You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షలు దాటిన కరోనా కేసులు.. దేశంలో మూడో స్థానం - ప్రెస్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటాయని ఆంధ్రజ్యోతి సహా అన్ని ప్రధాన పత్రికలు రాశాయి.
కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతోంది. సరిగ్గా 11 రోజుల్లోనే మరో లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి. వెరసి... మూడు లక్షల కేసులు దాటిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు నమోదు చేసింది.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మహారాష్ట్ర, తమిళనాడుల్లో మాత్రమే 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో మూడో రాష్ట్రంగా ఏపీ చోటు దక్కించుకుందని పత్రిక చెప్పింది.
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ కొత్తగా 9,652 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌లు 3,06,261కి చేరాయి.
రోజువారీ కేసుల్లో సైతం ఏపీ టాప్‌లోనే ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రోజుకు సగటున పదివేల కేసులు నమోదవడం లేదు. మహారాష్ట్రలోనూ రోజుకు 7-8 వేల కేసులు మాత్రం వెలుగు చూస్తున్నాయి.
రాష్ట్రంలో తొలి లక్ష కరోనా కేసులకు 137 రోజులు పట్టింది. రెండో లక్ష మాత్రం కేవలం 11 రోజుల్లోనే వెలుగు చూశాయి. అనంతరం మూడో లక్ష కేసులు కూడా 11 రోజుల్లోనే నమోదయ్యాయి.
ఈ స్థాయిలో కేసులు మరే రాష్ట్రంలో నమోదు కావడం లేదు. రాష్ట్రంలో కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి మరో లక్ష మంది కరోనా బారిన పడినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారని ఆంధ్రజ్యోతి రాసింది.
రాష్ట్రంలో మంగళవారం 9,211మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 2,18,311మంది డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం కొవిడ్ మరో 88మందిని బలి తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 2,820కి పెరిగాయని కథనంలో వివరించారు.
ఐపీఎల్ స్పాన్సర్ షిప్ హక్కులు దక్కించుకున్న డ్రీమ్ 11
ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్ ‘డ్రీమ్ 11’ ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు సొంతం చేసుకుందని సాక్షి కథనం ప్రచురించింది.
ఈ ఏడాది కోసం డ్రీమ్ 11 రూ. 222 కోట్లు చెల్లించనుంది. స్పాన్సర్‌షిప్ కోసం వేసిన బిడ్లను మంగళవారం తెరవగా...అందరికంటే ఎక్కువగా బిడ్ వేసిన డ్రీమ్ 11కు ఈ అవకాశం దక్కింది.
రెండో స్థానంలో బైజూస్ (రూ. 201 కోట్లు), అన్ అకాడమీ (రూ. 170 కోట్లు) నిలిచాయని పత్రిక రాసింది.
వచ్చే ఏడాది స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ‘వివో’ తిరిగి రాకపోతే తర్వాత రెండేళ్లు కూడా డ్రీమ్ 11కు స్పాన్సర్‌షిప్ హక్కులు ఇవ్వనున్నారు.
ఇందు కోసం రూ. 240 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ‘వివో’ ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించింది. దాంతో పోలిస్తే ఇది సగమే (49.5 శాతం తక్కువ).
అయితే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇది ఏ రకంగా చూసినా బోర్డుకు లాభదాయకమే అని సాక్షి చెప్పింది.
పైగా ఈ సారి అసోసియేట్ స్పాన్సర్ల సంఖ్యను మూడునుంచి ఐదుకు పెంచిన బోర్డు...చెరో రూ. 40 కోట్ల చొప్పున అదనంగా మరో రూ. 80 కోట్లను తమ ఖాతాలో వేసుకోనుంది. అంటే ఐపీఎల్–13 సీజన్‌నుంచి బోర్డుకు స్పాన్సర్ల ద్వారానే రూ. 302 కోట్లు రానున్నాయి.
చిరంజీవి 152 చిత్రం 'ఆచార్య' ఫొటో రిలీజ్
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న ‘ఆచార్య’ చిత్రబృందం అభిమానులకు ఓ కానుక అందించనుందని ఈనాడు కథనం రాసింది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో రూపొందుతున్న ఈ భారీ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను చిరు 65వ జన్మదినం సందర్భంగా విడుదల చేయనున్నారని చెప్పింది.
ఈ మేరకు చిత్రబృందం మంగళవారం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. బిగించిన పిడికిలిలో ఎర్రని శాలువ ఎగురుతున్నట్లున్న ఈ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్ పతాకాలపై నిర్మిస్తున్నారని ఈనాడు కథనంలో రాశారు.
మూడో దశ ట్రయల్‌కు సిద్ధమైన కరోనా వ్యాక్సిన్
దేశంలో తయారవుతున్న ఒక వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ క సిద్ధమైనట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
కరోనా కట్టడికి భారత సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు సంబంధించి నీతి ఆయోగ్ శుభవార్త చెప్పింది. దేశీయ సంస్థ అభివృద్ధి చేసిన ఓ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కి సిద్ధమైనట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారని కథనంలో రాశారు.
బుధవారంనాటికి ఈ టీకా మూడోదశలోని ప్రాథమిక హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించనున్నట్టు చెప్పారు. మరో రెండు టీకాలు మొదటి, రెండో దశలో ఉన్నట్టు వెల్లడించారు.
అయితే, ఈ వ్యాక్సిన్‌ల తయారీదారులు ఎవరనే విషయాన్ని ఆయన ప్రస్తావించలేదని పత్రిక చెప్పింది.
భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్' టీకానే మూడోదశ ట్రయల్స్‌లోకి ప్రవేశించబోతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.
వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఐదు దేశీయ సంస్థలతో కేంద్రం సోమవారం చర్చలు జరిపింది. టీకా ప్రయోగాలు ఏఏ దశల్లో ఉన్నాయి? టీకా సంస్థలు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సాయం, టీకాకు ఆశిస్తున్న ధర తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు.
ప్రస్తుతం కరోనా టీకాపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెన్నోవా సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారని, చర్చలు ఫలప్రదంగా సాగాయని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించినట్లు నమస్తే తెలంగాణ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- ఉత్తరప్రదేశ్: రేప్‌లు, మహిళలపై నేరాలు పెరుగుతోంటే.. రామరాజ్యం అంటున్న యోగి
- సముద్రంలో ఆపదలో ఇద్దరు మహిళలు.. ఈదుతూ వెళ్లి రక్షించిన దేశాధ్యక్షుడు
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- అమిత్ షాకు కరోనా పాజిటివ్.. అమితాబ్ బచ్చన్‌కు నెగటివ్
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- సౌదీ అరేబియాను పాకిస్తాన్ నుంచి భారత్ తనవైపు లాగేసుకుందా?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)