షార్క్స్: వీటికి మ్యాథ్స్ తెలుసు, మ్యూజిక్ అంటే ఇష్టం – సొరచేపల గురించి మీకు తెలియని తొమ్మిది విషయాలు

షార్క్‌లు, చరిత్ర, సముద్రం, జీవులు

ఫొటో సోర్స్, Jayne Jenkins/ Ocean Image Bank

    • రచయిత, జోసెలిన్ టింపర్లీ, సోఫియా క్వాగ్లియా, క్యాథరీన్ లాథమ్, స్టీఫెన్ డౌలింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

మనుషులకు, సొర చేప(షార్క్‌) లకు మనం అనుకునే దానికంటే ఎక్కువగానే దగ్గరి పోలికలు ఉన్నాయి.

ఇప్పుడు భూమిపై జీవిస్తోన్న అత్యంత పురాతనమైన వెన్నెముక కలిగిన వేటాడే జంతువులలో సొరచేప జాతి ఒకటి.

వందల మిలియన్ల ఏళ్ల పరిణామ క్రమంలో, అవి కొన్ని ఆశ్చర్యకరమైన విలక్షణమైన లక్షణాలను అలవర్చుకున్నాయి.

ఈ లక్షణాలలో చాలామందికి తెలిసింది కొద్ది విషయాలే. మామూలు ప్రజలకు తెలియని ఇంకా ఎన్నో విశేష లక్షణాలు వీటిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

షార్క్‌ల గురించి 9 అద్భుతమైన విషయాలు ఇక్కడ చూద్దాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1. భూమిపై దాదాపు అన్నిజీవులు నాశనమైనా షార్క్‌లు మాత్రం బతికాయి

భూమిపై సంభవించిన ఐదు అతిపెద్ద వినాశకర పరిణామాల నుంచి బతికి బయటపడ్డాయి షార్క్‌లు (వాటి పూర్వీకులు).

ఈ ఘటన్లో సుమారు 90 శాతం సముద్ర జీవులను, భూమిపై ఉన్న అత్యధిక జీవరాశిని చంపేసిన అతి భయంకర వాతావరణ విపత్తు 'పెర్మియాన్-ట్రయాసిక్ ఎక్స్‌టింక్షన్ ' లేదా ది గ్రేట్ డయింగ్ కూడా ఉంది.

కానీ, ఈ భయంకరమైన వాతావరణ విపత్తును తట్టుకుని నిలబడ్డాయి షార్క్‌లు. నేడు, సముద్రంలోని ప్రతి ప్రాంతంలో వీటిని చూడొచ్చు.

2. షార్క్‌లు లెక్కలు కూడా చేయగలవు

షార్క్‌‌లు చాలా తెలివైనవని సైన్స్ చెబుతోంది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో వీటికేవీ సాటిరావని కూడా పేర్కొంటోంది.

అవి స్వల్ప తేడాలున్న శబ్దాల మధ్య వ్యత్యాసాన్ని కూడా గుర్తించగలవు. అలాగే రంగురంగుల రేఖాగణిత ఆకారాలను ఇట్టే కనిపెట్టేస్తాయి.

గ్రే రంగులో ఉన్న యంగ్ బాంబో షార్క్‌లు.. దాదాపు సంవత్సరం పాటు ఆప్టికల్ భ్రమలు, ఆకారాలకు సంబంధించిన సమాచారాన్ని గుర్తుంచుకున్నాయని ఓ ప్రముఖ ప్రయోగంలో తెలిసింది.

అవి బేసిక్ మ్యాథమేటిక్స్‌ను కూడా చేయగలవు. మూడు, ఐదు, అలాగే నాలుగు, ఏడు వంటి క్వాంటిటీల మధ్య తేడాను స్పష్టంగా చెప్పగలవు. (అయితే, నాలుగు, ఐదుకు చాలా దగ్గరగా ఉండే సంఖ్యల మధ్య తేడాను గుర్తించలేవు.)

షార్క్‌లు, చరిత్ర, జీవులు

ఫొటో సోర్స్, Hannes Klostermann/ Ocean Image Bank

3. షార్క్‌లకు జాజ్ మ్యూజిక్ అంటే భలే ఇష్టం

మరో శాస్త్రీయ అధ్యయనంలో.. పోర్ట్ జాక్సన్ షార్క్‌లలో నేర్చుకునే సామర్థ్యాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు.

