కరోనా వైరస్‌: కోవిడ్‌-19 ఒక జ్వరం వంటిదే - వైఎస్ జగన్ : ప్రెస్ రివ్యూ

ప్రచురణ

‘కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ఒక జ్వరం వంటిదే. మందులు వేసుకుని, 14 రోజుల పాటు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలో ఉంటే తప్పనిసరిగా నయం అవుతుంది. ఎవరిలోనైనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే 104కు ఫోన్‌ చేస్తే వైద్యులు వచ్చి, చికిత్స చేస్తారు. అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తారు. భయాందోళనకు గురికావద్దు’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

వైరస్‌ను కట్టడి చేయడానికి చేపడుతున్న చర్యలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఏర్పాట్లు చేశామని జగన్ చెప్పారు. కోవిడ్‌-19 నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ నేపథ్యంలో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైరస్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడంతో పాటు, వారికి వెంటనే చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన విధానాన్ని అవలంబిస్తోందన్నారు.

‘‘ఈ వైరస్‌ ఒక స్టిగ్మా మాదిరి.. అది వస్తే ఏదేదో జరిగిపోతుందని ఎవరూ అనుకోవద్దు. ఈ వైరస్‌ కూడా దాదాపు ఒక జ్వరం, ఫ్లూ వంటిదే. కాకపోతే వయో వృద్ధులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారిపై ఇది కాస్త ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎవరూ అధైర్యపడొద్దు.

కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వైరస్‌ మాత్రమే. దేశ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్‌ సోకడం, ఆ తర్వాత వారు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కావడం చూశాం’’ అని జగన్ అన్నారు.

తెలంగాణలో వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి వేతనాలు

కరోనా పోరులో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఈ నెల (మార్చి) పూర్తి వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

నగరాలు, పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఈ నెల పూర్తి వేతనం లభించనున్నది.

అసాధారణ పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని పారదోలడానికి అహరహం శ్రమిస్తున్న వీరి రుణం తీర్చుకోలేనిదైనా.. వీరి సేవలకు గుర్తింపుగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించారు.

ఈ ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకట్రెండు రోజుల్లో స్వయంగా ప్రకటించనున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు.. ఇతర అంశాలపై బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.

లక్షణాల్లేవు.. అయినా పాజిటివ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో మంగళ, బుధవారాల్లో వైరస్‌ బారినపడినట్టు తేలిన ఐదుగురిలో నలుగురికి ఎలాంటి లక్షణాలూ కనిపించలేదని, ఇది వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఇప్పటి వరకు వైద్యులు కూడా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేశారు. లక్షణాలు లేని వ్యక్తులను కొద్ది రోజులపాటు పరిశీలనలో ఉంచి డిశ్చార్జి చేస్తున్నారు.

ఢిల్లీలో జరిగిన మత సమావేశంలో పాల్గొని నగరానికి వచ్చిన 35 మందిని వైద్యులు 3 రోజుల కిందట ఆసుపత్రికి తరలించి నమూనాలు సేకరించారు. అయితే, వీరంతా ఢిల్లీ నుంచి వచ్చి 10 రోజులు దాటుతుండడం, ఎవరిలోనూ వైరస్‌ సోకిన లక్షణాలు కనిపించక పోవడంతో పాజిటివ్‌ కేసులు ఉండవని భావించారు.

వీరిలో మంగళవారం రాత్రి కొందరివి, బుధవారం ఉదయం మరికొందరివి రిపోర్ట్సు వచ్చాయి. వీటిలో ఐదుగురు వైరస్‌ బారినపడినట్టు తేలింది. ఐదుగురిలో ఒక వృద్ధుడు(70) మాత్రమే ఒళ్లు నొప్పులతో బాధపడుతుండగా, మిగిలిన నలుగురిలో ఎలాంటి లక్షణాలు లేకపోగా ఆరోగ్యంగా కనిపించారు.

అయినా, వైరస్‌ బారినపడడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై వైద్యాధికారులను ఆరా తీయగా కొంతమందిలో వైరస్‌ ఉన్నా లక్షణాలు కనిపించేందుకు ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు.

స్వదేశీ వెంటిలేటర్ తయారు చేసిన ఐఐఎస్‌సీ

కరోనా బాధితుల చికిత్సలో కీలకమైన వెంటిలేటర్లను బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ)కి చెందిన నిపుణులు తక్కువ వ్యయంతో తయారు చేశారని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

పూర్తిగా స్వదేశీ పరికరాలతోనే ఈ ఎలక్ట్రో మెకానికల్ వెంటిలేటర్ ను తయారు చేశారని, తుది ఉత్పత్తి మరో నాలుగు వారాల్లో అందుబాటులోకి రానుందని పేర్కంది. ప్రత్యేక శిక్షణ లేని వైద్యులు, నర్సులు కూడా ఈ వెంటిలేటర్‌ను సులభంగా ఉపయోగించవచ్చునని డీఈఎస్ఈ ప్రధాన పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ టీవీ ప్రభాకర్ చెప్పారు.

దేశవ్యాప్తంగా 40 వేల వెంటిలేటర్లే అందుబాటులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇలాంటి చౌకైన వెంటిలేటర్ల తయారీకి బీహెచ్ఈఎల్ ముందుకు వచ్చినట్లు ఈ పరికరం తయారీలో పాల్గొన్న యువ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)