తెలంగాణ: 'ఆస్పత్రుల్లో పడకల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు' - కేసీఆర్ :ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఆస్పత్రి పడకల అందుబాటు విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

పడకల కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించినట్లు తెలిపింది.

ప్రతీ ఆస్పత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి? అనే విషయాలను బహిరంగ పరచాలని, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలియచేయాలని సీఎం ఆదేశించారు.

కరోనా వైరస్‌ సోకిన వారు హైరానా పడిపోయి అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని, ఎంత మంది వచ్చినా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం మంచి చికిత్స జరుగుతోందని చెప్పారు.

‘‘ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి, వైద్యుల సలహా తీసుకోవాలి. చికిత్స పొందాలి. కరోనా వైరస్‌ సోకితే కావాల్సిన వైద్యం అందించడానికి రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లున్నాయి. వీటిని ప్రజలు వినియోగించుకోవాలి. కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్‌ సోకిన వారికి మంచి వైద్యం అందించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్థంగా ఉంది’’ అన్నారు.

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉందొద్దని సీఎం సూచించినట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

ఏప్రిల్ 14 నాటికి అంబేడ్కర్ పార్క్-జగన్

ఏపీలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి రికార్డు స్థాయిలో వ్యయం చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి రికార్డు స్థాయిలో వ్యయం చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకుమించి ఖర్చుచేయాలని అధికార యంత్రాంగానికి సీఎం దిశా నిర్దేశం చేశారు.

ఎస్సీ, ఎస్టీల కోసం మన ప్రభుత్వం అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చిందని.. వారికి ఇప్పుడు జరుగుతున్న లబ్ధి అంతా ఆ పథకాల నుంచేనని ఆయన వివరించారు.

విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించ తలపెట్టిన అంబేడ్కర్‌ పార్కును వచ్చే ఏప్రిల్‌ 14 నాటికి పూర్తయ్యేలా మంత్రులు, అధికారులు లక్ష్యంగా పెట్టుకోవాలి.

దీనిని వేగంగా పూర్తిచేసేందుకు పార్కు పనులను విగ్రహ నిర్మాణం, ల్యాండ్‌ స్కేపిం గ్‌ రెండు విభాగాలుగా విభజించాలి. పార్కును అద్భుతంగా, అందంగా తీర్చిదిద్దాలి

మంత్రులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పార్కు నిర్మాణం చేయించాలి. విజయవాడ నగరానికి ఈ పార్కు తలమానికం కావాలి.

ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి ఆరో సమావేశం శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జరిగిందని సాక్షి వివరించింది.

నిమ్మగడ్డ విషయంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని ఈనాడు కథనం ప్రచురించింది.

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మూడు సార్లు విచారణ జరిగినా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని రమేశ్‌ కుమార్‌ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

అయినా, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయలేదని వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని ఈనాడు రాసింది.

గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయాలని రమేశ్‌కుమార్‌కు సూచించింది. హైకోర్టు తీర్పును అమలు చేయాలని గవర్నర్‌ను కోరాలని ఆదేశించింది.

గవర్నర్‌ను కలిసేందుకు ఇప్పటికే సమయం కోరామని రమేష్‌ కుమార్‌ తరఫు న్యాయవాది తెలిపారు.

హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందని హైకోర్టు చెప్పింది.

ఈ కేసుకు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసిందని ఈనాడు వివరించింది.

కొత్త సచివాలయానికి అనుకూలంగా కోర్టు తీర్పులు

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి న్యాయపరంగా ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. పాత భవనాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లలో ఒకే రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా అటు సుప్రీంకోర్టులో, ఇటు రాష్ట్ర హైకోర్టులో తీర్పులు వెలువడ్డాయని చెప్పింది.

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ దాఖలుచేసిన పిటిషన్ జస్టిస్ అశోక్ జస్టిస్ సంజయ్ కిషన్ జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది.

భవనాల కూల్చివేతకు జూన్ 29న హైకోర్టు ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ జీవన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.

దానిని జస్టిస్ అశోక్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణకు స్వీకరించింది.

ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా భవనాలు ఉన్నాయా? లేదా? అనే విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయని, ఆర్టికల్ 136 ప్రకారం విధానపర నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

‘సచివాలయం ఎంత పెద్ద ప్రాంతమైనా కావచ్చు. తెలంగాణ మంత్రివర్గ నిర్ణయంలో ఏమైనా ఉండవచ్చు. కానీ సచివాలయాన్ని కూల్చాలన్న క్యాబినెట్ నిర్ణయం మాత్రం న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు’ అని జస్టిస్ అశోక్ వ్యాఖ్యానించారని పత్రిక తెలిపింది.

విచారణ కన్నా ముందే కేవియట్ పిటిషన్ దాఖలుచేసిన తెలంగాణ ప్రభుత్వం.. తమ వాదనలు వినాలని విజ్ఞప్తి చేసింది.

కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ వాదనలు పరిగణనలోకి తీసుకొన్న సుప్రీంకోర్టు.. జీవన్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)