విద్యార్థిని తుపాకీతో కాల్చిన లెక్చరర్

ఫొటో సోర్స్, Police handout
- రచయిత, లిపిక పెల్హామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
బంగ్లాదేశ్‌లో రెండు రోజుల కిందట ఓ మెడికల్ స్కూల్‌లోని క్లాస్‌లో ఒక స్టూడెంట్‌ను తుపాకీతో కాల్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌ను సస్పెండ్ చేశారు.
కాల్పులు జరిగిన కాసేపటికే పోలీసులు లెక్చరర్ రైహాన్ షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాల్పుల ఘటనకు నిరసనగా విద్యార్ధులు ఆందోళనకు దిగడంతో ఆయనను సస్పెండ్ చేశారు.
కాల్పులో గాయపడిన విద్యార్థికి ఆసుపత్రిలో సర్జరీ చేశారు. ఆయన ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
షరీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వ్యవహారంలో ఆయన వాదన తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించినప్పటికీ వీలు పడలేదు.
షరీఫ్‌కు న్యాయవాదిని కేటాయించే వరకు ఎవరూ కలవకూడదని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ ఏం జరిగింది?
అరాఫత్ అమిన్ తోమల్ అనే 23 ఏళ్ల యువకుడు సిరాజ్‌గంజ్‌లోని మెడికల్ కాలేజ్‌లో చదువుతున్నాడు.
సోమవారం అరాఫత్‌కు మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో అరాఫత్, షరీఫ్ మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ సమయంలో షరీఫ్ తన దగ్గర ఉన్న తుపాకీతో తోమల్ మోకాలిపై కాల్చినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.
తుపాకీ తూటా తోమల్ ప్యాంటు జేబులో ఉన్న మొబైల్ ఫోన్‌కు తగిలింది. అతనికి కాలి మీద పెద్ద గాయమైనట్లు పోలీసులు చెప్పారని బంగ్లాదేశ్ న్యూస్ పేపర్ డైలీ స్టార్ తెలిపింది.
ఈ సంఘటన జరిగినప్పుడు క్లాసులు రూములో 45 మంది విద్యార్థులున్నారు. కాల్పులు జరిగిన తర్వాత విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు.
లెక్చరర్ షరీఫ్‌ను లోపల ఉంచి బయట నుంచి తలుపు గడియ వేశారు. తర్వాత పోలీసులకు ఫోన్ చేశారని ఢాకా ట్రిబ్యూన్ పత్రిక తెలిపింది.
పోలీసులు షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. “అక్రమంగా తన వద్ద ఉంచిన ఆయుధంతో డాక్టర్ షరీఫ్ ఓ విద్యార్థిపై కాల్పులు జరిపారు” అని పోలీసులు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాగులో రెండు తుపాకులు, బుల్లెట్లు, కత్తులు, డాగర్లు
షరీఫ్ నుంచి రెండు తుపాకులు, 81 రౌండ్ల బుల్లెట్లు, నాలుగు మేగజైన్లు, రెండు కత్తులు, పది డాగర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఆయన దగ్గరున్న బ్యాగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
షరీఫ్ మెడికల్ స్కూలుకు వచ్చినప్పుడల్లా ఆయుధాలు తీసుకు వస్తుంటారని, పాఠాలు చెప్పే సమయంలో వాటిని ప్రదర్శిస్తుంటారని విద్యార్థులు చెప్పారు.
ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో సంచలనం రేపింది. కాల్పులు జరిగిన వెంటనే డాక్టర్ షరీఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ రెండు రోజుల వరకు ఆయనను సస్పెండ్ చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
ఆయనను ఉద్యోగం నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని విద్యార్థులు ఆందోళనకు దిగిన తర్వాతనే ప్రభుత్వం డాక్టర్ షరీఫ్‌ను సస్పెండ్ చేసింది. ఈ సంఘటనపై విచారించేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో ఇలాంటి సంఘటనలు అరుదు. అక్కడ తుపాకులు కలిగిఉండటం, వాటిని ఉపయోగించడంపై కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- రాధికా మర్చంట్: ముకేశ్ అంబానీ కోడలవుతున్న ఈ అమ్మాయి ఎవరు?
- కోల్‌కతా: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణానికి వందేళ్ల కిందటే ప్లాన్
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























