‘‘షార్క్ నా తొడను పట్టుకుంది, నేను దాంతో పోరాడలేనని తెలుసు’’ - షార్క్ దాడికి గురైన ఇన్‌ఫ్లుయెన్సర్ అనుభవం ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Tayane Dalazen
- రచయిత, విల్ వెర్నోన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
"షార్క్‌లు నీటిపైన కనిపిస్తుండటంతో ఏదో తేడాగా ఉందని నాకు అర్థమైంది," అని బ్రెజిల్‌కు చెందిన 37 ఏళ్ల న్యాయవాది, సోషల్ మీడియా సెలబ్రిటీ టయానే దలాజెన్ అన్నారు.
"అక్కడ చాలా షార్క్‌లు ఉన్నాయి. పర్యాటకులతో అవి మమేకమయ్యేలా చేయడానికి టూర్ ఆపరేటర్లు ఆ షార్క్‌లకు ఆహారం పెడుతున్నారని తర్వాత తెలిసింది" అని ఆమె చెప్పారు.
సావో పాలోకు చెందిన దలాజెన్ ఏప్రిల్‌లో బ్రెజిల్ తీరంలో షార్క్‌లతో కలిసి డైవింగ్ చేసే టూర్‌కు వెళ్లారు.
అక్కడ అకస్మాత్తుగా కాలిపై ఏదో బరువు పడినట్టు భావించారు.
"షార్క్ నన్ను కరిచినప్పుడు నొప్పి చాలా ఎక్కువగా ఉంది. కానీ నేను దానితో పోరాడలేనని తెలుసు కాబట్టి ప్రశాంతంగా ఉన్నా" అని దలాజెన్ చెప్పారు.

‘ఇలా చేస్తే షార్క్‌లతో ముప్పు తప్పదు’
ఏడు అడుగుల కంటే పొడవైన నర్స్ షార్క్ ఒకటి ఆమె తొడను తన దవడలతో గట్టిగా పట్టుకుంది. కొన్ని సెకన్ల తరువాత వదిలేసింది. తర్వాత ఆమె తప్పించుకున్నారు. తన తొడలకు తీవ్రమైన గాయాలను మిగిల్చిన ఆ అనుభవాన్ని "చాలా భయానకమైనది"గా ఆమె వర్ణిస్తారు
షార్క్ కరిచిని వీడియోను దలాజెన్ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా దానికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడానికి తానక్కడికి వెళ్లలేదని, షార్క్‌ను తాకలేదని, రెచ్చగొట్టలేదని ఆమె చెబుతున్నప్పటికీ షార్క్‌లకు చాలా దగ్గరగా వెళ్లినట్టు మాత్రం అంగీకరించారు.
షార్క్‌లు మనుషులను కరవడం అత్యంత అరుదుగా జరుగుతుంది. కానీ ఏడాది కంటే తక్కువ సమయంలో ముగ్గురు ఇన్‌ఫ్లుయెన్సర్‌లను షార్క్‌లు కరిచాయి.
ప్రజలు షార్క్‌లకు చాలా దగ్గరగా ఈత కొట్టడం, వాటిని తాకడం లేదా వాటిపై స్వారీ చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో పెరిగిపోవడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"నేను గతంలో కంటే ఇప్పుడు ప్రతి వారం ఈ వీడియోలను ఎక్కువగా చూస్తున్నాను" అని షార్క్ వ్యవహారాల శాస్త్రవేత్త క్రిస్టియన్ పార్టన్ అన్నారు. ఆయన 'షార్క్ బైట్స్' అనే యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
"ఇలాగే కొనసాగితే షార్క్‌ల వల్ల ప్రజలకు మరిన్ని ప్రమాదాలు తలెత్తడం మనం చూడనున్నాం" అని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Tayane Dalazen
భద్రతా సూచనలను పట్టించుకోవడం లేదా?
జూలైలో ఒక ఫిషింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై రీఫ్ షార్క్ దాడి చేసింది. గత ఏడాది డిసెంబరులో మాల్దీవులలో ఒక చైనీస్ కంటెంట్ క్రియేటర్‌పై షార్క్ దాడి చేసింది. ఈ రెండు ఘటనలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
గత మూడేళ్లుగా షార్క్‌లతో కలిసి వీడియోలు చిత్రీకరించే ప్రయత్నంలో వాటి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిందని ప్రపంచవ్యాప్తంగా మానవ-షార్క్ మధ్య జరిగే ఘటనలను నమోదుచేసే ఇంటర్నేషనల్ షార్క్ అటాక్ ఫైల్ పరిశోధకులు బీబీసీతో చెప్పారు.
