్న పిల్లిబొమ్మ’ను ట్విటర్‌లో పెట్టారు. మరోవైపు తారక్.. బ్రహ్మానందం నవ్వుతున్న వీడియోను పంచుకొని అభిమానులను అలరించారని ఈనాడు రాసింది.
పండుగ సమయంలో ఆర్టీసీ చర్చల్లో ప్రతిష్టంభన
పండగ సీజన్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడపడంపై ప్రతిష్టంభన నెలకొందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
ఆంధ్ర, తెలంగాణ మధ్య ప్రజా రవాణా స్తంభించింది. ఆర్టీసీ బస్సుల్లేక, రైళ్లూ లేక... ప్రైవేటు బస్సులు ఎక్కలేక జనం నానా తంటాలు పడుతున్నారు.
లాక్‌డౌన్‌కు ముందు ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు బాగానే తిరిగాయి. కానీ, లాక్‌డౌన్ తర్వాత తెలంగాణ సర్కారు ‘అంతర్రాష్ట్ర ఒప్పందం’ కుదిరాకే బస్సులు తిరగాలని తేల్చి చెప్పిందని పత్రిక రాసింది.
ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణలో 2.60 లక్షల కి.మీ.,తిరుగుతున్నాయి. టీఎ్‌సఆర్‌టీసీబస్సులు 1.60 లక్షల కి.మీ. తిరుగుతున్నాయి.
ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ చేసుకుని ఏపీ సర్వీసులు లక్ష కిలోమీటర్లను తగ్గించుకోవాలని టీఎ్‌సఆర్‌టీసీ అధికారులు డిమాండ్ చేశారు.
ఏపీ అధికారులు ఇందుకు అంగీకరించారు. ‘సరే... మేం 50 వేలకిలోమీటర్లు తగ్గించుకుంటాం. ఆ మేరకు మీరు పెంచుకోండి’ అని సూచించారు.
అయితే, తాము ఎక్కువ కిలోమీటర్లు నడిపే పరిస్థితి లేదని, ఏపీ మాత్రం లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాల్సిందేనని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు.
దీంతో అనేక తర్జన భర్జనల తర్వాత లక్ష కిలోమీటర్లు తగ్గించుకునేందుకు ఏపీ అంగీకరించింది. ఏపీలో దాదాపు ప్రతి డిపో నుంచి హైదరాబాద్‌కు బస్సులు నడుస్తున్నాయి.
మరికొన్ని ప్రాంతాలకు కూడా సర్వీసులు ఉన్నాయి. మొత్తంగా 1009 ఏపీ బస్సులు తెలంగాణకు నడుస్తున్నాయి.
లక్ష కిలోమీటర్లు తగ్గించుకుంటే 400 బస్సులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు తప్పవు.
ఆర్థిక స్థోమత ఉన్న వారు, గత్యంతరం లేని వారు చార్జీ ఎక్కువైనా ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. జనం ఇన్ని కష్టాలు పడుతున్నా... ప్రభుత్వాలు మాత్రం పంతం వీడటంలేదని పత్రిక రాసింది.
అధికారుల స్థాయిలో పని కావడంలేదు. మంత్రులు కూర్చున్నా అవుతుందో లేదో తెలియదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకమాట అనుకుంటే తప్ప బస్సులు కదిలే పరిస్థితి కనిపించడంలేదని ఆంధ్రజ్యోతి కథనంలో వివరించింది.
ఏపీలో కిలో రూ. 40కే ఉల్లిపాయలు
శుక్రవారం నుంచి రైతు బజార్లలో కిలో ఉల్లిని రూ.40కే అందింస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతుబజార్లలో శుక్రవారం నుంచి కిలో ఉల్లిని రూ.40కే ప్రజలకు అందించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
భారీ వర్షాలు, వరదలతో ఉల్లి పంట దెబ్బతినడంతో మార్కెట్‌లో కిలో ఉల్లిని రూ.80 వరకు విక్రయిస్తున్నారని చెప్పారు.
దీంతో ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఉల్లి ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కాకినాడలో గురువారం మంత్రి వివరించారని కథనంలో రాశారు.
5 వేల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకునేందుకు నాఫెడ్ ద్వారా ఇండెంట్ పెట్టామని, అత్యవసరంగా 1,000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నామన్నారు.
తొలి దశలో పట్టణ, నగర ప్రాంతాల్లోని రైతుబజార్ల ద్వారా ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున ఉల్లిని అందిస్తామని మంత్రి చెప్పారని పత్రిక చెప్పింది..
కాగా, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఉల్లిని వెంటనే కొనుగోలు చేసి జిల్లాలకు సరఫరా చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
తొలుత వంద టన్నుల వరకు కొనుగోలు చేసి కర్నూలు జిల్లా, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సరఫరా చేయాలని సూచించింది.
దీంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రోఖియాబీ ఉల్లి కొనుగోలుకు గురువారం శ్రీకారం చుట్టారు. మరోవైపు పొలాల్లోకే వెళ్లి కొనుగోలు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని సాక్షి వివరించింది.
రాజస్థాన్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం
ఐపీఎల్-13లో కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించిందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
టోర్నీలో నిలవాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సమిష్టిగా సత్తాచాటింది.
గత మ్యాచ్‌లో కోల్‌కతా పేసర్ లూకీ ఫెర్గూసన్ ధాటికి విలవిల్లాడి సూపర్ ఓవర్‌లో ఓడిన హైదరాబాద్.. ఈ సారి సమిష్టిగా రాణించి అత్యవసర విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
మనీశ్ పాండే (47 బంతుల్లో 83 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), విజయ్ శంకర్ (51 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) విజృంభించడంతో వార్నర్ సేన ఈ సీజన్‌లో ఛేజింగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది.
సంజూ శాంసన్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్‌కు 2 వికెట్లు దక్కాయి. మనీశ్ పాండేకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డు దక్కింది.
టార్గెట్ ఛేజింగ్‌లో సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ (4) ఔట్‌కాగా.. మూడో ఓవర్‌లో బెయిర్‌స్టో (10) కూడా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు ఆర్చర్ ఖాతాలోకే వెళ్లాయి.
16 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ హైదరాబాద్‌ను మనీశ్ పాండే ఆదుకున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు.
అతడికి విజయ్ శంకర్ చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లో అర్ధశతకం చేసిన పాండే.. సిక్సర్లతో విజృంభించి లక్ష్యాన్ని కరిగించాడు.
ఆరంభంలో నెమ్మదిగా ఆడిన శంకర్ కూడా చివరకు బ్యాట్‌కు పనిచెప్పి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీ అభేధ్యమైన మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 140 పరుగులు జోడించి జట్టుకు విజయాన్నందించింది అని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జపాన్ 'ట్విటర్ కిల్లర్': ‘అవును ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- ‘నన్ను నేను చంపుకోవాలనే ప్రయత్నాలను చంపేశా.. ఇలా..’
- ఆత్మవిశ్వాసం తగ్గి ఆందోళన పెరిగినప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు
- ‘నాన్‌లోకల్ లీడర్ల’ అడ్డాగా విశాఖ... నగరంలో 30 ఏళ్లుగా వారి హవా సాగుతుండటానికి కారణాలేంటి?
- భారత రత్న జాబితాలో దక్షిణాది వారికి తగిన ప్రాముఖ్యం లభించటం లేదా?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో భూకంప కేంద్రం, 9 నెలల్లో 1,545 సార్లు భూ ప్రకంపనలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)