You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి తరువాత మరో కండక్టర్ ఆత్మహత్య -ప్రెస్‌రివ్యూ
శనివారం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కార్మికులు ఈ ఆవేదనలో ఉన్న సమయంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కండక్టర్ సురేందర్‌గౌడ్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో ఆవేదనా భరిత ఘట్టాలివి. వాతావరణం గంభీరంగా మారిన పరిస్థితుల్లోనూ పట్టుదలలు కొనసాగుతున్నాయని ఈనాడు తెలిపింది.
నర్సంపేటలో ఒక డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. తోటి కార్మికులు, పోలీసులు ఆయనను నిలువరించారు. మరోవైపు తాత్కాలిక నియామకాల కోసం ఆర్టీసీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆదివారం ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ఉద్ధృతం చేశారు. వంటావార్పు కార్యక్రమాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి మరణంతో ఖమ్మం రీజియన్‌లో ఒక్క బస్సూ తిరగలేదు.
సమ్మె చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇచ్చే వరకు తాము కూడా జీతాలు తీసుకోవద్దని నల్గొండ, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్లలోని ఆర్టీసీ అధికారులు, భద్రత సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయంపై ఆర్టీసీ ఐకాస హర్షం వ్యక్తం చేసింది. తమకు గొప్ప మద్దతు ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపింది.
సమ్మెకు పలు రెవెన్యూ సంఘాలూ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆదివారం ఏపీఎస్ ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని డిపోల వద్ద ధర్నా నిర్వహించారు. సమ్మె రాజకీయ శక్తుల చేతుల్లోకి వెళ్లిందని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ అధికారుల ఐకాస ఆరోపించింది.కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలేనని విపక్ష నేతలు, ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి మృతికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లు సంతాపం తెలిపారు. అయితే కార్మిక సంఘాల నేతలే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు.
రెచ్చగొట్టిన వారే బాధ్యత వహించాలని మంత్రి దయాకర్‌రావు అనగా, కార్మికుల జీవితాలతో విపక్షాలు చెలగాటమాడుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారని ఈనాడు పేర్కొంది.
పోలవరంపై నిర్లక్ష్యం సహించం
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరలో పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించబోమన్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ విధానంతో సహా ఇతర అంశాలకు సంబంధించిన వివరాలేమీ కేంద్రం వద్ద లేవన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదన్నారు. ఏపీ ప్రభుత్వ స్పందనను బట్టి కేంద్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో బీజేపీ నేతలు రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయం తెలిసిందే.
ఆదివారం రాత్రి 9 గంటలకు ఢిల్లీలోని మంత్రి షెకావత్ నివాసంలో కన్నాతోపాటు బీజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో తాము గమనించిన అంశాలతో కూడిన నివేదికను కేంద్ర మంత్రికి సమర్పించారు.
పోలవరంపై గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం చూపిన అలసత్వంపై ఫిర్యాదు చేశారు. దాదాపు గంటసేపు ఈ భేటీ కొనసాగింది. అనంతరం మంత్రి షెకావత్ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లు చెప్పారు. రివర్స్ టెండర్ల పేరుతో పనులు నిలిపివేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?
అదేంటి మహాత్మా గాంధీ ఆత్మహత్య చేసుకోవడమేంటి అనుకుంటున్నారా? గాంధీని గాడ్సే చంపారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, గుజరాత్‌లోని ఓ పాఠశాల ప్రశ్నపత్రంలో మాత్రం గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? అనే ప్రశ్నను అడిగారని సాక్షి వెల్లడించింది..
గాంధీ ఆత్మహత్య ప్రశ్నను చూసి ఆశ్చర్యపోయిన విద్యాశాఖాధికారులు దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. 'సుఫలాం శాల వికాస్ సంకుల్ పేరిట గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న పాఠశాలలో 9వ తరగతి ఇంటర్నల్ పరీక్షలో ఈ ప్రశ్న అడిగారు'అని ఓ అధికారి తెలిపారు.
12వ తరగతి విద్యార్థులకు 'మీ ప్రాంతంలో మద్యం అమ్మకాలు పెంచడానికి ఏం చేయాలో తెలుపుతూ పోలీస్ ఉన్నతాధికారికి లేఖ రాయండి'అనే మరో విచిత్రమైన ప్రశ్న ఎదురైంది.
దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని గాంధీనగర్ జిల్లా విద్యాధికారి భరత్ వధేర్ వెల్లడించారని సాక్షి తెలిపింది.
చెల్లింపులపై తెలంగాణ సర్కారు ఆంక్షలు
దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఏర్పడిన నిధుల కటకటను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పొదుపు చర్యలు ప్రారంభించిందని సాక్షి తెలిపింది.
ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలంటూ అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థికశాఖ ఆంక్షలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతి శాఖకు ప్రతిపాదించిన బడ్జెట్ అంచనాల్లో 75 శాతంతోనే సరిపెట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలంటూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు పేరిట అన్ని ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు అందాయి.
నెలవారీ చెల్లింపుల విషయంలోనూ కొన్ని పరిమితులు తప్పవని, నాలుగు అంశాలకు మాత్రమే నెలవారీ చెల్లింపులు చేస్తామని, మిగిలిన విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుందనే సంకేతాలను ఉత్తర్వుల్లో ఇచ్చారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేవలం నాలుగు పథకాలకే నెలనెలా చెల్లింపులు చేస్తామని ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆసరా పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు, బియ్యం, విద్యుత్ సబ్సిడీలకు మాత్రమే బడ్జెట్ విడుదల ఉత్తర్వులు (బీఆర్‌వోలు) విడుదలవుతాయని, మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఖర్చులను త్రైమాసికానికి ఓసారి మాత్రమే విడుదల చేస్తామని తెలిపింది.
కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి ఇప్పటివరకు విడుదలచేసిన మొత్తాన్ని కలుపుకొని బడ్జెట్ అంచనాల ప్రతిపాదనల్లో 75% మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తామని స్పష్టం చేసింది.
కొన్ని విభాగాల ఖర్చు కూడా త్రైమాసిక పద్ధతిలోనే ఇస్తామని తెలిపింది. దీంతో ఆయా ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరంలో వేతనాలు మూడు నెలలకోసారి మాత్రమే వస్తాయని తెలుస్తోంది. వీఆర్‌ఏలకు ఇచ్చే గౌరవ వేతనాలను మాత్రం ట్రెజరీ ఆంక్షలకు సంబంధం లేకుండా నెలనెలా ఇవ్వాలని ఆర్థికశాఖ తాజా ఉత్తర్వుల్లో వెల్లడించిందని సాక్షి వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్ ఏమయ్యారు?
- 'మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి' అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు
- 'ఏడేళ్ల వయసులో జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్లకు ఎందుకు చెప్పానంటే...'
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- గాడిద పాలతో చేస్తారు.. కేజీ రూ.78 వేలు.. తినడానికి విదేశాల నుంచి వస్తారు
- నకాషీ: 500 ఏళ్ల నుంచి ప్రత్యేకత నిలుపుకుంటున్న తెలంగాణ చిత్రకళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)