You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహారాష్ట్ర: మొబైల్ ఫోన్ విషయంలో వివాదం.. లోయలో పడి తండ్రీకొడుకుల మృతి, తాను కూడా దూకేసిన తల్లి
(గమనిక: ఈ కథనంలో మిమ్మల్ని కలవరపరిచే అంశాలు ఉండొచ్చు).
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా తీస్‌గావ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
ఆగస్టు 21న జరిగిన ఈ ఘటనలో మురళీధర్ దామోదర్ చాంద్‌గుడే, ఆయన భార్య సంగీత, కుమారుడు కునాల్ మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొబైల్ ఫోన్ విషయమై ఆ కుటుంబంలో వివాదం తలెత్తింది. దీంతో సమీపంలోని ఒక కొండ పైకి కునాల్ చేరుకుని, దూకేస్తానని బెదిరించాడు.
ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
(ఆత్మహత్య అనేది తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటుంటే భారత ప్రభుత్వ 'జీవన్ ఆస్తా' హెల్ప్‌లైన్ 18002333330ను ఆశ్రయించి సహాయం పొందవచ్చు. మీరు మీ స్నేహితులు, బంధువులతో కూడా మాట్లాడాలి.)
‘యువకుడికి నచ్చజెప్పేందుకు అక్కడివారు తీవ్రంగా ప్రయత్నించారు. కొండ కింద వల కూడా ఏర్పాటు చేశారు. అయితే, కునాల్ పదేపదే తన స్థానాన్ని మార్చుకుంటుండటంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ఇదే సమయంలో కునాల్ తండ్రి మురళీధర్ చాంద్‌గుడే అక్కడికి చేరుకున్నారు. తన కుమారుడిని రక్షించడానికి, కొండ అంచు నుంచి వెనక్కి లాగడానికి ఆయన ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆయన అదుపుతప్పి తన కుమారుడితో పాటు లోయలో పడిపోయారు. ఈ ఘటన కళ్లారా చూసిన తల్లి సంగీత చాంద్‌గుడే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భర్త, కుమారుడు లోయలో పడిపోవడం చూసి ఆమె కూడా దూకేశారు’ అని బీబీసీ మరాఠీ కథనంలో పేర్కొన్నారు.
పోలీసులు ఏం చెప్పారు?
ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి రామేశ్వర్ గాడే మాట్లాడుతూ.. "ఆగస్టు 21న ఖావడ్యా కొండపై ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం అందింది. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు" అని చెప్పారు.
"అతడిని కాపాడేందుకు కింద వల కూడా ఏర్పాటు చేశారు. అయితే, అతను నిరంతరం తన స్థానాన్ని మార్చుకుంటూనే ఉన్నాడు. అదే సమయంలో అతని తండ్రి అక్కడికి చేరుకుని కొడుకును రక్షించే ప్రయత్నం చేస్తుండగా ఇద్దరూ లోయలో పడిపోయారు" అని చెప్పారు.
"ఆ తర్వాత తల్లి కూడా కిందకు దూకేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు" అని తెలిపారు.
కొండ ఎత్తు సుమారు 400 నుంచి 500 అడుగుల వరకు ఉంటుందని గాడే పేర్కొన్నారు.
"మొబైల్ ఫోన్ విషయమై తలెత్తిన వివాదం మొత్తం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది" అని ఆయన అన్నారు.
పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో తీస్‌గావ్, పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.
3 గంటలు కూర్చున్నాడు: ప్రత్యక్ష సాక్షి
యువకుడు కొండ అంచున సుమారు మూడు గంటల పాటు కూర్చున్నాడని, స్థానికులు, పోలీసు అధికారులు ఎంత విజ్ఞప్తి చేసినా అతను పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షి సంజయ్ జాదవ్ చెప్పారు.
"18 ఏళ్ల యువకుడు ఇక్కడికి వచ్చి కొండ అంచున కూర్చున్నాడు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడి నుంచి కదిలేందుకు ఇష్టపడలేదు. నేను పోలీసులతో పాటు అక్కడే ఉన్నాను" అన్నారు.
సంజయ్ జాదవ్ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. "అయితే, యువకుడు ఎవరి మాట వినడానికి సిద్ధంగా లేడు. అతను తన స్థానాన్ని మార్చుకుంటూ, అదే సమయంలో తన తల్లితో మాట్లాడుతున్నాడు. అలా చేయవద్దని తల్లి వేడుకుంటోంది, అతనికి నచ్చజెబుతోంది. కానీ అతను ఆమె మాట వినే పరిస్థితిలో లేడు"
"సుమారు మూడు గంటల పాటు అతనికి నచ్చజెప్పి కిందకు రప్పించడానికి నేనూ ప్రయత్నించాను. చివరకు అతని తండ్రి కూడా అక్కడికి చేరుకున్నారు. తండ్రి అతనికి సర్దిచెప్పి సురక్షితంగా కిందకు వస్తాడని మేం అనుకున్నాం"
"కానీ, కొద్ది నిమిషాలకే తండ్రి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో యువకుడు, అతని తండ్రి కింద పడిపోయారు. ఆ తర్వాత అతని తల్లి కూడా కిందకు దూకేసింది" అన్నారు.
ముఖ్యమైన గమనిక:
- మానసిక రుగ్మతలకు మందులు, థెరపీ ద్వారా చికిత్స చేయవచ్చు. దీనికోసం మీరు మానసిక వైద్యుల సహాయం తీసుకోవాలి.
- ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
- సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)