You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: రోజూ 80 లక్షల మందిని తీసుకువెళ్లే ముంబయి లోకల్ రైళ్లు ఆగిపోయాయ్
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే ముంబయి సబర్బన్ (లోకల్) రైళ్లు ఆగిపోయాయి. సోమవారం ఉదయం నుంచి సాధారణ ప్రయాణికులను వీటిలోకి అనుమతించడాన్ని నిలిపివేశారు.అత్యవసర సేవల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రం కొన్ని ట్రెయిన్లు తిరుగుతాయి.
అయితే, ఈ నిర్ణయం ఎవర్నీ ఆశ్చర్యపరచలేదు.
ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉండే రైల్వే వ్యవస్థల్లో ముంబయి సబర్బన్ కూడా ఒకటి. రోజూ దీనిలో 80 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. రైళ్ల అసలు సామర్థ్యం కన్నా మూడు రెట్లు ఎక్కువగా ప్రయాణికులు ఎక్కుతుంటారు.
66 ఏళ్లుగా..
459 కి.మీ. పొడవైన ఈ నెట్‌వర్క్ దేశ ఆర్థిక రాజధాని ముంబయికి జీవనాడి లాంటిది. నగరంలోని ప్రజల ప్రయాణాల్లో దాదాపు 80 శాతం దీని ద్వారానే సాగుతుంటాయి.
ముంబయి సబర్బన్ వెబ్‌సైట్ ప్రకారం ఒక వారంలో ముంబయి లోకల్ ట్రెయిన్లు తిరిగే దూరం భూమికి, చంద్రుడికి మధ్య దూరానికి దాదాపు సమానంగా ఉంటుంది. 66 ఏళ్ల నుంచి ఈ నెట్‌వర్క్ నడుస్తోంది.
ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా ఈ ట్రెయిన్ల కోచ్‌లను పటిష్టంగా రూపొందించారు.
తొమ్మిది బోగీలుండే ట్రెయిన్‌లో 1,800 మంది నిల్చొని ప్రయాణించేలా వీటికి రూపకల్పన చేశారని.. కానీ, 7 వేల మంది దాకా అందులో ప్రయాణిస్తుంటారని 'అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రెయిన్స్' పుస్తకం రాసిన మోనిషా రాజేశ్ చెబుతున్నారు.
ముంబయి లోకల్ ట్రెయిన్లలో ప్రయాణం 'సున్నిత మనస్కుల'కు శ్రేయస్కరం కాదన్నది ఆమె అభిప్రాయం.
మహారాష్ట్రలోనే ఎక్కువ కరోనా కేసులు
దేశంలో మహారాష్ట్రలోనే ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
ఆదివారం ముందు వరకూ ముంబయి నుంచి సుదూరాలకు వెళ్లే చాలా ట్రెయిన్లు రద్దైనా, నగరంలోని లోకల్ ట్రెయిన్లను మాత్రం నడుపుతూ వచ్చారు. ఇంత రద్దీ ఉండే ట్రెయిన్లలో కరోనావైరస్ చాలా మందికి వ్యాపించవచ్చన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
2006లో ముంబయి లోకల్ ట్రెయిన్లను లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు 180కిపైగా మంది చనిపోయారు. 800 మందికిపైగా గాయపడ్డారు. విపరీతమైన రద్దీ వల్లే మరణాల సంఖ్య అంత ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు అప్పుడు వ్యక్తమయ్యాయి.
రద్దీ ప్రయాణాలకు, శ్వాసకోశ అంటువ్యాధులకు మధ్య సంబంధం ఉంది.
1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి వ్యాపించినప్పుడు భారత్‌లో దాదాపు 1.8 కోట్ల మంది ప్రాణాలు వదిలారు.
అప్పుడు వ్యాధి వ్యాప్తిలో రైల్వే గతి లేని పరిస్థితుల్లో ముఖ్య పాత్ర పోషించిందని ఓ అధికారిక నివేదిక పేర్కొంది.
''పెద్ద నగరాల నుంచి వైరస్‌ను స్థానిక రవాణా వ్యవస్థలు, ముఖ్యంగా రైల్వే మారుమూల ప్రాంతాల వరకూ మోసుకువెళ్లింది'' అని 1918-19లో బ్రిటన్‌లో ఫ్లూ వ్యాప్తిపై వచ్చిన ఓ నివేదిక అభిప్రాయపడింది.
ముంబయి కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారొచ్చని చాలా మంది భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముంబయి సబర్బన్ సేవలను నిలిపేయాల్సిందేనా? అంటేశ్రుతి రాజగోపాలన్ లాంటి ఆర్థికవేత్తలు దీనికి అవుననే జవాబు ఇచ్చారు.
''భారత్‌లో కరోనావైరస్ పరీక్షల నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. నిజంగానే జనాల్లో ఆ వైరస్ ఉంటే, ముంబయిలో దాని వ్యాప్తిని ఆపలేం. వైద్యం అందక చాలా మంది మరణిస్తారు'' అని ఆమె అన్నారు.వైరస్‌ను ముంబయి ట్రెయిన్లు జనసమ్మర్థ ప్రాంతాల వరకూ వేగంగా వ్యాప్తి చేయగలవని శ్రుతి అభిప్రాయపడ్డారు.
