You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లలితా జ్యువెలరీ ‘దొంగ‘.. ఓ సినీ నిర్మాత - ప్రెస్ రివ్యూ
తమిళనాడులోని తిరుచ్చిలో లలిత జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన రూ.13 కోట్ల దోపిడీ వ్యవహారానికి నాయకత్వం వహించిన తిరువారూరు మురుగన్ గురించి పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయని ఆంధ్రజ్యోతి తెలిపింది.
మురుగన్‌కి మొదటి నుండి సినిమాలు నిర్మించాలనే బలమైన కోరిక ఉండేది. ఈ క్రమంలో 'బాలమురుగన్' పేరుతో సినిమా కంపెనీ ప్రారంభించి, రూ.50 లక్షల వ్యయంతో ఒక సినిమా తీశాడు.
దానిలో లలిత జువెలరీ దుకాణంలో దోపిడీకి పాల్పడిన వారిలో ఒకడైన సురేశ్ కూడా నటించాడు. అయితే, ఆ సినిమా కొన్ని కారణాలతో విడుదల కాలేదు. దీంతో నష్టపోయిన మురుగన్.. ఆ డబ్బుని తిరిగి సంపాదించేందుకు దోపిడీలకు పాల్పడడం మొదలుపెట్టాడు.
ఆరంభంలో చిన్న చిన్న దొంగతనాలతో మొదలుపెట్టి, తరువాత పెద్ద దోపిడీదారుగా మారాడు. దీనికోసం ఒక ముఠాని కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆ క్రమంలో బెంగళూరు పోలీసులకు వాంటెడ్‌గా మారాడు. దాంతో హైదరాబాద్‌కి మకాం మార్చాడు.
దోచుకున్న సొమ్ముతో 'ఆత్మ' పేరుతో మరో సినిమా తీసేందుకు సిద్ధపడ్డాడు. కానీ, అదీ నెరవేరలేదు. ఈ నేపథ్యంలో మురుగన్‌కు సినీ సహాయ నటీమణులతో ఉన్న సంబంధాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మురుగన్ కొన్నేళ్లుగా సెల్‌ఫోన్‌లు ఉపయోగించడం లేదని, తన అనుచరులతో వాకీటాకీలతోనే మాట్లాడుతున్నాడని పోలీసులు గుర్తించారు. లలిత జ్యువెలరీలో దోపిడీకి పాల్పడిన తర్వాత మురుగన్ తన స్వస్థలమైన తిరువారూరుకు వెళ్లాలని అనుకున్నాడని, అప్పటికే దోపిడీ సొమ్మును పంచుకుని ఇద్దరు అనుచరులు అక్కడికి వెళ్లటంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడని తెలిసింది.
లలిత జ్యువెలరీ దోపిడీ కేసుతో సంబంధమున్న మురుగన్ సోదరుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తిరువారూరులో మురుగన్ ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు సీరాతోప్పులో నివసిస్తున్న మురుగన్ పెదనాన్న కుమారుడు మురళి(26)ని అరెస్టు చేశారు. ప్రస్తుతం మురళిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారిస్తున్నారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ఇకపై మీ దస్తావేజుకు.. మీరే లేఖరి
ఆంధ్రప్రదేశ్‌లో స్థిరాస్తి కొనుగోలు చేశాక ఇకపై దస్తావేజు లేఖరిని సంప్రదించక్కర్లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లక్కర్లేదు. ఇక నుంచిఆస్తి కొనుగోలు దస్తావేజులను మీరే తయారు చేసుకోవచ్చని సాక్షి తెలిపింది.
భూములు, స్థలాలు, భవనాల వంటి స్థిరాస్తుల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ల కోసం, డాక్యుమెంట్ల తయారీ నిమిత్తం ఇక దస్తావేజు లేఖరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. తెలుగులో అత్యంత సులభంగా మీ దస్తావేజులను మీరే తయారు చేసుకోవడానికి వీలుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో నమూనా దస్తావేజులను అప్‌లోడ్ చేసింది.
న్యాయ, రెవెన్యూ రంగాల నిపుణులతో చర్చించి సులభ శైలిలో ప్రజాప్రయోజనాల కోసం వీటిని రూపొందించింది. ఈ నమూనా దస్తావేజుల్లో ఖాళీలు నింపుకుంటే న్యాయబద్ధంగా చెల్లుబాటయ్యేలా స్థిరాస్తి విక్రయ రిజిస్ట్రేషన్ దస్తావేజు తయారవుతుంది.
అన్ని వివరాలు నింపిన తర్వాత తప్పులేమైనా ఉన్నాయేమో సరిచూసుకుని సరిదిద్దుకునే వెసులుబాటు కూడా ఉంది.
అన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత సబ్‌మిట్ క్లిక్ చేస్తే సదరు దస్తావేజు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు చేరుతుంది. ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ రోజుకు ముందుగానే స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు.
స్లాట్ బుక్ చేసుకున్న రోజు అదే సమయానికి సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అమ్మకందారులు, సాక్షులతో వెళ్లి అర గంటలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ సులభతర విధానం కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి రానుంది.
నెలాఖరు వరకు ఇక్కడ ఎదురయ్యే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చేర్పులతో ఈ విధానాన్ని నవంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. చదువుకున్న వారెవరైనా దస్తావేజులనుసొంతంగా తయారు చేసుకునే వెసులుబాటు కొత్త విధానం ద్వారా లభిస్తోంది.
రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళితే ఎడమ వైపు కింది భాగంలో న్యూ ఇనిషియేటివ్స్ అనే బాక్సులో డాక్యుమెంట్ ప్రిపరేషన్ అని ఉంటుంది. దీనిని క్లిక్ చేసి పాస్‌వర్డ్, ఐడీ రిజిస్టర్ చేసుకుని డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అందులో కొనుగోలుదారు పేరు, నివాస ప్రాంతం, ఆధార్ నంబరు, అమ్మకందారు పేరు, నివాస ప్రాంతం, అమ్మకందారు ఆధార్ నంబరు లాంటి వివరాలు నింపేందుకు ఖాళీలు వదిలి డాక్యుమెంటు ఉంటుంది. స్థిరాస్తి వివరాలు (సర్వే నంబరు/ఫ్లాట్ నంబరు/ప్లాట్ నంబరు, గ్రామం/ పట్టణం) లాంటి వివరాలను కూడా ఖాళీల్లో నింపితే డాక్యుమెంటు తయారవుతుంది.
ఆస్తి వివరాలు నమోదు చేసిన తర్వాత దాని రిజిస్ట్రేషన్‌కు ఎంత మొత్తం చెల్లించాలో కూడా ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్రకారం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ రుసుం చెల్లించాలని సాక్షి వెల్లడించింది.
ఇక్కడే ఉంటూ విదేశీ వర్సిటీల్లో చదువొచ్చు
విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు అక్కడికు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే ఆ వర్సిటీల ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోందని ఈనాడు తెలిపింది.
విపక్షంగా ఉన్నప్పుడు బీజేపీ ఈ విధానాన్ని వ్యతిరేకించింది. దీనిని పక్కనపెట్టి... విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాలను మన వద్ద తెరవడానికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది.
భారత ఉన్నత విద్య కమిషన్ బిల్లు 2019లో చేర్చిన ప్రతిపాదనల్లో ఇదొక కీలకాంశం. ప్రతిష్టాత్మక వర్సిటీలనే దేశంలోకి అనుమతిస్తారు. నియంత్రణ వ్యవస్థకు లోబడి అవి పనిచేయాల్సి ఉంటుంది.
విదేశీ వర్సిటీలను రప్పించడానికి 2014లో నరేంద్ర మోదీ సర్కారు కేంద్రంలో తొలిసారి అధకారంలోకి వచ్చినప్పుడే వాణిజ్య మంత్రిత్వ శాఖ మొగ్గు చూపింది.
విద్యారంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అస్కారం ఉండటంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించింది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ముప్పు రావచ్చనే ఉద్దేశంతో హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ ఇంతరవరకు దీనికి సానుకూలత వ్యక్తపరచలేదు.
మన దేశంలో అమల్లో ఉన్న నిబంధనలను అనుసరించకుండా విదేశీ సంస్థలు ఇక్కడెలా పనిచేస్తాయనే అభ్యంతరాలు తలెత్తడమూ మరో కారణమని ఈనాడు పేర్కొంది.
పండగ వేళ 'ప్రైవేట్' బాదుడు
దసరాకు పల్లెబాట పట్టిన ప్రయాణికులకు తెలంగాణలోని ప్రైవేట్ బస్సుల దోపిడీ పట్టపగలే చుక్కలు చూపిందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు, ఆర్టీసీ అద్దె బస్సుల్లో టికెట్ ధరపై రెట్టింపు చార్జీలు వసూలు చేసి ప్రయాణికులపై గుదిబండ మోపారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్‌స్టేషన్ల నుంచి పొరుగు రాష్ట్రాలు, తెలంగాణలోని పలు ప్రాంతాలకు 2000 బస్సులు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు.
వీటిల్లోనూ టికెట్ ధరపై 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 ఆర్టీసీ డిపోల్లో 3,800 బస్సులకుగాను ఆదివారం 1,200 బస్సులే రోడ్డెక్కాయి.ఈ బస్సుల్లోనూ తాత్కాలిక కండక్టర్లు చేతివాటం ప్రదర్శించారు.
శని, ఆదివారాలు కలిపి గ్రేటర్ ఆర్టీసీకి రూ.6 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. పలు ఆర్టీసీ డిపోల వద్ద రెగ్యులర్ కార్మికులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని అతికష్టం మీద కొన్ని బస్సుల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆటోలు, క్యాబ్‌లు అందినకాడికి దండుకున్నారు.
సుమారు 127 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో 1.75 లక్షల మంది వరకు రాకపోకలు సాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-హైటెక్ సిటీ రూట్లలో రద్దీని బట్టి ప్రతి మూడు, ఐదు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. ఆదివారం సుమారు 4 లక్షల మంది మెట్రో జర్నీ చేశారని అధికారులు అన్నారు.
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడా రైల్వే స్టేషన్ల నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు సైతం ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయని సాక్షి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- పునరావాస శిబిరాల్లో అత్యంత దారుణ పరిస్థితుల్లో బతుకెళ్లదీస్తున్న కశ్మీరీ పండిట్లు
- హైదరాబాద్: నర్సరీ విద్యార్థులకు కూడా ర్యాంకులా?
- బీబీసీ రహస్య పరిశోధన: మతం పేరుతో బాలికల లైంగిక దోపిడీ...మత గురువులే మధ్యవర్తులుగా ‘సుఖ వివాహాలు’
- ‘80 రూపాయలకే ఇల్లు పథకం’
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- హైదరాబాద్: నర్సరీ విద్యార్థులకు కూడా ర్యాంకులా?
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
- మాంసం తింటే క్యాన్సర్ వస్తుందనే ప్రచారంలో నిజమెంత?
- విశాఖ టెస్ట్: దక్షిణాఫ్రికాపై 203 పరుగులతో భారత్ విజయం
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)