విశాఖను ఓ వాలంటరీ అసోసియేషన్ పాలించిందని తెలుసా? ఈ ఊరు మున్సిపాల్టీగా ఎప్పుడు మారింది, అప్పట్లో ఎన్ని వార్డులు ఉండేవి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇప్పుడు విశాఖపట్నం అంటే బీచ్‌లు, పోర్టు, పరిశ్రమలు, వేగంగా విస్తరిస్తున్న నగరం. కానీ ఈ నగరం తొలిరోజులలో ఇలా లేదు.
కొంతమంది వ్యాపారులు, జమీందార్లు కలిసి ఏర్పాటు చేసిన ఓ వలంటరీ అసోసియేషన్ నుంచి మొదలైన వ్యవస్థ...మున్సిపల్ కమిషన్‌గా, కౌన్సిల్‌గా, కార్పొరేషన్‌గా మారింది.
ఆ తర్వాత నగరం విస్తరించడంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)గా ఎదిగింది.
ఈ క్రమంలో నగర పాలనలో వచ్చిన మార్పులేంటి? ప్రజాప్రతినిధుల పాత్ర ఎలా మారింది?
ఈ విషయాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తుశాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ, విశాఖ చరిత్రపై అధ్యయనం చేసిన బి. మహదేవ శాస్త్రి బీబీసీకి వివరించారు.


ఫొటో సోర్స్, Edward paul
సహజ నౌకాశ్రయం.. నగర అభివృద్ధికి పునాది
తూర్పు కనుమలు, బంగాళాఖాతం మధ్య ఉన్న విశాఖపట్నానికి సహజసిద్ధమైన ఓడరేవు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. సముద్ర వాణిజ్యం, విదేశీ వ్యాపారుల రాక, బ్రిటిష్ పాలనతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెరిగింది. తర్వాత రైల్వే, పోర్టు, పరిశ్రమలు, నౌకాదళ స్థావరం వంటి పరిణామాలు నగర విస్తరణకు దోహదపడ్డాయి.
నగర అభివృద్ధిలో భౌగోళిక పరిస్థితుల పాత్రను కొల్లూరు సూర్యనారాయణ ఇలా వివరిస్తున్నారు.
"ఒక పక్క తూర్పు కనుమలు , సముద్రతీరం ఒక పక్క. సముద్రతీరం ఒంపు తిరగడం ఇంకో ముఖ్యమైన విషయం. అంటే విశాఖ భౌగోళిక స్థితే దీని చరిత్రకి కారణం." అని ఏయూ చరిత్ర, పురావస్తు విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.
నగరం పెరుగుతున్న కొద్దీ పారిశుధ్యం, వీధుల నిర్వహణ, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ అవసరాలే విశాఖలో స్థానిక పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నేపథ్యంగా నిలిచాయి.

1858లో స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు
విశాఖ పురపాలనకు బీజం పడింది ఓ స్వచ్ఛంద సేవా సంస్థ అంటే ఆశ్చర్యం వేస్తుంది. స్వచ్ఛంద సేవ అంటే ఇదేదో అనధికారికంగా చేసేది కూడా కాదు. ఇది ఆల్ ఇండియా యాక్ట్ XXVI of 1850 చట్టం కింద ఏర్పాటుచేసిన సంస్థ. 1858లో విశాఖలో ఈ వాలంటరీ మున్సిపల్ అసోసియేషన్ ఏర్పడింది.
అయితే ఈ అసోసియేషన్ ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నుకునే ఎన్నుకునే వ్యవస్థ కాదు. ఇందులో అప్పటి వ్యాపారులు, జమీందార్లు, ఇతర ప్రముఖులు భాగస్వాములుగా ఉండేవారు.
ఆ తొలి వ్యవస్థ స్వరూపం గురించి కొల్లూరు సూర్యనారాయణ మాట్లాడుతూ...అందులో కలెక్టర్, సివిల్ జడ్జి, జమీందారీ కుటుంబాలకు చెందిన ప్రముఖులు, వ్యాపార వర్గాల ప్రతినిధులు ఉండేవారని వివరించారు.
"ఇది ఒక రకంగా పెద్ద మనుషుల కూటమి. దానిలో కలెక్టర్, సివిల్ జడ్జీ ఉండేవారు. అలాగే జమీందారీ కుటుంబాల నుంచి ఇద్దరు ప్రముఖులు, వ్యాపార ప్రముఖుల్లో మరో ఇద్దరు ఉండేవారు. ఇది వాలంటీరీ ఆర్గనైజేషన్." అని రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ తెలిపారు.
ఆ కాలంలో నగర పాలనకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవడం కూడా ఒక సవాలుగా ఉండేది. స్థానికంగా వసూలు చేసే పన్నులు, లైసెన్సుల ద్వారా ఆదాయం సమకూర్చుకునేవారని చరిత్రకారులు చెబుతున్నారు.