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు
చైనా కూడా వుహాన్‌కు వచ్చే పోయే రైళ్లు, పడవలు, విమానాలు, బస్సులను రద్దు చేసింది. లండన్ అండర్‌గ్రౌండ్ (మెట్రో) నెట్‌వర్క్‌లోని 40 వరకూ స్టేషన్లను వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మూసివేస్తామని గురువారం ఆ నగర అధికారులు కూడా ప్రకటించారు.
అయితే, కొందరు మాత్రం ప్రజా రవాణా వ్యవస్థలు మహమ్మారుల వ్యాప్తికి కారణమవుతాయని కచ్చితంగా చెప్పలేమంటున్నారు.
ప్రజా రవాణా వ్యవస్థలను నిలిపివేస్తే పాండెమిక్‌ల వ్యాప్తి ఆగడం గానీ, తగ్గడం గానీ ఉండదని ఓ అధ్యయనం అభిప్రాయపడింది.
''ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణాల వల్ల ముప్పు వ్యక్తిగత స్థాయి వరకే. కుటుంబ సభ్యుల నుంచి వ్యాపించే ముప్పే ఎక్కువగా ఉంటుంది'' అని ఆ అధ్యయనం పేర్కొంది.
''స్కూళ్లు, ఆఫీసులతో పోల్చితే ప్రజా రవాణా వ్యవస్థల వల్ల ముప్పు ఎక్కువని చెప్పే సమాచారమేదీ నేను చూడలేదు'' అని కాలిఫోర్నియా యూనివర్సిటీలోని ఎపిడమాలజీ ప్రొఫెసర్ టిమోతీ బ్రూయర్ వోక్స్ వెబ్‌సైట్‌తో అన్నారు.
''వుహాన్ బయట కరోనావైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాల్లో ఇళ్లల్లో ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించడం ఒకటి. అంటే, ఎక్కువ సేపు రోగితో ఉంటే అది మనకు సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందన్నమాట. చైనా నుంచి వచ్చిన సమాచారం ఇదే సూచిస్తోంది'' అని ఆయన అన్నారు.
''అదే నిజమైతే ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణంలో ఎంత సమయం గడుపుతున్నాం, ఎంత రద్దీ ఉంది అనే అంశాలు వాటిలో వ్యాప్తి ముప్పు ఎలా ఉంటుందన్న దాన్ని గుర్తించడంలో కీలకమవుతాయి'' అని చెప్పారు.
రద్దీని తగ్గించేందుకు ముంబయి సబర్బన్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని సంస్థ సీనియర్ కమ్యునికేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ అన్నారు. ప్రకటనలు, పోస్టర్లు, వీడియోల ద్వారా కరోనావైరస్ వ్యాప్తి గురించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
''ప్రయాణికులను పరిశీలించాం. వారు ఒప్పుకుంటే, శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించాం. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మవద్దని ప్రచారం చేశాం'' అని ఆయన అన్నారు.
తగ్గిన రద్దీ
కరోనావైరస్ భయాందోళనల వల్ల ముంబయి సబర్బన్‌లో ప్రయాణికుల రద్దీ 27 శాతం పడిపోయింది. అయినా, ఈ రైళ్లలో రోజూ ప్రయాణించిన వారి సంఖ్య లక్షల్లోనే ఉంది.
''భయంతోనే ఇదంతా. ఉద్యోగాలకు వెళ్లాలి కాబట్టి, మాలో చాలా మందికి లోకల్ ట్రెయిన్లలో ప్రయాణం తప్పట్లేదు. సంస్థలన్నీ ఉద్యోగులతో ఇళ్ల నుంచే పనిచేయించుకోవాలని ప్రభుత్వం ఇంకా ఆదేశాలేవీ ఇవ్వలేదు. ప్రయాణికులు మాస్క్‌లు వేసుకోవడం తప్ప, ఏ ముందు జాగ్రత్త చర్యలూ కనిపించడం లేదు'' అని రేఖా హోడ్గే అనే ప్రయాణికురాలు రైళ్లు రద్దుకాక ముందు చెప్పారు.
ఆమె మూడు దశాబ్దాలుగా సబర్బన్ సేవలను వినియోగించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాక్డౌన్
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: భారతదేశంలో మూగబోతున్న నగరాలు
- ఈ ఉన్నత విద్యావంతులు యాచకులుగా మారడానికి కారణమేంటి
- బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణ హత్యాకాండ
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- పీటీ ఉష: ఎలాంటి సదుపాయాలూ లేని పరిస్థితుల్లోనే దేశానికి 103 అంతర్జాతీయ పతకాలు సాధించిన అథ్లెట్
- భారత్ కూడా పాకిస్తాన్ చేసిన 'తప్పే' చేస్తోంది: షోయబ్ అఖ్తర్
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)