మణిపుర్: ‘కట్టెల కోసం అడవికి వెళితే, మా అబ్బాయిని చంపేశారు.. నాలుగేళ్ల నా మనవరాలు నాన్న ఎక్కడ అంటోంది’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇంఫాల్ లోయలో అక్టోబర్ 19న తీవ్రవాదధోరణిని అనుసరించేవారు జరిపినట్లుగా భావిస్తున్న ఒక దాడిలో ముగ్గురు మైతేయి తెగ వ్యక్తులు మరణించారు. వారిలో సుశీల్ కూడా ఒకరు.
సుశీల్ కొంతమంది గ్రామస్తులతో కలిసి కట్టెలు తెచ్చుకోవడానికి సమీప అడవికి వెళ్లినప్పుడు ఈ దాడి జరిగింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబి సింగ్ సహా పలువురు సుశీల్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు. బయటి వ్యక్తులను చూడగానే సుశీల్ వృద్ధ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు.
"ఆ హంతకులు మా కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని దూరం చేశారు. నా కుమారుడు కట్టెలు తీసుకురాడానికి అడవికి వెళ్లాడు. కానీ తిరిగి ఇంటికి రాలేదు’’
‘‘నాలుగేళ్ల మనవరాలు, నాన్న ఎక్కడ అని పదేపదే అడుగుతోంది. ఆ చిన్నారికి నేనేం సమాధానం చెప్పాలి?" అని కన్నీళ్లతోనే సుశీల్ తండ్రి డెబెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొండ దిగువ ప్రాంత ప్రజలకు కట్టెలు సేకరించడం,పొలాల్లో పనిచేస్తేనే గడుస్తుంది. కానీ పనికి వెళ్లిన సమయంలో ఎవరైనా కాల్పులు జరిపితే మా జీవనాధారం ఎలా, అలాంటి పరిస్థితుల్లో మేమెలా బతకాలి? " అని డెబెన్ ప్రశ్నించారు.


ఫొటో సోర్స్, Dilip Kumar Sharma
10 రోజుల్లో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
మణిపుర్‌లోని కొండ ప్రాంతాల్లో హింస ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల అక్టోబర్ 9 నుంచి కేవలం 10 రోజుల్లో కనీసం 14 మంది మరణించారు.
అక్టోబర్ 9, 10 తేదీల మధ్య కామ్జోంగ్, కాంగ్పోక్పి, ఉఖ్రుల్ జిల్లాల్లో 12 గంటల వ్యవధిలో జరిగిన హింసలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో కుకీ, నాగా వర్గాలకు చెందినవారు మరణించారు.
ఆ తర్వాత అక్టోబర్ 17న కామ్జోంగ్ జిల్లాలో కుకీల జనాభా ఎక్కువగా ఉన్న చస్సాద్ గ్రామంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యారు.
అక్టోబర్ 18 రాత్రి థౌబల్ జిల్లాలోని ఖంగాబోక్లో మరో వ్యక్తి హత్యకు గురయ్యారు. అనంతరం అక్టోబర్ 19న ఇంఫాల్ తూర్పు జిల్లాలో ముగ్గురు మైతేయి పురుషులను హత్య చేశారు.
మైతేయి, కుకీ వర్గాల మధ్య 2023 మే 3 నుంచి కొనసాగుతున్న హింస ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. అయితే, గత ఏడాది ఫిబ్రవరిలో ఉఖ్రుల్ జిల్లాలో కుకీ, నాగా వర్గాలకు చెందిన కొందరు యువకుల మధ్య మద్యం మత్తులో జరిగిన ఘర్షణ తీవ్రరూపం దాల్చి విస్తృత హింసకు దారితీసింది.
కేవలం ఎనిమిది నెలల క్రితం ప్రారంభమైన నాగా, కుకీ ఘర్షణల్లో ఇప్పటివరకు కనీసం 22 మంది నాగా పౌరులు, 31 మంది కుకీ పౌరులు మరణించారు.
మూడు రోజుల క్రితం మైతేయి ప్రజలపై జరిగిన దాడి తర్వాత రాష్ట్రంలో హింస మరో దశకు చేరుకుంది. తొలుత రెండు వర్గాల మధ్య మాత్రమే కొనసాగిన జాతి ఘర్షణలు ఇప్పుడు మూడు వర్గాల మధ్య సంఘర్షణగా మారాయి. ఒకవైపు మైతేయి, కుకీ వర్గాలు పరస్పరం ఘర్షణ పడుతుండగా, మరోవైపు నాగా, కుకీ వర్గాల మధ్య కూడా పోరు కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Dilip Kumar Sharma
పోలీసులు ఏమంటున్నారు?
నోంగ్షుమ్లో మైతేయి ప్రజలపై జరిగిన దాడికి సంబంధించి మణిపుర్ పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.
అక్టోబర్ 19 ఉదయం ఇంఫాల్ తూర్పు, కాంగ్పోక్పి జిల్లాల సరిహద్దులోని నోంగ్షుమ్ కొండ సమీప అడవిలో సుమారు 14 మంది మైతేయి ప్రజలు కట్టెలు సేకరిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అనుమానిత మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.
సగోల్‌మాంగ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి మృతులను క్షేత్రిమయుమ్ సుశీల్ (32), అరుబమ్ రోనిల్ (35), లైరెన్లక్పమ్ ఇనావోబి (44)గా గుర్తించారు.
"మణిపుర్ పోలీసులు, భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలతో కూడిన సంయుక్త బృందం ఘటనాస్థలం చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టింది. కట్టెలు సేకరించేందుకు వెళ్లిన వ్యక్తుల హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశాం" అని మణిపుర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లహిరి దోర్జీ లహాటు విలేకరుల సమావేశంలో తెలిపారు.
అరెస్టయిన వారిలో ఇద్దరు దాడికి పాల్పడిన బృందంలో తాము కూడా ఉన్నామని అంగీకరించినట్లు లహాటు చెప్పారు. ఆ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఇన్సాస్ రైఫిళ్లు, ఏకే-47లు, ఎం-16లు, స్నైపర్ రైఫిళ్లు, టైప్ 81 రైఫిళ్లు సహా 12 అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. హ్యాండ్ గ్రెనేడ్లు, పోంపే బాంబులు, పేలుడు పదార్థాలతో పాటు వెయ్యికి పైగా లైవ్ కార్ట్రిడ్జ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న హింసపై స్పందిస్తూ, ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పోలీసు అధికారి చెప్పారు.
అయితే, మైతేయి పురుషుల మృతదేహాలను వారి కుటుంబాలు ఇంకా స్వీకరించలేదు.
ఈ ఏడాది ఏప్రిల్ 7 తర్వాత లోయలో నివసించే మైతేయి ప్రజలపై దాడి జరగడం ఇదే తొలిసారి. ఈ ఘటన మైతేయి జనాభా ఎక్కువగా ఉన్న ఇంఫాల్ లోయలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
హత్యలను నిరసిస్తూ ఆగ్రహంతో ఉన్న స్థానికులు మృతదేహాలను ఇంఫాల్‌లోని ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ అధికారిక నివాసం ఎదుట ఉంచారు. అనంతరం భద్రతా సిబ్బంది వాటిని అక్కడి నుంచి తొలగించారు.
ప్రస్తుతం ఆ ముగ్గురి మృతదేహాలను ఇంఫాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. న్యాయం జరిగి, పౌరుల భద్రతకు భరోసా లభించే వరకు మృతదేహాలను తీసుకోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
మైతేయి వర్గానికి చెందిన నేటివ్ పీపుల్స్ కమిటీ మణిపుర్ ఈ హత్యలకు నిరసనగా గత మంగళవారం 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. లోయలోని అన్ని జిల్లాల్లోనూ బంద్ ప్రభావం కనిపించింది.
బుధవారం సాయంత్రం 5 గంటలకు బంద్ ముగిసినప్పటికీ, గురువారం కూడా ఇంఫాల్‌లో మార్కెట్లు, దుకాణాలు మూసివేసే ఉన్నాయి. మైతేయి పౌర సంఘాలు, మీరా పైబీ మహిళా సంఘం ఇంఫాల్‌లో ఇంకా ధర్నా నిర్వహిస్తున్నాయి.
"గత ఆరు నెలలుగా లోయలో ప్రశాంతత నెలకొంది. కానీ కుకీ మిలిటెంట్లు అమాయక ప్రజలను చంపి మళ్లీ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు" అని మైతేయి ప్రజల హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంఫాల్ నివాసి కిరణ్ అన్నారు.
, "పరిస్థితులు మెరుగుపడ్డాయని, ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని ప్రభుత్వంలోని కొందరు చెబుతున్నారు. ఆ హామీని నమ్మి మనవాళ్లు సమీప అడవికి కట్టెల కోసం వెళ్లారు. అక్కడ వారిని హత్య చేశారు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?" అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Dinesh Kumar Sharma
హింస ఎందుకు పెరిగింది?
మణిపుర్లో హింస ఒక్కసారిగా పెరగడానికి అనుమానిత అతివాదుల ప్రమేయమే ప్రధాన కారణమని భావిస్తున్నారు.
కొండ జిల్లాల్లో జరుగుతున్న దాడులు, అగ్నిప్రమాదాల వెనుక నాగా అతివాద సంస్థ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్సీఎన్-ఐఎం) ఉందని కుకీ వర్గానికి చెందిన ప్రధాన పౌర సంఘం కుకీ ఇన్పి తన ప్రకటనల్లో ఆరోపిస్తోంది.
అయితే, మణిపుర్‌లోని నాగా తెగలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత సామాజిక, రాజకీయ సంస్థ యునైటెడ్ నాగా కౌన్సిల్ మాత్రం ఈ దాడులకు చెక్ పెట్టే ఒప్పందం పరిధిలో ఉన్న వివిధ కుకీ సాయుధ బృందాలే కారణమని ఆరోపిస్తోంది.
మణిపుర్లో పెరుగుతున్న హింసపై భారత సైన్యం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హిమాలయ సింగ్ బీబీసీ న్యూస్ హిందీతో మాట్లాడారు.
"శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్రంలో తగినంత భద్రతా బలగాలు ఉన్నాయి. అయినప్పటికీ హింస కొనసాగుతోంది" అని అన్నారు.
"సంయుక్త ఆపరేషన్లు నిర్వహించడంలో భద్రతా సంస్థల మధ్య సమన్వయం లోపించినట్లు కనిపిస్తోంది. కఠిన చర్యలు తీసుకోకపోవడం హింసను ప్రేరేపిస్తున్నవారికి ధైర్యాన్నిచ్చింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
మణిపుర్‌కు చెందిన హిమాలయ సింగ్ రాష్ట్రంలో హింస నిరంతరం పెరగడానికి బాహ్య శక్తులు కూడా కారణమని భావిస్తున్నారు.
"ఇక్కడ శాంతి నెలకొనడం ఇష్టంలేని బాహ్య శక్తులు హింసను పెంచుతున్నాయి. మణిపుర్‌కు మయన్మార్‌తో సరిహద్దు ఉంది. ఇటీవలి హింస నేపథ్యంలో సరిహద్దుకు అవతల కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని అతివాద సంస్థల పేర్లు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి మణిపుర్ ఇప్పుడు భౌగోళిక రాజకీయాల పోరాట క్షేత్రంగా మారింది. మతం, గిరిజనవాదంతో ముడిపడిన అంశాలు కూడా జాతి ఘర్షణలకు మరో కారణం. విభజనకు దారితీసే అంశాలను రెచ్చగొడుతూ కొందరు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నారు" అని ఆయన వివరించారు.
మణిపుర్లో చాలాకాలంగా మానవ హక్కుల కోసం పనిచేస్తున్న కె. ఓనిల్ మాత్రం కుకీ తెగ డిమాండ్లపై ప్రభుత్వం తగినంత దృష్టి పెట్టకపోవడం కూడా హింసకు కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
"ఇది భూమికి సంబంధించిన పోరాటం. రాష్ట్రంలో శాంతి నెలకొంటే ప్రత్యేక పాలన, కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలన్న కుకీ వర్గ డిమాండ్లను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది" అని ఆయన అన్నారు.
భారత ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న అతివాద బృందాలే హింసను ప్రేరేపిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయని ఓనిల్ చెప్పారు. "ఈ సాయుధ బృందాలు కాల్పుల విరమణ నిబంధనలను పాటించడం లేదు. అందువల్లే హింస పెరిగింది" అని పేర్కొన్నారు.
మణిపుర్లో హింస వెనుక శాంతి ఒప్పందంలో ఉన్న బృందాల ప్రమేయం ఉందన్న విషయంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"నివేదికల్లో ప్రస్తావిస్తున్న హింసాత్మక ఘటనలన్నింటికీ అతివాద బృందాలే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. అంటే, ఈ బృందాలు కాల్పుల విరమణకు సంబంధించిన ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని స్పష్టమవుతోంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, https://x.com/YKhemchandSingh
ప్రభుత్వం ఏమంటోంది?
హింసను అరికట్టేందుకు సైనిక చర్యల కంటే వర్గాల మధ్య చర్చలే ముఖ్యమని మణిపుర్ ప్రభుత్వం చెబుతోంది.
ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి గోవిందాస్ కొంథౌజామ్ మీడియాతో మాట్లాడారు
"తుపాకీ గొట్టంతో శాంతి సాధ్యం కాదు. చర్చల ద్వారానే శాంతి నెలకొంటుంది. ఎలాంటి విభేదాలనైనా చర్చలు, సంప్రదింపుల ద్వారా మాత్రమే పరిష్కరించగలం" అని అన్నారు.
హింసకు పాల్పడుతున్న వర్గాల మధ్య పరస్పర అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. "శాంతిని నెలకొల్పాలంటే మాట్లాడుకోవాలని చాలా మంది అర్థం చేసుకున్నారు. కేవలం భద్రతా బలగాలపై ఆధారపడటం ద్వారా సమస్యలను పరిష్కరించలేం" అని పేర్కొన్నారు.
హింసకు పాల్పడుతున్న అతివాదులపై చర్యల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, హింసను వ్యాప్తి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి తెలిపారు. వివిధ స్థాయుల్లో కొనసాగుతున్న అతివాద వ్యతిరేక ఆపరేషన్లలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
హింస చోటుచేసుకున్న కొండ జిల్లాలకు సీనియర్ పోలీసు అధికారులను పంపినట్లు తెలిపారు. పెరుగుతున్న హింసను అదుపులోకి తెచ్చేందుకు డీజీపీ ముఖేశ్ సింగ్ స్వయంగా కామ్జోంగ్ జిల్లాకు వెళ్లారని చెప్పారు. అక్కడ కుకీ, నాగా వర్గాల ప్రజల ఆందోళనలను ఆయన విన్నారని వివరించారు.
అనంతరం 11వ అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్ ప్రతినిధులతో సంయుక్త భద్రతా సమన్వయ సమావేశం కూడా నిర్వహించినట్లు ఆ అధికారి తెలిపారు. రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