ఈ షార్క్‌లు ఆస్ట్రేలియాకు చెందినవి. సముద్రపు అడుగున ఇవి జీవిస్తుంటాయి.

ఈ అధ్యయనంలో షార్క్‌లకు ఒక చిన్న పని ఇచ్చారు. ట్యాంక్‌లో ఒక ప్రత్యేకమైన సంగీతం వినిపించినప్పుడు అవి నిర్దేశిత ప్రాంతానికి ఈదుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళినందుకు బహుమతిగా వాటికి ఆహారం లభిస్తుంది.

సిడ్నీలోని మాక్వారీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. జాజ్ మ్యూజిక్‌ను ప్లే చేసేటప్పుడు షార్క్‌లు ఆహారాన్ని అందించే స్పాట్ వద్దకు చేరుకున్నట్లు తెలిసింది.

అయితే, శాస్త్రీయ సంగీతం విషయంలో మాత్రం అలా చేయలేకపోయాయని తేలింది.

4. షార్క్‌లకు బొడ్డు

కొన్ని రకాల షార్క్‌లు గుడ్లు పెడితే.. బుల్ షార్క్‌లాంటివి తమ పిల్లల్ని వాటి గర్భాశయంలోనే మోస్తాయి. మనుషులు లాగానే బొడ్డు తాడు ద్వారా కడుపులోని వాటి పిల్లలకు ఆహారాన్ని అందిస్తాయి.

అందుకే, షార్క్‌లు తమ పిల్లలకు జన్మనిచ్చిన కొన్ని వారాలు లేదా నెలల తర్వాత వరకు.. బొడ్డు తాడు నయం అయ్యే వరకు ఆ పిల్లలకు బొడ్డు గుంట ఉంటుంది.

ఇతర రకాల షార్క్‌లు గుడ్లు పెట్టవు, అలాగని క్షీరదాల వలే వాటి సంతానోతోత్పత్తి ఉండదు.

పిండాలు తల్లి గర్భంలోనే ఉన్న గుడ్లలో పెరుగుతాయి, అక్కడే పొదుగుతాయి. ఆ తర్వాత ఈ పిల్లలు ప్రాణంతో బయటకు వస్తాయి. ఉదాహరణకు, 'స్పైనీ డాగ్‌ఫిష్' రకం షార్క్‌లు దాదాపు రెండేళ్ల పాటు సాగే సుదీర్ఘ గర్భధారణ తర్వాత ఈ విధంగా పిల్లలకు జన్మనిస్తాయి.

5. తల్లి కడుపులోనే బేబి షార్క్‌లు ఒకదానికొకటి తింటాయి

శాండ్ టైగర్ షార్క్ బేబీలు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి బతుకు పోరాటం చేస్తాయి.

ఫీమేల్ శాండ్ టైగర్ షార్క్‌లకు రెండు గర్భాశయాలు ఉంటాయి. ప్రతి దానిలో ఐదు చిన్న పిల్లల వరకు పెరుగుతాయి. ఈ పిండాల్లో కేవలం ఒకటి మిగిలే వరకు వాటి తోబుట్టువులకు ఆహారంగా మారతాయి. దీన్నే ఇంట్రా యుటెరైన్ క్యానిబాలిజం లేదా అడెల్ఫోఫగీ అంటారు. అంటే తమ సోదరులను అవే తినేస్తాయన్నమాట.

తమ తోబుట్టువులను కడుపు నిండా తిన్న తర్వాత, శాండ్ టైగర్ షార్క్ పిల్లలు వాటి తల్లులు నిరంతరం విడుదల చేసే ఫలదీకరణ చెందని గుడ్లను తింటాయి. ఇలా తినడం వల్ల అవి పుట్టేనాటికి ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి.

షార్క్‌లు, జీవులు, సముద్రం, చరిత్ర

ఫొటో సోర్స్, Hannes Klostermann/ Ocean Image Bank

6. షార్క్‌లకు కూడా ప్రాణ స్నేహితులుంటారు

షార్క్‌లు ఒంటరిగా జీవిస్తూ, వేటాడుతుంటాయని చాలామంది అనుకుంటారు. కానీ, షార్క్‌లలో అన్ని జాతులకు ఈ జీవనశైలి సరిపోదని కొన్ని శాస్త్రీయ అధ్యయనాల్లో తెలిసింది.

