చంద్రయాన్ 2 ప్రయోగం ఆగిపోయింది.. సాంకేతిక కారణాలతోనేనన్న ఇస్రో : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, iSro
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జాబిల్లి యాత్ర 'చంద్రయాన్-2' అనూహ్యంగా ఆగిపోయిందని ఈనాడు తెలిపింది.
వాహకనౌక అయిన 'జీఎస్‌ఎల్వీ మార్క్3'లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్ నిలిచిపోయింది.
ఆ తర్వాత 2-3 నిమిషాలకే చంద్రయాన్-2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఆపేశారు. మళ్లీ ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టేది తర్వాత ప్రకటిస్తామని ఇస్రో అధికారులు చెప్పారు.
అన్నీ అనుకున్నట్లు సాగి ఉంటే.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు షార్ నుంచి 'జీఎస్‌ఎల్వీ మార్క్3-ఎం1' వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లి ఉండేది. ఆపై కేవలం 16.13 నిమిషాల వ్యవధిలో చంద్రయాన్-2ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి ఉండేది.
తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా నిర్దిష్ట సమయం(లాంచ్ విండో)లోనే వ్యోమనౌకను ప్రయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ప్రయోగించలేకపోతే మళ్లీ అనువైన సమయం వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే. ప్రస్తుత లాంచ్ విండో(సోమవారం తెల్లవారుజాము)లో ప్రయోగాన్ని పూర్తిచేసేందుకు ఇస్రో తీవ్రంగా శ్రమించినప్పటికీ నిరాశే ఎదురైంది.
మళ్లీ ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు అనువుగా ఈ నెలలో కేవలం 1 నిమిషం నిడివి ఉన్న లాంచ్ విండోలే అందుబాటులో ఉన్నాయి. సోమవారం నాటి లాంచ్ విండో నిడివి 10 నిమిషాలు కావడం గమనార్హం. అంతకుముందు, తిరుమల వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో షార్‌కు వచ్చారు.
షార్‌లో రూ.629 కోట్లతో నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం రెండో ప్రయోగ వేదిక వద్దకెళ్లి చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని పంపనున్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్3-ఎం1 వాహక నౌకను వీక్షించారు. అక్కడే ఇస్రో అధిపతితో కలిసి ఫొటో దిగారు. అక్కడ నుంచి మళ్లీ నక్షత్ర అతిథి భవనానికి చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, Sujana/fb
‘ప్రధానిగా జగన్, బాబు ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేరు’
'బల్ల గుద్ది చెబుతున్నా..ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని మోదీ ప్రభు త్వం పూర్తిగా న్యాయం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు లేక జగన్‌లలో ఎవరు ప్రధానమంత్రి సీటులో కూర్చున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం అసాధ్యం' అని టీడీపీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
ఇప్పుడున్న నిబంధనల మేరకు రాష్ట్రానికి హోదా ఇవ్వలేమని, భవిష్యత్తులోనూ అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రం ఇస్తానన్న ప్యాకేజీ వదులుకుని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక పోయిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమైనా ప్యాకేజీ తీసుకుంటే రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుందని సూచించారు.
'2014లో బీజేపీ-టీడీపీ పొత్తు వల్ల రాష్ట్రం బాగుపడింది. స్వతంత్ర భారతావనిలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత సాయం మోదీ ప్రభుత్వం ఏపీకి మొదటి నాలుగేళ్లలో(2014-18) ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందాలంటే బీజేపీ మరింత బలపడాలి'అని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీని వీడి తాము బీజేపీలో చేరడం వెనుక చంద్రబాబు పాత్ర ఉందనడం కేవలం అపోహ మాత్రమేనన్నారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి విజయవాడకు వచ్చిన సుజనా విలేకరులతో మాట్లాడారు. నవ నిర్మాణ భారత్ కోసమే బీజేపీలో చేరామని చెప్పారు.
'రాజ్యాంగం ప్రకారమే టీడీపీని వీడి బీజేపీలో చేరాను. నేను రాజ్యసభకు రాజీనామా చేయడంవల్ల టీడీపీకి కూడా ఉపయోగం లేదు. టీడీపీ పాలిట్‌బ్యూరో నిర్ణయం మేరకే గతంలో మోదీపై చేసిన విమర్శలు, కేంద్రమంత్రిగా రాజీనామా చేసినప్పటి వ్యాఖ్యలు చేశాను. అవి నా వ్యక్తిగతం కాదు. ఏపీలో నాయకుల వలసలను ప్రోత్సహించడం మా ఉద్దేశ్యం కాదు. బీజేపీని సొంతంగా బలోపేతం చేసుకోవడమే లక్ష్యం' అని అన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నామమాత్రపు కేటాయింపులూ చేయని వైరంపై స్పందిస్తూ, 'రాష్ట్రానికి బడ్జెట్‌లో పెడితేనే న్యాయం చేసినట్లు కాదు. రైల్వేకు కూడా గతంలో ఇచ్చిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. మోదీ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు వివరిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తా' అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు ఎవరూ తనకు టచ్‌లో లేరని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తన ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫొటో పెట్టడంలో తప్పేం లేదని, తనకు అది ఆనందమేనని చెప్పారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Telaganacmo/fb
నిర్మించేది గ్రీన్ సెక్రటేరియట్
తెలంగాణలో కొత్త సచివాలయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పర్యావరణహితంగా నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు తెలిసిందని నమస్తే తెలంగాణ పేర్కొంది.
