సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు, ఆయన భార్య ఏమన్నారంటే..

నిరాహార దీక్ష, సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ, జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, Reuters

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

నీట్ సహా పరీక్ష పత్రాల లీకేజీకి నిరసనగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను దిల్లీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

శనివారం తెల్లవారుజామున ఆయన్ను జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు.

నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలకు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష 21వ రోజుకు చేరుకుంది.

సోనమ్ వాంగ్‌చుక్ తరలింపు నేపథ్యంలో జంతర్ మంతర్ దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

దీనిపై న్యూదిల్లీ డీసీపీ ఎక్స్‌ ద్వారా స్పందించారు. "సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో దిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్యు నిపుణుల సలహాల మేరకు అవసరమైన వైద్య సంరక్షణ కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించాం" అని న్యూదిల్లీ డీసీపీ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిరాహార దీక్ష, సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ, జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు
ఫొటో క్యాప్షన్, సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి

కుటుంబ సభ్యులేమంటున్నారు?

సోనమ్ అనుమతి లేకుండా ఆయనకు నోటి ద్వారా గానీ, శరీరంలోకి ఎక్కించడం ద్వారా గానీ ఏమీ ఇవ్వకూడదని సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో అన్నారు.

"నేను దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉన్నాను. ఇక్కడే సోనమ్ వాంగ్‌చుక్‌ను చేర్పించారు. గత 20 రోజులుగా ఆయన్ను పర్యవేక్షిస్తున్న వైద్యులు, నేను, మా కుటుంబం అంగీకారం తెలిపే వరకు ఆయనకు నోటి ద్వారా గానీ, శరీరంలోకి ఎక్కించడం ద్వారా గానీ ఎలాంటి మందులు లేదా ద్రవాలు ఇవ్వవద్దు" అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

నిరాహార దీక్ష, సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ, జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, PTI

‘అభిజీత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్ష’

అభిజీత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నారని కాక్రోచ్ జనతా పార్టీ 'ఎక్స్' అకౌంట్ నుంచి ప్రకటన వెలువడింది.

ఈ నెల 20న ప్రతిపాదించిన 'చలో పార్లమెంట్' యాత్ర షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని సీజేపీ తెలిపింది.

సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే స్పదించారు.

నిరసన ప్రదేశం దగ్గర నుంచి తాను కాసేపు బయటకు వెళ్లానని ఆయన చెప్పారు.

"ఉదయం 7 గంటలకు నేను స్నానం చేసి రావడానికి ఇక్కడి నుంచి వెళ్లినప్పుడు పోలీసులు వచ్చి సోనమ్ సార్‌ను బలవంతంగా తీసుకెళ్లారు. నిరాహార దీక్ష చేస్తున్న 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లారు. నేను నా స్నేహితుని ఇంటి నుంచి జంతర్ మంతర్‌కు వస్తుండగా ఈ సంగతి తెలిసింది" అని అభిజిత్ దీప్కే అన్నారు.

"పోలీసులు నాపై కూడా దాడి చేశారు. నేను విదేశాల నుంచి నా దేశానికి తిరిగి వచ్చాను. నేనేమైనా నేరస్తుడినా?" అని ప్రశ్నించారు.

సోనమ్ వాంగ్‌చుక్ తన నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించినప్పటి నుంచి తొమ్మిది కేజీలకు పైగా బరువు తగ్గారు. త్వరలోనే ఆయన పరిస్థితి విషమించవచ్చని, అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు.

సోనమ్ మానసికంగా చురుగ్గా ఉన్నారని, ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని నిరాహార దీక్ష 19వ రోజున(ఈ నెల 16) ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ సతీశ్ లంబా వివరించారు. సోనమ్ పరిస్థితి ఎప్పుడైనా క్షీణించే అవకాశం ఉండడంతో వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

నిరాహార దీక్ష, సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ, జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, న్యూదిల్లీ డీసీపీ సచిన్ శర్మ

‘దిల్లీ హైకోర్టు ఆదేశాలతో’

''హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తుండగా నిరసనకారులు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప గందరగోళం నెలకొంది. మేం అత్యంత సంయమనంతో వ్యవహరించాం. మొత్తం ప్రక్రియను సురక్షితంగా పూర్తి చేశాం. జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు వీలైనంత త్వరగా, శాంతియుతంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం'' అని మరో పోస్ట్‌లో దిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని దిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నిరసన విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి.

వాంగ్‌చుక్ పరిస్థితి విషమించక ముందే ఆయనకు బలవంతంగా ఆహారం అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం వైద్యుల అభిప్రాయం ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

నిరాహార దీక్ష జరుగుతున్న ప్రదేశం నుంచి పార్లమెంటు వరకు జులై 20న పాదయాత్రకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమానికి కొద్దిరోజుల ముందు కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా, పరీక్షా విధానంలో సంస్కరణలు వంటి డిమాండ్లు ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం.

నిరాహార దీక్ష, సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ, జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, @abhijeet_dipke

ఫొటో క్యాప్షన్, గత 20 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.

