సోనూ సూద్: సొంతంగా రోడ్డు వేసుకున్న విజయనగరం జిల్లా గిరిజనులు.. ‘రియల్ హీరోస్’ అన్న బాలీవుడ్ నటుడు - ప్రెస్ రివ్యూ

ఏపీ విజయనగరం జిల్లా ఏఓబీలోని గ్రామానికి రోడ్డు వేసుకున్న గ్రామస్థులపై నటుడు సోనూసూద్ ప్రశంసలు కురిపించారని సాక్షి రాసింది.
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా గిరిజనులు తమ సమస్యలను తామే పరిష్కరించుకున్న తీరుపై ‘రియల్ హీరో’ సోనూసూద్ ప్రశంసల వర్షం కురిపించారు.
‘‘మీలాంటి ఇంకెంతో మంది వ్యక్తులు ఇలాగే ముందుకు వచ్చి తమ పనులు తామే చక్కబెట్టుకుంటే ఎంతో బాగుంటుంది. ఇలాంటివి మరిన్ని చూడాలని ఉంది. త్వరలోనే అక్కడికి వస్తాను. మిమ్మల్ని కలుస్తాను. మీరు జాతి మొత్తానికి స్ఫూర్తిగా నిలిచారు. వెల్‌డన్ హీరోస్’’ అంటూ ట్విటర్ వేదికగా కొనియాడారని సాక్షిలో రాశారు.
ఇకపై కావళ్లపై మనుషులను మోసుకెళ్లే అవసరం ఉండదంటూ సంతోషం వ్యక్తం చేశారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఏఓబీలో గల గిరిశిఖర కొదమ పంచాయతీ చింతామలలో సుమారు 150 కుటుంబాలు జీవిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా రాష్ట్రంలో భారీ సంత జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్లాలన్నా, మరే ఇతర అవసరాల కోసమైనా ఈ పంచాయతీ గిరిజనులు సబకుమరి జంక్షన్ దాటాల్సి ఉంటుంది.
అయితే జంక్షన్ వరకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వేసిన బీటీ రోడ్డు మాత్రమే ఉంది. అయితే దాటేందుకు రోడ్డు వేయాల్సిందిగా దశాబ్దాల తరబడి అర్జీలు పెట్టుకున్నా అవి కార్యరూపం దాల్చలేదని సాక్షి రాసింది..
దీంతో గిరిజనులు తమ సమస్యను తామే తీర్చుకునేందుకు నడుం బిగించారు. సబకుమరి జంక్షన్ వరకు రోడ్డు నిర్మాణానికై చింతామల గ్రామస్తులు ఇంటికి రెండు వేల చొప్పున చందాలు సేకరించారు.
వాటితో రెండు ప్రొక్లెయిన్లను రప్పించి కొండను తవ్వించి ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇక గతంలోనే పగులుచెన్నేరు గ్రామస్తులు పట్టుచిన్నేరు నుంచి తమ గ్రామానికి శ్రమదానంతో మట్టి రోడ్డు వేసుకున్నారు.
ఈ విషయాన్ని ఓ నెటిజన్ సోనూసూద్ దృష్టికి తీసుకువెళ్లగా గిరిజనులపై ఆయన ప్రశంసలు కురిపించారని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
బీహార్ ప్రసూతి పథకం కుంభకోణం: 65 ఏళ్ల మహిళ 18 నెలల్లో 13 జన్మనిచ్చిందంటూ రికార్డులు
బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలోని చోటీ కొథియాలో లీలాదేవి అనే 65 ఏళ్ల మహిళకు ఆరుగురు పిల్లలు, ఆమె చిన్న కొడుకు వయసు 21 ఏళ్లు. అయితే గత 18 నెలల్లో ఆమె 13 మంది పిల్లలకు జన్మనిచ్చిందని ముషాహారి బ్లాక్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రికార్డుల్లో ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక కథనం ప్రచురించింది.
ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఒక పథకం ద్వారా లబ్ధి పొందిన 18 మంది మహిళల్లో ఆమె ఒకరు. వారి పేరున భారీగా నగదు కొల్లగొడుతున్నారని పత్రిక చెప్పింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక కస్టమర్ సర్వీస్ ఆపరేటర్ ఆగస్టు 6న లీలాదేవి ఇంటికి వెళ్లడంతో ఈ గుట్టు బయటపడిందని కథనంలో రాశారు.
