You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: నాలుగు ఖండాల్లోని నలుగురు నర్సులు... కోవిడ్ రోగుల సేవల్లో వారి అనుభవాలు
ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికిపైగా కరోనావైరస్ బారినపడ్డారు. ఈ మహమ్మారి విజృంభణ సమయంలో ప్రపంచవ్యాప్తంగా నర్సులు అందిస్తున్న సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నాలుగు వేర్వేరు ఖండాల్లో పనిచేస్తున్న నలుగురు నర్సులతో బీబీసీ మాట్లాడింది.
కోవిడ్-19పై పోరులో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుంది.
ఆధునిక నర్సింగ్ వ్యవస్థ రూపశిల్పి ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి అయిన మే 12ను నర్సింగ్ డేగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొంటారు.
అంతరించిపోతున్న అండమాన్ ఆదిమ తెగను కరోనా నుంచి కాపాడిన శాంతి లక్రా
‘‘మార్చి 24న మేం మొట్టమొదట కోవిడ్-19 రోగిని చేర్చుకున్నాం. నేను వెంటనే ఆసుపత్రిలో ఉన్న ఇద్దరు ఆదివాసీల గురించి ఆలోచించాను. వెంటనే వారిని ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించాను’’ అన్నారు శాంతి థెరెసా లక్రా.
అండమాన్ నికోబార్ దీవుల్లో అంతరించిపోతున్న గిరిజన జాతులకు ఆరోగ్య సేవలు అందించిన వనితగా శాంతికి గుర్తింపు ఉంది. ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు కూడా ఆమెను వరించింది.
ఆమె ఉన్న ఆసుపత్రికి కోవిడ్ కేసు వచ్చినప్పటికి న్యుమోనియాతో బాధపడుతున్న అయిదేళ్ల జారవా గిరిజన తెగ బాలుడి బాగోగులు చూస్తున్నారు.
1997 తరువాతే జారవా తెగ ఆదివాసీలు బాహ్యప్రపంచాన్ని తెలుసుకున్నారు.
పోర్ట్ బ్లెయిర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని అడవుల్లో నగ్నంగా సంచరించే ఆదిమ తెగలు జారవాలు. శాంతి ఇప్పుడు వారి ఆరోగ్యం కోసం పనిచేస్తున్నారు.
ఆ అయిదేళ్ల అబ్బాయిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వారం తరువాత ఆమె వారుండే అడవికి వెళ్లారు.
‘‘అబ్బాయి పూర్తిగా కోలుకున్నాడు. వారి భాష నాకు కొంత తెలియడంతో వారికో మాట చెప్పాను. అడవిలో బాగా లోపలికి వెళ్లిపోమని.. బయటకు రావొద్దని సూచించాను’’ అన్నారామె.జారవా తెగలో ప్రస్తుతం 450 మంది వరకు ఉంటారని.. వారి రోగ నిరోధక శక్తి చాలా తక్కువని.. వారిలో ఒక్కరి కనుక ఇలాంటి వైరస్ సోకితే మొత్తం అందరికీ ప్రమాదమేర్పడుతుందని శాంతి చెప్పారు.
‘నాలాంటి కొడుకున్నందుకు గర్వపడతానని అమ్మ అంటుంది’
‘‘కోవిడ్-19పై పోరాటంలో భాగస్వామినయినందుకు మొదట మా కుటుంబసభ్యులు కొంత ఇబ్బందిపడ్డారు. కానీ, రక్షణగా నేను ధరించిన పరికరాలు చూసిన తరువత ఈ పనిలో నేను ప్రమాదంలో పడే అవకాశాలు తక్కువేనని అర్థం చేసుకున్నారు’’ అన్నారు ఎంజ్వాకె మొహలొగన్యె.
ఎంజ్వాకె వయసు 37. ఇద్దరు పిల్లలున్నారు అతనికి. అయిదేళ్లుగా నర్సుగా పనిచేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో గత రెండు నెలలుగా కోవిడ్-19 మొబైల్ టీంలో పనిచేస్తున్నారు.కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో విజయవంతమైన దేశాల్లో దక్షిణాఫ్రికా కూడా ఒకటి.
