కరోనావైరస్‌: రోజువారీ కొత్త కేసులు, మరణాలలో భారత్‌ అగ్రస్థానం - ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

ప్రచురణ

భారత్‌లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్‌తోపాటు భారతదేశంలో రోజువారీ కేసులు అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయని WHO తెలిపింది.

గత 24 గంటలలో ప్రపంచవ్యాప్తంగా 307,930 కేసులు నమోదయ్యాయని, ఇది ఒకే రోజు అత్యధిక కేసులలో ఒక రికార్డని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 5,500మంది మరణించారని, దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 917,417 చేరుకున్నట్లు WHO తెలిపింది.

అత్యధిక కేసులు నమోదు చేస్తున్న దేశాలలో భారత్‌, అమెరికా, బ్రెజిల్‌లు అన్నిదేశాలకన్నా ముందు వరసలో ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2.8 కోట్ల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, అందులో సగం కేసులు అమెరికాలోనే ఉన్నాయి.

సెప్టెంబర్‌ 6న చివరిసారిగా అత్యధిక సంఖ్యలో 306,857 కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

కేసులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలనుబట్టి ఆదివారంనాడు భారతదేశంలో 94,372 కొత్త కేసులు నమోదుకాగా, అమెరికాలో 45,523, బ్రెజిల్‌లో 43,718 కేసులు రికార్డయ్యాయి.

గత 24 గంటల్లో భారత్‌, అమెరికాలో వెయ్యి మరణాలు నమోదుకాగా, బ్రెజిల్‌లో 874మంది చనిపోయారు.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో భారత్‌ రెండోస్థానంలో నిలిచింది. అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్క ఆగస్టు నెలలోనే భారత్‌లో 20లక్షల పాజిటివ్‌ కేసులు రిపోర్టయ్యాయి.

మహమ్మారి ప్రభావం చూపడం మొదలు పెట్టిన తర్వాత ఒక నెలలో ఇదే అత్యధిక కేసుల సంఖ్య.

సెప్టెంబర్ ప్రారంభం నుంచి భారత్‌లో రోజూ వెయ్యిమంది కోవిడ్‌ కారణంగా చనిపోతుండగా, జులై నెలలో రోజుకు 84శాతంవృద్ధితో, 64,000 కేసులు రికార్డయ్యాయని అధికారిక రిపోర్టులు చెబుతున్నాయి.

బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. దీంతో ఆ దేశం కేసుల నమోదులో ప్రపంచంలోనే మూడోస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు బ్రెజిల్‌లో 131,000 మంది మరణించారు.

ఇక అమెరికా విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో పావువంతు కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ దేశంలో దాదాపు 6 కోట్లమంది వైరస్‌ పీడితులయ్యారు. జులైలో అత్యధికంగా కేసులు వచ్చినా, ప్రస్తుతం అది తగ్గుముఖం పట్టింది.

ప్రపంచ మరణాలలో అమెరికా అందరికంటే ముందుంది. సుమారు 194,000మంది ఆ దేశంలో మరణించారు.

ప్రపంచం పరిస్థితి ఎలా ఉంది?

యూరప్‌వ్యాప్తంగా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో కరోనా మరో వేవ్‌ మొదలయిందన్న ఆందోళన కనిపిస్తోంది.వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో స్థానికంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నారు.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై కొత్తగా మళ్లీ నిబంధనలు విధిస్తున్నారు. పెరూ, ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలలో కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో కోవిడ్‌-19 నిబంధనలు తొలగించాలంటూ నిరసనకారులు ఆందోళనకు దిగడంతో పోలీసులు 70మందిని అరెస్టు చేశారు.

కోవిడ్‌-19 ఓ కుట్ర అంటూ సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడంతో సుమారు 250మంది నిరసనకారులు మెల్‌బోర్న్‌ వీధుల్లో ఆందోళన నిర్వహించారు. ఆస్ట్రేలియావ్యాప్తంగా 75శాతం కేసులు, 90 శాతం మరణాలు ఒక్క విక్టోరియా రాష్ట్రంలోనే నమోదయ్యాయి.

ఇక సెప్టెంబర్‌ 21 నుంచి రాజధాని అక్లాండ్‌ సహా దేశవ్యాప్తంగా కోవిడ్‌ ఆంక్షలు ఎత్తివేస్తామని న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెన్‌ ప్రకటించారు.

కోవిడ్‌-19 నియంత్రణలో న్యూజీలాండ్‌ అనుసరించిన విధానాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అయితే రాజధాని అక్లాండ్‌లో కొత్తగా కేసులు బయటపడటంతో ఆ నగరంలో నిబంధనలు విధించారు.

వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ అమలు చేయాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి ఈ లాక్‌డౌన్‌ అమలులోకి వస్తుంది.

ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో 153,000 పాజిటివ్‌ కేసులు రాగా, 1,108మంది మరణించారని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ రిపోర్టులు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)