You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ భయంతో పిల్లలను కనడం వాయిదా వేసుకుంటున్నారా
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
కార్తీక్ (పేరు మార్చాం)కి 2018లో వివాహమైంది. కార్తీక్ దంపతులు రెండేళ్ల తర్వాత పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారు.
కానీ, ఊహించని రీతిలో వ్యాపించిన కోవిడ్-19.. వారు పిల్లల్ని కనాలనే ఆలోచనను వాయిదా వేసుకునేలా చేసింది. ఆయన తనకున్న భయాలను ‘బీబీసీ’కి వివరించారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికే భయపడుతున్నప్పుడు మరో బిడ్డను కనడం.. ఆ బిడ్డతోపాటు మనకు కూడా ముప్పే" అని కార్తీక్ అన్నారు.
“ఇటీవల కొంత మంది గర్భిణులు ప్రసవ సమయంలో కోవిడ్-19 సోకి మరణించినట్లు వార్తలు చూసిన తర్వాత మరింత భయం వేసింది” అని ఆయన చెప్పారు.
“గర్భం దాలిస్తే ప్రతి నెలా చికిత్స కోసం, వైద్య పరీక్షలు, స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్తూ ఉండాలి. ఈ ప్రక్రియలో నాకు, నా భార్యకు, కూడా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది” అన్నారాయన.
“ఇదంతా పక్కన పెడితే, వ్యక్తిగత రక్షణ పరికరాలు, శానిటైజేషన్ అంటూ సాధారణంగా అయ్యే ఖర్చు కంటే.. హాస్పిటల్ ఖర్చులు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది”
ఈ సమయంలో గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే మనం పుట్టబోయే బిడ్డ, స్వీయ సంరక్షణ పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించడం లాంటిదేనని ఆయన అన్నారు.
కోవిడ్-19 ప్రబలినప్పటి నుంచి 9 నెలల సమయంలో ప్రపంచంలోనే అత్యధిక జననాలు (రెండు కోట్ల పది లక్షలు) భారత్‌లో చోటు చేసుకుంటాయని యూనిసెఫ్ అంచనా వేసింది.
చైనాలో (ఒక కోటి 35 లక్షలు), నైజీరియా (60 లక్షల నలభై వేలు), పాకిస్తాన్ (50 లక్షలు), ఇండోనేసియాలో (40 లక్షలు) జననాలు నమోదు కావొచ్చని పేర్కొంది.
శిశు మరణాల శాతం ఎక్కువగా ఉన్న ఈ దేశాల్లో.. కోవిడ్-19 వ్యాప్తితో మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా తెలిపింది.
యూనిసెఫ్ చేసిన వాదనతో హైదరాబాద్‌కు చెందిన గైనకాలజిస్ట్ మంజుల అనగాని ఏకీభవించారు.
దంపతుల మధ్య పెరిగిన అన్యోన్యత
ఫెర్టిలిటీ చికిత్స తీసుకుంటున్న కొంత మంది లాక్‌డౌన్ సమయంలో సహజంగా గర్భం దాల్చారని గైనకాలజిస్ట్ మంజుల అనగాని చెప్పారు.
లాక్‌డౌన్ వల్ల గృహ హింస పెరిగిందనే నివేదికలు వచ్చాయి. కానీ, దంపతుల మధ్య అన్యోన్యత కూడా అదే రీతిలో పెరిగిందని మంజుల అన్నారు. చాలా మంది ఇంటి నుంచే పని చేయడంతో ఎప్పటి నుంచో పిల్లల్ని కనడం వాయిదా వేస్తూ వస్తున్న వారు కూడా గర్భం దాల్చడానికి అవకాశం దొరికిందని అన్నారు.
గతంలో తన దగ్గరకు వచ్చే కేసులతో పోలిస్తే లాక్‌డౌన్‌లో వచ్చిన కేసుల సంఖ్యలో పెద్దగా తేడా ఏమీ లేదని చెప్పారు. గర్భం దాల్చిన వారు పెరిగారు అని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, తనను సంప్రదించడానికి వచ్చే వారి కేసుల సంఖ్య మాత్రం తగ్గలేదని చెప్పారు.
