వరదలో చిక్కుకున్న 97ఏళ్ల వృద్ధురాలు అరటి బోదెల సాయంతో ఎలా బయటపడ్డారంటే...

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, ఇండియా కరస్పాండెంట్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

జూలై 19 అర్ధరాత్రి దాటిన తర్వాత అస్సాంలో ఒక గ్రామం మీదుగా వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, తన భర్తతో కలిసి బోర్నాలి బారువా, తన 97 ఏళ్ల అత్తయ్యను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

దాదాపు మంచానికే పరిమితమైన లోకడా దువారా నడవలేరు. ఆ సమయంలో పడవ లేదు, సహాయక బృందం లేదు, సాయపడటానికి పొరుగువారు కూడా అందుబాటులో లేరు. దీంతో వారు అరటి బోదెలతో తాత్కాలికంగా తయారు చేసిన ఒక తెప్పపై ఆమెను ఎక్కించి, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలోంచి సురక్షిత ప్రాంతం వైపు తీసుకువెళ్లారు.

"అంతా తమను తాము కాపాడుకునే పనిలో ఉన్నారు" అని బారువా చెప్పారు.

ఒక గంట తర్వాత, శివసాగర్ జిల్లాలోని చారింగ్‌లోని తమ ఇంటికి కొంత దూరంలో ఉన్న జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఒక సహాయక శిబిరానికి తాము ముగ్గురం చేరుకున్నామని ఆమె చెప్పారు. తీవ్రంగా వరద ప్రభావానికి గురైన జిల్లాల్లో శివసాగర్ కూడా ఒకటి.

వరద నీరు మూడు నుంచి నాలుగు అడుగుల లోతు కుచేరింది. ప్రవాహం కూడా బలంగా ఉండటంతో, ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, కర్రలసాయంతో ముందుకు కదలాల్సి వచ్చింది.అప్పటికే బారువా ఇల్లు వరద నీటిలో కనిపించకుండా పోతోంది. ఆ ఇంట్లో నీరు దాదాపు ఐదు అడుగుల ఎత్తుకు చేరింది.

చారింగ్‌లో కనిపించిన ఈ దృశ్యం, అస్సాం అంతటా విస్తరిస్తున్న మరింత పెద్ద విపత్తులో ఒక భాగం మాత్రమే.

తాజా గణాంకాల ప్రకారం, వరదల కారణంగా మృతుల సంఖ్య 100కు చేరుకుంది. పది జిల్లాలు, 456 గ్రామాలు ప్రభావితమయ్యాయి. దాదాపు 1,40,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 52 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా, 25 జిల్లాల్లో దాదాపు 12 లక్షల మంది వరదల ప్రభావానికి గురయ్యారు. 19,000కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 252 సహాయక శిబిరాల్లో 75,000 మందికి పైగా ప్రజలు తలదాచుకున్నారు.

అస్సాం ఎగువ ప్రాంతంలో వరదలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని చారింగ్ లాంటి గ్రామాలు సహజంగా వరద ముంపునకు గురికావు.

40 ఏళ్ల బారువాకు ఈ వరద ముంపు దిగ్భ్రాంతి కలిగించింది. ''నా జీవితంలో ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో ఇంతటి వరదను చూడలేదు'' అని ఆమె చెప్పారు.

బారువా పుట్టినప్పటి నుంచి చారింగ్‌లోనే జీవిస్తున్నారు. ఆమె పూర్వీకులు కూడా ఇక్కడే జీవించారు. తాను పుట్టక ముందు 1950లో భారీ వరద వచ్చినట్టు విన్న విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

వరదలకు ప్రభావితంకాని చారింగ్ వంటి గ్రామాలు కూడా ఈసారి నీట మునిగాయి. ఎగువ అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు మరింత తీవ్రంగా ఉన్నాయి.

పలు నదులు పొంగి పొర్లడంతో, పట్టణాలు, గ్రామాలను ముంచెత్తాయని బారువా చెబుతున్నారు.

నీరు పెరగడం ప్రారంభమైన దాదాపు ఒక రోజు తర్వాత, ఆమె, ఆమె కుటుంబం తమ ఇంటిని విడిచిపెట్టారు. అప్పటికే ఇంట్లో నీరు నాలుగు అడుగుల లోతుకు చేరింది. ఆ తర్వాతి 10 రోజులు వారు ఒక సహాయక శిబిరంలో గడిపారు.

శిబిరంలో ఐదు రోజుల పాటు విద్యుత్ లేదు, మొబైల్ కనెక్టివిటీ కూడా లేదు. ప్రభుత్వం ఆ కుటుంబానికి బియ్యం, పప్పులు, వంటనూనెతో కూడిన సహాయక సామగ్రిని అందించింది.

