'దిశ' కేసులో తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద 40 అడుగుల ఎత్తు మీదున్న సీసీటీవీ ఫుటేజిలో కీలక దృశ్యాలు :ప్రెస్ రివ్యూ

'దిశ' అత్యాచారం, హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు ఈనాడు కథనం ప్రచురించింది.
ఈ కేసులో పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయిన నలుగురు నిందితులకు వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్ ప్రయోగశాల నివేదికను సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసినట్లు ఈనాడు రాసింది.
ఈ కేసుకు సంబంధించి శంషాబాద్, షాద్‌నగర్ పోలీసులు సుమారు 40 సాక్ష్యాధారాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు గత ఏడాది డిసెంబర్ రెండో వారంలో పంపించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, యంత్రాలు, సూక్ష్మపరికరాలతో వాటిని విశ్లేషించారు.


ఇందులో కీలకమైన సాక్ష్యాలు, దిశ, ఆమె సోదరి స్వరాలు, తొండుపల్లి టోల్‌ప్లాజా దగ్గర దిశను లాక్కెళ్లేటప్పుడు నిక్షిప్తమైన సీసీ కెమెరా ఫుటేజీ, దిశ సెల్‌ఫోనులోని నంబర్లు.. సంక్షిప్త సందేశాలు.. సంభాషణల నివేదికలను ప్రత్యేకంగా రూపొందించారు. వీటిని రెండు రోజుల్లో పోలీసులకు అందజేయనున్నట్లు తెలిసింది.
తొండుపల్లి టోల్‌ప్లాజా కూడలి దగ్గర 40 అడుగుల ఎత్తులో ఉన్న సీసీ కెమెరాలో దిశ హత్యాచార ఘటనకు సంబంధించిన అత్యంత కీలక దృశ్యాలు రికార్డయ్యాయి అని ఈనాడు కథనంలో చెప్పారు.
ఆమె ద్విచక్ర వాహనం టైర్ పంక్చర్ చేయడం, బాగు చేయిస్తామంటూ నిందితులు ఆమెతో మాట్లాడడం, అక్కడున్న వారెవరికీ అనుమానం రాకుండా లారీ వద్దకు లాక్కెళ్లడం... ఇలా అన్ని దృశ్యాలూ ఆ ఫుటేజీలో ఉన్నాయి.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో నిందితుల ముఖాలు మరింత స్పష్టంగా కనిపించేలా ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు అభివృద్ధి చేసినట్లు ఈ కథనంలో వివరించారు.

మానవ తప్పిదంతోనే కచ్చులూరు పడవ ప్రమాదం
గోదావరి నదిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదానికి మానవ తప్పిదాలే కారణమని ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారించినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
కచ్చులూరు బోటు ప్రమాదంతోపాటు రాష్ట్రంలో బోటు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ఇందులో చెప్పారు.
2017 నవంబరులో కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదం దగ్గర నుంచి 2019 సెప్టెంబరులో గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం వరకూ అన్నింటినీ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
రెండేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఐదు పెద్ద బోటు ప్రమాదాలు జరిగాయి. వీటికి కారణాలనూ కమిటీ గుర్తించి, నివేదికలో పొందుపరిచింది.
కచ్చులూరు ప్రమాదానికి ఏడు కారణాలున్నట్టు కమిటీ పేర్కొంది.
బోటులో అనుభవం, శిక్షణ పొందిన డైవర్ లేరని, ప్రయాణించిన రూట్ కూడా సరైంది కాదని కమిటీ నిర్ధారించిందని పత్రిక రాసింది.
సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించినట్లు గుర్తించింది. దీనిలో ప్రధానంగా మానవ తప్పిదం ఉందని నిర్ధారించింది.
ప్రయాణికుల సేఫ్టీ పరికరాలను బోటులో ఉపయోగించలేదని, జలరవాణాకు అనుమతిచ్చే సిబ్బంది సమగ్ర నిర్వహణ విధానాన్ని అనుసరించలేదని కమిటీ తమ నివేదికలో చెప్పినట్లు ఆంధ్రజ్యోతి కథనం వివరించింది.

ఫొటో సోర్స్, iStock
ఆంగ్ల మాధ్యమంపై విచారణ ఫిబ్రవరి 4కు వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసినట్లు సాక్షి కథనం ప్రచురించింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కౌంటర్ దాఖలు చేసేందుకు 10 రోజులు గడువు కావాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) బి.కృష్ణమోహన్ స్పందిస్తూ.. విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యాబోధన జరగాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని చెప్పినట్లు పత్రిక రాసింది.
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆంగ్ల మాధ్యమంలోనే చదవాలని విద్యార్థులను బలవంతం చేయలేమని, ఇందుకు సుప్రీంకోర్టు తీర్పు సైతం అంగీకరించడం లేదని వ్యాఖ్యానించింది.
ఆంగ్ల మాధ్యమంలో పాఠ్య పుస్తకాల ముద్రణ తదితర విషయాల్లో ముందుకెళితే సంబంధిత అధికారులే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే ఓసారి చెప్పామని, ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నామని ధర్మానసం చెప్పినట్లు కథనంలో రాశారు.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసినట్లు సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, youtube grab
మరో 3 నెలలు భూ ప్రకంపనలు
తెలంగాణలో కొనసాగుతున్న భూ ప్రకంపనలు మరో మూడు నెలలు కొనసాగవచ్చని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్పినట్లు నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.
సూర్యాపేట జిల్లాలో భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వెల్తూరు, దొండపాడు ప్రాంతాల్లో సోమవారం కూడా భూమి స్వల్పంగా కంపించినట్టు హైదరాబాద్‌లోని భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్జీఆర్‌ఐ) అబ్జర్వేటరీ అన్‌లైన్ డేటాలో నమోదయినట్లు పత్రిక చెప్పింది.
ఈ ప్రకంపనలు అక్కడకక్కడ మరో మూడునెలలపాటు కొనసాగవచ్చని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఈ కాలంలో ఎప్పుడైనా వెల్తూరు పరిసరాల్లో భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్జీఆర్‌ఐ చీఫ్ సైంటిస్ట్ శ్రీనగేశ్ చెప్పారని కథనంలో రాశారు.
51 ఏండ్ల తర్వాత ఇదే అతి పెద్ద భూకంపంగా ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు, వెల్తూరు మధ్య సంభవించిన భూప్రకంపనలు.. సోమవారం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి.
ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.6గా నమోదైంది. ఆదివారం నాడు సూర్యాపేటతోపాటు ఖమ్మం, నల్లగొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు సంభవించినట్టు ఎన్జీఆర్‌ఐ శాస్తవేత్తలు గుర్తించినట్లు పత్రిక చెప్పింది.
భూమిలోపల ఏడు కిలోమీటర్ల లోతులోని పొరల్లో పగుళ్లు ఏర్పడటం వల్ల పక్కనున్న రాతిపొరలను అధిగమించే క్రమం లో ఒత్తిడి, సర్దుబాటు కారణంగా ఈ భూకం పం సంభవించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సురక్షిత జోన్‌లో ఉండగా.. ఆదిలాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలు తక్కువ ప్రమాదమున్న మూడో జోన్‌లోకి వస్తాయని ఈ కథనంలో వివరించారు.
రాష్ట్రంలో దాదాపు 51ఏండ్ల తర్వాత ఇంత పెద్ద భూకంపం సంభవించడం ఇదే తొలిసారని ఎన్జీఆర్‌ఐ రికార్డులు వెల్లడిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:
- అడవిలో తప్పిపోయి, 34 రోజులపాటు బెర్రీలు తింటూ ప్రాణాలు నిలబెట్టుకున్న తల్లీ పిల్లలు
- ప్రియాంక చోప్రా చదవని ఇమెయిల్స్
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. మోదీ, ట్రంప్, జిన్‌పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- విశాఖపట్నంలో రాజధాని: సెక్రటేరియట్, సీఎం నివాసం ఉండేది ఎక్కడంటే..
- ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- అమరావతి ఆందోళనల్లో మహిళలు: ‘వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే వస్తున్నాం’
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























