స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్, రమేశ్ పోఖ్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్.. విద్యా శాఖలో ఏ మంత్రీ ఎక్కువ కాలం ఎందుకు నిలవలేకపోయారు?

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty Images
- రచయిత, శివాంగి జైస్వాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
విద్యార్థుల నిరసనల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో ఆయన మోదీ ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖలో గడువు ముగియక ముందే బాధ్యతల నుంచి తప్పుకున్న మంత్రుల జాబితాలో చేరిపోయారు.
భారత విద్యా వ్యవస్థపై జంతర్ మంతర్ వద్ద మొదలైన ప్రశ్నలు, వారం రోజుల్లోనే దేశవ్యాప్త యువజన ఆందోళనగా మారాయి. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లను ఆమోదించిన తర్వాత ఈ ఉద్యమ ముగింపును ప్రకటించారు.
అయితే, ఈ ఉద్యమం భారత విద్యా వ్యవస్థ, పరీక్షల నిర్వహణ తీరు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఒక కొత్త చర్చకు తెరలేపింది. ఇప్పుడు ప్రశ్నలు కేవలం ప్రస్తుత విద్యాశాఖ మంత్రిపైనే కాకుండా, మోదీ ప్రభుత్వ హయాంలో విద్యా మంత్రిత్వ శాఖ నడిచిన మొత్తం దిశపైనే వ్యక్తమవుతున్నాయి.
2014 నుంచి ఇప్పటివరకు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్, రమేశ్ పోఖ్రియాల్ 'నిశంక్', ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలో విద్యా మంత్రిత్వ శాఖ సరికొత్త విద్యా విధానాన్ని, సంస్థాగత మార్పులను, భావజాలపరమైన ఎన్నో చర్చలను చూసింది.
ఈ సంవత్సరాలలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కంటే భావజాల మార్పులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శకులు ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం దీనిని ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాత్మక సంస్కరణల ప్రక్రియగా పేర్కొంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో, మోదీ హయాంలోని నలుగురు విద్యాశాఖ మంత్రుల పాత్రను ఏ కోణంలో చూడాలనే ప్రశ్నను ప్రస్తుత వివాదం మరోసారి తెరపైకి తెచ్చింది.
12 ఏళ్ల మోదీ ప్రభుత్వంలో విద్యా మంత్రిత్వ శాఖ మాత్రమే నలుగురు వేర్వేరు మంత్రుల మారిన ఏకైక కీలక శాఖగా నిలిచింది. అదే సమయంలో హోం, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, రక్షణ, ఆరోగ్య వంటి మంత్రిత్వ శాఖలలో మాత్రం దాదాపు స్థిరత్వం కొనసాగింది.
ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ ముగ్గురు మాజీ విద్యాశాఖ మంత్రులు పదవుల నుంచి తప్పుకున్న కొద్ది సంవత్సరాలకే వివిధ కారణాల వల్ల కేంద్ర క్యాబినెట్ నుంచి కూడా పూర్తిగా కనుమరుగయ్యారు.
ఎందుకింత అస్థిరత?
బీజేపీ, ఆరెస్సెస్ రాజకీయాలను నిశితంగా గమనించే సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది మాట్లాడుతూ, "విద్య, సంస్కృతి, సమాచార-ప్రసార శాఖలు... ఇలాంటి కొన్ని ఎంపిక చేసిన మంత్రిత్వ శాఖలను సాఫ్ట్ పవర్‌గా చూస్తారు. ఇవి సంఘ్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత కీలకమైనవి. అందుకే ఇక్కడ వివాదాలు ఎక్కువగా జరిగాయి, అంతే స్థాయిలో అస్థిరత కూడా కనిపిస్తుంది" అన్నారు.
సమాచార-ప్రసార శాఖలో గత 12 ఏళ్ల వ్యవధిలో ఏడుగురు కేంద్ర మంత్రులు, సంస్కృతి మంత్రిత్వ శాఖలో ఐదుగురు కేంద్ర మంత్రులు మారారు.
మోదీ ప్రభుత్వ మొదటి విడత పదవీకాలంలో స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్ మానవ వనరుల వికాస మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహించారు. మోదీ 2.0 హయాంలో ఈ బాధ్యత రమేశ్ పోఖ్రియాల్ నిశంక్‌కు దక్కింది.
అయితే, 2021లో జరిగిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియమించారు. ఆయన రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు నెల రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు కూర్చున్నారు, చివరికి కేంద్ర ప్రభుత్వం ఆ ఒత్తిడికి తలొగ్గింది.
