కేసీఆర్‌ వర్సెస్ జగన్‌: పోతిరెడ్డిపాడు, కాళేశ్వరంపై వాదనలకు దిగిన ఇద్దరు సీఎంలు - ప్రెస్ రివ్యూ

కేసీఆర్, జగన్
ప్రచురణ

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మంగళవారం వాడివేడిగా సాగిందని.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పలుమార్లు పరస్పరం విమర్శలకు దిగినట్లు సమాచారమని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. ఆయా సందర్భాల్లో జోక్యం చేసుకున్న కేంద్ర మంత్రి.. ''ఈ పద్ధతేం బాగోలేదు. ఇలా అయితే ఎలా ముందుకెళ్లగలం? ఏదైనా అంశంపై ముందు నేను మాట్లాడిన తర్వాత మీరు మీ వాదనలు చెప్పండి'' అని సూచించినట్లు తెలిసింది.

కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్‌) సమర్పించడానికి ఇద్దరు సీఎంలూ అంగీకరించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హైదరాబాద్‌ నుంచి, ఏపీ సీఎం జగన్‌ దిల్లీ నుంచి.. ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు కొనసాగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో.. కృష్ణా, గోదావరి నదీ జలాలపై హక్కులు, వాటాల గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను, వాదనలను వినిపించారు. సమావేశంలో ఎజెండా అంశాల వారీగా కాకుండా ఖరారు చేసిన నాలుగు ఎజెండాలపై కేంద్రం ఒకేసారి తన అభిప్రాయాలను సీఎంల ముందు ఉంచింది.

కేంద్రం తన అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కృష్ణ, గోదావరి నదీ జలాల పంపిణీకి ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై వినతి పత్రం పంపిస్తే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌ ఏర్పాటు గురించి పరిశీలిస్తామని కేంద్ర మంత్రి అన్నారు.

అయితే.. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులతోపాటు కృష్ణానదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులనూ కేంద్రమే స్వాధీనం చేసుకుని వాటిని నిర్వహించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఇరు రాష్ట్రాలకూ నీటివినియోగంలో సమన్యాయం జరుగుతుందన్నారు.

శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 841 అడుగులకు తగ్గితే రాయలసీమ, నెల్లూరు జిల్లాల దాహార్తిని తీర్చలేని పరిస్థితి ఎదురవుతుందని, అందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని జగన్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఇది సాధ్యపడకపోతే శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం, సాగర్‌ కుడి కాలువను ఆంధ్రకు స్వాధీనపరచాలని కోరినట్లు తెలిసింది.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ఏపీ ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకే ఏ అనుమతులూ లేవని, అలాంటిది దాని సామర్థ్యం పెంచడం ఏమిటని ప్రశ్నించారు.

దీనికి ఏపీ సీఎం జగన్‌.. ''అనుమతులు లేకుండానే గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు చేపడుతున్నారు. సీతారామ ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులకు అనుమతులు లేవు. మాకో న్యాయం వాళ్లకో (తెలంగాణకు) న్యాయమా? తెలంగాణకు ఏ నిబంధన వర్తిస్తుందో మాకూ అదే వర్తిస్తుంది'' అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

దీనికి కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయని, ఆ ప్రాజెక్టు నది బేసిన్‌లో ఉందని, కానీ రాయలసీమ ప్రాజెక్టు ద్వారా నది బేసిన్‌ బయటికి నీళ్లు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇలాగైతే... తాము కూడా జూరాల దిగువలో భారీ బ్యారేజిని నిర్మించి, రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేస్తామని అన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న షెకావత్‌.. న్యాయం, నిబంధనలు రెండు రాష్ట్రాలకూ సమానమేనని, చట్ట ప్రకారమే అన్నీ జరగాలని పేర్కొన్నట్లు తెలిసింది.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాదనలు విన్న కేంద్ర మంత్రి.. ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందిస్తే తాము అన్నీ పరిశీలిస్తామని వారికి సూచించారు. అందుకు ఏపీ ముఖ్యమంత్రి అంగీకరించారు. దాంతో కేసీఆర్‌ కూడా ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించడానికి అంగీకరించారు.

అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయాలు

కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డుల పరిధులు, అధికారాలను నిర్థారిస్తూ నోటిఫికేషన్‌ జారీకి నిర్ణయం బోర్డులకు అధికారాలను నిర్ధారిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే జగన్‌ ఇందుకు సానుకూలంగా స్పందించారు. మరో పక్క బోర్డులకు అధికారాలను అప్పగించే అధికారం కేంద్రానికి ఉందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. దాంతో బోర్డులకు అధికారాలను అప్పగించాలని అపెక్స్‌లో నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్‌, వాటి ఆధారంగా నిర్మించిన పలు ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది.

కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు ఏపీకి!

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన గోదావరి బోర్డును హైదరాబాద్‌ కేంద్రంగా, కృష్ణా బోర్డును విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే అప్పట్లో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో ఈ రెండు బోర్డులనూ హైదరాబాద్‌ కేంద్రంగానే ఏర్పాటు చేశారు. కృష్ణా బోర్డును ఏపీకి తరలించాలని కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. ఇందుకు తెలంగాణ కూడా అంగీకరించడంతో అపెక్స్‌లో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు కృష్ణా బోర్డును త్వరలోనే ఏపీకి తరలించనున్నారు.

గోదావరి వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌

గోదావరి బేసిన్‌లో జల వివాదాల పరిష్కారం, నీటి కేటాయింపుల కోసం కొత్తగా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల నుంచి వినతులు వచ్చిన ఏడాదిలోగా ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకటించారు. దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ రేపే తమ వినతిని పంపుతామని చెప్పారు.

అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు అయిన తర్వాత సమావేశం నిర్వహించడం ఇది రెండో సారి. అలా కాకుండా ఇకపై ఏటా దీన్ని నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేశారు.

ఆర్ఆర్ఆర్

ఫొటో సోర్స్, DVV/Twitter

ఆర్ఆర్ఆర్ షూటింగ్ మళ్లీ ప్రారంభం

రామ్ చరణ్ తేజ, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ మళ్లీ ప్రారంభమైనట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రీకరణ సోమవారం నుంచి పునఃప్రారంభమైంది.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించింది. ‘విశ్రాంతి ద్వారా రీచార్జ్‌ అయ్యాం. ఇప్పుడు గర్జించడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ నిర్మాణ సంస్థ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించింది.

రాజమౌళి మాట్లాడుతూ ‘జీవితం కొత్తరకమైన సాధారణ స్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్ని అలవాటు చేసుకుంటూ జీవితాన్ని సాగించాలి. సుదీర్ఘమైన విరామం వల్ల సినిమాకు మంచే జరిగిందనుకుంటున్నా.అన్నారని పత్రిక చెప్పింది.

ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని అందించాలని సిద్ధమయ్యాం’ అన్నారు. భద్రతాపరంగా అన్ని రకాల ప్రమాణాల్ని పాటిస్తూ షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టామని నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు.

తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీమ్‌, అల్లూరి సీతారామరాజుల చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ పాత్ర తాలూకు ఇంట్రడక్షన్‌ మోషన్‌ పోస్టర్‌ను మార్చిలో విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ నెల 22న కొమరంభీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిందని నమస్తే తెలంగాణ వివరించింది.

కోవ్యాక్సిన్

ఫొటో సోర్స్, BHARATBIOTECH

నవంబర్‌లో 'కోవాగ్జిన్' టీకా తుది దశ పరీక్షలు

భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సీన్ కోవాగ్జిన్ చివరి దశ పరీక్షలు నవంబర్ నుంచి మొదలవుతాయని ఈనాడు కథనం ప్రచురించింది.

కరోనాను అరికట్టేందుకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ టీకాకు సంబంధించి మూడో దశ(చివరిది) క్లినికల్‌ పరీక్షలు వచ్చే నెలలో మొదలు కానున్నాయి.

మొదటి లేదా రెండో వారంలో వీటిని ప్రారంభించనున్నట్లు నిమ్స్‌ వైద్య వర్గాలు తెలిపాయని ఈనాడు రాసింది.

క్లినికల్‌ పరీక్షల్లో భాగంగా ఇప్పటికే నిమ్స్‌లో తొలి దశ పరీక్షలు ముగిశాయి. రెండో దశలో భాగంగా మంగళవారం 12 మందికి టీకా ఇచ్చి బూస్టర్‌ డోస్‌ ప్రక్రియ ప్రారంభించామని క్లినికల్‌ ట్రయల్స్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

వచ్చే మూడు రోజుల వ్యవధిలో మరో 55 మందికి టీకా ఇస్తామన్నారు. 14 రోజుల తర్వాత వీరందరి రక్త నమూనాలు సేకరించి భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)కి పంపనున్నారు.

మరోవైపు తొలిదశలో 45 మందికి నిమ్స్‌లో టీకా ఇవ్వగా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు వైద్య బృందం తెలిపింది. మొదటి, రెండో దశల్లో మొత్తం 100 మంది వాలంటీర్లు భాగస్వాములయ్యారని డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి వివరించారు.

దాదాపు 6 నెలలపాటు వాలంటీర్ల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. మూడో దశ పరీక్షల్లో 200 మందికి టీకా ఇచ్చే అవకాశం ఉందని ఆయన వివరించినట్లు ఈనాడు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)