You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా - ఇరాన్ ఒప్పందం ఆదివారమేనన్న ట్రంప్: గడువుపై ఇరాన్ అనుమానాలు
- రచయిత, జరోస్లావ్ లుకివ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
యూఎస్, ఇరాన్ మధ్య పోరాటాన్ని ముగించే ఒప్పందంపై ఆదివారం సంతకాలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అయితే, ఇరాన్ మాత్రం ఈ గడువుపై సందేహాలు వ్యక్తం చేసింది.
ఈ ఒప్పందం కుదిరిన వెంటనే హార్ముజ్ జలసంధి రవాణా మార్గం అందరికీ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.
మరోవైపు, ఈ చర్చల్లో కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ కూడా వచ్చే 24 గంటల్లో ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
తాము ఎలక్ట్రానిక్ పద్ధతిలో సంతకాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు శనివారం ప్రకటించింది.
ఖతార్ ప్రతినిధుల రాక
ట్రంప్ వ్యాఖ్యలకు ముందు ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ ఈ గడువుపై ఆచితూచి స్పందించారు.
"అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగే తేదీ కోసం వేచి చూడాల్సిందే, అయితే అది ఆదివారం మాత్రం కాదు" అని తెలిపారు.
ఈ లోపే, చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ ప్రతినిధి బృందం ఆదివారం తెహ్రాన్ చేరుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ పర్యటన వల్ల ఇరాన్ సంతకం చేసే గడువులో ఏవైనా మార్పులు వస్తాయా అనేది స్పష్టంగా తెలియలేదు.
ట్రంప్ శనివారం ట్రూత్ సోషల్ పోస్ట్‌లో "ఈ ఒప్పందం రేపు సంతకం కానుంది. అది పూర్తయిన వెంటనే హార్ముజ్ జలసంధి అందరి కోసం తెరుచుకుంటుంది" అని రాశారు.
ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను ఉద్దేశిస్తూ, "సరైన సమయంలో, అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు, మేం అక్కడికి వెళ్లి 'న్యూక్లియర్ డస్ట్(అణు నిల్వలు)' స్వాధీనం చేసుకుని, తర్వాత వాటిని నాశనం చేస్తాం" అని ట్రంప్ తెలిపారు.
అణు కార్యక్రమంపై వివాదం
ఇరాన్ అణుబాంబు తయారీకి ప్రయత్నిస్తోందని పాశ్చాత్య దేశాలు దశాబ్దాలుగా ఆరోపిస్తున్నాయి. కానీ, ఇరాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. తమ అణు కార్యక్రమం కేవలం విద్యుత్ ఉత్పత్తి, పరిశోధనల వంటి శాంతియుత అవసరాల కోసమేనని చెబుతోంది.
"ఒకవేళ ఈ వ్యవహారాలు త్వరగా, సులువుగా, సజావుగా జరగకపోతే, వాషింగ్టన్ వద్ద అత్యున్నత ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంది. దానిని మళ్లీ ఎప్పుడూ ఉపయోగించాల్సిన అవసరం రాకూడదని ఆశిస్తున్నాను" అని ట్రంప్ కూడా హెచ్చరించారు.
అంతకుముందు శనివారం, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ,"మనం శాంతి ఒప్పందానికి అత్యంత సమీపంలో ఉన్నాం" అని చెప్పారు.
"రాబోయే 24 గంటల్లో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే శాంతి ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకాలకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది. వచ్చేవారం సాంకేతిక స్థాయి చర్చలు జరుగుతాయి" అని షరీఫ్ ఎక్స్ పోస్టులో రాశారు.
అమెరికాతో ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ శుక్రవారం తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఘర్షణలు ముగుస్తాయని చెప్పారు.
తర్వాత, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఒప్పంద వివరాలలో కొన్నింటిని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. అయితే ఇరాన్ సాధించే ఆర్థిక ప్రయోజనాలు, ఆ దేశం తన బాధ్యతలను నెరవేర్చడంపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.
ఒప్పందంలో ఇజ్రాయెల్ ఉందా?
గత కొన్నినెలలుగా ఈ ఒప్పందానికి సంబంధించి వేర్వేరు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, చివరి క్షణాల్లో అవి కార్యరూపం దాల్చలేదు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలపై దాడులు చేసింది. అలాగే ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేసింది.
గత ఏప్రిల్‌లో ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, అమెరికా - ఇరాన్ మధ్య అప్పుడప్పుడు పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య నడుస్తున్న ఘర్షణ ఈ ఒప్పందంలో భాగం కాకపోవచ్చని గతంలో అమెరికా నుంచి వచ్చిన రిపోర్టులు సూచించాయి. అయితే ఇరాన్ మాత్రం దీనిపై పట్టుబట్టినట్లు తెలిపాయి.
అమెరికా-ఇరాన్ ఒప్పందంలో ఇజ్రాయెల్ భాగస్వామి కాదు. అందువల్ల, ఉత్తర ఇజ్రాయెల్‌పై జరుగుతున్న దాడులకు ప్రతిగా హిజ్బుల్లాపై తన సైనిక చర్యలు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
ఆదివారం దక్షిణ లెబనాన్‌లోని 29 గ్రామాల ప్రజలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఈ చర్య వైమానిక దాడులకు ముందు జరుగుతుంది.
ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక ప్రాంతంపై పడిన రెండు అనుమానాస్పద డ్రోన్లను ఉద్దేశిస్తూ, "హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో, ఐడీఎఫ్ దానిపై దాడికి సిద్ధమైంది" అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి కల్నల్ అవిచాయ్ అడ్రాయ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)