నిర్భయ దోషులను చివరి కోరిక అడిగిన తీహార్ జైలు అధికారులు: ప్రెస్ రివ్యూ

నిర్భయ దోషులు

ఫొటో సోర్స్, delhi police

ప్రచురణ

నిర్భయ కేసులో నలుగురు దోషులను మీ చివరి కోరిక ఏంటో చెప్పాలని కోరినపుడు, వారు ఏ సమాధానం ఇవ్వలేదని తీహార్ జైలు అధికారులు చెప్పినట్లు సాక్షి ఒక కథనం ప్రచురించింది.

దిల్లీ నిర్భయ ఘటనలో దోషులు నలుగురినీ ఫిబ్రవరి 1వ తేదీన ఉరితీసేందుకు తీహార్‌ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఉరితీయడానికి ముందు ఏ ఖైదీనైనా వారి ఆఖరి కోరిక ఏమిటని అడగడం ఆనవాయితీ.

తీహార్‌ జైలు అధికారులు సైతం ఈ నలుగురినీ ఆఖరి కోరిక ఏమిటని ప్రశ్నించగా నలుగురిలో ఏ ఒక్కరు కూడా సమాధానమివ్వకుండా మౌనాన్ని ఆశ్రయించారనీ, వారి సమాధానం కోసం వేచి చూస్తున్నామని అడిషనల్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ రాజ్‌కుమార్‌ వెల్లడించినట్లు సాక్షిలో రాశారు.

నలుగురినీ రాతపూర్వకంగా తమ చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు ప్రశ్నించినట్టు ఆయన తెలిపారు.

Presentational grey line
Presentational grey line

దోషులు ఒకసారి వారు నోరువిప్పి తమ చివరి కోరిక ఏమిటో చెపితే దాన్ని తీర్చగలుగుతామా లేదా అనే విషయాన్ని జైలు అధికారులు పరిశీలిస్తారని ఆయన చెప్పినట్లు కథనంలో వివరించారు.

'అయితే అన్ని కోర్కెలూ తీర్చే అవకాశం ఉండదు. ఖైదీలు తమ కోర్కెను రాతపూర్వకంగా ఇచ్చిన తరువాత దానిపై అధికారులు నిర్ణయం తీసుకొంటారు' అని ఆయన చెప్పారు.

కనీసం, మీరు చివరిసారిగా ఎవరినైనా కలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఆస్తులను, మీకు సంబంధించిన వాటిని ఎవరికైనా అప్పజెప్పాలనుకుంటున్నారా? అని కూడా వారిని ప్రశ్నించినట్టు అధికారులు తెలిపారు.

ఢిల్లీ హైకోర్టు నిర్భయ దోషులైన వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌(31), ముఖేష్‌ కుమార్‌ (32), పవన్‌(26)లను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6గంటలకు ఉరి తీయాలని ఆదేశాలు జారీచేసింది.

నిర్భయ ఘటనలో దోషులకు మరణ శిక్ష విధించిన సెషన్స్‌ జడ్జి సతీష్‌ కుమార్‌ అరోరాను డిప్యుటేషన్‌ ప్రాతిపదికన అదనపు రిజిస్ట్రార్‌గా సుప్రీంకోర్టుకు బదిలీ చేశారని కూడా సాక్షిలో ప్రచురించారు.

అమరావతి భూములు

అమరావతిలో తెల్లకార్డుదారులే 700 ఎకరాలు కొన్నారు: సీఐడీ

అమరావతి రాజధాని ప్రాంతంలో 799 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు 700 ఎకరాల భూములు కొన్నారని సీఐడీ అధికారులు చెప్పినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

ఈ భూముల రిజిస్ట్రేషన్ ధర రూ.40 కోట్లని, బహిరంగ మార్కెట్‌లో వీటి ధర రూ.200 కోట్లు ఉందని సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారని రాశారు.

