రాజీవ్ త్యాగి మరణం: టీవీ ఛానళ్ల చర్చలు కోడిపుంజుల కొట్లాటల్లా మారాయా?

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఆగస్టు 12వ తేదీన ఒక టీవీ ఛానల్ చర్చల్లో పాల్గొన్న కొద్దిసేపటికే కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానెళ్లలో చర్చలు ఒత్తిడికి గురి చేస్తున్నాయంటూ అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

1990లలో ప్రైవేట్ టీవీ ఛానళ్లు రావడం మొదలై, అత్యంత వేగంగా వాటి సంఖ్య పెరిగింది. వార్తలు మాత్రమే కాకుండా టీవీలలో ఇతరత్రా వినోదాత్మక కార్యక్రమాలు, అనేక రకాల చర్చలు, వివిధ అంశాలలో పోటీలు మొదలైనవాటి ప్రసారం పెరిగింది.

అయితే ప్రైవేట్ టీవీల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాల విషయ నియంత్రణా చర్యలు మాత్రం 2011లో ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫెడరేషన్, బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్ (బీసీసీసీ)ను స్థాపించడంతో ప్రారంభమయ్యాయి. ఇందులో మాజీ న్యాయమూర్తులు అధ్యక్షులుగా ఉండగా, వివిధ ఛానళ్ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

అయినా కూడా, టీవీల్లో చర్చలు చాలాసార్లు నియంత్రణ పరిధులు అతిక్రమిస్తున్నాయి.

రాజీవ్ త్యాగి మరణంతో ప్రైవేట్ ఛానళ్లలో జరిగే చర్చల స్థాయి, ప్రభావం మరోసారి చర్చల్లోకి వచ్చాయి.

ఈ సందర్భంగా, కాంగ్రెస్ ప్రతినిధి, సుప్రీం కోర్టు లాయర్ జయ్‌వీర్ షెర్గిల్…టీవీల్లో దూషణలతో కూడిన, విషపూరితమైన చర్చలను నియంత్రిస్తూ, నాగరికంగా, పరస్పర గౌరవంతో చర్చలు జరిగేలా చూడాలని సమాచార ప్రచార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్‌ను ట్విటర్ ద్వారా కోరారు.

టీవీల్లో వస్తున్న చర్చల్లో విలువలు రాను రాను క్షీణిస్తున్నాయని అనేకమంది అభిప్రాయపడుతున్నారు.

కొంతమంది ప్రముఖ జర్నలిస్టులు ఈ చర్చలను 'కోడిపుంజుల కొట్లాట' గా పేర్కొన్నారు.

ప్రముఖ పాత్రికేయులు ఉర్మిలేష్ ఒక ప్రభుత్వ టీవీ ఛానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక చర్చల్లో పాల్గొన్నారు. పలుమార్లు వివిధ ఛానళ్లలో నిర్వహించిన రాజకీయ విశ్లేషణలకు సంబంధించిన చర్చల్లో కూడా పాల్గొన్నారు.

ఇటీవల కాలంలో ఆయన టీవీల్లో వచ్చే చర్చల్లో పాల్గొనడం మానేసానని అన్నారు. ఆ చర్చల స్థాయి హీనస్థితికి వచ్చేసిందనే అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఉర్మిలేష్ బీబీసీతో మాట్లాడుతూ..."ఇవి ఇంకా ఎంత దిగజారిపోతాయో అర్థం కావడం లేదు. టీవీల్లో చర్చలు రాజకీయ సాధనాలుగా మారిపోయాయి. కార్పొరేట్ సంస్థలు, రాజకీయ పార్టీలు వీటిని నియంత్రిస్తున్నాయి. ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే దిశలో పనిచేస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు వార్తలు తెలుసుకోవాలంటే ఇదొక్కటే మార్గం" అన్నారు.

టీవీ ముఖ్య ఉద్దేశం సమాచారం అందించడం, ముఖ్య విషయాలు తెలియజేయడం. ఇది తప్ప ప్రైవేటు ఛానళ్లు మిగతావన్నీ చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

వార్తాలు అందించడంలోనూ, చర్చలు నిర్వహించడంలోనూ అధికారం చలాయించే తత్వం, మిడిమిడి జ్ఞానం కనబడుతోందని పలువురు భావిస్తున్నారు.

మరోవైపు, ప్రజలకు ఏం కావాలో అదే చూపిస్తున్నామని మీడియా సంస్థలు అంటున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంలో టీఆర్పీ రేటింగులు పెద్ద పాత్ర పొషిస్తున్నాయి. టీఆర్పీ రేంటింగులు ప్రజాదరణను సూచిస్తాయి. ముఖ్యంగా సంస్థ ఆదాయలు వీటిపై ఆధారపడి ఉంటాయి.