గ్రే రీఫ్ షార్క్‌ల విషయానికొస్తే.. నాలుగేళ్ల పాటు అవి ఒకే స్నేహితుల బృందంలో ఉండేందుకు ఇష్టపడతాయట.

ఆహారం, వేట కోసం ఈ స్నేహితుల బృందాలు చిన్న చిన్న గ్రూప్‌లుగా విడిపోయి, ఆ తర్వాత మళ్లీ కలుస్తాయి.

అలాగే, లెమన్ షార్క్‌ల పిల్లలు కూడా గ్రూప్‌గా ఉండేందుకు ఇష్టపడతాయి. ముఖ్యంగా.. ఈ సామాజిక సంభాషణలతో అవి ఆహారాన్ని ఎలా వెతుక్కోవాలి, వేటాడే జీవుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనే కొత్త విషయాలను ఇతర వాటి నుంచి నేర్చుకుంటాయి.

ఒకే సైజులో ఉన్న ఇతర లెమన్ షార్క్‌లతో కలిసి ఉండేందుకే అవి ఇష్టపడతాయని పరిశోధకులు గుర్తించారు.

గ్రేట్ వైట్స్‌కు కూడా ప్రాణ స్నేహితులున్నాయి. ఒక అధ్యయనంలో సిమోన్, జెకిల్ అనే రెండు గ్రేట్ వైట్ షార్క్‌లు ఒకదానికొకటి విడిపోకుండా కలిసి 6 వేల కి.మీలు ప్రయాణించాయని తెలిసింది.

అయితే, వీటి ప్రవర్తన గురించి మరింత తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరం.

7. షార్క్‌ల శరీరంలో వేలకొద్దీ చిన్న దంతాలు

షార్క్ శరీరం చాలా అద్భుతమైన పదార్థం. 18వ శతాబ్దంలో ఇటలీలోని చేతివృత్తుల వారు అమూల్యమైన స్ట్రాడివేరియస్ వయోలిన్‌ల సున్నితమైన అంచులను నునుపుగా చేయడానికి దీని శరీరాన్ని ఉపయోగించేవారు.

విక్టోరియా కాలంనాటి బ్రిటన్‌లో వడ్రంగి వాళ్లకు షార్క్ శరీరం ఒక ముఖ్యమైన వస్తువుగా మారింది (వారు దీనిని "షాగ్రీన్" అని పిలిచేవారు).

పొలుసులకు బదులు షార్క్ శరీరం అనేక చిన్నచిన్న దంతాలతో నిండి ఉంటుంది. వీటినే డెంటికల్స్ ఉంటారు.

నీటిలో ఈ చేప ముందుకు కదిలేటప్పుడు వచ్చే ఒత్తిడికి ఇవి చదునుగా (ఫ్లాట్‌గా) మారి, నీటి ఘర్షణను తగ్గిస్తాయి. ఒకవేళ మీరు వాటి చర్మంపై చేయి వేసి నిమిరితే, అది ఒక గరుకైన సాండ్‌పేపర్‌ను రుద్దినట్లు అనిపిస్తుంది.

షార్క్, జీవులు, సముద్రం, చరిత్ర

ఫొటో సోర్స్, Larsvon Ritter Zahony/ Ocean Image Bank

8. హార్ట్ బీట్‌లను కూడా షార్క్‌లు గుర్తిస్తాయి

షార్క్‌లకు ఎనిమిది జ్ఞానేంద్రియాలు ఉంటాయి. చూడటం, వినడం, రుచిచూడటం, తాకడం వంటి ఐదు ప్రాథమిక జ్ఞానేంద్రియాలతో పాటు.. వాటికి ఇంకా అనేక శక్తులున్నాయి. ఇవే నీటిలో ఓల్టేజ్‌ లేదా ఒత్తిడిలో మార్పులను గుర్తిస్తాయి. అలాగే, భూ అయస్కాంత శక్తిని కూడా గ్రహిస్తాయి.

