You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనాతో చనిపోయినవారిని ఈడ్చుకెళ్లి గుంతల్లో విసిరేశారు: ప్రెస్ రివ్యూ
కర్ణాటకలో కరోనా మృతులను సామూహిక ఖననం చేశారని, ఆ సమయంలో దారుణంగా వ్యవహరించారని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
‘‘మృతులకు దక్కాల్సిన అంతిమ సంస్కారం.. కరోనా కారణంగా సంస్కార హీనంగా మారిపోయింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కరోనా వైర్‌సతో చనిపోయిన 18 మందిని గోతుల్లోకి విసిరేస్తూ నిర్వహించిన సామూహిక అంత్యక్రియలు.. ప్రతిఒక్కరి హృదయాలనూ కలిచివేసిందని చెప్పింది.
బళ్లారి కొవిడ్ ఆస్పత్రిలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు సోమవారం 12 మంది, మంగళవారం ఆరుగురు చనిపోయారు.
గ్రామాల్లోని స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులే వారికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.
గుగ్గరహట్టి వద్ద తుంగభద్ర ఎగువ కాలువకు సమీపంలోని ఒక వంకలో పూడ్చడానికి మంగళవారం ఆ 18 మృతదేహాలను ఒక అంబులెన్స్‌లో తీసుకొచ్చారు.
అప్పటికే జేసీబీలతో రెండు పెద్ద గోతులు తవ్వి ఉంచగా.. సిబ్బంది నల్లటి కవర్లలో చుట్టిన మృతదేహాలను తీసుకొచ్చి వాటిలోకి విసిరేశారని చెప్పారు.
ఒక దాన్లో 8 మృతదేహాలు, మరొక గోతిలో 10 మృతదేహాలను పడేసి పూడ్చిపెట్టారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితిని మనం ఇప్పటి వరకూ విదేశాల్లోనే చూశాం.
కానీ.. ఈ అంతిమ సంస్కారం వీడియోలు వైరల్‌గా మారడంతో భారత్ కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోబోతోందనే ఆందోళన కలుగుతోంది. కాగా.. అంత్యక్రియలు నిర్వహించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో దీనిపై విచారణకు ఆదేశించామని బళ్లారి డిప్యూటీ కమిషనర్ తెలిపార’’ని ఆ కథనంలో రాశారు.
తెలంగాణలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో తెలంగాణలో అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేసినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
‘‘కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదావేసినట్లు తెలంగాణ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు వెల్లడించారని చెప్పింది.
డిగ్రీ, పీజీ కోర్సుల తుది సెమిస్టర్ నిర్వహణపై ప్రభుత్వం, ఉన్నతవిద్యామండలి నుంచి వివరాలు తెలుసుకొన్న తర్వాత కోర్టుకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, పీజీసెట్, లాసెట్ తదితర ప్రవేశపరీక్షలను వాయిదావేయాలని..గత సెమిస్టర్లలో మార్కుల ఆధారంగా డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ ఫలితాలు విడుదలచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది సీ దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పరీక్షల నిర్వహణ వల్ల విద్యార్థులు వైరస్ బారినపడే ప్రమాదం ఉన్నదని తెలిపారు.
హైదరాబాద్ పరిధిలో లాక్‌డౌన్ విధించనున్నట్టు మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తున్నదని.. మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నదా? అని హైకోర్టు ధర్మాసనం అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించింది.
మంత్రిమండలిలో చర్చించి రెండురోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని ఏజీ పేర్కొన్నారు.
లాక్‌డౌన్ విధిస్తే ప్రవేశ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ధర్మాసనం మరోసారి ప్రశ్నించడంతో.. దీనిపై చీఫ్‌సెక్రటరీతో చర్చించి వివరాలు వెల్లడిస్తానని, విచారణను మధ్యాహ్నభోజన విరామ సమయానికి వాయిదావేయాలని ఏజీ కోరారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి వాదనలు వినిపిస్తూ అన్ని ప్రవేశపరీక్షలను వాయిదావేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని హైకోర్టుకు వెల్లడించారు.
రాష్ట్రంలో వాయిదాపడిన అన్ని ప్రవేశపరీక్షలను ఆగస్టు మొదటివారంలో నిర్వహించాలని యోచిస్తున్నామని, ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపార’’ని పత్రిక వివరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అంబులెన్సులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర సేవలు అందించే 108, 104 అంబులెన్సులను ప్రజలకు అందుబాటులోకి తెస్తోందని సాక్షి కథనం ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108, 104 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో మరో అడుగు ముందుకు వేశారని చెప్పింది.
