కరోనావైరస్:ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల మళ్లీ లాక్‌డౌన్, అధికారుల్లో సందిగ్దం, ప్రజల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్ పోలీసు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ

లాక్ డౌన్ 4.0 ముగిసిన జూన్ ఒకటో తేదీకి ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 3676. కేవలం 24 రోజుల్లో దాదాపు 6 వేల కేసులు పెరిగాయి. జూన్ 25 ఉదయానికి ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన ప్రకారం మొత్తం పాజిటివ్ కేసులు 10,884. అంటే లాక్ డౌన్ అమలులో ఉన్న కాలంలో నమోదయిన కేసులతో పోలిస్తే లాక్ డౌన్ సడలింపుల తర్వాత పెరిగిన కేసుల సంఖ్య చాలా ఎక్కువ.

ఆంక్షలు ఉన్నప్పటికీ అనేక చోట్ల వాటిని ఉల్లంఘిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటివి తప్పనిసరి చేసినా చాలా చోట్ల అమలుకి నోచుకోవడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు పలు చోట్ల ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లోనే లాక్ డౌన్ అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూనుకుంటోంది.

అదే సమయంలో కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఆయా జిల్లా కలెక్టర్లు ప్రకటించి, ఆ తర్వాత మళ్లీ వాటిని ఉపసంహరించుకుంటున్నారు. దాంతో అధికారుల్లోనే ఇలాంటి సందిగ్దం ఏర్పడడంతో సామాన్యుల్లో ఆందోళన పెరుగుతోంది.

కరోనావైరస్:విజయవాడలో పోలీసుల తనిఖీలు

ఫొటో సోర్స్, twitter.com/VjaCityPolice

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్:విజయవాడలో పోలీసుల తనిఖీలు

సడలింపుల తర్వాత పెరుగుతున్న సమస్య

మార్చి 20 నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు దేశమంతా మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ఆ తర్వాత మే మొదటి వారంలో మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు కేంద్రం సానుకూలత చూపింది.

మే 6 నుంచి ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఆతర్వాత మే రెండో వారం నుంచి ప్రజా రవాణా మొదలయ్యింది. మే 23 నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. జూన్ మొదటి వారంలో వివిధ ఆలయాల్లో దర్శనాలకు, మాల్స్ తెరుచుకునేందుకు కూడా అనుమతులు వచ్చాయి. దాంతో సాధారణ స్థితి వస్తుందని అంతా భావిస్తున్నారు.

అదే సమయంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కలకలం రేపుతోంది. మద్యం దుకాణాలు సహా అన్ని చోట్లా భౌతికదూరం కేవలం ప్రకటనలకే పరిమితం అయినట్టు కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులలో కూడా పలు మార్పులు చేసినప్పటికీ వాటిని అనుసరించడంలో ప్రజల్లో అవగాహన, ఆచరణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి అనేక కారణాలతో ప్రస్తుతం కేసులు యథేచ్ఛగా పెరుగుతుండడం చాలామందిని కలవరపరుస్తోంది.

ఇండియా ఇప్పటి వరకు 180,000 పరీక్షలు నిర్వహించింది

ఫొటో సోర్స్, Getty Images

మళ్లీ లాక్ డౌన్ అమలులోకి...

సుమారు 20 రోజుల పాటు లాక్ డౌన్ సడలించిన తర్వాత వచ్చిన అనుభవాలతో యంత్రాంగం అప్రమత్తమయ్యింది. కేసులు పెరుగుతున్న తరుణంలో వాటిని నియంత్రించేందుకు మరోసారి లాక్ డౌన్ ని ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఇప్పటికే రెడ్ , గ్రీన్, ఆరెంజ్ జోన్ల ప్రతిపాదనలు విరమించుకుని కేవలం కంటైన్మెంట్ జోన్ల వరకూ మాత్రమే పరిమితం చేసిన ప్రభుత్వం వాటిని నిర్ణయించే అధికారం జిల్లా యంత్రాంగాలకు అప్పగించింది. ఆయా జిల్లాల పరిధిలో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించి, అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు పాటించేలా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇస్తున్నారు.

లాక్ డౌన్ విషయంలో కూడా జిల్లా కలెక్టర్లే ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటుగా చీరాలలోనూ లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా కేసులు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో కూడా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, హిందూపురం, కదిరి సహా మరి కొన్ని ప్రాంతాలలో ఈ నెల 21 నుంచి వారం పాటు లాక్ డౌన్ విధించారు. తరువాత పరిస్థితులను బట్టీ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు. ఇక కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయాలని కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు.