అసోసియేషన్ నుంచి మున్సిపల్ కౌన్సిల్ వరకు...
విశాఖలో నగర పాలన వ్యవస్థ తర్వాతి దశల్లో అధికారిక రూపం దాల్చింది. 1865 నాటి టౌన్ ఇంప్రూవ్మెంట్ చట్టం తర్వాత మున్సిపల్ కమిషన్ ఏర్పడింది. 1865లో విశాఖపట్నం మున్సిపల్ కౌన్సిల్‌గా మారింది. ఇందులో కలెక్టర్, ఇతర అధికారులు కీలక పాత్ర పోషించేవారు. నగర అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ప్రధానంగా అధికారుల ఆధ్వర్యంలోనే జరిగేవి.
ఈ మార్పు గురించి విశాఖ చరిత్ర అధ్యయనకారులు బి. మహదేవ శాస్త్రి తెలిపారు. వలంటరీ అసోసియేషన్ నుంచి కౌన్సిల్ వరకు సాగిన ప్రయాణంలో సభ్యుల సంఖ్య, పాలనా వ్యవస్థ క్రమంగా విస్తరించాయని చెప్పారు.
"1865లో టౌన్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్‌ని తెచ్చి కౌన్సిల్స్ ఏర్పరిచారు.. 1888 నాటికి విశాఖలో ఐదు వార్డులే ఉండేవి." అని బి. మహదేవ శాస్త్రి బీబీసీతో చెప్పారు.
వీధుల విస్తరణ, మార్కెట్ల నిర్వహణ, టౌన్‌హాల్ వంటి నిర్మాణాలు ఆ కాలంలో నగర అభివృద్ధిలో భాగమయ్యాయి. అయితే అప్పటి వ్యవస్థకు, ప్రస్తుతం మనం చూస్తున్న ఎన్నికల ఆధారిత స్థానిక పాలనకు చాలా తేడా ఉందని బి. మహదేవ శాస్త్రి అన్నారు.

1979లో కార్పొరేషన్‌గా మార్పు...
విశాఖ నగరం విస్తరిస్తూ, జనాభా పెరుగుతూ ఉండటంతో మున్సిపల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 1979లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది.
ఈ పరిణామాన్ని కొల్లూరు సూర్యనారాయణ ఇలా వివరించారు.
"1979లో ఇది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది." అని ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ తెలిపారు.
1981లో కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. ఎంఎస్ఎన్ రెడ్డి పరోక్ష ఎన్నిక పద్ధతిలో మేయర్‌గా ఎన్నికయ్యారు. 1987లో డీవీ సుబ్బారావు ప్రత్యక్ష ఎన్నికలో మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో సబ్బం హరి, రాజాన రమణి వంటి వారు కూడా మేయర్ పదవిలో కొనసాగారు.
అయితే ఎన్నికలతో పాటు ప్రత్యేక అధికారుల పాలన కూడా కొన్ని దశల్లో కొనసాగింది. పాలకవర్గాల పదవీకాలం ముగిసినప్పుడు లేదా ఎన్నికలు జరగనప్పుడు నగర పరిపాలన అధికారుల చేతుల్లో ఉండేది.
విశాఖ నగర పాలన చరిత్రలో ఎన్నికైన ప్రతినిధుల పాలన, ప్రత్యేక అధికారుల పాలన రెండూ కనిపిస్తాయి.

