సంజనా గల్రానీ: కన్నడ చిత్రసీమ డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కి డోప్ టెస్ట్- ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/sanjjanaagalrani
కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి సంజనా గల్రానీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సాక్షి పత్రిక రాసింది.
డ్రగ్స్ కేసులో తనను బలి పశువును చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని సంజనా ఆరోపించినట్లు ఈ కథనం వెల్లడించింది.
డోప్ టెస్టు చేయించుకోవాలన్న పోలీసుల సూచనను ఆమె తీవ్రంగా తప్పుబట్టారని తెలిపింది.
తాను ఏ తప్పు చేయలేదని, పోలీసులపై తనకు నమ్మకం పోయిందని, పరీక్ష చేయించుకోనని పోలీసులకు సంజనా స్పష్టం చేశారని సాక్షి రాసింది. అయితే చివరకు ఆమె టెస్టుకు అంగీకరించారని ఈ కథనం పేర్కొంది.
సంజనా పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు.
చిన్నారికి మళ్లీ చేతులొచ్చాయి
స్కూలు ఆవరణలో కరెంట్ షాక్ కారణంగా రెండు చేతులు కోల్పోయిన చిన్నారికి జపాన్ నుంచి కృత్రిమ అవయవాలు తెప్పించి అమర్చారని, ఇప్పుడా చిన్నారి చక్కగా చదువుకోగలుగుతోందని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం రాసింది.
ఈ కథనం ప్రకారం సూర్యపేట జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన పన్నెండేళ్ల కీర్తన నడిగూడెం గురుకుల పాఠశాలలో చదువుతోంది. గత ఏడాది స్కూల్‌లో పోల్‌జంప్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు కేవీ విద్యుత్ లైన్ తీగలు తగిలాయి.
తీవ్ర గాయాలపాలైన ఆమె రెండు చేతులకు ఇన్‌ఫెక్షన్ కూడా సోకడంతో మోచేతుల వరకు తొలగించాల్సి వచ్చింది. రెండు నెలలపాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి రాగా, ఆ ఖర్చులను ప్రభుత్వమే భరించింది.
గురుకుల విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ చొరవ తీసుకుని చిన్నారి కోసం రూ.8 లక్షలు ఖర్చుతో జపాన్ నుంచి కృత్రిమ చేతులు తెప్పించారు. వాటివినియోగంపై 12 రోజులపాటు కీర్తనకు శిక్షణ ఇచ్చారు.
ఇప్పుడు ఆ చిన్నారి పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లగలుగుతోందని, సొంతంగా రాయగలుగుతోందని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. ఈ మొత్తం చికిత్సకు రూ.38లక్షలు ఖర్చయినట్లు ఈ కథనం వెల్లడించింది.

ఆన్‌లైన్ ఆటల కోసం యువకుడు బలి
క్రికెట్ బెట్టింగులు, ఆన్‌లైన్ గేమ్‌లు ఆడి, వాటి కోసం అప్పులు చేసి, అవి తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.
కరీంనగర్ జిల్లాకు చెందిన నితీశ్ కుమార్ అనే యువకుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఆన్‌లైన్ గేమ్‌లు, క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసైన నితీశ్ గత రెండేళ్లుగా వాటి కోసం అనేకమంది దగ్గర అప్పులు చేశాడు.
గతంలో నితీశ్ చేసిన అప్పులను తండ్రి తీర్చాల్సి వచ్చింది. అయినా తీరు మార్చుకోని నితీశ్ మళ్లీ అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గం లేకపోవడంతో కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల భయంతోనే తన కొడుకు ప్రాణాలు తీసుకున్నాడని నితీశ్ తండ్రి చెప్పినట్లు నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఫొటో సోర్స్, REUTERS
ఆజాద్ అవుట్-ప్రియాంక ఇన్
పార్టీ అధిష్టానానికి లేఖ రాసిన బృందానికి నాయకత్వం వహించిన గులాం నబీ ఆజాద్‌ను కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించిందని సాక్షి సహా అన్ని పత్రికలూ రాశాయి.
ఆజాద్‌ను సీడబ్ల్యూసీలో కొనసాగిస్తూనే కార్యదర్శి హోదాపై అధిష్టానం వేటు వేసిందని సాక్షి కథనం పేర్కొంది. ఏఐసీసీ పునర్వ్యవస్థీ కరణలో భాగంగా సీడబ్ల్యూసీ సభ్యులను, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లను మారుస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆజాద్‌తోపాటు మోతీలాల్ వోరా, మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీలను కూడా ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తప్పించినట్లు ఈకథనం వెల్లడించింది.
ఆజాద్ ప్రధాన కార్యదర్శి హోదా కోల్పోగా, ప్రియాంకా గాంధీకి సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. దీంతోపాటు పార్టీ వ్యవహారాలో సోనియా గాంధీకి సహాయ పడేందుకు ఆరుగురు సభ్యుల కమిటీని కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏర్పాటు చేసినట్లు ఈ కథనంలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఊమెన్ చాందీని కొనసాగించగా, తెలంగాణ ఇంఛార్జ్ కుంతియా స్థానంలో మాణిక్కం టాగూర్‌ను సోనియా గాంధీ నియమించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