జూన్ 25 నుంచి తూర్పు గోదావరి జిల్లా అంతటా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అదే రీతిలో 26 నుంచి లాక్ డౌన్ అమలు చేసేందుకు కృష్ణా జిల్లా యంత్రాంగం కూడా సన్నద్ధమయ్యింది.

కరోనావైరస్:భౌతిక దూరం ఊసే మర్చిపోతున్న జనం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్:భౌతిక దూరం ఊసే మర్చిపోతున్న జనం

కలెక్టర్లు ఉత్తర్వులు వెనక్కి ఎందుకు తీసుకున్నారు?

వివిధ జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేసేందుకు కలెక్టర్లు ఉత్తర్వులు ఇవ్వడంతో కలకలం రేగింది. మిగిలిన జిల్లాల్లో కూడా కొందరు డిమాండ్ చేయడం ప్రారంభించారు. మరోసారి లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోతామనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయా జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. జిల్లా వ్యాప్త లాక్ డౌన్ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని సూచించారు. దాంతో కృష్ణా జిల్లాలో లాక్ డౌన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ తన ఆదేశాలను ఉపసంహరించుకుంటూ ఒక్క రోజు వ్యవధిలోనే ఆదేశాలు ఇచ్చారు.

జిల్లా వ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ ఉపసంహరణపై బీబీసీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డిని సంప్రదించింది. ఆయన వివరిస్తూ “కేసులు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా అప్రమత్తంగా ఉన్నాం. అందుకు లాక్ డౌన్ ఓ సాధనం.

కానీ, లాక్ డౌన్ ప్రకటిస్తే ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన వారంతా మరిన్ని ఇక్కట్లు పాలవుతామనే ఆందోళనలో ఉన్నారు. సాధారణ జనజీవనానికి ఇబ్బంది కలిగితే వారంతా సతమతం అవుతారు. వాటిని పరిగణనలోకి తీసుకుని జిల్లా అంతటా లాక్ డౌన్ ఆలోచన ఉపసంహరించుకున్నాం. కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్ల వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది. కంటోన్మెంట్ జోన్లలో 200 మీటర్లతో పాటుగా బఫర్ జోన్లలో మరో 200 మీటర్ల పరిధిలో కూడా లాక్ డౌన్ అమలవుతుంది. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు”...అని తెలిపారు. మరోవైపు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఈ విషయంపై మాట్లాడలేనని బీబీసీతో చెప్పారు.

కరోనావైరస్:ఏపీలో మద్యం దుకాణాల వద్ద జనం
ఫొటో క్యాప్షన్, మద్యం షాపులకు అనుమతి ఇచ్చినప్పుడు చాలా చోట్ల జన ఇలా రద్దీగా కనిపించారు

కఠిన చర్యలు అవసరం...

లాక్ డౌన్ విషయంలో అధికారులే నిర్ణయాలు మార్చుకుంటున్న తీరు విస్మయకరంగా ఉందని , ప్రజలను గందరగోళపరుస్తోందని సామాజిక వేత్త కె. త్రిమూర్తులు రెడ్డి అబిప్రాయపడ్డారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. “కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ యంత్రాంగం కొంత గందరగోళంలో ఉంది. మొదట లాక్ డౌన్ ప్రకటిస్తారు. కొద్దిసేపటికి మళ్లీ లేదంటారు.

ఇలా ప్రజలను సందిగ్దంలోకి నెట్టడం విచారకరం. కరోనా అదుపు చేసేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలి. అధికారులు, ముఖ్యనేతలు ముందు ఆచరించాలి. అందరూ అలాంటి నిబంధనలు అనుసరించేలా జాగ్రత్త పడాలి. అప్పుడు మాత్రమే మహమ్మారిని నియంత్రించగలం” అని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్, బఫర్ జోన్ల పరిధిలో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేసేందుకు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. ఆలయాల్లో కూడా కేసులు నమోదవుతున్న తరుణంలో జాగ్రత్తలు పాటించబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఓవైపు పరీక్షలు విస్తృతం చేస్తూ, మరోవైపు ఆంక్షలు కఠినం చేస్తూ కరోనా అదుపు చేసేందుకు చర్యలు ఉధృతం చేస్తున్నామని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహార్ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి