అలన్ జోన్స్: 'ఆయన వేయరానిచోట చేతులు వేసేవారు'.. అంటూ ఆ నలుగురు పురుషులు ఇచ్చిన ఫిర్యాదు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లానా లామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ అలన్ జోన్స్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణ సిడ్నీ కోర్టులో ప్రారంభమైంది.
ఈ హై-ప్రొఫైల్ కేసులో తొలిరోజు కోర్టులో పలు ఆరోపణలను ప్రాసిక్యూషన్ వివరంగా ప్రస్తావించింది.
డ్రైవింగ్ చేస్తుండగా ఇద్దరు పురుషుల జననాంగాలను అలన్ జోన్స్ తాకారని, అనేకమందిని వారి ఆమోదం లేకుండా ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించారని వచ్చిన ఆరోపణలపై సిడ్నీ కోర్టులో విచారణ జరిగింది.
ఆస్ట్రేలియాలో మీడియా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి, ఆస్ట్రేలియా రగ్బీ జట్టు మాజీ కోచ్ అయిన అలన్ జోన్స్‌పై లైంగిక దాడికి సంబంధించి 20 ఆరోపణలతోపాటు ఆరుగురు మగవాళ్లను అసభ్యకరంగా తాకారనే మరో రెండు ఆరోపణలు ఉన్నాయి.
85 ఏళ్ల జోన్స్ ఈ ఆరోపణలన్నింటినీ తిరస్కరించారు.

2003 నుంచి 2020 మధ్య బహిరంగ కార్యక్రమాల్లో లేదా జోన్స్ నివాసాలు, ఆఫీసులలో ఇవి జరిగినట్లు ఆరోపణలొచ్చాయి.
బాధితుల ఆరోపణల విశ్వసనీయతను జోన్స్ లాయర్లు కోర్టులో ప్రశ్నించారు.
పోటీ, ద్రోహం, డబ్బు, ద్వేషం, అవకాశవాదం, నిరాశా నిస్పృహ లాంటి కారణాలతోనే ఈ కేసు నమోదైందని వారు వాదించారు.
అసలేం జరిగింది?
బాధితుల ఆరోపణలను ప్రాసిక్యూటర్లు వివరంగా వెల్లడించారు. జోన్స్‌ను ఫిర్యాదుదారు 'జే' మొదటిసారి కలిసినప్పుడు ఒక టీనేజర్. అప్పటికి జే క్రీడల్లో సాధించిన ఘనతలపై ఇంటర్వ్యూ కోసం కలిశారు.
"తర్వాత జోన్స్ ఆ టీనేజర్‌కు ఫోన్, కారు బహుమతిగా ఇచ్చారు. ప్రతివారం 400 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించేవారు. తర్వాత ఆ చెల్లింపు 600 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెరిగింది" అని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
ఒక సందర్భంలో వారిద్దరూ జోన్స్‌కు చెందిన ఫిట్జ్‌రాయ్ ఫాల్స్ ఇంటికి వెళ్తున్నారు. అక్కడకు వెళ్లేందుకు దక్షిణ సిడ్నీ నుంచి రెండు గంటలు ప్రయాణించాలి. ఆ సమయంలో బాధితుని జననాంగాన్ని జోన్స్ తాకారని, అతని సమ్మతి లేకుండా ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ తెలిపింది.
"ఇంకోసారి తన సమ్మతి లేకుండా జోన్స్ తనను ముద్దుపెట్టుకున్నారని ఫిర్యాదుదారు చెప్పారు. కానీ ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఎవరితోనైనా చెబితే తాను అంతా కోల్పోతానని భయపడ్డారు" అని ప్రాసిక్యూషన్ తెలిపింది.
‘‘ నేను కోరుకున్నవి దొరికేవి. అది చాలా అద్భుతమైన జీవితం'' అని కారు గురించి, వారానికిచ్చే పేమెంట్ల గురించి ప్రస్తావిస్తూ ఫిర్యాదుదారు జే చెప్పారు.
''నాకు ఇతర పురుషులపై అలాంటి ఆసక్తి లేదు. అందుకే ఎవరికీ నేను ఏమీ చెప్పాలనుకోలేదు. నా స్నేహితులకు, కుటుంబానికి ఏమీ చెప్పలేదు'' అన్నారు.
ఫిర్యాదుదారు 'జే' ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడ్డారని, అవమానంగా భావించారని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఆయన మొత్తం తొమ్మిది ఆరోపణలు చేశారు. ఈ వేధింపులు మొదలైన సమయంలో ఆయన వయసు 17 ఏళ్లు.
కిక్కిరిసిన కోర్టు గదిలో ఫిర్యాదుదారు 'సి' చేసిన ఆరోపణలు కూడా ప్రస్తావించారు. ఆయన జోన్స్ వద్ద డ్రైవర్‌గా పనిచేశారు. ఇంటికి తీసుకెళ్లే సమయంలో అనేక సందర్భాల్లో జోన్స్ తన జననాంగాన్ని తాకారనడానికి సాక్ష్యమివ్వనున్నట్టు ఆయన తెలిపారు.
రేడియో స్టూడియోల్లోని లిఫ్ట్‌ల్లో జోన్స్ తరచుగా ఆయన్ను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూటర్లు చెప్పారు. ఈ చర్యలన్నీ బాధితుని అనుమతి లేకుండానే జరిగాయని తెలిపారు.
ఫిర్యాదుదారు 'సి' కి జోన్స్ అభ్యంతరకర సందేశాలు కూడా పంపారని ప్రాసిక్యూటర్లు చెప్పారు. తన కెరీర్‌కు ముప్పు రాకుండా ఉండాలంటే ఆ మెసేజ్‌లకు స్పందించక తప్పదని బాధితుడు భావించారు.
మరో బాధితుడు 17 ఏళ్ల హైస్కూల్ విద్యార్థి. జోన్స్ ఆ విద్యార్థిని తన ఫిట్జ్‌రాయ్ ఫాల్స్ ఇంటికి ఆహ్వానించారు. అక్కడ జోన్స్.. ఆ విద్యార్థిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు.
'కల్పిత ఆరోపణలు'
జోన్స్ తరఫున వాదనలు వినిపించిన డిఫెన్స్ లాయర్లు.. ఆయన ఇప్పటికే "మీడియా విచారణ"కు గురయ్యారని చెప్పారు. ప్రత్యర్థి గ్రూపులు బాధితులను ఫిర్యాదు చేయాలని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.
కొంతమంది బాధితులు కల్పిత ఆరోపణలు చేశారని, కోర్టులో ఈ ఆరోపణలు అనుమానాలకు తావులేకుండా నిరూపించాల్సి ఉంటుందని లాయర్లు చెప్పారు.
ఈ కేసులో 70 మందికి పైగా సాక్షులను విచారించే అవకాశముంది.
2024 నవంబరులో అలన్ జోన్స్‌ను మొదటిసారి పోలీసులు అరెస్టు చేశారు. 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' లో మొదట ఈ ఆరోపణలపై కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత లైంగిక దాడి ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దశాబ్దాల పాటు 2జీబీలో టాక్‌బాక్ రేడియో షోతో అలన్ జోన్స్ సిడ్నీలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా నిలిచారు.
బ్రాడ్‌కాస్టర్‌గా మారకముందు ఆయన ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1980ల మధ్యకాలంలో ఆస్ట్రేలియా జాతీయ రగ్బీ జట్టు 'వాలబీస్'కు నాలుగేళ్లపాటు కోచ్‌గా వ్యవహరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