దీనికంటే ముందు, పార్లమెంటులో నీట్ లీక్ వ్యవహారంపై చర్చ జరపడానికి మోదీ ప్రభుత్వం అంగీకరించింది, కానీ, రాజీనామా డిమాండ్‌ను చర్చకు షరతుగా పెట్టవద్దని ప్రతిపక్షాలకు కోరుతూ వచ్చింది.

ఫొటో సోర్స్, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images
ధర్మేంద్ర ప్రధాన్ హయాం.. వివాదాలు, విమర్శలు
విజయ్ త్రివేది అభిప్రాయం ప్రకారం, "ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సుముఖంగా లేకపోవడానికి కారణం... ఆయనకు సంఘ్ ఆశీస్సులు ఉండటమే".
"నీట్ పరీక్ష లీక్ కేసును పక్కన పెడితే, సంఘ్‌కు సంబంధించిన అన్ని ప్రధాన లక్ష్యాలను ధర్మేంద్ర ప్రధాన్ ఎలాంటి హడావుడి లేకుండా అమలు చేయడంలో విజయం సాధించారని గ్రహిస్తారు. ఆయన కంటే ముందున్న మంత్రులు దీని కోసం గట్టిగా ప్రయత్నించి వివాదాల్లో చిక్కుకున్నారు" అని విజయ్ త్రివేది చెప్పారు.
2014లో ఏర్పాటైన మొదటి మోదీ క్యాబినెట్లో ధర్మేంద్ర ప్రధాన్‌ను పెట్రోలియం శాఖ మంత్రిగా నియమించారు. ఆ తర్వాత మోదీ 2.0లో ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యారు, మోదీ 3.0 పదవీకాలంలోనూ ఆ బాధ్యతల్లోనే కొనసాగారు.
ఆయన పదవీకాలంలో జాతీయ విద్యా విధానానికి ఊతం లభించింది. మాతృభాష, పలు భాషల్లో విద్యను ఆయన ప్రోత్సహించారు. కానీ, త్రిభాషా సూత్రంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో సుదీర్ఘకాలం పాటు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచారు.. రాజకీయ జోక్యం, 'హిందీ రుద్దడం' లాంటి ఆరోపణలను ప్రత్యర్థులు ఆయనపై గుప్పించారు, దీనివల్ల విద్యా విధానం కేంద్రం వర్సెస్ రాష్ట్రాల వివాదంగా మారింది.
అయితే, 'ది హిందూ' అసోసియేట్ అండ్ పొలిటికల్ ఎడిటర్ నిస్తులా హెబ్బార్ బీబీసీ వీక్లీ ప్రోగ్రాం 'ది లెన్స్'లో మాట్లాడుతూ... "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ విషయంలో బీజేపీకి వేరే రాజకీయ ప్రత్యామ్నాయాలు లేకుండా పోయాయి. ఎందుకంటే, ఇది నేరుగా మధ్యతరగతి, కొత్త మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన అంశం. నీట్ లీక్, సీబీఎస్ఈ ఓఎస్ఎమ్ల వల్ల ఈ వర్గాలే తీవ్రంగా నష్టపోయాయి" అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Vipin Kumar/Hindustan Times via Getty Images
విద్యా విధానంలో మార్పులు
"మోదీ హయాంలోని నలుగురు విద్యాశాఖ మంత్రులను ఒకే కొలమానంతో చూడాలి. ఎందుకంటే, తమ సొంత ఆలోచనలను అమలు చేసే స్వేచ్ఛ ఎవరికీ లేదు. వ్యూహాలన్నీ పైస్థాయిలోనే రూపొందేవి. అయితే, వాటిని అమలు చేసే విధానం మాత్రం ఒక్కో మంత్రికి ఒక్కోలా ఉండేదనేది నిజం. ఉదాహరణకు స్మృతి ఇరానీ చాలా దూకుడుగా వ్యవహరించేవారు, జావదేకర్ వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించే వ్యక్తి" అని జర్నలిస్ట్ శరద్ గుప్తా అన్నారు.
మోదీ పాలనలో విద్యాశాఖలో అవలంబించిన విధానాలన్నీ వామపక్ష భావజాలాన్ని తొలగించే లక్ష్యంతోనే అమలయ్యాయని శరద్ గుప్తా పేర్కొన్నారు.