సమాజ సమూహాల్లో పెద్ద ఎత్తున టెస్టులు చేయడం, చైతన్యపరచడమే దానికి కారణం.ఇదంతా ఎలా ఉన్నా ఎంజ్వాకె కుటుంబం మాత్రం తొలుత ఆయన కోవిడ్ సేవల్లో భాగస్వామి కావడాన్ని ఇష్టపడలేదు. ఆయనకేమవుతుందో అని ఆందోళన చెందారు.ఆ తరువాత వారి అభిప్రాయాలు మారాయి.
‘‘నాలాంటి గొప్ప కొడుకు ఉండడం ఎంతో గర్వంగా ఉందని అమ్మ నాతో చెప్పింది’’ అన్నారు ఎంజ్వాకె.ఈ క్లిష్ట సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడంలో తానూ భాగమైనందుకు సంతోషంగా ఉందంటారు ఎంజ్వాకె.
గతంలో కంటే ఇప్పుడు నర్సులకు అభినందనలు పెరుగుతున్నాయని అన్నారాయన.‘‘వెనకడుగువేయొద్దు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో మీరు చేయగలిగిందంతా చేయండి. విఫలమయ్యామని అనుకోవద్దు’. ప్రపంచవ్యాప్తంగా నర్సులందరికీ ఇదే నా సందేశం’’ అన్నారాయన.
‘కదిలించే ఫొటో మాత్రమే కాదు.. కలవరపరిచేది కూడా’
ఇటలీలో అలసిసొలసిన ఒక నర్సు మాస్కు కూడా తీయకుండా అలాగే టేబుల్‌పై తలవాల్చిన ఫొటో ఒకటి వైరల్ అయింది.
కరోనావైరస్ ప్రభావానికి తీవ్రంగా లోనయిన మొదటి పాశ్చాత్య దేశం ఇటలీ. అలసిసొలసిన నర్సు ఎలెనా పాగ్లియారిని చిత్రం ఇటలీలో ఈ వైరస్ సృష్టించిన విలయానికి తార్కాణం.‘‘నా కళ్ల ముందే కొందరు రోగులు చనిపోతున్నారు. రాత్రంతా మేం పనిచేశాం. ఉదయం 6 గంటల సమయంలో నేను కాసేపు నా డెస్క్‌పై తలవాల్చి విశ్రాంతి తీసుకున్నాను. అప్పుడు మా డాక్టర్ ఈ ఫొటో తీశారు’ అని చెప్పారు ఎలెనా.
తనకు ఏమాత్రం పరిచయం లేని ఎందరో జర్నలిస్టులు తనను సంప్రదించేవరకు ఈ ఫొటో ప్రాముఖ్యం తనకు తెలియలేదని అన్నారామె.‘‘ఇది కదిలించే చిత్రమే కాదు కలవరపెట్టేది కూడా’’ అన్నారామె.
‘‘మార్చి నెల మధ్యలో ఇటలీలోని ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ప్రతి రోజూ వందల మంది చనిపోతున్నారు. అప్పుడు ఎలెనాకు కూడా కరోనా సోకింది. వాసన, రుచి తెలియడం మానేశాయి. 23 రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యారు. కోలుకున్నాక ఏప్రిల్ 2న విధులకు వచ్చారు.
అప్పటికి ఇటలీలో కరోనావైరస్ పీక్ స్టేజ్‌కు చేరింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా తగ్గనారంభించింది.
ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నవారు.. కొత్త కేసులు తగ్గుతుండడంతో కొంతవరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది.ఇటలీలో 160 మందికిపైగా హెల్త్ కేర్ వర్కర్స్ కరోనా కారణంగా చనిపోయారు. ‘‘నా పనికి నేను గర్వపడుతున్నాను.. ఆ ఫొటోలో ఉన్నది నేనే అయినా అది మొత్తం వైద్యులు, నర్సులు అందరికీ ప్రతీక’’ అన్నారామె.
