త్వరలో రూ.130కే 200 ఉచిత చానెళ్లు.. కొత్త కేబుల్ టీవీ విధానాన్ని రూపొందించిన ట్రాయ్ - ప్రెస్‌ రివ్యూ

టీవీ

ఫొటో సోర్స్, Science Photo Library

ప్రచురణ

కేబుల్ టీవీ ధరలపై ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుందని, ఫలితంగా రూ.130కే 200 ఉచిత చానెళ్లు వినియోగదారులు పొందొచ్చని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

వినియోగదారులు తాము చూసిన చానెళ్లకు మాత్రమే డబ్బు చెల్లించే ఉద్దేశంతో గతంలో ట్రాయ్ రూపొందించిన విధానం, అమలు చేసిన నిబంధనలు అంతిమంగా ప్రజలపై భారం పడేలా చేశాయి.

దానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. 'టారిఫ్‌ ఆర్డర్‌, ఇంటర్‌ కనెక్షన్‌ రెగ్యులేషన్స్‌, క్వాలిటీ ఆఫ్‌ సర్వీసెస్‌ రెగ్యులేషన్స్‌, 2017’కు సవరణలు చేపట్టి ట్రాయ్‌ కొత్త విధానాన్ని ప్రకటించింది. దానిప్రకారం..

వినియోగదారుడు నెలకు రూ. 130 (పన్నులు అదనం) చెల్లిస్తే 200 ఉచిత చానెళ్లను.. అది కూడా వారు ఎంచుకున్న చానెళ్లను తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. వాటితోపాటు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తప్పనిసరిగా పేర్కొన్న దూరదర్శన్‌ వంటి 26 చానెళ్లను కూడా ఇవ్వాలి.

ప్రస్తుతం ఈ మొత్తానికి దూరదర్శన్‌ చానెళ్లు కాకుండా కేవలం 100 ఉచిత చానెళ్లను మాత్రమే ప్రసారం చేస్తున్నారు. ఆ తర్వాత ఇచ్చే ప్రతి 25 ఉచిత చానెళ్లకూ రూ.20 (పన్నులు అదనం) వసూలు చేస్తున్నారు.

వినియోగదారుడు నెలకు రూ.160 చెల్లిస్తే సర్వీస్‌ ప్రొవైడర్లు తమవద్ద ఉన్న ఉచిత చానెళ్లన్నీ ఇవ్వాల్సిందే.

ఒక ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే... రెండో కనెక్షన్‌కు నెట్‌వర్క్‌ క్యారేజ్‌ ఫీజులో (కేబుల్‌/డీటీహెచ్‌ కనెక్షన్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ప్రతి నెలా కట్టే మొత్తం. అంటే రూ.130+పన్నులు) 40 శాతం చార్జీనే వసూలు చేయాలని పేర్కొంది.

ఈ నిర్ణయాలన్నీ మార్చి 1న అమల్లోకి వస్తాయి.

మద్యం

ఫొటో సోర్స్, Getty Images

తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్ మద్యం అమ్మకాలు ఇలా..

తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ డిసెంబర్‌ 30, 31 తేదీల్లో రూ.400 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్ముడైందని, క్రితం సారితో పోలిస్తే విక్రయాలు మరింతగా పెరిగాయని సాక్షి దినపత్రిక ఓ కథనం రాసింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మద్యం అమ్మకాలు తగ్గినట్లు పేర్కొంది.

తెలంగాణలో డిసెంబర్ 30, 31 తేదీల్లో దాదాపు 10 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్‌ చివరి వారమంతా కలిసి రూ.600 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరగ్గా, చివరి రెండు రోజుల్లోనే రూ.400 కోట్ల విలువైన లిక్కర్‌ అమ్ముడుపోయిందని అంచనా.

రాష్ట్రంలో రోజుకు సగటున రూ.62 కోట్ల వరకు మద్యం వ్యాపారం జరుగుతుండగా, న్యూ ఇయర్‌ సందర్భంగా చివరి రెండు రోజులు కలిపి అందుకు ఆరున్నర రెట్లు విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే రూ.100 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ వర్గాలంటున్నాయి. ఇక బీర్లు, లిక్కర్‌ వారీగా చూస్తే ఈ 2 రోజుల్లో దాదాపు 4.5 లక్షల కేసుల బీర్లు, 5.10 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో క్రితం సారి నూతన సంవత్సర వేడుకల్లో రూ.120 కోట్ల మేర మద్యం విక్రయాలు జరగ్గా ఈసారి రూ.105 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.

పైగా క్రితం ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఇప్పుడు మద్యం ధరలు కూడా ఎక్కువ. అమ్మకాలు రూ.15 కోట్ల మేర మాత్రమే తగ్గినా, మద్యం వినియోగం భారీగా తగ్గింది.

క్రితం సారి డిసెంబరు 31, జనవరి 1న రెండు రోజుల్లో కలిపి రూ.200 కోట్ల మద్యం ఆదాయం రాగా, ఈసారి ఆ రెండు రోజుల్లోనూ అది రూ.125 కోట్లు దాటలేదు.