2005లో గ్రేటర్ విశాఖ ఆవిర్భావం
విశాఖ విస్తరణతో పాత కార్పొరేషన్ పరిధి క్రమంగా సరిపోని పరిస్థితి ఏర్పడింది. చుట్టుపక్కల ప్రాంతాలను నగర పాలనా వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం పెరిగింది. ఈ క్రమంలో 2005 నవంబర్ 1న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఏర్పాటైంది. కొన్ని పంచాయతీ ప్రాంతాల విలీనంతో నగర పాలన పరిధి విస్తరించింది.
ఈ మార్పు గురించి కొల్లూరు సూర్యనారాయణ మాట్లాడుతూ...అప్పటివరకు కార్పొరేషన్‌గా ఉన్న విశాఖ, గ్రేటర్ కార్పొరేషన్‌గా విస్తరించిందని వివరించారు.
"మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న దానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గా మారింది. 2005 నవంబర్ నుంచి కూడా గ్రేటర్ విశాఖ మున్సిపాల్ కార్పొరేషన్‌గా మారింది. ఇది ప్రజెంట్ స్టేటస్." అని కొల్లూరు సూర్యనారాయణ బీబీసీతో అన్నారు.
బి. మహదేవ శాస్త్రి వివరించిన ప్రకారం, గాజువాక, గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం వంటి ప్రాంతాలను కలుపుతూ జీవీఎంసీ పరిధి విస్తరించింది.
ఆ తర్వాత కూడా ఈ విస్తరణ కొనసాగింది. అనకాపల్లి, భీమునిపట్నం పురపాలక సంఘాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు జీవీఎంసీ పరిధిలోకి వచ్చాయి. దీంతో విశాఖ నగర పాలన అనేది పాత నగర ప్రాంతానికే పరిమితమైన వ్యవస్థ కాకుండా, విస్తృతమైన భౌగోళిక పరిధిలో సేవలు అందించాల్సిన సంస్థగా మారింది. ప్రస్తుతం జీవీఎంసీ వార్డుల సంఖ్య 120.
నగర విస్తరణ
విశాఖ నగర పాలనలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అధికారుల పాలన వేర్వేరు దశల్లో కనిపిస్తాయి.
1992 నుంచి 1995 వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. 1995లో ఎన్నికల తర్వాత సబ్బం హరి మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2000లో రాజాన రమణి మేయర్‌గా ఎన్నికయ్యారు. జీవీఎంసీ ఏర్పాటైన తర్వాత 2005 నుంచి 2007 వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. 2007లో మళ్లీ ఎన్నికలు జరిగాయి.
2012లో పాలకవర్గ పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారి పాలన కొనసాగిందని గతంలో బీబీసీతో మాట్లాడిన మాజీ మేయర్ రాజాన రమణి చెప్పారు.
జీవీఎంసీ పరిధిలోకి అనకాపల్లి, భీమునిపట్నం పురపాలక సంఘాలతో పాటు మరికొన్ని పంచాయతీ ప్రాంతాలను చేర్చడంతో నగర పాలన పరిధి మరింత పెరిగింది.
నగర పరిధి పెరగడంతో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పట్టణ ప్రణాళిక వంటి సేవలను విస్తృత ప్రాంతానికి అందించాల్సిన బాధ్యత కూడా పెరిగింది. అదే సమయంలో ప్రజాప్రతినిధుల పాత్ర కూడా కీలకంగా మారింది. వార్డుల్లోని సమస్యలను గుర్తించడం, వాటిని కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లడం, అభివృద్ధి పనులపై ప్రశ్నించడం వంటి బాధ్యతలు ఎన్నికైన ప్రతినిధులకు ఉంటాయి.
1858లో ప్రారంభమైన వలంటరీ అసోసియేషన్ నుంచి నేటి జీవీఎంసీ వరకు విశాఖ నగర పాలన ఎన్నో మార్పులు చూసింది.
ఐదు వార్డులతో మొదలైన విశాఖ నగర పాలన...నేడు 120 వార్డులకు విస్తరించింది. వాలంటరీ అసోసియేషన్, ...మున్సిపల్ కౌన్సిల్, కార్పొరేషన్ మీదుగా జీవీఎంసీగా ఎదిగింది. 2026-27లో రూ. 4,047 కోట్ల వ్యయ బడ్జెట్‌ను ఆమోదించింది. రూ. 4,180 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