భూములు కొనేంత ఆర్థిక స్థోమత వారికి ఎలా వచ్చింది? లేక వీరి పేరుతో ఎవరైనా బినామీలు రాజధానిలో భూములు కొన్నారా అనే వ్యవహారంపై నిగ్గు తేల్చాలని ఆదాయపన్ను శాఖ అధికారులకు లేఖలు రాశామని ఆమె చెప్పారు.

కోట్ల ఆదాయం కలిగి తెల్లకార్డు ఉంటే అది నేరం అవుతుందని, వారిపై మోసం కేసు నమోదు చేయాల్సి ఉంటుందని మేరీ పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలో ఆమె విలేకరులతో మాట్లాడారని ఈనాడు చెప్పింది.

"వెంకటపాలెంలో పోతురాజు బుజ్జి అనే దళిత మహిళకు ప్రభుత్వం 99 సెంట్ల భూమి పంపిణీ చేసింది. రాజధాని భూసమీకరణలో మీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే రూపాయి కూడా రాదని నమ్మించి గ్రామానికి చెందిన బెల్లంకొండ నరసింహారావు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ చౌకగా తన భూమిని కొట్టేశారని బాధితురాలు ఫిర్యాదు చేశారు".

"వారిపై సెక్షన్ 420, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టాం. నాటి ప్రభుత్వ పెద్దలకు బినామీలుగా ఎవరు వ్యవహరించారు. హవాలా మార్గంలో నగదు లావాదేవీలు జరిగాయా? తేల్చాలని ఆదాయపన్ను విభాగానికి లేఖ రాశాం. మేమూ విచారణ చేయిస్తున్నాం. రాజధాని ప్రకటన వెలువడక ముందు 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు రాజధానిప్రాంతంలో జరిగిన భూమి కొనుగోళ్లన్నింటిపైనా విచారణ జరుగుతుంది" అని సీఐడీ ఎస్పీ చెప్పినట్లు కథనంలో వివరించించారు.

అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారంలో సూత్రధారులెవరన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నామని సీఐడీ అదనపు డీజీ పి.వి.సునీల్ కుమార్ వెల్లడించారు.

"అమరావతి ఐదు మండలాల పరిధిలో రూ.5 వేల ఆదాయ కూడా లేని 797 మంది తెల్లకార్డుదారులు రూ.200 కోట్ల విలువైన భూమిని కొన్నారు. వారిపై ఆదాయపన్ను అధికారులకు, మనీ లాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈడీకి సమాచారమిచ్చాం.వివిధ మండలాల తహసీల్దార్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నాం" అని చెప్పారని తెలిపారు.

దీనిపై మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు "టీడీపీ నేతలపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను నిరూపించలేక దళితులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని" మండిపడ్డారని ఈనాడు చెప్పింది.

సీఐడీ ద్వారా కేసులు పెట్టి ప్రభుత్వం మాట నెగ్గించుకోవాలని చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం చెప్పినట్లు వ్యవహరిస్తున్న అధికారులపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారని కథనంలో రాశారు.

బాలికపై అత్యాచార యత్నం

ఫొటో సోర్స్, Getty Images

బాలికపై సామూహిక అత్యాచార యత్నం

తల్లిదండ్రులను చూసేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన ఆ 16ఏళ్ల బాలికపై అమీన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలో నలుగురు అత్యాచార యత్నం చేశారని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని వాణీనగర్‌ శివారులో గురువారం ఈ దారుణం జరిగింది. బాధితురాలి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు రెండేళ్ల క్రితం వాణీనగర్‌కు వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో పనికి కుదిరారు.

శ్రీకాకుళం జిల్లాలో అమ్మమ్మ వద్ద ఉంటున్న ఈ దంపతులు కుమార్తె పది రోజుల క్రితం తల్లిదండ్రులను చూసేందుకు వచ్చిందని కథనంలో చెప్పారు.

గురువారం ఉదయం 10గంటల సమయంలో బాలిక, ఇంటి సమీపంలోని ఓ కిరాణా దుకాణానికి వెళ్లింది. అక్కడి నుంచి ఆమెను ఓ యువకుడు బైక్‌ మీద ఎక్కించుకొని నిర్మానుష్యంగా ఉండే చక్రపురి అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు.