కృష్ణా జిల్లాలో అత్యధికంగా, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా మద్యం విక్రయాలు నమోదయ్యాయి.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, CHANDRABABU/FB

‘రాజధాని కోసం జైలుకైనా వెళ్తా’

రాజధాని కోసం తాను జైలుకైనా వెళ్తానని, పాలన చేతగాకే అమరావతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంపేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్లు ఈనాడు దినపత్రిక ఓ వార్త రాసింది.

ఏపీ రాజధానిని తరలించే శక్తి ఈ భూమిపై ఎవ్వరికీ లేదని చంద్రబాబు అన్నారు.

''రాజధానికి రైతులిచ్చిన భూముల్ని తిరిగి ఇచ్చేస్తామని కొందరు మంత్రులంటున్నారు. ఎలా ఇస్తారు? వాటిలో నిర్మించిన సచివాలయం, హైకోర్టు, రోడ్లు, భవనాల్ని ఏం చేస్తారు? వాటిని పడగొట్టి, భూముల్ని తిరిగిస్తారా? గన్నవరం విమానాశ్రయానికి 650 ఎకరాలు సమీకరించాం. వాటిలో నిర్మించిన రన్‌వేని తొలగించి భూములు వెనక్కిస్తారా? కొంచెమైనా బుద్ధుండే మాట్లాడుతున్నారా?'' అని ప్రశ్నించారు.

మూడు రాజధానులు వద్దనుకుంటున్న దక్షిణాఫ్రికా దేశాన్ని జగన్‌ ఆదర్శంగా తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

''రాజధానిలో భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు పెడితే విలువ పెరగదని, తమ బిడ్డల చదువులు, పెళ్లిళ్లు వంటి అవసరాలకు భూములు అమ్ముకునేందుకు అనుమతివ్వాలని రైతులు కోరితే అంగీకరించాం. దాన్ని వైకాపా నాయకులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటున్నారు'' అని చంద్రబాబు చెప్పారు.

''రాజధానిని ప్రకటించాక భూములు కొంటే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎలా అవుతుంది? తెదేపా నేతలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనీ, వాటన్నిటినీ తవ్వాలని అధికారులపై ఈ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. కొండను తవ్వి... ఎలుకను కాదు కదా, దాని వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారు'' అని అన్నారు.

ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరిగితే జగన్‌కు ఎందుకంత కడుపుమంట? అని వ్యాఖ్యానించారు.

''రాజధాని రైతులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న పవన్‌కల్యాణ్‌ను ముళ్లకంచెలు పెట్టి అడ్డుకుంటారా? సీఎం కాన్వాయ్‌ వస్తోందని రోడ్డుపై నిలబెడతారా? సీఎం ఆకాశం నుంచి ఊడిపడ్డారా? జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు ముళ్లకంచెలు పెట్టి అడ్డుకున్నామా? అప్పుడు భద్రత కల్పించకపోతే రాష్ట్రమంతా తిరిగేవారేనా?'' అని చంద్రబాబు ప్రశ్నించారు.

కేటీఆర్

ఫొటో సోర్స్, MinisterKTR/twitter

'మరో పదేళ్లు సీఎం కేసీఆరే.. ఊహాగానాలు అనవసరం'

తెలంగాణ ముఖ్యమంత్రిగా మరో పదేళ్లు కేసీఆరే ఉంటారని, ఈ విషయంలో ఊహాగానాలు అనవసరమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ వార్త రాసింది.

ఈ దశాబ్దం తెలంగాణదేనని, టీఆర్‌ఎస్‌ నాయకత్వంలో దేశానికి మార్గదర్శకంగా రాష్ట్రం నిలువబోతుందని కేటీఆర్ అన్నారు.

మరో పదేళ్లు సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించారని గుర్తుచేస్తూ.. ఇంకా సీఎం మార్పుపై ఊహాగానాలు ఎందుకని అన్నారు.

మున్సిపల్‌ చట్టాన్ని సమర్థంగా అమలుచేయడమే ఈ సంవత్సరం తమ లక్ష్యమని తెలిపారు.

''ఎన్నికల్లో పోటీచేసేవారు ఈ చట్టం గురించి తెలుసుకోవాలి. వారి విధులు, నిధులు రెండూ చట్టంలో నిర్వచించాం. ఒకవేళ విధుల్లో అలసత్వం వహిస్తే మొదట చర్యలు తీసుకునేది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లమీదనే. చైర్మన్‌ను తొలిగించే అధికారం కూడా చట్టంలో ఉంది'' అని అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో తమ విధానాన్ని పార్లమెంటులోనే స్పష్టం చేశామని కేటీఆర్ అన్నారు.

''సీఏఏను మతం అద్దంలో చూడొద్దు. భారతదేశం సిద్ధాంతమే భిన్నత్వంలో ఏకత్వం. కేసీఆర్‌ను మించిన హిందువు ఉన్నారా? ఆయన కట్టిన దేవాలయం కంటే గొప్పది ఎవరైనా కట్టారా? ఆయన చేసినన్ని యాగాలు ఎవరైనా చేస్తారా? ఆయన సీఏఏను వ్యతిరేకించారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

తమకు రాజకీయంగా శత్రువులెవరూ లేరని.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌.. ఇందిరాగాంధీని, రాజశేఖర్‌రెడ్డిని పొగిడిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాలతో తెలంగాణకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, చిన్నచిన్న సమస్యలు వచ్చినా, పరిణతితో పరిష్కరించుకుంటామని అన్నారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)