You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
''143 మంది నన్ను రేప్ చేశారు.. ఏళ్ల తరబడి హింసించారు'': హైదరాబాద్ యువతి 100 పేజీల ఫిర్యాదు - ప్రెస్ రివ్యూ
''నాపై 143 మంది ఏళ్ల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. నగ్నంగా చిత్రాలు, వీడియోలు తీశారు. సిగరెట్లతో కాలుస్తూ శారీరకంగా హింసించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని తుపాకీతో బెదిరించారు. వారిలో విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల పీఏలతో పాటు సినీ పరిశ్రమ వారూ ఉన్నారు. ఇప్పుడు వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది'' అంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. 100 పేజీల ఫిర్యాదులో ఆమె పలు అంశాలను పేర్కొంది. తనపై సామూహిక అత్యాచారాలు, వేధింపులు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగాయని తెలిపింది. వారు తనను వదిలిపెట్టరని, ఇదే చివరి వాంగ్మూలమని పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద 143 మందిపై కేసు నమోదు చేశారు.
నిందితుల్లో ఓ మాజీ ఎంపీ పీఏ కూడా ఉన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన ఈ యువతికి మిర్యాలగూడకు చెందిన వ్యక్తితో 2009 జూన్‌లో వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులు తట్టుకోలేక 2010 డిసెంబరులో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు.
పుట్టింట్లో ఉండి చదువుకుంటుండగా విద్యార్థి సంఘం నాయకులతో పాటు పలువురితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం క్రితం రాజ్‌భవన్ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగింది. ఈ క్రమంలో తనపై మాజీ ఎంపీ పీఏ, విద్యార్థి సంఘం నాయకులు ముగ్గురు, మరో 139 మంది కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది.
తనతో నగ్నంగా నృత్యాలు చేయించేవారని, ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆనందం పొందేవారని, వారి స్నేహితులతో కూడా గడపాలని బెదిరించేవారని, సహకరించకపోతే చంపుతామనేవారని యువతి తెలిపింది. కులం పేరుతో దూషించేవారని, నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతామన్నారని ఫిర్యాదు చేసింది. వారు మరికొందరు యువతులపైనా అఘాయిత్యాలకు పాల్పడ్డారని తెలిపింది.
న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును సీసీఎస్ లేదా సీఐడీకి అప్పగించే అవకాశాలున్నాయి.
డిసెంబరు నాటికి భారత్‌లో వ్యాక్సిన్: కేంద్ర ఆరోగ్యమంత్రి
ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ 'కోవాక్సిన్' ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపినట్లు 'సాక్షి' ఓ కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ట్రయల్స్ అన్ని విజయవంతమైన పక్షంలో ఆక్స్‌ఫర్డ్ టీకా 'కోవిషీల్డ్' 2020 చివరి నాటికి భారతీయులకు అందుబాటులోకి రావచ్చునని కూడా పలు రిపోర్టులు చెప్తున్నాయి. వీటితోపాటు జైడుస్ కాడిలా తయారు చేస్తున్న 'జైకోవ్ డీ', ఆక్స్‌ఫర్డ్ 'ఆస్ట్రాజెనికా'తో జతకట్టిన సీరం ఇన్స్‌స్టిట్యూట్ ట్రయల్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.
అన్నీ అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఇవి కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని హర్షవర్ధన్ వెల్లడించారు. వ్యాక్సిన్ల తయారీలో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నారు. సురక్షిత వ్యాక్సిన్‌తోపాటు సరసమైన ధరలకే దానిని ప్రజలకు అందించే దిశగా ఆయా కంపెనీలు పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఇక భారత్‌లో అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ ఏదైనా తొలుత 50 లక్షల వ్యాక్సిన్లు కరోనా వారియర్లకే ఇవ్వాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది. దానికోసం ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఇదిలాఉండగా.. వ్యాక్సిన్ తయారీలో భారత్ సక్సెస్ అవుతుందని రష్యా పేర్కొంది. ఆ సత్తా భారత్‌కు ఉందని తెలిపింది. కాగా, స్పుత్నిక్ వీ పేరుతో రష్యా తొలి కరోనా వ్యాక్సిన్‌ను అందబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, సరైన నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద రష్యా వ్యాక్సిన్‌ను తెచ్చిందనే విమర్శలు వెలువడుతున్నాయి. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పనితీరు త్వరలో వెల్లడి కానుంది.
