You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమరావతి భూముల చిట్టా బయటపెడతామన్న బొత్స... సెంటు భూమి కూడా కొనలేదన్న సుజన :ప్రెస్ రివ్యూ
'ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఒక ప్రాంతానిదో.. ఒక సామాజికవర్గానిదో.. నాయకుల సొంతానిదో కాదు.. 5 కోట్ల మంది ప్రజానీకానిది. 13 జిల్లాలకు సంబంధించినది' అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారని ఈనాడు తెలిపింది.
'రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతూ తలసరి ఆదాయం పెరగాలనేదే సీఎం జగన్ ఆలోచన. అంతేగానీ ఒకరికి మేలు చేసేలా మా ప్రభుత్వం వ్యవహరించదు' అని వివరించారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
'రాజధానిలో కొందరు వ్యక్తుల పేర్లతో 25వేల చదరపు గజాల స్థలాలున్నాయి. త్వరలో పేర్లతో సహా వెల్లడిస్తాం. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి, చంద్రబాబు బంధువులకు భూములున్నాయి. అక్రమాలను వరుసగా వెల్లడిస్తాం' అని చెప్పారు.
‘సుజనా చౌదరి బంధువు, గ్రీన్‌టెక్ కంపెనీలో డైరెక్టరు అయిన జితిన్ కుమార్ పేరుతో చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాల భూములున్నాయి. ఈడీ ఇచ్చిన జాబితా ప్రకారం ఆయనకు ఉన్న 120 సంస్థల్లో ఇదీ ఒకటి. ఆయన సోదరుడి కుమార్తె అయిన యలమంచిలి రుషికన్య పేరుతో వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలున్నాయి. ఆయన రాజధాని ప్రాంతంలో ఎకరా ఉంటే చూపించమన్నారు. 124 ఎకరాలు చెప్పా’ అని ఆయన పేర్కొన్నారు.
బొత్స వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరీ స్పందించారు. రాజధాని అమరావతి పరిధిలో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ ఒక్క సెంటు భూమీ కొనలేదని రాజ్యసభలో భాజపా సభ్యుడు సుజనా చౌదరి స్పష్టం చేశారు. 3 నెలల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మంత్రి బొత్స సత్యనారాయణ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే కొత్త పదాన్ని వారే కనిపెట్టారని, ఒకవేళ అదే జరిగి ఉంటే అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంది కాబట్టి విచారణ జరపొచ్చని సవాల్ చేశారని ఈనాడు తెలిపింది.
మాంద్యం ముంచుకొస్తుంది.. పొదుపు తప్పదు: సీఎం కేసీఆర్
దేశవ్యాప్తంగా తీవ్ర ఆర్థికమాంద్యం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణలో కూడా అన్ని ప్రభుత్వశాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.
రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన మొదలుకొని నిధుల సద్వినియోగం వరకు ప్రతిదశలోనూ పూర్తిస్థాయి క్రమశిక్షణ, ప్రణాళిక అవసరమని చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులను సమావేశపరిచి ఆర్థిక పరిస్థితిని వివరించాలని, ఆర్థిక క్రమశిక్షణ పాటించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడమరిచి చెప్పాలని ఆయన నిర్ణయించారు. వచ్చే నెలలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
అసెంబ్లీని సమావేశపర్చటానికి ముందే రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విస్తృతంగా చర్చించాలని, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించేలా ఆయా శాఖలకు సరైన మార్గదర్శకం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
‘సెప్టెంబర్ నుంచి నవరత్నాలు’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలకు తెరతీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసే నవరత్నాల కార్యక్రమాల శ్రీకారానికి సెప్టెంబరు మాసాన్ని మంచి ముహూర్తంగా నిర్ణయించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
సంక్షేమ పథకా ల కేలండర్‌ను మంగళవారం సచివాలయంలో కలెక్ట ర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కన్ఫరెన్సులో వై ఎస్ జగన్ ప్రకటించారు. వచ్చే నెల చివరకు సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్నవారికి రూ.10 వేలు ఇస్తామని సీఎం వెల్లడించారు.
దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలని సీఎం అదేశించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇ చ్చే డబ్బు పాత అప్పులకు జమ కాకుండా అన్ ఇన్‌కంబర్డ్ బ్యాంకు ఖాతాలు కొత్తగా తెరవాలని అధికారులను కోరారు.
దీనికి సంబంధించి బ్యాంకర్లతో ఉన్నతస్థాయిలో మాట్లాడుతున్నామని సీఎంకు అధికారు లు వివరించారు. లబ్ధిదారులను ఎంపిక చేయడం స హా కొత్తగా బ్యాంకు అకౌంట్‌లను ప్రారంభించడంపై వలంటీర్లు దృష్టి సారించాలని జగన్ తెలిపారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
తెలంగాణలో ఘాటెక్కిన ఉల్లి ధర
తెలంగాణలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గడంతో ధర కొండెక్కుతోందని సాక్షి వెల్లడించింది.
కేవలం పది రోజుల వ్యవధిలోనే కిలో ఉల్లి ధర రూ. 10 నుంచి రూ. 15 వరకు పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ. 42 నుంచి రూ. 45 పలుకుతుండగా ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా ఉల్లి సాగు గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, కొంతమేర కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగవుతుంది.
రాష్ట్రంలో సాధారణ ఉల్లి సాగు విస్తీర్ణం 13,247 హెక్టార్లు కాగా ఈ ఏడాది ఆలస్యంగా కురిసన వర్షాలు, భూగర్భ జలాల్లో భారీ తగ్గుదల కారణంగా 5,465 హెక్లార్లలోనే సాగైంది. దీంతో రాష్ట్రం నుంచి వస్తున్న ఉల్లితో పూర్తిస్థాయిలో అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.
సాధారణంగా రాష్ట్ర మార్కెట్‌లకు మహారాష్ట్రలోని షోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్, కర్ణాటకలోని శివమొగ్గ, రాయచూర్ ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి దిగుమతులు ఉంటాయి. అలాగే ఏపీలోని కర్నూలు నుంచి కూడా ఉల్లి సరఫరా అవుతుంది.
అయితే ఈ ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఉల్లి సాగుకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అక్కడ దిగుబడులు పూర్తిగా తగ్గాయి. మార్కెట్‌లోకి వస్తున్న కొద్దిపాటి ఉల్లి ఆయా రాష్ట్రాల అవసరాలకే సరిపోతుండగా మిగతా వాటి కోసం దక్షిణాది రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఫలితంగా డిమాండ్ పెరగడంతో ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయని సాక్షి పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- జియో గిగా ఫైబర్: సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. టీవీ, ఫోన్ ఫ్రీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో బ్లాక్ అండ్ వైటా.. కలరా?
- భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు: తెంచుకుంటే ఎవరికెంత నష్టం?
- డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై: పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా...
- కార్గిల్ చొరబాట్ల గురించి ఉప్పందించిన గొర్రెల కాపరి ఇప్పుడేం చేస్తున్నారు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)