ప్రభుత్వం ఆమె అకౌంట్‌లో జమ చేసిన నగదును అక్రమంగా మరో అకౌంటుకు బదిలీ చేయడానికి ఒక ఫాం మీద వేలి ముద్ర వేసేందుకు ఆమెను కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు రావాలని అతడు కోరాడు.
తను ఏ పథకంలోనూ లబ్ధిదారుగా లేకపోవడంతో లీలాదేవికి సందేహం వచ్చింది. "దాంతో నేను ముషాహారీ బ్లాక్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గరికి వెళ్లాను. అక్కడ మా గ్రామం, పక్కనే ఉన్న రాహువా గ్రామానికి చెందిన మరో 12 మంది మహిళలు కూడా ప్రసవం పథకంలో లబ్ధిదారులుగా ఉన్నట్టు తెలిసింది" అన్నారు..
18 మంది మహిళల్లో ఎవరూ గర్భవతులు కారు: ఆస్పత్రిలో ఒక ప్రసవానికి ఒక మహిళకు 1400 రూపాయలు ఇస్తారు. ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చిన ఆశా వర్కర్‌కు 600 లభిస్తుంది. ఈ 18 మంది మహిళల బ్యాంక్ అకౌంట్లకు ఈ నగదు చెల్లించారు.
ఈ అకౌంట్లన్నీ కస్టమర్ సర్వీర్ పాయింట్ ఆపరేటర్ సుశీల్ కుమార్ తెరిచాడు. ఈ మహిళల్లో ఛోటియా గ్రామానికి చెందిన 59 ఏళ్ల షీలా దేవి గత 13 నెలల్లో 8 మంది పిల్లలకు జన్మనిచ్చారన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రికార్డుల్లో ఉంది. ఈ లెక్కల్లో ఒక రోజు తేడాలోనే ఆమె ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినట్టు ఉంది. వాస్తవానికి షీలాదేవికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె చిన్న కూతురి వయసు 17 ఏళ్లని పత్రిక రాసింది.
‘‘ఆ జాబితాలో నా పేరు ఉన్నట్టు నాకు లీలా చెప్పారు. నాకు ఆ బదిలీల గురించి తెలీదు’ అని షీలా చెప్పారు.
ముజఫర్‌పూర్ పోలీసులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అకౌంటెంట్ పై కేసు నమోదు చేశారు. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.ఈ విషయం బయటపడడంతో ఈ మహిళల పేరున అకౌంట్ల తెరిచిన ఎస్బీఐ సర్వీస్ పాయింట్ ఆపరేటర్ పేరు ఇంకా చేర్చలేదు.
గత రెండేళ్లుగా కేంద్రంలో జరిగిన ప్రసవాలకు చెల్లించిన మొత్తం లెక్కలు సమర్పించాలని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదేశించారు. దీనిపై నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. వారు ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వివరించింది.

సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్ 4... మెట్రో రైళ్లు మళ్లీ పరుగులు పెడతాయా?
సెప్టెంబర్ 1 నుంచి సరికొత్త మార్గదర్శకాలతో కేంద్రం అన్‌లాక్-4ను కేంద్ర సిద్ధం చేస్తోందని ఈనాడు సహా ప్రధాన పత్రికలన్నీ ప్రచురించాయి.
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో నిలిచిపోయిన మెట్రో రైళ్లు త్వరలో మళ్లీ పరుగులు పెట్టనున్నాయి! ‘అన్‌లాక్-4’లో భాగంగా వచ్చే నెల 1 నుంచి వాటి ప్రయాణాలను కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోవిడ్ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో బడులు, కళాశాలలు, సినిమా థియేటర్లు మాత్రం మరికొన్నాళ్లు మూతపడి ఉండక తప్పేట్టు లేదని ఈనాడు రాసింది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ‘అన్‌లాక్-3’ గడువు ఆగస్టు 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సరికొత్త మార్గదర్శకాలతో ‘అన్‌లాక్-4’ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
ఈ వారంలోనే సదరు మార్గదర్శకాలు విడుదలవుతాయని అంచనా. ‘అన్‌లాక్-4’లో భాగంగా వచ్చే నెల 1 నుంచి మెట్రో సేవలను అనుమతించే అవకాశముందని ఓ అధికారి తెలిపారని కథనంలో రాశారు.