ఇప్పటికే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించిన సీఎం జగన్ ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారని సాక్షి రాసింది.
బుధవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్‌లో ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) సీఎం జెండా ఊపి ప్రారంభించనున్నారని తెలిపింది.
అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108, 104 సర్వీసులను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేయగా, ఇప్పుడు సీఎం జగన్ వాటికి అత్యాధునిక వైద్య సేవలను జోడించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని పత్రిక వివరించింది.
మన దేశంలోనూ అదే వైరస్
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ సమూహమే మన దేశంలో కూడా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.
కరోనా వ్యాప్తి గురించి కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఇదివరకు పరిశోధనల్లో భారత్‌లో ప్రత్యేకమైన వైరస్ సమూహం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినా.. రెండు నెలలు తిరిగే సరికే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వ్యాపిస్తున్న వైరస్ సమూహమే మనదేశంలోనూ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారని అందులో తెలిపారు.
వెయ్యికిపైగా వైరస్ నమూనాల జన్యుక్రమాలను కనుగొన్న తర్వాత ఈ అంచనాకు వచ్చారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన బయో ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పరిశోధన ఫలితాలను విశ్లేషించిందని పేర్కొన్నారు.
కొవిడ్-19 వైరస్ రూపాంతరం చెందుతున్న తీరును తెలుసుకుంటే దానిప్రకారం ఔషధాలు, టీకాలు కనుగొనేందుకు వీలవుతుంది. అందుకే 3 నెలలుగా వైరస్ జన్యుక్రమాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ముమ్మరంగా శ్రమిస్తున్నారు.
మార్చిలో రెండు జన్యుక్రమాలను(జీనోమ్స్) కనుగొనడంతో మొదలైన పరిశోధన ప్రస్తుతం 1,031కి చేరింది. తెలంగాణ నుంచి 193 జీనోమ్స్ ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 178 జీనోమ్స్‌ను హైదరాబాద్‌లో సీసీఎంబీ కనుగొంది.
తెలంగాణలోని మిగతా జన్యుక్రమాలను సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ (సీడీఎఫ్‌డీ), గాంధీ ఆసుపత్రిలో కనుగొన్నారు. దేశవ్యాప్తంగా 33 ప్రయోగశాలల్లో ఈ పరిశోధనలు చేపట్టారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 11 రకాల వైరస్ సమూహాలు వ్యాప్తి చెందుతున్నట్లు ఇదివరకే పరిశోధకులు గుర్తించారు. మనదేశంలో ప్రధానంగా రెండు రకాల సమూహాల వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తాజా ఫలితాల ఆధారంగా వెల్లడైంది. 1,031 జీనోమ్స్ విశ్లేషణతో అత్యధికంగా ఏ2ఏ సమూహం ఉన్నట్లు గుర్తించారని ఈనాడు కథనంలో రాశారు.
యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ రకం వ్యాప్తే 60 శాతం వరకు ఉందని పరిశోధకులు అంటున్నారు. ఏ2ఏ వైరస్ సమూహం తర్వాత ఎక్కువగా మనదేశంలో ఏ3ఐ ఉంది. బీ4 రకం కూడా అక్కడక్కడ కనిపిస్తోందని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- హాంగ్‌కాంగ్ సెక్యూరిటీ లా: వివాదాస్పద చట్టానికి చైనా ఆమోదం... వెల్లువెత్తిన ఆగ్రహం
- 'చైనా మాట ఎత్తడానికే మోదీ భయపడుతున్నారు' - రాహుల్ గాంధీ
- 'వచ్చేది వానాకాలం, జాగ్రత్తగా ఉండాలి.. 80 కోట్ల మందికి నవంబర్ దాకా ఉచిత రేషన్'
- మహిళా ఉద్యోగినిపై దాడి... జుట్టు పట్టుకుని కొట్టిన అధికారి అరెస్ట్
- టిక్‌టాక్ ఇంకా పనిచేస్తోంది... వాడాలా వద్దా? నిషేధం ప్రభావం ఎలా ఉంటుంది?
- చైనాలో వీగర్ ముస్లిం మహిళలకు బలవంతపు కుటుంబ నియంత్రణ
- రైతు బంధు ఎవరికి చేరుతోంది? కేసీఆర్ ప్రభుత్వం సీలింగ్ ఎందుకు పెట్టడం లేదు
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- భారత్-నేపాల్ సరిహద్దు వివాదం: పది గజాల స్థలం కోసం మొదలైన వివాదం - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- చైనాతో సరిహద్దు ఘర్షణ విషయంలో భారత్ చేస్తున్న ప్రకటనల్లో ఎందుకిన్ని తేడాలు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)