ముత్తయ్య మురళీధరన్: 'భారత్‌లో పుట్టుంటే భారత్‌కు ఆడేవాడిని... శ్రీలంక తమిళుడిగా పుట్టడం నా తప్పా?'

ముత్తయ్య మురళీధరన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ప్రస్తుతం భారత్‌లో '800' పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు.

అయితే, భారత్‌లోని కొన్ని తమిళ సంఘాలు, సంస్థలు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక జాతీయ జట్టుకు ఆడి మురళీధరన్‌ తమిళ జాతికి ద్రోహం చేశారని అవి ప్రచారం చేస్తున్నాయి. మురళీధరన్ పాత్రలో నటిస్తున్నందుకు విజయ్ సేతుపతిపై మండిపడుతున్నాయి.

ఈ వ్యవహారంపై మురళీధరన్ తాజాగా స్పందించారు. తన వైపు వాదనను జనానికి వినిపించాల్సిన అవసరం ఉందని, అందుకే తాను ఈ విషయం గురించి మాట్లాడుతున్నానని ఆయన అన్నారు.

మురళీధరన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

‘‘నా జీవిత కథను సినిమాగా తీస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినప్పుడు మొదట నేను తటపటాయించా. కానీ, ఆ విషయం గురించి ఆలోచించన తర్వాత, మురళీధరన్‌గా నేను సాధించిన ఘనతలు నా ఒక్కడివే కాదని అనిపించింది. నా తల్లిదండ్రుల సహకారం ఇందులో ఎంతో ఉంది. నా ఉపాధ్యాయులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు అందరూ నా వెనుక ఉన్నారు. సినిమాతో వాళ్లకు గుర్తింపు వచ్చినట్లవుతుందని అనిపించింది. అందుకే ఒప్పుకున్నా.

శ్రీలంకలో టీ తోటల్లో కూలీలుగా నా తల్లిదండ్రులు జీవితం మొదలైంది. టీ తోటల్లో పనిచేస్తున్న భారత సంతతి కూలీలే 30 ఏళ్లపాటు సాగిన సుదీర్ఘ యుద్ధంలో తొలి బాధితులు.

70ల నుంచి తమిళలకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు, జేవీపీ ఆందోళనల తర్వాత జరిగిన హింస, బాంబు పేలుళ్లు... నా బాల్యం నుంచి ఈ ఘటనలన్నింటి వల్ల మేం ఎంతో ప్రభావితమయ్యాం.

నాకు ఏడేళ్లున్నప్పుడు మా నాన్న చనిపోయారు. మా బంధువులు చనిపోయారు. జీవితంలో ఎన్నో సార్లు మేం రోడ్డునపడ్డాం. యుద్ధం వల్ల ఓ మనిషిని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. శ్రీలంకలో 30 ఏళ్లకుపైగా యుద్ధం సాగింది. దానితోపాటే నా జీవిత ప్రయాణం కొనసాగింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నేను క్రికెట్ జట్టులో ఎలా చేరగలిగాను? ఎలా చరిత్ర సృష్టించగలిగాను?

ముత్తయ్య మురళీధరన్

ఫొటో సోర్స్, MUTTIAH MURALITHARAN FB

ఇప్పటివరకూ జీవితంలో నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నా వ్యక్తిగత జీవితం గురించి, క్రికెట్ జీవితం గురించి చాలా మంది మాటలన్నారు. ఇప్పుడు '800' చిత్రం కూడా నా జీవితం గురించే చర్చిస్తుంది కాబట్టి, దీనిపైనా విమర్శలు వస్తాయి. అయితే, నేను కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా.

ఈ చిత్రాన్ని కొందరు వివిధ కారణాలతో రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. నేను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూపిస్తున్నారు. ఉదాహరణకు, 2009 నాకు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని గత ఏడాది నేను అన్నాను. 'శ్రీలంకలో తమిళులను పెద్ద సంఖ్యలో చంపిన ఏడాది మురళీధరన్‌కు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరమట' అని కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు.

దయచేసి ఓ సామాన్యుడి కోణంలో ఆలోచించండి. దేశంలో యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు, మరుసటి రోజు మళ్లీ నా స్నేహితులు ప్రాణాలతో వస్తారో, లేదో అన్న భయం ఉండేది. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో 2009లో యుద్ధం సమాప్తమైంది. ఓ సామాన్యుడిగా సురక్షితంగా ఉన్నామన్న భావన నాకు కలిగింది. పదేళ్లుగా ఏ పక్షం వైపూ మరణాలు లేవు. అందుకే, 2009ని నేను అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అమయాకులను చంపడాన్ని నేను ఎప్పుడూ సమర్థించలేదు. సమర్థించబోను.