'వాళ్ళ వయసు 70 ఏళ్ళకన్నా ఎక్కువే... కానీ, కోలుకున్నారు'
గాబ్రియేలా సెరానో అమెరికాలో ఒక నర్సు. ఆమె సేవలందిస్తున్నవారిలో కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న తొలి రోగి గురించి ఆమె చెప్పారు.
‘‘ఆమెను నేను చక్రాల కుర్చీలో ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్తున్నప్పుడు ఆమె అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. సూర్యుడి వెలుగును చూడడం, స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారామె’’ అని చెప్పారు గాబ్రియేలా.
31 ఏళ్ల గాబ్రియేలా గత రెండు నెలల్లో ముగ్గురి మరణాన్ని చూశారు.అయితే, వారెవరూ కరోనా రోగులు కారు. మృత్యు ముఖంలో ఉన్న ఒక మహిళ గురించి ఆమె చెబుతూ, ‘‘మొదటి రోజు ఆమె శరీరం వైద్యానికి కొంతవరకు సహకరించింది. కానీ, ఏమీ మాట్లాడలేకపోయేవారు. ఆమెకు చేస్తున్న ప్రతి పనినీ నేను వివరించేదాన్ని. ఆమె తిరిగి నాతో మాట్లాడలేకపోయినా కూడా చెప్పేదాన్ని. రెండో రోజు ఆమె కనీసం కళ్లు తెరిచి కూడా చూడలేని స్థితిలో ఉన్నారు.ఆమె చివరి క్షణాల్లో ఆమెను చూసేందుకు బంధువులు రావొచ్చని ఆసుపత్రి చెప్పింది. కానీ, ఆమెకు కుటుంబ సభ్యులెవరూ లేరు. ఆమె బెస్ట్ ఫ్రెండ్ కూడా ఆ పరిస్థితుల్లో ఆసుపత్రికి రావడానికి ధైర్యం చేయలేదు. నేనే ఆమె దగ్గర కూర్చున్నాను. ఆమె చేయి పట్టుకుని ఎవరూ లేకపోయినా నేనున్నానని చెప్పాను’’ అన్నారు గాబ్రియేలా.
‘‘ఆ సమయంలో ఆమె నా మాటలు వినగలుగుతున్నారో లేదో కూడా తెలియదు. కానీ నేను చేయగలిగిన గొప్ప పని మాత్రం అదే’’ అన్నారామె.అయితే... గాబ్రియేలా ఎంత కష్టపడి పనిచేసినా ఈ క్లిష్ట సమయంలో ఉద్యోగం కోల్పోక తప్పలేదు. ఆమె ఒక ట్రావెల్ నర్స్ కావడం.. తాత్కాలిక నియామకంలో ఉండడం.. అత్యవసరం కాని రోగులెవరూ హాస్పిటల్‌కు రావడం తగ్గించడంతో ఆసుపత్రి యాజమాన్యం గాబ్రియేలాను ఉద్యోగం నుంచి తొలగించింది.
‘‘నెల రోజుల్లో నేను మళ్లీ ఎక్కడైనా ఉద్యోగం సంపాదించగలనన్న నమ్మకం ఉంది’’ అన్నారు గాబ్రియేలా.
ఇవి కూడా చదవండి:
- లాక్ డౌన్ ఎఫెక్ట్: పని మనుషులని పనుల్లోకి పిలవాలా? వద్దా? కోట్లాది కుటుంబాలని వేధిస్తున్న ప్రశ్న
- విశ్వ రహస్యం గుట్టు విప్పే ప్రయత్నంలో మరో 'ముందడుగు'
- కిమ్ జోంగ్ ఉన్‌కు గుండె ఆపరేషన్ జరిగిందా? లేదా?.. దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందంటే..
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా
- కరోనావైరస్తో మనుషులు చనిపోతుంటే... మరో వైపు మాఫియా డాన్లు ఏం చేస్తున్నారు?
- కరోనావైరస్: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై ఫిర్యాదు చేస్తారా
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)