"భారత విద్యా వ్యవస్థ నుంచి వామపక్ష విద్యా విధానాన్ని తొలగించడమే సంఘ్ ప్రధాన లక్ష్యం. ఎందుకంటే సంఘ్ భావన ప్రకారం, వామపక్షాలు మొఘలులకు మద్దతుగా నిలిచారు. వారి దృష్టిలో మొఘలులు దురాక్రమణదారులు, దేశంలోని ముస్లిం జనాభా వారి వారసులే. సంఘ్ తనకున్న అనేక అనుబంధ సంస్థలలో ఒకటైన బీజేపీ ద్వారా ఈ పనిని చేయిస్తోంది" అని అన్నారు.
మోదీ పాలనలో విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించిన విధానాలను ఈ కోణంలోనే చూడాలని శరద్ గుప్తా వాదిస్తున్నారు. మరోవైపు, విజయ్ త్రివేది కూడా సంఘ్ నిర్దేశించుకున్న ఈ లక్ష్యమే మోదీ ప్రభుత్వంలోని నలుగురు విద్యాశాఖ మంత్రుల ఎంపికకు ప్రాతిపదికగా భావిస్తున్నారు.
"స్మృతి ఇరానీని పక్కన పెడితే, మిగిలిన ముగ్గురు విద్యాశాఖ మంత్రులు ప్రకాశ్ జావదేకర్, రమేశ్ పోఖ్రియాల్ 'నిశంక్', ధర్మేంద్ర ప్రధాన్ ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చినవారే. వాజపేయి హయాంలో కూడా సంఘ్ నేపథ్యం ఉన్న మురళీ మనోహర్ జోషిని విద్యాశాఖ మంత్రిగా నియమించారని, ఈ మంత్రిత్వ శాఖలో సంఘ్ తన జోక్యాన్ని ఎప్పుడూ కోరుకుంటుందనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది" అని విజయ్ త్రివేది వివరించారు.
స్మృతి ఇరానీ కాలం.. డిగ్రీలు, వివాదాల పర్వం
2014లో స్మృతి ఇరానీని మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) మంత్రిగా నియమించినప్పుడు, ఆమె రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయిన తర్వాత క్యాబినెట్లో భాగమయ్యారు.
మోదీ రెండవ విడత పదవీకాలంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరును మార్చారు. జాతీయ విద్యా విధానంలోని ప్రధాన సిఫార్సులలో భాగంగా 'విద్యపై మరింత దృష్టి పెట్టడానికి' కేంద్ర ప్రభుత్వం ఈ మార్పు చేసింది.
1985 కంటే ముందు ఈ శాఖను 'విద్యా మంత్రిత్వ శాఖ' అనే పిలిచేవారు. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పాలనలో దీని పేరును మార్చారు. అప్పట్లో 'విద్యను మరింత విస్తృత కోణంలో చూడటం' దీని వెనుక ఉన్న ఉద్దేశంగా చెప్పారు.
2014 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, స్మృతి ఇరానీ చదువు 12వ తరగతి వరకే సాగింది. దీనిని కాంగ్రెస్ ఒక పెద్ద అంశంగా మార్చింది. అయితే, ఆమె పార్లమెంటులో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తన వాదనను చాలా స్పష్టంగా, బలంగా వినిపిస్తారని చెబుతూ బీజేపీ ఈ విమర్శలను తోసిపుచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తులలో స్మృతి ఇరానీ ఒకరిగా గుర్తింపు పొందారు. బీబీసీ ప్రతినిధి జుబేర్ అహ్మద్ 2016 నాటి రిపోర్ట్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది.
కానీ, మోదీ 1.0 హయాంలో జరిగిన క్యాబినెట్ విస్తరణలో ఇరానీని జౌళి మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. అంతకుముందే ఆమె పేరుతో డిగ్రీ వివాదం, జేఎన్‌యూ వివాదం, రోహిత్ వేముల ఆత్మహత్య వంటి తీవ్ర వివాదాలు ముడిపడి ఉన్నాయి.
విజయ్ త్రివేది మాట్లాడుతూ, "స్మృతి ఇరానీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి రాలేదు. ఆర్ఎస్ఎస్ ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. సంఘ్ ఎలాంటి హడావుడి చేయదు. అందుకే, ప్రశాంతమైన ఇమేజ్ ఉన్న ప్రకాశ్ జావదేకర్కు ఈ మంత్రిత్వ శాఖను అప్పగించారు" అని విశ్లేషించారు.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతే నూతన విద్యా విధానంపై కసరత్తు మొదలైంది.
మంత్రిత్వ శాఖలో స్మృతి ఇరానీ పదవీకాలంలో నూతన విద్యా విధానానికి సంబంధించిన పనులు ప్రారంభం కాగా, మోదీ హయాంలోని మూడవ విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ 'నిశంక్' సమయంలో దీనిని అమలు చేశారు.
