వైఎస్ జగన్.. కోర్టు ముందు హాజరుకావలసిందే... జైల్లో ఉన్నప్పుడే చాలా చేశారు.. ఇప్పుడు సీఎంగా ఉన్నారు: సీబీఐ కౌంటర్ దాఖలు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, @AndhraPradeshCM
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావలసిందేనని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పష్టం చేసినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. చట్టం ముందు అందరూ సమానమేనని, పదవిలో ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరడం రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని సీబీఐ పేర్కొంది.
ఆయన జ్యుడీషియల్ కస్టడీలో జైల్లో ఉండగానే.. తన పలుకుబడిని, కండబలాన్ని ఉపయోగించారని.. ఇప్పుడు సీఎంగా ఉన్నారని.. అన్ని అధికారాలూ ఆయనకు ఉన్నాయని గుర్తుచేసింది.
నిందితుల హోదా, ఆర్థిక నేపథ్యం ఆధారంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వకూడదని.. అలా ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని తేల్చిచెప్పింది. సాక్షులు భయాందోళనకు గురయ్యే అవకాశముందని తెలిపింది.
ఆయన ఎంపీగా ఉన్న సమయంలోనే సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. మినహాయింపు ఇస్తే అర్థ, అంగ బలాలను వాడుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చినట్లేనని స్పష్టం చేసింది.
ఈ మేరకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ డీఐజీ వి.చంద్రశేఖర్ తాజాగా 14 పేజీల కౌంటర్ అఫివిడవిట్ దాఖలు చేశారు.
వాస్తవాలను దాచిపెట్టి.. దురుద్దేశంతో జగన్ పిటిషన్ వేశారని.. దానిని కొట్టివేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 18కి వాయిదా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటి భోజనం కావాలి: చిదంబరం పిటిషన్
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం తనకు ఇంటి భోజనం కావాలని కోరుతూ మంగళవారం కోర్టులో పిటిషన్ వేసినట్లు ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నంత కాలం తన అనారోగ్య రీత్యా ఇంట్లో వండిన ఆహారాన్ని తెప్పించుకునేందుకు వీలు కల్పించాలని కోర్టును చిదంబరం విజ్ఞప్తి చేశారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు.. ఈ నెల 3న వాదనలు వింటామని వెల్లడించింది.
చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా ప్రభుత్వ పెట్టుబడులను ఐఎన్‌ఎక్స్ మీడియాలో పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనను ఆగస్టు21న అరెస్టు చేసి, తీహార్ జైల్లో ఉంచారు. ఇప్పటికే ఆయన బెయిల్ కోసం పలుమార్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ ఫలితం లేదు.
కేసులో సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని చిదంబరం పిటిషన్‌ను కొట్టేసింది. గత నెలలో అనారోగ్యరీత్యా తనకు సెల్‌లో దిండు, కుర్చీ కావాలని కోరారు. కానీ ఆ పిటిషన్ కూడా కోర్టు తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, @cmohry
హరియాణా సీఎంకు సొంత కారూ లేదు!
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సొంత కారు కూడా లేదని.. ఆయన చేతిలో ఉన్న నగదు కేవలం రూ. 15,000 మాత్రమేనని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. హరియాణాలో ఈ నెల 21న ఎన్నికలు జరగనుండటంతో.. ముఖ్యమంత్రి ఖట్టర్ అధికార బీజేపీ తరఫున కర్నాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం 65 ఏళ్ల వయసున్న ఖట్టర్ అవివాహితుడని, ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 1.27 కోట్లని ఆ నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. అందులో రూ. 94 లక్షలు చరాస్తులు కాగా.. రూ. 33 లక్షలు స్థిరాస్తులని వెల్లడించారు.
2014 ఎన్నికల్లో సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తన చరాస్తుల విలువ రూ. 8,29,952 అని చెప్పిన ఖట్టర్.. ఈ ఏడాది ఆ ఆస్తులు రూ. 94,00,985 కు పెరిగినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సొంత కారు లేదని, చేతిలో రూ. 15,000 నగదు మాత్రమే ఉందన్నారు. తనపై ఎలాంటి కేసులూ లేవని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దసరాకు రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ రూ. 20
దసరా పండుగ నేపథ్యంలో రద్దీని నివారించేందుకు రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరను తాత్కాలికంగా పెంచుతూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ప్రస్తుతం రూ.10గా ఉన్న ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ. 20కి పెంచారు. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చి 11వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రయాణికులతో పాటు ఇతరులు సెండాఫ్ ఇచ్చేందుకు స్టేషన్లకు వచ్చే అవకాశం ఉన్నందున రద్దీని నివారించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే.. ఈ నిర్ణయం హైదరాబాద్ నగరంలోని కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్లలో మాత్రమే అమలవుతుందని మిగతా స్టేషన్లలో యథావిధిగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- చైనా అభివృద్ధిలో విజేతలెవరు... అక్కడి పాఠ్య పుస్తకాల్లో కనిపించని చరిత్ర ఏంటి?
- మోదీ Vs. ఇమ్రాన్ ఖాన్: ఐరాస వేదికపై ఎవరిది విజయం
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