ఇప్పటివరకు పిల్లలపై కోవిడ్-19 చూపే ప్రభావం గురించి కచ్చితమైన పరిశోధనలు జరగకపోవడంతో ఇది పుట్టబోయే శిశువులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కచ్చితంగా చెప్పలేమని అన్నారు.
ఇటీవల తన దగ్గర ఒక కోవిడ్-19 సోకిన గర్భిణి ఆరోగ్యకరమైన బిడ్డకే జన్మనిచ్చినట్లు తెలిపారు.
ఒకవేళ దంపతులకు ఎలాంటి సమస్యలు లేకుండా, పిల్లల్ని కనడం కోసం తొందర లేని పక్షంలో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రంగా ఉన్నంత వరకు గర్భం దాల్చడాన్ని వాయిదా వేసుకుంటేనే మంచిదని ఆమె సూచించారు.
కానీ, ఎప్పటి నుంచో పిల్లలు కోసం ఫెర్టిలిటీ చికిత్స తీసుకుంటున్న వారు, లేదా సహజంగా గర్భం దాల్చిన వారు మహమ్మారికి భయపడి గర్భస్రావం మాత్రం చేయించుకోవాల్సిన పని లేదని, అన్నారు.
మాతృత్వపు అనుభూతిని ఆస్వాదించలేకపోతున్నాను.
కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న వసంత (పేరు మార్చడమైనది)కి మార్చ్ నెలలో గర్భం దాల్చినట్లు తెలిసింది. ఆమె తల్లితండ్రులు అమెరికా ప్రయాణం చేసే పరిస్థితి లేకపోవడంతో ఆమె వెంటనే హైదరాబాద్ వచ్చేశారు.
అప్పుడు గర్భస్రావం చేయించుకోవడం శ్రేయస్కరం కాదని డాక్టర్లు చెప్పడంతో ఆమె అందుకు సిద్ధపడలేదు.
అయితే, ఆమె మాతృత్వపు అనుభవాలను ఆస్వాదించటం కన్నా అనుక్షణం భయంతో గడపాల్సి వస్తోంది.
ఈ కోవిడ్-19, లాక్‌డౌన్‌ల గురించి ఏ మాత్రం ముందుగా తెలిసినా గర్భం దాల్చడం గురించి ప్లాన్‌చేసి ఉండేవాళ్లమని ఆమె అన్నారు.
"ఇప్పుడు నాకున్న భయం ఒక్కటే - నేను ఇంట్లో జాగ్రత్తగా ఉంటాను. కానీ, ఇంట్లో పనుల కోసం, ఉద్యోగం కోసం ఇతర కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడం తప్పదు కదా! ఎవరి వల్ల కరోనావైరస్ సోకుతుందో తెలియదు కదా" అని ఆమె అన్నారు.
అమెరికాలో తాము వాకింగ్‌కు వెళ్లేవాళ్లమని, ఇక్కడ బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని అన్నారు. వీటన్నింటి వల్ల చాలా కష్టంగా ఉంటోందని అన్నారు.
‘‘ప్రస్తుతానికి డాక్టర్ చెక్‌అప్ కోసం క్లీనిక్‌కు మాత్రమే వెళ్తున్నాను. హాస్పిటల్ అంటే ఎక్కడ కోవిడ్-19 బారిన పడతానో అనే భయం అయితే మాత్రం నిత్యం వెంటాడుతూనే ఉంది’’
“అలాగే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ హాస్పిటల్ ఖర్చులు కూడా పెరుగుతాయని అనిపిస్తోంది. కానీ, ఇప్పుడిక నేనేమి చేయలేను”
ఆమె పడుతున్న ఇబ్బందులను చూసి ఆమె స్నేహితులు కొందరు ఈ కోవిడ్-19 కేసులు తగ్గు ముఖం పట్టేవరకు పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఉత్సాహం చూపిస్తున్న దంపతులు
అయితే, ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్న వారి కంటే, లాక్‌డౌన్‌లో పిల్లల్ని కనడానికి ఇష్టపడే వారే ఎక్కువగా కనిపిస్తున్నారని తెనాలికి చెందిన గైనకాలజిస్ట్ మాధవి కొడాలి చెప్పారు.