షార్క్ శరీరం ఇరువైపులా 'లాటరల్ లైన్స్' అని పిలిచే రంధ్రాల వరుసలు ఉంటాయి. ఇవి ఒకరకమైన ద్రవంతో, సెన్సరీ సెల్స్‌తో నిండి ఉంటాయి. షార్క్ చుట్టూ ఉండే నీటిలో కదలికలు వచ్చినప్పుడు, ఆ ద్రవంలో ఉన్న వెంట్రుకల వంటి కణాలు కదులుతాయి. ఇవి షార్క్‌లు నీటిలోని ప్రకంపనలను గుర్తించేలా చేస్తాయి.

పిట్ ఆర్గాన్లు శరీరమంతా విస్తరించి ఉన్న సెన్సరీ హెయిర్ మాదిరి కణాలు. ఈ కణాలు ఇతర జంతువులు చేసే లో-ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ ఫీల్డ్స్‌ను ఇవి గుర్తిస్తాయి. దీంతో, చీకట్లో కూడా వాటిని వేటాడగలవు. ఇసుకలో దాక్కొని ఉన్న ఎరను కనుగొంటాయి.

అదేవిధంగా.. లోరెంజినీ ఆంపుల్లే అనే మరో శ్రేణి సెన్సర్లు విద్యుత్ గ్రాహకంగా, అయస్కాంత గ్రాహకంగా కూడా ఉండవచ్చు.

వందలాది లేదా వేలాది ఈ రంధ్రాలు సొరచేప తలపై విస్తరించి ఉంటాయి. ప్రతి ఒక్క రంధ్రం సున్నితమైన నాడీ కణాలతో నిండి ఉంటుంది.

ఇవి సమీపంలోని జంతువుల కండరాల సంకోచాల ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ ప్రేరణలను ఉదాహరణకు, గుండె కొట్టుకోవడాన్ని గ్రహించడానికి షార్క్‌లకు వీలు కల్పిస్తాయి. భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి దిశను తెలుసుకుంటూ, వేల మైళ్ల సముద్రాన్ని దాటడానికి కూడా ఇవి షార్క్‌లకు సహాయపడవచ్చు .

9. చెట్లు, ధ్రువ నక్షత్రం కంటే పురాతనమైనవి షార్క్‌లు

షార్క్‌లు చాలా పురాతనమైనవి. నేటి షార్క్‌లకు చెందిన పూర్వీకుల శిలాజ ఆధారాలు.. 450 మిలియన్ ఏళ్ల కాలం క్రితంనాటివని వాటి పొలుసుల ద్వారా తెలుస్తుంది.

అంటే అవి భూమిపై మొట్టమొదటి చెట్టు పుట్టడానికి సుమారు 60 మిలియన్ సంవత్సరాల ముందు, డైనోసార్ల కంటే 220 మిలియన్ సంవత్సరాల ముందు, శని గ్రహం చుట్టూ వలయాలు ఏర్పడటానికి కంటే 350 మిలియన్ సంవత్సరాల ముందు, ధ్రువ నక్షత్రం పుట్టుకకు 380 మిలియన్ సంవత్సరాల ముందే ఉద్భవించాయి.

మొట్టమొదటి షార్క్‌లకు చెందిన దంతాలు 410 మిలియన్ ఏళ్ల కిందటివి బయటపడ్డాయి.

ఆ తర్వాత, సుమారు 195 మిలియన్ సంవత్సరాల కిందట నేటి ఆధునిక షార్క్‌ల తొలి రకాలు ఉద్భవించాయి. ఈ షార్క్‌లకు ముందుకు సాగదీయగల సౌకర్యవంతమైన దవడలు ఉండటం వల్ల, ఇవి అద్భుతమైన వేటగాళ్లుగా, శక్తివంతంగా ఈదగలిగే జీవులుగా మారాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 రకాల షార్క్‌ల జాతులు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 50 మిలియన్ సంవత్సరాల కిందట ఉనికిలో ఉండేవని భావిస్తున్న షార్క్‌ల సంఖ్యతో పోలిస్తే ఇది తక్కువే. అయినప్పటికీ, పరిశోధకులు ఇప్పటికీ కొత్త షార్క్‌ జాతులను కనుగొంటూనే ఉన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)