భద్రతాసూచనలను పట్టించుకోనివారిలో ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఫోటోగ్రాఫర్లు ముందువరుసలో ఉన్నారని సముద్ర జీవులతో కలిసి ఈతకొట్టే టూర్లపై జరిపిన ఒక అధ్యయనంలో తేలింది.
గత ఏడాది ఫిబ్రవరిలో కరేబియన్ ప్రాంతంలో ఓ పర్యాటకుడు తక్కువ లోతున్న నీటిలో బుల్ షార్క్ ఫోటో తీయడానికి ప్రయత్నిస్తుండగా అది ఆయన రెండు చేతులను కొరికిందని స్థానిక అధికారులు తెలిపారు.
రెండు నెలల తర్వాత ఇజ్రాయెల్‌లో సెల్ఫీ స్టిక్ పట్టుకుని స్నార్కెలింగ్ చేస్తున్న ఒక వ్యక్తి ఫోటో తీయడానికి ప్రయత్నిస్తుండగా షార్క్‌ల దాడిలో మరణించినట్టు సమాచారం.
షార్క్ దాడి చేసే ప్రమాదం చాలా తక్కువ. గత 30 ఏళ్లుగా మనుషులపై షార్క్‌ల ఆకస్మిక దాడుల సంఖ్య సంవత్సరానికి సుమారు 70 మాత్రమే.
సాధారణంగా ప్రశాంతంగా ఉంటుందని భావించే నర్స్ షార్క్ దలాజెన్‌పై దాడి చేసింది. అయితే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు టైగర్ షార్క్‌లను, ఇంకా గ్రేట్ వైట్ షార్క్‌లను తాకుతున్న వీడియోలు బయటకొచ్చాయి.
"మనం ఒక భారీ మాంసాహారి, ఒక పెద్ద సముద్ర జంతువు గురించి మాట్లాడుతున్నాం. మీరు అడవిలోకి వెళ్లి సింహం ముఖం ముందు చేయి పెట్టరు కదా" అని పార్టన్ అంటారు.
"మనుషులు సొరచేపల ఆవాసంలోకి ప్రవేశించినప్పుడు అవి ఆత్మరక్షణలో భాగంగా లేదా దాడిలో భాగంగా కొరుకుతాయి" అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
‘షార్క్‌లపై అవగాహన పెంచడానికే’
''మనుషులు దగ్గరగా ఉండడం జంతువులకు ఒత్తిడిని కలిగిస్తుంది. సొరచేపల దగ్గరకు వెళ్లడం లేదా వాటిని తాకడం వల్ల వాటిలో గ్లూకోకార్టికాయిడ్స్ అనే హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల షార్క్‌ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటానికి, మరణాల రేటు పెరగడానికి, గర్భస్రావానికి దారితీయవచ్చు'' అని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి.
"ఒక షార్క్‌కు దాని ఆవాసంలో, సంతానోత్పత్తి ప్రదేశాలలో లేదా ఆహారం తీసుకునే ప్రాంతంలో దగ్గరగా వెళ్తే, దానికి ఒత్తిడి కలిగిస్తే, అది జీవించడానికి అవసరమైన స్థలాన్ని లేకుండా చేస్తున్నట్టే. అది కచ్చితంగా ఒక సమస్య" అని పార్టన్ అన్నారు.
షార్క్‌లకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ బ్లాగర్లలో ఓషన్ రామ్‌సే ఒకరు. 38 ఏళ్ల ఈ మాజీ మోడల్ ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద గ్రేట్ వైట్ షార్క్‌తో ఈత కొడుతూ 2019లో తీయించుకున్న ఫోటో తర్వాత పాపులర్ అయ్యారు.
ఆమె తరచూ షార్కులను తాకుతూ, వాటి రెక్కలను పట్టుకుంటున్న వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.
హవాయిలోని ఒక పడవ నుంచి ఆమె బీబీసీతో మాట్లాడారు. అక్కడ ఆమె "డైవ్ విత్ ది ఓషన్" టూర్లను నిర్వహిస్తారు.
"నేను పోస్ట్ చేసే కంటెంట్ అంతటికీ వ్యూస్ పొందడం నా లక్ష్యం కాదు. షార్క్‌లను కాపాడడం కోసం అవగాహన పెంచడమే నా లక్ష్యం. నేను అనేక పరిశోధనా పత్రాలకు, డేటా సేకరణకు సహకరించాను. నా పని అంతా విద్యాపరమైనదే" అని ఆమె అన్నారు.
