You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ చెప్పుల ధర రూ. 237 కోట్లు
- రచయిత, రాబిన్ లెవిన్సన్ కింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
'ది విజర్డ్ ఆఫ్ ఆజ్' సినిమాలో నటి జూడీ గార్లాండ్ డోరతి పాత్రలో ధరించిన 'రూబీ చెప్పులు' 28 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 237 కోట్లు) ధర పలికాయి.
ఈ సినిమాలో జూడీ వేసుకున్న స్లిప్పర్లలో 4 జతలు మాత్రమే ఏమాత్రం పాడవకుండా ఉన్నాయి.
వాటిలో అత్యంత పాపులర్ అయిన ఈ రెడ్ సీక్విన్ చెప్పులు గతంలో దొంగతనానికి గురయ్యాయి.
పోయి దొరికిన ఈ చెప్పులను వేలం వేశారు. నెల కిందట ఆన్‌లైన్‌లో ఈ వేలం మొదలైంది.
ఈ చెప్పులను వేలం వేసిన హెరిటేజ్ ఆక్షన్ సంస్థ రూ. 25 కోట్ల వరకు ధరకు ఇవి అమ్ముడవుతాయని అంచనా వేసింది. కానీ, వారి అంచనాలను మించి ఈ చెప్పులు ఏకంగా రూ. 237 కోట్ల ధర పలికాయి.
ఇప్పటివరకు సినిమాలకు సంబంధించిన పాత వస్తువులలో వేలంలో ఎక్కువ ధర పలికినవి ఇవేనని హెరిటేజ్ ఆక్షన్స్ చెప్తోంది.
ఇటీవలే ప్రముఖ పాప్ గాయని ఆరియానా గ్రాండీ నటించిన 'విక్కెడ్' సినిమా విడుదలైంది.
ఇది'విజర్డ్ ఆఫ్ ఆజ్' సినిమాకు ప్రీక్వెల్ కావడంతో, దీని విడుదల సంధర్బంగా ' విజర్డ్ ఆఫ్ ఆజ్' సినిమా మళ్ళీ వార్తల్లో నిలిచింది.
ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలో వాడిన చెప్పులు వేలం వేశారు.
పిల్లల పుస్తకం ఆధారంగా సినిమా
1939లో విడుదలైన 'ది విజార్డ్ అఫ్ ఆజ్'లో నటించినప్పుడు జూడీ గార్లాండ్ వయసు పదహారు సంవత్సరాలు.
ప్రముఖ మీడియా సంస్థ 'వెరైటీ' విడుదల చేసిన 100 గ్రేటెస్ట్ సినిమాస్ ఆఫ్ ఆల్ టైం జాబితాలో, ఈ సినిమా రెండో స్థానం దక్కించుకుంది.
ఎల్ ఫ్రాంక్ బామ్ 1900లో రచించిన పిల్లల పుస్తకం ఆధారంగా రూపొందించిన సినిమా ఇది.
అయితే పుస్తకంలో ఈ చెప్పులు వెండి వన్నెలో ఉంటే సినిమాలో మాత్రం టెక్నికలర్ సాంకేతికతను ఉపయోగించుకోడానికి చిత్ర బృందం ఎర్ర చెప్పులను ఉపయోగించింది.
సినిమాలో, పుస్తకంలో రెండింట్లోనూ కథానాయకి డోరతి తన కాలికి ఉన్న చెప్పులను ఒకదాంతో ఒకటి మూడు సార్లు తాకిస్తూ.. 'దేర్ ఈజ్ నో ప్లేస్ లైక్ హోం' అని మూడు సార్లు పలికే సన్నివేశం ఉంటుంది.
షూటింగ్ కోసం వాడిన అనేక చెప్పుల జతల్లో కేవలం 4 ఇప్పటికీ పాడవకుండా మిగిలి ఉన్నాయి.
వీటిలో ఒకటి 'స్మిత్‌సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీ'లో ప్రదర్శనకు ఉంచారు.
కానీ ఇప్పుడు వేలానికి అమ్ముడు పోయిన చెప్పుల జతకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది.
దీనిని సేకరించిన మైకేల్ షా ఈ చెప్పులను 'ది జూడీ గార్లాండ్ మ్యూజియం'కు ఇచ్చారు.
ఈ మ్యూజియం జూడీ గార్లాండ్ స్వస్థలం మిన్నెసోటాలోని గ్రాండ్ రాపిడ్స్‌లో ఉంది.
అయితే 2005లో ఈ చెప్పులు చోరీకి గురయ్యాయి.
ఈ చెప్పులను భద్రపరచిన గాజు పెట్టెను సుత్తితో పగలకొట్టి టెర్రీ జాన్ మార్టిన్ అనే దొంగ ఎత్తుకెళ్లారు.
వీటి మీద ఉన్న రంగురాళ్లను రత్నాలనుకొని పొరపడి, వీటిని అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయనుకుని దొంగతనం చేశానని టెర్రీ తరువాత చెప్పారు.
దొంగిలించిన వస్తువులు అమ్మే ఒక ప్రాంతంలో ఈ చెప్పులను ఆయన విక్రయించడానికి ప్రయత్నించగా.. అక్కడ అవి రత్నాలు కావు గాజుతో చేసినవి అని తెలిసింది. దాంతో ఆయన వాటిని వేరే ఎవరికో ఇచ్చేశారు.
2018లో ఎఫ్‌బీఐ స్టింగ్ ఆపరేషన్‌లో పోలీసులకు ఈ చెప్పులు దొరికాయి.
2023లో 70 ఏళ్ళ టెర్రీ తన నేరాన్ని అంగీకరించారు. అప్పటికే వీల్‌చైర్‌లో ఉన్న టెర్రీకి ఈ దొంగతనం కేసులో జైలు శిక్ష కూడా పడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)