శిబిరంలో అపరిచితుల నుంచి కూడా సహాయం అందింది. బోర్నాలి అనే అపరిచిత యువతి, ఆహారం విషయంలో సహాయం చేయడంతో పాటు, శుభ్రపరిచే పనుల్లోనూ, తన 60 మేకలను చూసుకోవడంలోనూ ఆమెకు తోడ్పడ్డారు. మరో మహిళ అనారోగ్యానికి గురైన జంతువులకు చికిత్స చేయించడం, వాటికి ఆహారం అందించడం వంటి బాధ్యతను తీసుకున్నారు.

బారువా ఒకనాడు జర్నలిస్టుగా పనిచేశారు. కానీ 2016లో ఆ వృత్తిని వదిలేసి పశువుల పెంపకాన్ని ఎంచుకున్నారు. అనంతరం మూడేళ్లలోనే ఆమె అస్సాం ఉత్తమ పశుపోషణ రైతుగా పేరుగడించారు.

ఆమె వద్ద 300 మేకలు, 1000 కోళ్లు, 500 బాతులు, చేపలు కూడా ఉన్నాయి. కానీ వరద వీటిలో చాలావాటిని తుడిచిపెట్టింది.

అయితే ఇంతకుముందెన్నడూ వరదలు రాలేదని చెబుతున్న ప్రాంతానికి అంత పెద్ద వరద ఎలా వచ్చింది?

అస్సాంలోని లోతట్టు ప్రాంతమైన బ్రహ్మపుత్ర లోయలో వరదలు రావడం సహజమేనని గువాహటి విశ్వవిద్యాలయంలో భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్, సెంటర్ ఫర్ బ్రహ్మపుత్ర స్టడీస్ డైరెక్టర్ ధ్రుబజ్యోతి సహారియా చెబుతున్నారు. కానీ "చారిత్రక ప్రమాణాలను దాటి వరదల తరచుదనం, తీవ్రత, ఉద్ధృతి పెరిగాయి" అని ఆయన చెప్పారు.

ప్రపంచంలోని అతిపెద్ద బహుళ పాయల నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర, నీటి ప్రవాహ పరిమాణం, నదిలో కొట్టుకువచ్చే అవక్షేపాల పరిమాణం కారణంగా ప్రపంచంలోని మొదటి ఐదు నదుల్లో ఒకటిగా ఉంది. ఆ అవక్షేపాల్లో చాలాభాగం నది పుట్టిన టిబెట్ నుంచి వస్తుంది.

రెండు కోట్ల 80 లక్షలమంది మంది ప్రజలకు నివాసమైన, చుట్టూ కొండలతో నిండిన అస్సాంలో విస్తారమైన వరద మైదానాల్లోకి బ్రహ్మపుత్ర ప్రవేశించినప్పుడు దాని వేగం తగ్గుతుంది. దీంతో అవక్షేపాలు అక్కడ పేరుకుపోయి, నదీ కోతను, వరదలను మరింత పెంచుతాయి. అస్సాంలో ఏటా వరదలు రావడం జీవితంలో ఒక భాగమే అయినప్పటికీ, కొన్నిసార్లు దారుణంగా ఉంటుంది. 2004లో వచ్చిన వరదలు కోటి 20 లక్షలమందిని మందిని ప్రభావితం చేసి, 251 మందిని బలిగొన్నాయి.

ఇటీవలి వరదల్లో ఎగువ అస్సాంలో, పొరుగున ఉన్న నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో నిరంతరంగా కురిసిన భారీ వర్షాలు శివసాగర్, చరైడియో, జోర్హాట్ జిల్లాల్లో తీవ్ర వరదలకు, పెద్ద ఎత్తున ఒండ్రుమట్టి పేరుకుపోవడానికి కారణమయ్యాయని సహారియా చెప్పారు.

గతంలో వరదలు చేరని ప్రాంతాలకు కూడా ఇప్పుడు వరదలు చేరుతున్నాయని సహారియా చెప్పారు. వరద మైదానాల్లో ఎక్కువ మంది స్థిరపడటం, అడవులను కొట్టేయడం, కొండలను తొలచడం ఎక్కువకావడంతో నదుల్లో అవక్షేపాలు పెరగడం, అలాగే ఈ ప్రాంత జలసంబంధ పరిస్థితులను తగినంతగా పరిగణనలోకి తీసుకోకుండా రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడం కూడా కారణమని చెప్పారు.

అయితే బ్రహ్మపుత్రను అస్సాం ఒక్కతే నియంత్రించ లేదు. దాని అనేక ఉపనదులు చుట్టుపక్కల ఉన్న కొండ రాష్ట్రాల్లో పుడుతుండగా, వరద నియంత్రణ చర్యలు మాత్రం ప్రధానంగా అస్సాం పరిధిలోనే ఉంటున్నాయి.

"నదీ పరీవాహక ప్రాంతం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది" అని సహారియా చెబుతున్నారు. అందుకు రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, మారుతున్న నదుల భౌగోళిక స్వభావంపై మెరుగైన అవగాహన కూడా అవసరమని ఆయన అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)