చంద్రన్న కానుకపై సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వ నిర్ణయం.. ‘‘సీబీఐ విచారణ జరుపుకోవచ్చు’ అని చంద్రబాబు సవాలు విసిరారు.. అందుకే ఆదేశించాం’ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో కందిపప్పు, నెయ్యి, గోధుమపిండి వంటి చంద్రన్న కానుకల సరుకుల కొనుగోళ్లు, ఫైబర్‌ నెట్‌ ఏర్పాటులో అవినీతి జరిగిందని.. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించటానికి జగన్‌ ప్రభుత్వం నిర్ణయించిందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం మేరకు.. ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌లో దీనిపై తీర్మానం చేశారు. ‘‘అప్పట్లో పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసిన సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుక, రంజాన్‌ తోఫాలపైనా, ఫైబర్‌నెట్‌ కార్యకలాపాలపైనా సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నాం’’ అని జగన్‌ ప్రకటించారు. మంత్రివర్గ సహచరులంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

కానుకల పంపిణీలో భాగమైన కందులు, నెయ్యి తదితర సరుకుల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతోపాటు ఫైబర్‌నెట్‌ సంస్థలోనూ అవినీతి జరిగిందని వెల్లడిస్తూ బుగ్గన కమిటీ సభ్యులు మరో నివేదికను అందజేశారు. ఫైబర్‌నెట్‌ సంస్థలో కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగాయని బుగ్గన కమిటీ తెలిపింది.

ఈవీఎం చోరీ కేసులో నిందితుడైన హరికృష్ణకు ఈ ప్రాజెక్టు గవర్నింగ్‌ బాడీ బాధ్యతలు అప్పగించారని... ఆయనకే చెందిన టెరా సాఫ్ట్‌ సంస్థకు టెండర్లు దక్కాయని తెలిపారు. ‘‘ఈ రెండింటిలోనూ చంద్రబాబు సర్కారు అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా ఉంది. ఈ లావాదేవీలు సీబీఐ విచారణకు ఆమోదయోగ్యమైనవి’’ అని తెలిపింది. కమిటీ సిఫారసును మంత్రివర్గం ఆమోదిస్తూ తీర్మానం చేసింది. ఈ వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.

‘‘గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని తాము చెబుతుండగా... ‘సీబీఐ విచారణ జరుపుకోవచ్చు’ అని చంద్రబాబు పదేపదే సవాలు విసురుతున్నారని పేర్ని నాని తెలిపారు. అందుకే, కళ్లెదుట కనిపిస్తున్న అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించామని చెప్పారు.

టెరాసాఫ్ట్‌కు అర్హతలేకున్నా, ఎల్‌-1 కాకున్నా ఫైబర్‌నెట్‌ పనులు అప్పగించారన్నారు. పర్యవేక్షణకు కేంద్ర సంస్థను కాదని టెరాసాఫ్ట్‌కు చెందిన జెమినీ అనే మరో కంపెనీకి బాధ్యతలు అప్పగించారన్నారు. సెట్‌టాప్‌ బాక్సులు టెండర్‌లో ఎల్‌-1 కాకుండా టెరా సాఫ్ట్‌ బాగుపడేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో రూ.200 కోట్ల అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేలిందన్నారు.

'బీమా, వసతి కల్పిస్తాం.. వచ్చేయండి': వలస కార్మికులకు కంపెనీల తాయిలాలు

లాక్‌డౌన్‌ కారణంగా సొంత ఊర్లకు వెళ్లిన వలస కార్మికులకు.. బీమా కవరేజీ, ఆరోగ్య సదుపాయాలు, ఉండడానికి హాస్టల్‌ వసతి తదితరాలు అందిస్తామంటూ భారత కంపెనీలు హామీ ఇస్తున్నాయని.. కూలీలను తిరిగి ప్లాంట్లకు రావాలని కోరుతున్నాయని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. వలస కార్మికులంతా ఊర్లకు వెళ్లడంతో భారత కంపెనీల్లో కార్మికుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. గత రెండు నెలలుగా ఉత్పత్తి లేక ఆదాయాలు పడిపోయిన కంపెనీల్లో ఉత్పత్తి పెరగడానికి వలస కార్మికులు కీలకం.

వలస కార్మికులందరూ తిరిగి రావడానికి కనీసం 45-60 రోజుల సమయం పట్టొచ్చని స్థిరాస్తి, వినియోగదారు ఉత్పత్తులు, వాహన, నిర్మాణ, జౌళి రంగాలకు చెందిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడుతున్నారు. ఆ లెక్కన జులైకి కానీ ఉత్పత్తి పెరగకపోవచ్చన్నమాట.

