పీవీపీ: ‘పోలీసులపైకి కుక్కలను ఉసిగొల్పారు’.. వైసీపీ నేతపై కేసు నమోదు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఓ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులతో వచ్చిన పోలీసులపై వైసీపీ నేత పీవీపీ కుక్కలను ఉసిగొల్పారంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది.

‘‘ఓ విల్లా యజమానిని బెదిరించినందుకు పీవీపీపై బంజరాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఒకసారి విచారణకు హాజరైన పీవీపీ రెండోసారి మాత్రం రాలేదు.

దీంతో నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆదివారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లారు. వారిపై పీవీపీ అనుచరుడు కుక్కలను వదిలారు.

నోటీసులు ఇవ్వడానికి వచ్చామని, కుక్కలను కట్టేయాలని పోలీసులు కోరినా నాని వినలేదని, తన యజమాని పీవీపీ చెబితేనే కట్టేస్తానని పీవీపీ అనుచరుడు నాని స్పష్టం చేశారు’’ అని ఆంధ్రజ్యోతి ఆ కథనంలో పేర్కొంది.

కుక్కల కారణంగా నోటీసులు ఇవ్వలేకపోయిన పోలీసులు పీవీపీతోపాటు అతని ఇద్దరు అనుచరులపై తమ విధులకు భంగం కలిగించారన్న ఆరోపణల కింద కేసు నమోదు చేసినట్టు ఆ కథనంలో తెలిపారు.

వైసీపీ నేత హత్య

వైసీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కర రావు (57) దారుణ హత్యకు గురయ్యారని ‘సాక్షి’ కథనం తెలిపింది.

‘‘రాష్ట్ర రవాణా సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అనుచరుడైన మోకా భాస్కరరావును అతని రాజకీయ ప్రత్యర్థులు సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో చేపల మార్కెట్‌లో హత మార్చారు.

నిత్యం రద్దీగా ఉండే కోనేరు సెంటర్‌కు కూతవేటు దూరంలో ఉన్న చేపల మార్కెట్‌లో జరుగుతున్న పనులను మంత్రి ఆదేశాల మేరకు పర్యవేక్షించి తిరిగి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్న సమయంలో అక్కడే మాటు వేసిన ప్రత్యర్థులు భాస్కరరావుపైకి దూసుకొచ్చి ఒక్క ఉదుటన తోసేసారు. దీంతో కిందపడిపోయిన భాస్కరరావు గుండెల్లో రెండు చోట్ల, పొట్టపై మరొక చోట కత్తితో పొడిచారు.

ఆ సమయంలో జేబులో ఉన్న సెల్‌ఫోన్‌కు కత్తిపోటు తగలడంతో బ్యాటరీ పేలిపోయింది. తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన భాస్కరరావును ఆటోలో హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అయితే మార్గం మధ్యలోనే అతను మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

వంద అడుగులు నడిస్తే ఆయసమా? కరోనా కావచ్చు

వంద అడుగుల దూరం నడిస్తే ఆయాసం వచ్చిందంటే కరోనా సోకినట్లు అనుమానించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ కరోనా కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌ అధికారులు వెల్లడించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది. ఎవరైనా తమకు కరోనా సోకిందో లేదో గుర్తించడానికి వంద అడుగుల దూరం నడవాలని, ఆ సమయంలో ఆయాసం అనిపిస్తే రిస్క్‌లో ఉన్నట్లేనని ఏపీ కరోనా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అధికారి డాక్టర్‌ సి.ప్రభాకర్‌ రెడ్డి వెల్లడించినట్లు ఆంధ్రజ్యోతి కథనంలో రాసింది.

ఈ మేరకు విజయవాడలో 100మందిని పరిశీలించామని, అందులో 58మంది ఆయాస పడ్డారని, వారికి టెస్టులు నిర్వహించగా 8మందికి కరోనా ఉన్నట్లు తేలిందని డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి వెల్లడించినట్లు తెలిపింది. కరోనాను గుర్తించడానికి ఇదో సురక్షిత పద్ధతి అని, దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తిస్తుందని ప్రభాకర్‌ రెడ్డి వెల్లడించినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.

ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

ఏటీఎంనే ఎత్తుకెళ్లిన సంఘటన గజ్వేల్‌ నియోజకవర్గం హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌నగర్‌ రహదారిపై ప్రజ్ఞాపూర్‌ వద్ద శనివారం చోటు చేసుకుందని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.

‘‘ప్రజ్ఞాపూర్‌ వద్ద ఉన్న ఇండియా వన్‌ ఏటీఎంను ఏకంగా గడ్డపారతో తొవ్వి దొంగలు ఎత్తుకెళ్లారు.

ఆదివారం ఉదయం ఏటీఎం ఉన్న ఇంటి యజమాని దీనిని గమనించి ఏటీఎం నిర్వహకులకు సమాచారం అందించాడు. నిర్వహాకులు 24 గంటల తర్వాత అనగా సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో గజ్వేల్‌ ఏసీపీ నారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

ఏటీఎంలో 4,98,800 నగదు ఉన్నట్లు నిర్వహకులు పోలీసులకు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.

ఏటీఎం దొంగలించిన 24 గంటల తర్వాత పోలీసులకు సమాచారం అందిచడంతో ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంను దొంగలించేందుకు నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చినట్లు పోలీసులు గుర్తించార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

తన 'హద్దు'ను దాటి చైనా చొరబాటు నిజమే

భారత భూభాగంలోకి చైనా దాదాపు అరకిలోమీటరు దూరం చొచ్చుకు వచ్చినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా బైటపడిందని ‘ఈనాడు’ కథనం తెలిపింది.

తూర్పు లద్ధాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా సుమారు 423 మీటర్ల మేర చొచ్చుకు వచ్చినట్లు శాటిలైట్‌ చిత్రాలు సూచిస్తున్నాయని ఈ కథనంలో ఉంది.

ఈ చొరబాటు ద్వారా 1960లో తానే స్వయంగా పేర్కొన్న సరిహద్దు రేఖను కూడా చైనా ఉల్లంఘించిందని ఈనాడు తన కథనంలో రాసింది.

ఎన్డీటీవీ ఛానెల్‌ ఈ నెల 25న సేకరించిన ఉపగ్రహ చిత్రాలలో ఈ విషయం బైటపడిందని, భారత భూభాగంలో చైనా 16 గుడారాలను, 4 వాహనాలను నిలిపి ఉంచిందని ఈ కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)