మూడు నెలల నిరుద్యోగ భృతి
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)లో సభ్యులుగా ఉండి లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు మూడు నెలలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. అటువంటి కార్మికులకు ఒక్కో నెల వేతనంలో 50 శాతాన్ని నిరుద్యోగ భృతిగా చెల్లించనున్నారు. దేశంలో లాక్‌డౌన్ మొదలైన మార్చి 24 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 31 మధ్య 90 రోజుల కాలవ్యవధికి కార్మికులు నిరుద్యోగ భృతికి అర్హులు అవుతారు.
అయితే వారు 2018 ఏప్రిల్ 1నుంచి 2020 మార్చి 31 మధ్య రెండేండ్లు ఈఎస్‌ఐ సభ్యులుగా ఉండాలి. 2019 అక్టోబర్ 1నుంచి 2020 మార్చి 31 మధ్య కనీసం 78 రోజులు చందా (తమ వంతు కంట్రిబ్యూషన్ మొత్తం) చెల్లించినవారే నిరుద్యోగ భృతికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
ఈఎస్‌ఐసీ నిబంధనల ప్రకారం.. ఈఎస్‌ఐ సభ్యుడైన ఉద్యోగి ఏదైనా కారణాలతో తన ఉద్యోగం కోల్పోతే 90 రోజుల పాటు 25 శాతం వేతనం చెల్లించాల్సి ఉంటుంది (జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది). దీనిని కేంద్రం ప్రస్తుతం 50 శాతానికి పెంచింది.
అసభ్యకర పోస్టర్లు.. క్షమాపణ చెప్పిన నెట్‌ఫ్లిక్స్
ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ త్వరలో ప్రసారం చేయబోయే సినిమాకు సంబంధించిన పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తటంతో ఆ సంస్థ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిందని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ సంస్థ మీద కొందరు పిటిషన్లు కూడా వేస్తున్నారు. ఫ్రెంచ్‌లో తీసిన మిగ్నొన్నెస్ చిత్రాన్ని ఇంగ్లిష్‌లో 'క్యూటీస్' పేరుతో వచ్చే నెలలో నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయనుంది.
పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌కు చెందిన 11 ఏళ్ల ముస్లిం బాలిక జీవితమే ఈ చిత్రం కథ. కుటుంబ కట్టుబాట్లు.. ఆధునిక, ఇంటర్నెట్ కల్చర్ మధ్య నలిగిపోయే ఓ బాలిక.. స్వేచ్ఛను కోరుకుంటుంది. ఇందుకోసం ఓ డాన్స్ గ్రూప్‌లో చేరుతుంది. ఆ గ్రూప్‌లో ఉండేది 11-15 ఏళ్ల మధ్య ఉండే బాలికలే.
ఈ బాలికల నేపథ్యంలో సాగే చిత్రానికి సంబంధించిన పోస్టర్లను నెట్‌ఫ్లిక్స్ ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ పోస్టర్లు అసభ్యంగా, చిన్నారులను శృంగారానికి ఉసిగుల్పే విధంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో తప్పు తెలుసుకున్న నెట్‌ఫ్లిక్స్ బహిరంగ క్షమాపణ తెలిపింది.
'క్యూటీస్.. సినిమా కోసం అనుచితంగా ఉన్న పోస్టర్లను ఉపయోగించినందుకు క్షమాపణ చెబుతున్నాం. ఈ పోస్టర్లు సరిగా లేవు. పోస్టర్లను, సినిమాకి సంబంధించిన వివరణను మారుస్తున్నాం' అని నెట్‌ఫ్లిక్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)