ప్రస్తుత సచివాలయ భవనాలు 25 ఎకరాల విస్తీర్ణంలో అస్తవ్యస్తంగా ఉన్నందున కొత్త సమీకృత సచివాలయ భవనాలను తక్కువ స్థలంలోనే క్రమపద్ధతిలో నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలన్నింటినీ కేవలం ఐదెకరాల్లోనే చేపట్టి మిగిలిన 20 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం వెల్లివిరిసేలా ఉద్యాన వనాలు, వాటర్ ఫౌంటేన్లు ఏర్పాటుచేయనున్నారు.
నగరంలోనే అతిపెద్ద అర్బన్ పార్కు ఇక్కడ ఆవిర్భవించనున్నది. ఈ మేరకు నూతన సచివాలయ నమూనాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
నూతన సచివాలయం నిర్మించాలన్న ప్రభు త్వ నిర్ణయంపై పలువురు ఆరోపణలు చేస్తు న్నారు. ఇప్పుడున్న భవనాలు బాగానే ఉన్నాయని, వాటిని కూల్చాల్సిన అవసరమేమున్నదని ప్రశ్నిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు.
అయితే వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు తెలంగాణ ప్రతిష్ఠను పెంపొందించేందుకు కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెపుతున్నది.
సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ.400 కోట్లు ఖర్చుపెట్టడాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదని తెలంగాణవాదులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత భవనాల్లోని లోటుపాట్లు, అసౌకర్యాలు ఏమిటి? నూతన సచివాలయాన్ని నిర్మించాల్సిన అవసరమెం త? కొత్త భవనాల నిర్మాణంలో ఎలాంటి ప్రమాణాలను పాటించాలి? అనే అంశాలపై టెక్నికల్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇవ్వనున్నదని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఫొటో సోర్స్, Andhrapradeshcm/fb
రూపాయికే పంటల బీమా!
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా ఏపీలో రైతులు నామమాత్రంగా రూపాయి చెల్లించి నమోదు చేయించుకుంటే.. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఉచితంగా చెల్లించబోతోంది. దీనికోసం సొంతంగా వ్యవసాయ పంటల బీమా సంస్థనే ప్రారంభించబోతోందని ఈనాడు తెలిపింది.
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ ఖరీఫ్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగయ్యే ప్రతి ఎకరానికి ప్రీమియం చెల్లించేందుకు నిధులు కూడా అందుబాటులో ఉంచబోతోంది.
బ్యాంకుల్లో పంటరుణాలున్న వారితో పాటు.. రుణాలు పొందని రైతులు కూడా నామమాత్ర రుసుము చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. బ్యాంకుల ద్వారా బీమా ప్రీమియం చెల్లించే వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. రబీ నాటికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా వ్యవసాయ బీమా సంస్థ ఏర్పాటు చేయబోతోంది.ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సర్కారు చర్యల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల బీమా పథకం రూపురేఖలే మారిపోనున్నాయి.
ఈ ఏడాది ఖరీఫ్‌లో 42.04 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. వాస్తవ పంటల సాగు ఎంత ఉంటే అంతకు బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెలిస్తుంది. పంటరుణాలు తీసుకోని రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా నామమాత్రంగా ఒక రూపాయి చెల్లించి నమోదు చేసుకుంటే సరిపోతుంది.
రైతు వాటాను వ్యవసాయశాఖ జమ చేస్తుంది. సాగుదారు రూపాయి చెల్లించి పేరు, సాగు చేసిన పంట, విస్తీర్ణం, భూమి వివరాలు నమోదు చేయించుకుంటే చాలు. రాష్ట్రమే సొంతంగా బీమా సంస్థను ఏర్పాటు చేస్తే ఇతర బీమా సంస్థల దయాదాక్షిణ్యంపై ఆధారపడాల్సిన అగత్యం ఉండదు. పరిహారం విడుదలపై నిర్ణయం సర్కారు చేతిలోనే ఉంటుంది.
రైతులు ఏప్రిల్, మే నెలల నుంచే బ్యాంకుల్లో కొత్త రుణాలు తీసుకోవడం, పాత రుణాలకు వడ్డీలు చెల్లించి కొత్తవాటిగా మార్చుకోవడం ప్రారంభించారు. వీరందరి నుంచి పంటల వారీగా ప్రీమియం రుసుమును బ్యాంకులు మినహాయించుకున్నాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని బ్యాంకుల వారీగా ప్రభుత్వం తిరిగి జమ చేయనుందని ఈనాడు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
- ఇక్కడ ఉండేవారు మృత్యువు కోసం ఎదురు చూస్తుంటారు
- అపోలో మిషన్: చంద్రుని మీద మానవుడి తొలి అడుగుకు స్వర్ణోత్సవం
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- శాండ్విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?
- సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























