విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం.. పది కిలోమీటర్ల వరకు శబ్దాలు: ప్రెస్ రివ్యూ

పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం
ఫొటో క్యాప్షన్, పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం
ప్రచురణ

పరవాడలోని ఫార్మాసిటీలోని రాంకీ సాల్వెంట్స్‌ కర్మాగారంలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు ‘ఈనాడు పత్రిక’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఫ్యాక్టరీ రికవరీ కాలమ్‌లో ప్రమాదం జరగడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసి పడ్డాయి.

రసాయనాల డ్రమ్ములకు నిప్పు అంటుకోవడంతో అవి పెద్ద శబ్దంతో పేలిపోయాయి. అగ్నికీలలు 50 మీటర్ల వరకు ఎగిసిపడగా, పేలుడు శబ్దాలు 10కి.మీ. వరకు వినిపించాయని స్థానికులు వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది.

దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగినప్పుడు సంస్థలో కేవలం నలుగురే విధుల్లో ఉన్నారు. వీరిలో ఒకరికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

మంటలను ఆర్పేందుకు 12అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. సంస్థలోని ఐదు రియాక్టర్లలో ఒకదానిలో ప్రమాదం జరిగిందని, మంటలను వెంటనే అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించామని విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ వెల్లడించారు.

ఫార్మాసిటీలో మిగిలిన ఫ్యాక్టరీలకు, సంస్థలకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రాణనష్టం జరక్కపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ముద్రగడ పద్మనాభం
ఫొటో క్యాప్షన్, ముద్రగడ పద్మనాభం

కాపు ఉద్యమానికి ముద్రగడ గుడ్‌బై

కాపు ఉద్యమాన్ని అమ్ముకున్నానంటూ తనపై కొందరు చేస్తున్న ఆరోపణలకు మనస్తాపంతో తాను ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ప్రచురించింది.

సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో పనిగట్టుకుని కొందరు రోజూ పదిమందితో తనను తిటిస్తున్నారని ఆయన తన బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించలేదని, నన్ను విమర్శించేవారు రిజర్వేషన్లు సాధించినా సంతోషమేనని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.

పరీక్షలు - ఎంట్రన్స్ ఎగ్జామ్స్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో ఆగస్టు 10 నుంచి- ఏపీలో సెప్టెంబర్‌ మూడో వారంలో సెట్‌లు

కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న అన్ని కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులను ఆగస్టు 10 నుంచి నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది.

20 రోజుల వ్యవధిలో ఈ పరీక్షలన్నింటినీ ముగించాలని కూడా అధికారులు భావిస్తున్నట్లు ఈ కథనం వెల్లడించింది.

యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో త్వరలోనే సెట్‌లు కూడా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి హైకోర్టుకు తెలిపింది.

గతంలో 8 సెషన్లలో నిర్వహించిన ఎంసెట్‌ పరీక్షలను ఈసారి 10 లేదా 12 సెషన్లలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా ఒకేసారి ఎక్కువమంది పరీక్షకు హాజరు కాకుండా చూసేందుకు అవకాశం ఉంటుందన్నది అధికారుల ఆలోచన.

ఇప్పటి వరకు హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాలకే పరిమితమైన ఎగ్జామినేషన్‌ సెంటర్లను విద్యార్ధుల సంఖ్యనుబట్టి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని అధికారులు యోచిస్తున్నట్లు ఈ కథనం పేర్కొంది.

మరోవైపు ఏపీలో అన్ని సెట్‌లను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ మూడో వారంలో అన్ని సెట్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది. డిగ్రీ, చివరి సెమిస్టర్‌లతో పాటు అన్నింటికీ త్వరలోనే షెడ్యూలు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.

సుందర్ పిచాయ్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో గూగుల్ పెట్టుబడుల వెల్లువ

భారతదేశంలో డిజిటల్‌ టెక్నాలజీని విస్తరించేందుకు రాబోయే 5-6 ఏళ్లలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించినట్లు నమస్తే తెలంగాణ సహా పలు పత్రికలు ప్రముఖంగా కధనాలు ప్రచురించాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సోమవారంనాడు వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్న పిచాయ్‌ గూగుల్‌ ఫర్‌ ఇండియా వార్షిక సమావేశంలో ఈ ప్రకటన చేశారు.

భారత్‌లో రైతులు, యువత జీవితాలను మార్చేందుకు సాంకేతికత వినయోగంపై ప్రధానమంత్రి మోదీ, సుందర్‌ పిచాయ్‌ చర్చలు జరిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)