సోషల్ యాక్టివిస్ట్ సందీప్ మహాపాత్ర మట్లాడుతూ...చర్చ అంటే మన అభిప్రాయం మనం చెప్పి, ఇతరులకు కూడా అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చి, వాళ్లు చెప్పింది విని అంగీకారాన్ని లేదా విభేదాన్ని గౌరవంగా తెలుపడం. కానీ చర్చల్లో 12 మందిని కూర్చోబెడితే ఇవేవీ సవ్యంగా జరగట్లేదు. కొన్నిసార్లు అరాచకంగా కూడా వ్యవహరిస్తున్నారు అని అభిప్రాయపడ్డారు.

ఈమధ్య ఆయన కూడా టీవీల్లో చర్చల్లకి వెళ్లట్లేదని తెలిపారు.

అయితే, టీవీ చానళ్లలో కంటెంట్‌ను నియంత్రించలేమని, అది భావ ప్రకటనా స్వేచ్చపై దాడిగా భావించే అవకాశం ఉందని మహాపాత్ర అభిప్రాయపడ్డారు.

"ఉదాహరణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను తీసుకోండి. ఇది ఒక నియంత్రణాధికారం ఉన్న సంస్థ. కానీ దీనికి కూడా పరిమితులున్నాయి. అలాగే టివీల్లో వచ్చే కంటెంట్‌ను నియంత్రించడానికి ఏర్పరచిన సంస్థకు కూడా కొన్ని పరిమితులున్నాయి" అని మహాపాత్ర అన్నారు.

నవభారత్ టైమ్స్, దైనిక్ హిందుస్తాన్, అవుట్‌లుట్ పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన అలోక్ మెహతా మాట్లాడుతూ... టీవీల్లో చర్చల స్థాయి దిగజారిపోవడానికి ప్రేక్షకులు కూడా బాధ్యులే. టీఆర్పీ రేటింగుల కోసమే ప్రతీ ఛానల్లోనూ చర్చా కార్యక్రమాలు పెట్టేస్తున్నారు. ఈ చర్చలన్నీ నిజమైన జర్నలిజానికి వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి అన్నారు.

టివీల్లో వచ్చే చర్చల్లో చాలామటుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరంతా ఎంత గట్టిగా అరిచి అవతలి పార్టీని మాట్లాడనివ్వకుండా చెయ్యచ్చనే దానిపై పోటీలు పడుతున్నారు అని సందీప్ మహాపాత్రా అన్నారు.

లోక్ జన్ శక్తి పార్టీ జాతీయ ప్రతినిధి అజయ్ కుమార్ మాట్లాడుతూ... ‘నేనెప్పుడైనా చర్చకు కూర్చోగానే ఫోన్లో మెసేజులు రావడం మొదలవుతుంది. గట్టిగా మాట్లాడండి, ప్రత్యర్థిపై దాడికి దిగండి అంటూ మెసేజులు వస్తాయి. ఒక్కోసారి ఎంత గట్టిగా అరిచినట్టు మాట్లాడవలసి వస్తుందంటే గొంతు పట్టేస్తుంది’ అని అన్నారు.

కంటెంట్ రాజైతే, ప్రేక్షకులు మహారాజులు అనే పద్ధతిలో టీవీల్లో కార్యక్రమాలు నడుస్తున్నాయి అని ఆయన అన్నారు.

రాష్ట్రీయ జనతా దళ్ ప్రతినిధి మనోజ్ ఝా మాట్లాడుతూ... ’ఇప్పుడు టీవీ ఛానల్ చర్చల్లో పాల్గొనడం మానసికంగా ప్రభావం చూపిస్తోంది. ఈ చర్చల్లో విద్వేషాన్ని వెళ్లగక్కుతూ మనసుల్లో విషాన్ని నాటుతున్నారు’ అని అన్నారు.

ప్రముఖ పాత్రికేయులు రాజ్‌దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ.. ‘ప్రతి చర్చా ఒకరినొకరు తీవ్రంగా నిందించుకోవడంతోనే ముగుస్తుంది. ఈ రకమైన చర్చలు ఇందులో పాల్గొంటున్నవారిపైనే కాక వ్యాఖ్యాతపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి’ అని అభిప్రాయపడ్డారు.

ఈ చర్చలన్నీ కోడిపుంజుల కొట్లాటల్లా తయారయ్యాయని ట్విటర్లో తన అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఎన్డీటీవీ యాంకర్‌గా పనిచేసిన నిధీ రాజ్‌ధాన్ ట్విటర్లో.. "టివీ ఛానల్లో చర్చలు విషం చిమ్ముతున్నాయి అని బాధపడేవారంతా పరిస్థితి ఇంతలా దిగజారిపోవడానికి మనందరం బాధ్యులమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఛానళ్లు చూసే ప్రేక్షకులు (మనందరం), వీటిలో ప్రకటనలు ఇచ్చేవారు, సంపాదకులు అందరూ బాధ్యులే" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)