ప్లాంట్ల సమీపంలో వసతి: డాబర్‌, పార్లే ప్రోడక్ట్స్‌, పెప్సికో వంటి వినియోగదారు ఉత్పత్తి సంస్థలు వలస కార్మికులు లేక స్థానిక ప్రజలపై ఆధారపడుతున్నాయి. తయారీ ప్లాంట్లకు చేరువలో వారి కోసం వసతిని సైతం సమకూరుస్తున్నాయి. డాబర్‌ వంటి కంపెనీలు ఆరోగ్య బీమాను కల్పిస్తున్నాయి. నెస్లే, మారికో, హెచ్‌యూఎల్‌లు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. మే 20 తర్వాత పరిస్థితులు కొంత మెరుగయ్యాయి.

స్థిరాస్తి కంపెనీలు సైతం..: ఇక స్థిరాస్తి కంపెనీలు సైతం కార్మికులు తిరిగి సైట్లకు రావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. పరిశ్రమలోనే అత్యుత్తమ ప్రమాణాలను, వసతులను కల్పిస్తున్నట్లు ఓ దిగ్గజ స్థిరాస్తి కంపెనీ చెప్పుకొచ్చింది. సాధారణంగా ప్లాంట్ల వద్ద 2,000 సిబ్బంది వరకు పనిచేస్తారని.. వారిలో 800 మంది ఇళ్లకు వెళ్లారని అంటోంది. 45 రోజుల్లోగా వారిని వెనక్కి రప్పించేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.

స్థానికులపైనే ఆధారం..: వసల కార్మికులకు హాస్టల్‌ వసతులు అవసరం. ఒక్కోసారి ఇంటికి వెళితే నెల వరకు తిరిగి రారు. అందుకే ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న కార్మికులపైనే జౌళి కంపెనీలు దృష్టి పెడుతున్నారు. స్థానికులపైనే ఆధారపడుతున్నారు. మరో పక్క, దైమ్లర్‌ ఇండియా వంటి సంస్థలు కార్యకలాపాలు పెంచుతున్నాయి.

భారతదేశంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు: కేంద్రం

భారతదేశంలో ఇప్పటికీ అత్యధిక జనాభాకు కరోనా ముప్పు పొంచి ఉన్నట్లు సర్వేలో తేలిందని.. అయితే, కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి భారత్‌ ఇంకా చేరుకోలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆకథనం ప్రకారం.. కోవిడ్‌–19 వ్యాప్తిపై దేశంలో తొలిసారిగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో రెండు భాగాలు ఉన్నాయి. మొదట సాధారణ జన సమూహంలో సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ వ్యాప్తి తీరును పరిశీలించారు.

రెండో భాగంలో కంటైన్‌మెంట్‌ జోన్లు, హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఎవరెవరు ఈ మహమ్మారి బారినపడ్డారో గుర్తించినట్లు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ చెప్పారు. రెండో భాగం సర్వే ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

రాష్ట్ర ఆరోగ్యశాఖలు, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) భాగస్వామ్యంతో మే నెలలో దేశవ్యాప్తంగా సర్వే ప్రారంభించామని పేర్కొన్నారు.

మొత్తం 83 జిల్లాల్లో 28,595 ఇళ్లల్లోని 26,400 మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు.

ఇప్పటిదాకా 65 జిల్లాల సర్వే ఫలితాలను క్రోడీకరించారు. ఈ జిల్లాల్లో 0.73 శాతం జనాభా సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ ప్రభావానికి గురైనట్లు తేలింది.

దేశంలో కరోనా వేగానికి అడ్డుకట్ట వేయడంలో, పాజిటివ్‌ కేసులను తగ్గించడంలో లాక్‌డౌన్, కంటైన్‌మెంట్‌ చర్యలు బాగా తోడ్పడ్డాయి.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే కరోనా ముప్పు పట్టణ ప్రాంతాల్లో 1.08 రెట్లు, పట్టణ మురికివాడల్లో 1.89 రెట్లు అధికం.

పట్టణ మురికివాడల్లో లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిన అవసరం ఉంది.

కరోనా వైరస్‌ ప్రభావానికి అధికంగా గురయ్యే అవకాశం ఉన్న గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.

15 లేదా 16న దోస్త్‌ షెడ్యూల్‌ - సెప్టెంబర్‌ 1 నుంచి డిగ్రీ తరగతులు

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీన షెడ్యూల్‌ విడుదల కానున్నదని.. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌-2020) అధికారులు కసరత్తు చేస్తున్నారని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాలు ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. 2020-21 విద్యాసంవత్సరానికి జూలై, ఆగస్టులో రెండు లేదా మూడు దశల్లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి ఆగస్టు 24 వరకు పూర్తిచేయనున్నారు.

యూజీసీ మార్గదర్శకాల ప్రకారం మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబర్‌ ఒకటి నుంచి, ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులను ఆగస్టు ఒకటి నుంచి నిర్వహించాల్సి ఉన్నది. ఈ మేరకు షెడ్యూల్‌ సిద్ధంచేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్ల నిర్వహణకు సీజీజీ సహకారం అందిస్తున్నది. విద్యార్థులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించనున్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో కాలేజీలను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించనున్నది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)