కాక్రోచ్ జనతా పార్టీ: హైదరాబాద్‌లో ఆందోళన ఎలా సాగింది, దీనిపై బీజేపీ ఏమంటోంది?

కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు ఆదివారం హైదరాబాద్ లోని ధర్నాచౌక్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.

దాదాపు మూడున్నర నుంచి నాలుగు గంటలపాటు ఆందోళన జరిగింది.

ధర్నాచౌక్ వద్ద ఉన్న ఇందిరాపార్కు గేటు ఎదురుగా టెంట్లు వేసి నిరసన చేపట్టారు సీజేపీ మద్దతుదారులు.

నిరసనకు వామపక్షవాద విద్యార్థి సంఘాలు, స్వతంత్ర జర్నలిస్టులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరై మద్దతు ప్రకటించారు. సీజేపీకి మద్దతుగా ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ధర్నాచౌక్‌కు వెళ్లే దారిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.

సీజేపీ నిరసన కార్యక్రమానికి సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్, సీజేపీ ప్రతినిధి విజయ్ దహియా, హైదరాబాద్‌కు చెందిన క్లైమెట్ చేంజ్ ప్రతినిధులు రుచిత్ ఆశా కమాల్, అన్సర్ ఉన్నారు.

కాగా సీజేపీ ఆందోళనలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ చెబుతోంది.

సోనమ్ వాంగ్చుక్ ఏమన్నారంటే…

సీజేపీ నిరసన కార్యక్రమానికి హాజరైన సోనమ్ వాంగ్చుక్ మాట్లాడుతూ... యువత చేసే పోరాటాలకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు.

''ఈ ఆందోళనలో రెండు విషయాలు నాకు నచ్చడం లేదు.

సోనమ్ వాంగ్చుక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అవ్వాలని అంటున్నారు.

సోనమ్ వాంగ్చుక్ పోరాడుతుంటే, మేం వెనుక ఉంటామని అంటున్నారు. ఈ రెండు విషయాలు నాకు నచ్చలేదు.

మీరు పోరాడండి.. మీ వెనుక నేను ఉంటాను'' అని అన్నారు సోనమ్ వాంగ్చుక్.

''మాలాంటి వారు మార్గదర్శనం చేస్తుంటే, మీరు ఆందోళనలు చేయండి.

కేంద్ర విద్యా శాఖ మంత్రిని తీసేసి, మాకు నచ్చిన వారిని మంత్రిని చేయాలనేది మా ఉద్దేశం కాదు.

కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు అభిజిత్ దీప్కే, విజయ్ దహియా, సౌరభ్‌తో మాట్లాడాను.

ఈ పార్టీని రాజకీయ వేదికగా మార్చాలన్నది వారి అభిమతం కాదు, ప్రజలను జాగృతం చేయాలన్నది వారి అభిప్రాయం.

ఏదో రాజకీయ పార్టీని కూలదోయడానికో.. మరో పార్టీని గద్దెనెక్కించడానికి జరుగుతున్న ఆందోళన కాదు ఇది. దేశంలోని సమస్యలపై గళం విప్పేిందుకు సీజేపీ పనిచేస్తోంది.

మీరంతా ముందుకు కదలండి, మీ వెనుక మేమున్నాం.'' అని సోనమ్ వాంగ్చుక్ అన్నారు.

నినాదాలు.. నిరసనలు…

శాంతియుత నిరసన ప్రదర్శన పేరుతో ఆందోళన నిర్వహించారు. ఇందుకు ప్రత్యేకంగా ధర్నా చౌక్ వద్ద టెంట్లు వేసి లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు.

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆందోళనలో పాల్గొన్న సీజేపీ మద్దతుదారులు నినదించారు.

ఈ విషయంపై ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించారు. అక్కడే రహదారిపై 'విద్య అనేది దేశ ప్రజల జన్మ హక్కు' అంటూ రాశారు.

రాజ్యాంగం పుస్తకాలు, రాజ్యాంగం మొదటి పేజీ ప్రతులు, అంబేడ్కర్ ఫొటోలు ప్రదర్శిస్తూ, ద్వేషపూరిత విధానాలను విడనాడాలంటూ నినాదాలు చేశారు.

''రాజ్యాంగం జిందాబాద్'' అంటూ నినాదాలు చేశారు.

పోలీసులు పెద్దసంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోనమ్ వాంగ్చుక్ తోపాటు ప్రొ.కె.నాగేశ్వర్, ఆకునూరి మురళి, పలువురు స్వతంత్ర జర్నలిస్టులు కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

నాడు రైల్వే మంత్రి రాజీనామా.. ఇప్పుడేమో ఇలా: ప్రొ.నాగేశ్వర్

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేస్తే, సోనమ్ వాంగ్చుక్ లేదా నాగేశ్వర్ విద్యా శాఖ మంత్రి అవ్వరని మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ అన్నారు.

సీజేపీ ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.

''ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఎందుకు అడుగుతున్నామంటే.. రాజకీయ జవాబుదారీతనం ఉండాలనే ఈ డిమాండ్ చేస్తున్నాం'' అని అన్నారు.

ఒకప్పుడు రైల్వే ప్రమాదం జరిగితే, అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు.

''దేశంలో సమస్యలపై ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అని, చైనా, పాకిస్థాన్ ఏజెంట్లు, దేశద్రోహి అంటున్నారు. ఇలా అనే వారికి చెప్పదలుచుకున్నదొకటే.. మేం భరతమాత ముద్దు బిడ్డలం, భగత్ సింగ్ తమ్ముళ్లం'' అని చెప్పారు నాగేశ్వర్.

బీజేపీ ఏమంటోంది?

సీజేపీ ఆందోళనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడారు.

''వారు(సీజేపీ ప్రతినిధులు) చేస్తున్న ఆందోళనలకు స్పందన ఉండటం లేదు.

వారి ఆందోళనలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ గానీ, దిల్లీలో గానీ జరిగిన ఆందోళనల్లో నీట్ రాసిన విద్యార్థులే లేరు. చాలా మందికి నీట్ గురించి తెలియదని దిల్లీ ఆందోళన తర్వాత బయటకు వచ్చిన వీడియోల్లోనే తెలిసింది. ఏబీవీపీ వ్యతిరేకంగా ఉన్న విద్యార్థి సంఘాల నాయకులను తీసుకువచ్చి ఆందోళనలు చేస్తున్నారు'' అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)