ముత్తయ్య మురళీధరన్

ఫొటో సోర్స్, Muttiah Muralitharan / Facebook

ఇక నేను స్కూల్ స్థాయి నుంచి తమిళ మాధ్యమంలోనే చదువుకున్నా. నాకు తమిళం తెలియదనడం పూర్తిగా తప్పు.

తమిళ విద్యార్థులకు ఆత్మన్యూనతా భావం ఉంటుందని నేను అన్నట్లు కొందరు చెబుతున్నారు.

శ్రీలంకలో సింహళీయుల మధ్యలో మేం మైనార్టీలుగా బతికాం. సహజంగానే, జనాలకు ఆత్మన్యూనతా భావం ఉంటుంది. నాకు కూడా ఉంది. నా తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచించేవారు.

కానీ, క్రికెట్ పట్ల నాకున్న ప్రేమ చాలా ఎక్కువ. అందుకే స్కూల్ క్రికెట్ జట్టులో చేరా. ఆత్మస్థైర్యంతోనే నేను జట్టులో ఆడా. నా నైపుణ్యంతో జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడిగా మారా.

'మీ ఆత్మన్యూనత భావాన్ని వదిలించుకోండి. నైపుణ్యాన్ని నమ్ముకుని, ప్రయత్నిస్తూనే ఉండండి' అని ఇదివరకు నేను అందుకే అన్నాను.

సింహళీయులైనా, టీ తోటల్లోని తమిళులైనా, ఈలం తమిళులైనా... నేను అందరినీ ఎప్పుడూ సమానంగానే చూశా. టీ తోటల్లో నుంచి వచ్చిన తమిళుడైనప్పటికీ, నేను మా వర్గం వారికన్నా ఈలం తమిళులకే ఎక్కువ చేశా. నేను చేసిన విషయాలను చెప్పుకోవడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ, చెప్పక తప్పని పరిస్థితి తెస్తున్నారు.

2002లో ఐరాస ఆహార విభాగానికి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా. ఎల్‌టీటీఈ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలల వరకూ ఆ కార్యక్రమాలను తీసుకువెళ్లా. సునామీ వచ్చినప్పుడు ఎంతో మంది ఈలం తమిళలకు సాయం చేశా. నేను చేసిన సేవ ఏంటో ప్రజలకు బాగా తెలుసు.

యుద్ధం ముగిసిన తర్వాత నేను ఏర్పాటు చేసిన 'ఫౌండేషన్ ఆఫ్ గుడ్‌నెస్' దాతృత్వ సంస్థ ద్వారా చాలా మంది ఈలం తమిళులకు సాయపడుతున్నా. ఈలం తమిళులుండే ప్రాంతాల్లో నా సంస్థ శాఖలున్నాయి. విద్య, వైద్యం, మహిళల అభ్యున్నతి వంటి వాటి కోసం కృషి చేస్తున్నా. ప్రజల మధ్య సామరస్యతను ప్రోత్సహించేందుకు ఏటా 'మురళీ హార్మొనీ కప్' పేరుతో క్రికెట్ టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నా.

శ్రీలంక క్రికెట్ జట్టు తరఫున ఆడినందుకు కొందరు నాపై చెడు అభిప్రాయంతో ఉన్నారు. ఒక వేళ భారత్‌లో పుట్టుంటే, భారత జట్టులో చేరాలని ప్రయత్నించేవాడిని. శ్రీలంకలో తమిళుడిగా పుట్టడం నేను చేసుకున్న తప్పా?

ఈ అంశాలన్నింటినీ కొందరు విస్మరిస్తారు. ఇంకొందరు రాజకీయ కారణాలతో నాకు వ్యతిరేకంగా విషయాలను వక్రీకరిస్తుంటారు. తమిళ సమాజానికి నేను వ్యతిరేకమన్నట్లు చిత్రీకరిస్తున్నారు.

నేను ఇంత చెప్పినా, నన్ను వ్యతిరేకించేవారు మారరని నాకు తెలుసు. నాకు వ్యతిరేకంగా చాలా తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాటిపై నా వైపు వాదన ఏంటో తటస్థంగా ఉండేవారికి, సామాన్య ప్రజలకు తెలియజేయాలనుకున్నా. అందుకే స్పందించా’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)