షార్క్‌లకు దగ్గరగా వెళ్లడం, వాటిని తాకడం హానికరం అనే విషయాన్ని ఆమె ఖండించారు. "నా పనిలో ఎక్కువ భాగం నేను పంచుకునే విషయాలన్నీ దూరం నుంచి గౌరవప్రదంగా పరిశీలించడమే" అని చెప్పారు.
"నేను వాటి ప్రవర్తనను గమనిస్తాను. ఆ తర్వాత అవే నా దగ్గరకు వస్తాయి. ఎప్పుడూ అవే ముందుగా నా దగ్గరకొస్తాయి'' అని ఆమె అంటున్నారు. షార్క్‌లను తాకుతున్న వ్యక్తుల వీడియోలు ఇతరులను అదే విధంగా సాహసాలు చేయడానికి ప్రోత్సహిస్తాయని శాస్త్రవేత్తలు చేస్తున్న ఆరోపణలకు ఆమె సమాధానమిచ్చారు.
''సాధారణ ప్రజలకు కూడా కొంత బాధ్యత ఉండాలి'' అని ఆమె అభిప్రాయపడ్డారు.
"నేను షేర్ చేసే విషయాలను చూసే చాలా మంది విద్యాపరమైన విషయాలుగా భావిస్తారు. వాటిని చూసి అలాగే చేయడానికి వారు వెళ్తారనుకోను" అని అన్నారు.

ఫొటో సోర్స్, Denis Grosmaine
‘ఫోటో కావాలనుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సిరావొచ్చు’
తాము ఇవి చేయడానికి సోషల్ మీడియా వ్యూస్‌లు, క్లిక్‌లు లేదా ఆదాయం కారణం కాదని షార్క్‌ల పరిరక్షణ, వాటిపై ప్రజల అభిప్రాయాలను మార్చడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పిన పలువురు కంటెంట్ క్రియేటర్లలతో బీబీసీ మాట్లాడింది.
షార్క్ నిపుణులు డాక్టర్ జేక్ కూపర్ మాత్రం ఈ వాదనలను హాస్యాస్పదమైనవిగా కొట్టిపారేశారు.
"ఒక షార్క్ దగ్గరకు వెళ్లడం, దానిని తాకడం లేదా దానిపై స్వారీ చేయడం వాటి సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుందో నాకు అసలు అర్ధం కావడం లేదు. మీరు చేస్తున్నదల్లా మనుషుల వల్ల ఒక షార్క్ ఇబ్బంది పడుతోందని చూపించడమే. చేపలు ఎక్కువగా పట్టడాన్ని తగ్గించడానికి లేదా షార్క్‌లకు మరింత రక్షణ కల్పించడానికి మనం ఏం చేయాలనేదాని గురించి ఇది ఎలాంటి అవగాహన కల్పించదు. షార్క్‌ల సంఖ్య ఎంత ఉంది? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? వాటిని సంరక్షించడానికి ఏ విధానాలు నిజంగా ఉపయోగపడతాయనేదానికి ఎలాంటి శాస్త్రీయ సమాచారాన్నీ కచ్చితంగా అందించదు" అని ఆయన విశ్లేషించారు.
ఫ్రాన్స్‌లో సముద్ర జీవశాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఎరిక్ క్లూవా షార్క్ కాటు వెనుక ఉన్న కారణాలను అధ్యయనం చేశారు.
"గతంలో కంటే ఇప్పుడు ప్రజలు షార్క్‌లను ప్రమాదకరమైనవిగా భావించడం తగ్గించారు. ఫలితంగా వాటికి చాలా దగ్గరగా వెళ్లే సంఘటనల సంఖ్య పెరుగుతోంది" అని ఆయన అన్నారు.
'చూడండి! షార్క్‌ను తాకండి, మీకేమీ కాదు'" అన్నట్టుగా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇస్తున్న సందేశాలున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా షార్క్‌లతో కలిసి ఈత కొట్టడం లేదా డైవింగ్ చేయడం బాగా ప్రాచుర్యం పొందుతోంది. ట్రావెల్ వెబ్‌సైట్ ట్రిప్అడ్వైజర్ ఒక్క మాల్దీవులలోనే ఇలాంటి 140 ఘటనలను లిస్ట్ చేసింది. వాటిలో కొన్ని టూర్లకు షార్క్‌లతో "అద్భుతమైన సెల్ఫీ"అని ప్రచారం చేస్తున్నాయి.
ఆ అద్భుతమైన ఫోటోను పొందడానికి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయని నిపుణులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































