వరవరరావును కోవిడ్ చికిత్స కోసం నానావతి హాస్పిటల్‌కు తరలించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న వరవరరావును రాత్రి 1.30 గంటలకు సెయింట్ జార్జ్ హాస్పిటల్ నుంచి నానావతి హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయాన్ని సెయింట్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు.
జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) వరవరావుకు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స అందించాలని శనివారం ఆదేశించింది.
వరవరరావు వైద్యానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని సూచించింది.
మహారాష్ట్రలోని తలోజా జైలులో భీమా కొరేగావ్ కేసు విచారణ ఖైదీగా వరవరరావు ఏడాదిన్నరగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో ముంబయిలోని జేజే ఆసుపత్రిలో జైలు అధికారులు చేర్చారు.
అక్కడ జరిపిన పరీక్షల్లో వరవరరావుకు కరోనావైరస్ ఉన్నట్లు తేలింది.
వరవరరావులో కరోనా సోకినప్పికీ వ్యాధి లక్షణాలు మాత్రం బయటపడలేదని , శ్వాస తీసుకోవడంలోనూ ఆయన ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోవడం లేదని ఆ ఆసుపత్రి డీన్ డాక్టర్ రంజిత్ మంకేశ్వర్ వెల్లడించారు. వ్యాధి లక్షణాలు బయటపడకుండానే చాలామందికి కరోనా వైరస్ సోకుతున్న విషయం తెలిసిందే.
వరవరరావు వయసు సుమారు 80 ఏళ్లు. ఆయన ఆరోగ్యం విషమించిందని, కనీసం నడిచే స్థితిలో కూడా లేరని ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జైలు సిబ్బంది వరవరావును అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇటు వరవరరావు కుటుంబ సభ్యులు జేజే ఆసుపత్రికి వెళ్లినప్పుడు ట్రాన్సిట్ వార్డులో మూత్రంతో తడిసి ఉన్న బెడ్‌పై వరవరరావు స్థిమితం లేకుండా కనిపించినట్లు తమకు సమాచారం అందిందని ఎన్‌హెచ్ఆర్‌సీ పేర్కొంది.
భార్యను, కూతుర్లను ఆయన వెంటనే గుర్తుపట్టలేకపోయారని, ట్రాన్సిట్ వార్డులో ఎలాంటి చికిత్స సదుపాయాలూ లేవని నర్సులు వారికి చెప్పారని తెలిపింది.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రత్యేక పర్యవేక్షకురాలు మజా దరువాలా నుంచి కూడా తలోజా జైలులో వరవరరావు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఫిర్యాదు అందినట్లు తెలిపింది.
60 ఏళ్లకు పైబడి, అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో వరవరరావు పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యాఖ్యానించింది.
ఆలస్యం చేయకుండా, వెంటనే ఆయన్ను ఏదైనా ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రస్తుతం విచారణ ఖైదీగా వరవరరావు ప్రభుత్వం అదుపులో ఉన్నారని, చట్టబద్ధమైన సంరక్షక హోదాలో ఆయన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కాగా, ఆరోగ్యం క్షీణించడం, కరోనా ముప్పు ఉన్న కారణంగా వరవరరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ బాంబే హైకోర్టులో ఇదివరకు ఓ పిటిషన్ దాఖలైంది.
శుక్రవారం ఇది విచారణకు రావాల్సి ఉంది. అయితే, ఈ పిటిషన్ వంతు రాకముందే ఈ రోజు కోర్టు కార్యకలాపాలు ముగిసినట్లు వరవరరావు తరఫు న్యాయవాది తెలిపారు.

ఫొటో సోర్స్, FACEBOOK/KRANTHI TEKULA
మెరుగైన చికిత్స అందించండి
కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వరవరరావుకు మెరుగైన చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. జాతీయ స్థాయిలో పియుడిఆర్ సహా అనేక హక్కుల సంఘాలు, ప్రముఖ రచయితలు, కవులు అనేకులు వివిధ మాధ్యమాల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మెరుగైన వైద్య సాయం అందించాలని వెంటనే బెయిల్ లభించేలా చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గతంలో అనేకానేక కేసులు మోపి జైలుకు పంపినా ఒక్క కేసులో కూడా ఆయనకు శిక్షపడలేదని ఆయన కుటుంబసభ్యులు ప్రజాసంఘాలనేతలు చెపుతున్నారు. కేవలం కక్షపూరితంగానే కేసుల పేరుతో ఆయన్ను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తనను ధిక్కరించిన ఎవరికైనా తన విధానాలపై తీవ్రమైన అసమ్మతి తెలిపిన ఎవరికైనా ఇలాంటి గతే పడుతుంది అని హెచ్చరించడానికి ప్రభుత్వంలోని పెద్దలు ఈ పద్ధతి ఎంచుకున్నట్టు కనిపిస్తోందని ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని పలు ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.
ఆయనను హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని కోరుతూ కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు.
భీమా-కోరేగావ్ అల్లర్లలో పాత్ర, ప్రధాని హత్యకు కుట్ర ఆరోపణలతో వరవరరావు అరెస్టైన సంగతి తెలిసిందే.
ఆరోగ్యం క్షీణించడం, కరోనా ముప్పు ఉన్న కారణంగా ఆయనకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ ఇదివరకు వరవరరావు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను జూన్ 26న ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
వరవరరావు తరఫున న్యాయవాది సత్యనారాయణ అయ్యర్ బాంబే హైకోర్టులో ఈ మేరకు రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
ఎన్‌ఐఏ కోర్టు వరవరరావు బెయిల్ తిరస్కరణను ఒక పిటిషన్‌లో సవాల్ చేసిన ఆయన, రెండో పిటిషన్‌లో జూన్ 2న జేజే ఆసుపత్రి నుంచి వరవరరావు డిశ్చార్జ్ అయ్యాక ఆయన మెడికల్ రిపోర్టులను తమకు ఇచ్చేలా తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు.
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Facebook/Bhasker Koorapati
మావోయిస్టులతో కలిసి ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై వరవరరావు దాదాపు ఏడాదిన్నరగా విచారణ ఖైదీగా జైల్లో ఉన్నారు.
వరవరరావుతోపాటు మరో నలుగురిని పుణె పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేశారు.
మహారాష్ట్రలో భీమా-కోరెగావ్ అల్లర్లలో పాత్ర, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్ర వంటి అభియోగాలు వీరిపై ఉన్నాయి.
వరవరరావును మొదట్లో పుణెలోని ఎరవాడ జైలులో ఉంచారు. అనంతరం అక్కడి నుంచి కొన్నాళ్ల కిందట నవీ ముంబయిలోని తలోజా జైలుకు ఆయన్ను తరలించారు.
వరవరరావు ఆరోగ్యం విషయంలో గత వారం ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని, లేకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందంటూ లైవ్ వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వరవరరావు భార్య, కుమార్తెలు విజ్జప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారత్‌పై గూగుల్‌కు అంత ప్రేమ ఎందుకు
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