ప్రతిపక్ష పార్టీల విమర్శలు

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ దిల్లీ పోలీసుల చర్యను విమర్శించారు. "ఇదేం గూండాయిజం? మోదీజీ, ఈ అధికార దురహంకారం ఎక్కువ కాలం నిలవదు. మీరు బలవంతంగా వాడుకుంటున్న యువతే మిమ్మల్ని గద్దె దించుతారు. గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను, ఆయన డిమాండ్లు వినకుండా బలవంతంగా అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు" అని ఎక్స్‌లో విమర్శించారు.

సోనమ్ వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లడాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ నిరసించారు.

"సోనమ్ వాంగ్‌చుక్‌ను బలవంతంగా తరలించడం ఒక వ్యక్తిపై తీసుకున్న చర్య మాత్రమే కాదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాయడమే. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు శాంతియుత నిరసనలను కూడా సహించలేని స్థితికి చేరుకుంది. ఇది నియంతృత్వం" అని డింపుల్ యాదవ్ అన్నారు.

" తాము వైద్యుల బృందమని చెప్పుకుంటూ 10 మంది పోలీసులు లోపలికి వచ్చారు. వారు వైద్యుల్లా కనిపించకపోవడంతో మాకు అనుమానం వచ్చింది. వలంటీర్లందరినీ ఆ ప్రాంతం విడిచి వెళ్లమని వాళ్లు చెప్పారు. సోనమ్‌కు 8:45 గంటలకు వైద్య పరీక్ష ఉంది కాబట్టి మీరు ఆ సమయానికి రావాలన్నారు" అని వలంటీర్లు చెప్పారు.

"అకస్మాత్తుగా వాళ్లు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పడం మొదలుపెట్టారు. సోనమ్‌ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాల్సిందేనని అన్నారు " అని జంతర్ మంతర్ వద్ద ఉన్న ఒక వ్యక్తి ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

"అభిజీత్ దీప్కే బయటికి వెళ్లినప్పుడు పోలీసులు ఇలా చేశారు. ఆయన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందుకే ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు. ఆయన ఫోన్ అందుబాటులో లేదు. పోలీసులు నిరసనకారులపై కూడా దాడి చేశారు. కొందరు సివిల్ డ్రెస్‌లో వచ్చి మీరు ఇక్కడినుంచి వెళ్లిపోవాలన్నారు. ఈ ఘర్షణలో కొందరు గాయపడ్డారు" అని ఆయన చెప్పారు.

నిరాహార దీక్ష, సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ, జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

జంతర్ మంతర్ నుంచి తరలించే ముందు వాంగ్‌చుక్ ఏం చెప్పారు?

ఆమరణ నిరాహార దీక్ష 20వ రోజు ముగిసిన సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో వాంగ్‌చుక్, ప్రజల భాగస్వామ్యమే ఉద్యమానికి అతిపెద్ద బలం అని పేర్కొన్నారు. ఈ నెల 20న జరిగే సీజేపీ పార్లమెంట్ మార్చ్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

"అవును, నేను ఇంకా బతికే ఉన్నాను. నా శరీరంలో 20 శాతం ఇప్పటికే క్షీణించింది. మొదట కొవ్వు తగ్గింది. ఆ తర్వాత కండరాలు క్షీణించాయి. తర్వాత అవయవాలు దెబ్బతింటాయి. చివరికి మెదడు. ఆ దశ ఇంకా రాలేదు'' అని అన్నారు.

"20వ రోజు ముగియబోతోంది. నా మెదడు ఇంకా సరిగ్గానే పనిచేస్తోందని నిరూపించుకోవాలనుకుంటున్నాను'' అని చెప్పారు.

ఈ ఉద్యమం వల్ల జవాబుదారీతనం వస్తుందా? లేదా? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? అని అడగ్గా, ప్రజా ఉద్యమాల శక్తిని తక్కువ అంచనా వేయొద్దని సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు.

"నేను మిమ్మల్ని అడుగుతున్నాను. భారత ప్రజలు తమ పిల్లల ప్రాణాలను, చదువును ఎక్కువగా ప్రేమిస్తారా? లేక ఉల్లిపాయలను ఎక్కువగా ప్రేమిస్తారా?"

పెరుగుతున్న ఉల్లి ధరలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం కారణంగా ఉద్యమాలు జరిగి గతంలో ప్రభుత్వాలు కూలిపోయాయని ఆయన గుర్తు చేశారు.

"భారత్‌లో ప్రజా ఉద్యమాల కారణంగా ప్రభుత్వాలు మూడుసార్లు పడిపోయాయి. 1980లో కేంద్ర ప్రభుత్వం, 1998లో దిల్లీ ప్రభుత్వం, అదే సంవత్సరంలో రాజస్థాన్ ప్రభుత్వం కూడా పడిపోయాయి. ఆ ఉద్యమం దేని గురించి? ఉల్లి ధరల గురించి" అని సోనమ్ అన్నారు.

నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని, పరీక్షల కుంభకోణాలపై న్యాయ విచారణ జరపాలని, పరీక్షా విధానంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జూన్ 20 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతోంది.

సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న ఈ ఉద్యమంలో చేరి అప్పటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)