లాక్‌డౌన్ వల్ల సమయం దొరకడంతో తమ దగ్గరకు ఫెర్టిలిటీ చికిత్స కోసం వచ్చే వారు ఎక్కువయ్యారని ఆమె అన్నారు.
కోవిడ్-19 కారణంగా అబార్షన్ కోసం తన దగ్గరకు కేవలం ఒకే ఒక్క కేసు వచ్చినట్లు చెప్పారు. ఈ సమయంలో పిల్లల్ని కని తనను బిడ్డను ముప్పులో పెట్టకుండా ఉండేందుకు ఆమె అబార్షన్ చేయమని కోరినట్లు మాధవి చెప్పారు.
ముంబయిలో ఒక హాస్పిటల్‌లో మే నెల నాటికి కోవిడ్-19 సోకిన గర్భిణులే దాదాపు 100 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు బీబీసీ పేర్కొంది.
కేరళలో కోవిడ్-19 భయంతో సరైన సమయానికి వైద్యం దొరక్క కవల పిల్లలు కడుపులోనే మరణించినట్లు వార్తలు వచ్చాయి.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అంచనాల ప్రకారం.. అక్టోబరు నాటికి దేశంలో 1,00,800 మరణాలు చోటు చేసుకున్నాయి. అయితే మాతా శిశు మరణాలు సంఖ్య పై స్పష్టత లేదు.
వైద్య సేవల కొరత
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో అమలులో ఉన్న లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ లు, వైద్య సేవలు, పరికరాలు, సిబ్బంది లోటు వల్ల ఈ సమయంలో పుట్టిన పిల్లలు, తల్లులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని యూనిసెఫ్ అంచనా వేసింది.
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకుతుందేమోననే భయంతో చాలా మంది గర్భిణులు సరైన సమయానికి హాస్పిటల్‌కి వెళ్లలేకపోవడం, లేదా వైద్య సేవల కొరత వల్ల అత్యవసర సేవలు లభించకపోవడం జరుగుతోందని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రియెట్టా ఫోరా అన్నారు.
కోవిడ్-19 నివారణ కోసం తీసుకుంటున్నచర్యల వల్ల పుట్టిన పిల్లల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం జరిగే అవకాశం ఉందని, దీంతో కొన్ని లక్షల మంది తల్లీపిల్లల ఆరోగ్యం ముప్పులో పడవచ్చని యూనిసెఫ్ హెచ్చరించింది.
యూనిసెఫ్ సూచనలు
ఈ పరిస్థితిని నివారించడానికి యూనిసెఫ్ ప్రభుత్వానికి, వైద్య రంగానికి కొన్ని సూచనలు చేసింది.
గర్భిణులు, శిశువులకు అవసరమైన వైద్య సేవలను అందుబాటులో ఉంచాలి.
వైద్య సిబ్బందికి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలు అందుబాటులో ఉండాలి.
ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి.
వైద్య సేవలు అందుబాటులో లేని ప్రదేశాల్లో మొబైల్ హెల్త్ కిట్లు, వైద్య సేవల లభించేటట్లు చూడాలి.
గర్భిణీలకు కూడా యూనిసెఫ్ కొన్ని సూచనలు చేసింది
వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉండాలి.
కోవిడ్-19 లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం తీసుకోవాలి.
అందు కోసం పుట్టిన శిశువులను తాకకుండా ఉండాల్సిన పని లేదు.
కాన్పు విషయంలో ప్రణాళిక ఉండాలి.
శిశువు జన్మించాక టీకా ప్రణాళికను తప్పని సరిగా పాటించాలి.
కోవిడ్-19 లేని సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 2.8 మిలియన్ మాతా శిశు మరణాలు చోటు చేసుకున్నాయి. తగిన చర్యలు తీసుకుంటే ఈ మరణాలను తగ్గించవచ్చని యూనిసెఫ్ అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి:
- సముద్రపు దొంగలను పట్టిస్తున్న అరుదైన పక్షి ఇది..
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. వాటి వల్ల రైతులకు లాభమా, నష్టమా?
- 40 ఏళ్ల కిందట చోరీ అయిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా దొరికాయి?
- హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ నిరాకరించిందా? Fact Check
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- భారతదేశంలో అసలు కరోనావైరస్ కేసుల సంఖ్య 10 కోట్లు దాటిపోయిందా?
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)