అయితే- వైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టి ఆయా రాష్ట్రాల్లో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కల్పిస్తుందని చెప్పారు.
ఈ ఏడాది మార్చి ఆఖర్లో మెట్రో సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
అన్‌లాక్-4లోనూ పాఠశాలలు, కళాశాలలను తెరిచేందుకు అనుమతులు రాబోవని అధికారి తెలిపారు.
విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంల వంటి ఉన్నత విద్యాసంస్థలను పునఃప్రారంభించే అంశంపై మాత్రం చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదన్నారు.
సెప్టెంబరు 1 నుంచి సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతించే అవకాశాలూ లేవని చెప్పారు. భౌతిక దూరం వంటి ప్రమాణాలను పాటిస్తూ వాటిని నడపడం యజమానులకు ఆర్థికంగా చాలా భారంగా మారుతుందని పేర్కొన్నారు.
బార్లను పూర్తిస్థాయిలో తిరిగి తెరిచేందుకూ అనుమతులు రాబోవన్నారు. కౌంటర్లలో మద్యం విక్రయించుకునేందుకు మాత్రం వాటిని అనుమతించే అవకాశముందని ఆయన చెప్పారని ఈనాడు కథనంలో వివరించారు.

ఎడమగట్టు విద్యుత్ కేంద్రం రెండు యూనిట్లకు భారీ నష్టం
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో రెండు యూనిట్లకు నష్టం జరిగిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంతో రెండు యూనిట్లకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
మరో రెండు యూనిట్లు సురక్షితంగానే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
మిగిలిన రెండు యూనిట్ల భవితవ్యం ఏమిటన్నది పరిశీలన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా విద్యుత్తు కేంద్రం లోపలకు పూర్తిగా పోలేని పరిస్థితే ఉంది.
టన్నెల్ కావడంతో ఇంకా వేడి ఆవరించి ఉంది. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు అందిన సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రానికి టన్నెల్ లోపలకు వెళ్లడానికి మార్గం సుగమయిందని కథనంలో రాశారు.
మంగళవారం సులువుగా లోపలకు వెళ్లి నష్టం అంచనా మొదలు పెట్టవచ్చని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని చెబుతున్నా అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటన్నది వెల్లడి కావాల్సి ఉంది.
ప్రమాద సమయంలో విధుల్లో ఉండి సురక్షితంగా బయటపడిన ఇంజినీర్లు తెలిపిన సమాచారం ప్రకారం.. నాలుగో యూనిట్‌లో మొదలైన మంటలు 5, 6 యూనిట్లకు వేగంగా వ్యాపించాయి.
1, 2 యూనిట్లకు మాత్రం పెద్దగా ప్రమాదం వాటిల్లలేదని విద్యుత్తు అధికారులు అంచనా వేస్తున్నారు.
అందుకే ఈ రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని 16 రోజుల్లో తిరిగి ప్రారంభించగలమనే భావనలో జెన్‌కో ఉంది. ఇందు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎండీ ప్రభాకర్‌రావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారని పత్రిక చెప్పింది.
అయితే.. ఇది అంతా కూడా ప్రాథమిక అంచనానే. ఒక్కో యూనిట్‌లో ప్యానల్ బోర్డు, జనరేటర్‌ను సాంకేతికంగా పరిశీలించిన తర్వాతే నష్టం ఏ మేరకు జరిగింది? ఎంత జరిగింది? అనే అంచనాకు రాగలమని జెన్‌కో చెబుతోందని ఆంధ్రజ్యోతి వివరించింది..

తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,474 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇందులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 447 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,01,865 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ ఏడుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 744కు చేరింది.
ఇవాళ 1,768 మంది వైరస్ బారి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 78,735 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 22,386 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో 15,931 మంది ఉన్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో 43,095 మందికి కొవిడ్ -19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 8,91,173 మందికి టెస్టులు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొందని పత్రిక రాసింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 447, రంగారెడ్డి జిల్లాలో 201, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి.
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- CAA, దిల్లీ హింసలపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి
- కశ్మీర్, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...
- కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























