సినీనటి రమ్యకృష్ణ కారులో వందకుపైగా మద్యం సీసాలు.. తనిఖీల్లో పట్టుకున్న చెన్నై పోలీసులు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

సినీ నటి రమ్యకృష్ణ కారు మద్యం సీసాలతో చెన్నైలో పట్టుబడ్డట్టు ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో మద్యం అక్రమ సరఫరా అనుమానాలతో తమిళనాడు పోలీసులు వాహనాల తనిఖీలు విస్తృతం చేస్తున్నారు. ఇదే సందర్బంలో నటి రమ్యకృష్ణ కారును కూడా చెక్‌ చేశారు.

చెన్నై సమీపంలోని ముత్తుకాడు చెక్‌పోస్ట్‌ దగ్గర జరుగుతున్న తనఖీల సందర్బంగా రమ్యకృష్ణ కారు మద్యం బాటిళ్లతో పట్టుబడింది. తనిఖీలు జరుగుతున్న సమయంలో రమ్యకృష్ణ, ఆమె సోదరి వినయాకృష్ణన్‌ కూడా కారులోనే ఉన్నట్లు ఆంధ్రజ్యోతితోపాటు ఇండియాటుడే పేర్కొనగా, అప్పుడు రమ్యకృష్ణ కారులో లేరని ఈనాడు పత్రిక తెలుపగా, ఘటనా స్థలంలో ఆమె ఉన్నట్లు ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్ పత్రిక ప్రస్తావించలేదు.

ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం, తనిఖీ సందర్బంగా కారులో వందకుపైగా మద్యం బాటిళ్లు దొరికాయని పోలీసులు తెలిపారు. రమ్యకృష్ణ, ఆమె సోదరి వినయాకృష్ణన్‌లు సెల్వకుమార్‌ను అరెస్టు చేసి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. పట్టుబడ్డ మద్యంబాటిళ్లలో 96 బీరు సీసాలు కాగా, 8 ఇతర మద్యం సీసాలున్నాయని పోలీసులు వెల్లడించారు.

రైతులకు సబ్సీడీలు రద్దు.....నేరుగా బ్యాంకు ఖాతాలకు డబ్బు - కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అభిప్రాయం

సబ్సీడీలు ఎక్కువగా అనర్హులైన వారికే అందుతున్నాయని, రైతులను ఆదుకోవాలంటే వాటిని రద్దు చేసి ఆ డబ్బును రైతుల ఖాతాల్లోనే వేయడం మంచిదని కేంద్ర ఆర్దిక శాఖ మాజీ కార్యదర్వి సుభాష్‌ చంద్ర గర్గ్‌ వ్యాఖ్యనించినట్లు ఈనాడు ప్రచురించింది.

ఈ కథనం ప్రకారం రైతులకు స్థిర ఆదాయాన్ని కల్పించాలంటే సబ్సిడీలు, కనీస మద్దతు ధరలను రద్దు చేసి, ఆ డబ్బును వారి ఖాతాలకే నేరుగా పంపే ఏర్పాటు చేయాలని సుభాష్‌ చంద్ర అన్నారు. సబ్సిడీల పేరుతో ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, వీటివల్ల అసమర్ధ కంపెనీలు లాభం పొందుతున్నాయి తప్ప రైతులకు వాటి ఫలాలు పూర్తిగా అందడం లేదని సుభాష్‌ చంద్ర అభిప్రాయపడ్డారు.

55ఏళ్లుగా అమలు చేస్తున్న కనీస మద్దతు ధర వల్ల రైతులకు ఏమాత్రం మేలు జరగలేదని, దాని స్థానంలో సబ్సీడీలను రైతులకు నేరుగా అందిస్తే వారికి స్వేచ్ఛ లభిస్తుందని, చిన్న సన్నకారు రైతులు బాగుపడతారని ఆయన అన్నారు. 24కోట్లమంది రైతులకు మేలు కలగాలంటే వ్యవసాయ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని గర్గ్‌ స్పష్టం చేశారు.

మహారాష్ట్ర మరో న్యూయార్క్‌

దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా రికార్డు సృష్టించిన మహారాష్ట్ర కరోనా ఉక్కు పిడికిలిలో చిక్కుకుని విలవిలలాడుతోందని సాక్షి ఒక కథనం ఇచ్చింది.

ఆ కథనం ప్రకారం.. 96 రోజుల్లో లక్షకేసులను దాటిన మహారాష్ట్ర, ఒక దేశమైనట్లయితే ప్రపంచంలో 17వ స్థానంలో ఉండేది. చైనా, కెనడాలాంటి దేశాలను కూడా దాటి మహారాష్ట్ర కేసుల్లో రికార్డులు సృష్టిస్తోంది. దేశంలో సగానికి పైగా కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. పైగా మహారాష్ట్రలోని మొత్తం లక్ష కేసుల్లో సగం కేసులు ఒక్క ముంబయి నగరంలోనే నమోదు కావడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా తీవ్రత కారణంగా మహారాష్ట్ర వ్యాప్తంగా 3వేలకు పైగా కంటైన్‌మెంట్ జోన్లు ప్రకటించాల్సి వచ్చింది. ముగ్గురు మంత్రులకు పాజిటివ్ రావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో కూడా ఇదే తరహాలో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు మహారాష్ట్ర కూడా న్యూయార్క్‌ను తలపిస్తోంది.

పరోటాకు 18శాతం పన్ను కట్టల్సిందే

పరోటా, రోటీ ఒకటి కాదని, పరోటా రెడీ టు ఈట్‌ విభాగంలోకి వస్తుందని అందువల్ల దానికి 18శాతం జీఎస్టీ కట్టాల్సిందిగా వస్తు సేవల అథారిటీ నిర్ణయించినట్లు నమస్తే తెలంగాణ ఒక కథనం రాసింది.

ఆ కథనం ప్రకార.. హోటల్‌కు వెళ్లి పరోటా తిన్నవారికి 18శాతం జీఎస్టీ మోత తప్పదు. అదే రోటీ రెడీ టు ఈట్‌ విభాగంలోకి రాదు కాబట్టి దానికి 5శాతం పన్ను మాత్రమే విధిస్తారు. పరోటా ఈ విభాగంలోకి వస్తుందో రాదో తెలపాల్సిందిగా బెంగళూరుకు చెందిన ఐడీ ఫ్రెష్‌ ఫుడ్స్‌ కంపెనీ వివరణ కోరడంతో ఏఏఆర్‌ కర్ణాటక విభాగం ఈ మేరకు తీర్పు చెప్పింది.

అయితే పరోటాపై 18శాతం జీఎస్టీ విధించడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా విస్మయం వ్యక్తం చేశారు. మన భారతీయ పాక ప్రవీణులు రోటీని, పరోటాను కలిపి పరోటీలను తయారు చేస్తే వాటిని ఎలా వర్గీకరిస్తారని ఆయన ప్రశ్నించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)