కొద్దిసేపటికి కారులో మరో ముగ్గురు యువకులు చేరుకున్నారు. ఆమె నుంచి సెల్‌ఫోన్‌ లాక్కొని దూరంగా విసిరేసి నిర్బంధించారు. నలుగురూ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారని పత్రికలో రాశారు.

అంతలో ఆ వైపు మరో కారు రావడాన్ని చూసి యువకులు పారిపోయారు. తన సెల్‌ఫోన్‌ను వెతుక్కొన్న బాలిక, తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి దారుణం గురించి చెప్పింది.

కాలనీకి చెందిన 20మంది యువకులు బాలికను గాలిస్తూ చక్రపురికి చేరుకున్నారు. పొదల మాటున బాలిక వివస్త్రగా ఉందని తెలుసుకొని బట్టలు తెప్పించి ఆమెకు ఇచ్చారు. తర్వాత అమీన్‌పూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని పత్రిక చెప్పింది.

మొదట తనపై నలుగురు యువకులు అత్యాచారం చేశారంటూ పోలీసులకు బాలిక చెప్పింది. అయితే ఆమెపై అత్యాచారం జరగలేదని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి వైద్యులు తేల్చినట్లు రాశారు.

అనంతరం మహిళా ఎస్సై మళ్లీ ప్రశ్నించగా మాటమార్చిన బాలిక తనపై గుర్తు తెలియని నలుగురు యువకులు అత్యాచారయత్నమే చేశారని.. ఆ వైపు కారు రావడంతో వదిలేసి పారిపోయారని చెప్పినట్లు కథనంలో వివరించారు.

ఇమేజ్ టవర్ హైదరాబాద్

ఫొటో సోర్స్, facebook/Super Hyderabad

అంతర్జాతీయ ప్రమాణాలతో ఇమేజ్ టవర్

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇమేజ్‌ టవర్‌ను నిర్మిస్తున్నామని తెలంగాణ పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

ఇన్నోవేషన్‌, యానిమేషన్‌, మల్టీమీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమింగ్‌ రంగాల కోసం రూ.1200 కోట్లతో 1.6 మిలియన్‌ చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న ఇమేజ్‌ టవర్‌ 2021 నాటికి పూర్తవుతుందని ఆయన అన్నారు.

కేటీఆర్ దీనిని 'ఆధునిక చార్మినార్‌'గా వర్ణించారు.

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు సందర్భంగా గురువారం దావోస్‌లో సీఎన్బీసీ టీవీ-18 చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారని పత్రిక రాసింది..

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన 'చోటా భీమ్‌' హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌గోల్డ్‌ సంస్థ అని, 'బాహుబలి' లాంటి పలు భారీ సినిమాలకు కూడా హైదరాబాద్‌లో విజువల్స్‌ ఎఫెక్ట్స్‌ చేశారని, ఇందుకు అవసరమైన పూర్తి సాంకేతిక నైపుణ్యం, ఉత్తమ మానవవనరులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

వీఎఫ్‌ఎక్స్‌, మల్టీమీడియాతోపాటు ప్రపంచ ప్రఖ్యాత గేమింగ్‌ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని పేర్కొంటూ.. ఈ విభాగాలను 'సన్‌రైజ్‌ సెక్టార్‌'గా అభివర్ణించారని కథనంలో చెప్పారు.

ఈ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇమేజ్‌ టవర్‌ను నిర్మిస్తున్నామని, కంపెనీలకు అవసరమైన అన్నిరకాల సౌకర్యాలు దీనిలో ఉంటాయని తెలిపారు.

త్వరలో హాలీవుడ్‌ స్టూడియోలతోపాటు ప్రపంచస్థాయి స్టూడియోలు, ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని, దీంతో వీఎఫ్‌ఎక్స్‌, మల్టీమీడియా, గేమింగ్‌ రంగాలకు తెలంగాణ హబ్‌గా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేసినట్లు నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)