2016 నాటి బీబీసీ కథనం ప్రకారం... "నూతన విద్యా విధానాన్ని రూపొందించడంలో, దానిని అమలు చేయడంలో జరిగిన ఆలస్యం పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూడా ఆమె (స్మృతి) పనితీరుపై పెద్దగా సంతృప్తిగా లేదు".

ఫొటో సోర్స్, Sushil Kumar/Hindustan Times via Getty Images
తగ్గుతున్న బడ్జెట్..
భారతదేశంలో నూతన విద్యా విధానం 34 సంవత్సరాల తర్వాత 2020లో అమల్లోకి వచ్చింది. దీనిని మోదీ పదవీకాలంలో ఒక పెద్ద అడుగుగా భావిస్తారు. నూతన విద్యా విధానంలో విద్యా బడ్జెట్‌ను జీడీపీలో ఆరు శాతంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇటీవలి 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం, కేంద్ర బడ్జెట్లో విద్యా మంత్రిత్వ శాఖ వాటా గత 12 ఏళ్లలో వేగంగా క్షీణించింది. ఈ వాటా 2013-14లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 4.6 శాతం ఉండగా, 2025-26 నాటికి 2.5 శాతానికి పడిపోయింది.
విద్యకు బడ్జెట్ తగ్గడమే మోదీ ప్రభుత్వం విద్యా సంస్కరణలపై తీవ్రంగా లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోందని సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ భావజాలంపై మేధోపరమైన లోపం ఉందనే ఆరోపణలు వస్తుంటాయి" అని అన్నారు.
వామపక్షాల కోటగా పిలిచే జేఎన్‌యూలో సంఘ్ సుదీర్ఘకాలంగా తన ప్రభావాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోందని, చివరికి వారు విజయం సాధించారని శరద్ గుప్తా చెప్పారు.
"నలుగురు విద్యాశాఖ మంత్రుల హయాంలో దాదాపు ప్రతి విశ్వవిద్యాలయంలోనూ అధ్యాపకుల ఎంపికలో భావజాలానికే పెద్దపీట వేశారు. ఈ విధంగా భవిష్యత్తులో ప్రభుత్వం మారినప్పటికీ, కనీసం రెండు తరాల పాటు విద్యా సంస్థలపై సంఘ్ తన ప్రభావాన్ని నిలుపుకోగలుగుతుంది" అన్నారు.
విజయ్ త్రివేది మాట్లాడుతూ, "ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనా వ్యాసాలు అన్నీ సంఘ్ భావజాలానికి సంబంధించిన అంశాలపైనే సాగుతున్నాయి. ఆ తర్వాత వారే లెక్చరర్లుగా మారుతున్నారు" అని పేర్కొన్నారు.
వామపక్షాల పట్టుగా భావించే జేఎన్‌యూలో 2022లో శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. ఈ విశ్వవిద్యాలయ చరిత్రలోనే తొలి మహిళా వైస్ ఛాన్సలర్‌గా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో తనకున్న అనుబంధాన్ని బహిరంగంగా అంగీకరించిన వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు.
మోదీ ప్రభుత్వ రెండవ విడత విద్యాశాఖ మంత్రి (అప్పటి హెచ్ఆర్డీ శాఖ) ప్రకాశ్ జావదేకర్ పదవీకాలంలో... పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో కశ్మీరీ విద్యార్థులపై హింస జరిగినట్లు వార్తలు వచ్చాయి.
బీబీసీ అప్పట్లో దీనిపై జావదేకర్‌ను ప్రశ్నించగా, ఆయన ఆ సంఘటనలను తిరస్కరించారు. ఆయన కాలంలోనే సీబీఎస్ఈ 10వ, 12వ తరగతుల పేపర్లు లీక్ అయ్యాయనే ఆరోపణలు రావడం వల్ల, మంత్రిత్వ శాఖ వాటిని తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అప్పట్లో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళనలూ చేశారు.
అయితే, ఆయన హయాం 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్', ఎన్టీఏ స్థాపన వంటి కీలక నిర్ణయాలకు కూడా గుర్తింపు పొందింది.
అయితే, ఏ ఎన్టీఏ నిర్వహించిన నీట్ పరీక్షలో లీకేజీల వ్యవహారం తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు సాగాయో, ఆ సంస్థను ఏర్పాటు చేసిందీ ఈయన కాలంలోనే.
"నిశంక్ విషయానికి వస్తే, సంఘ్ నుంచి వచ్చిన ఒక పండితుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. సంఘ్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం ఆయనకు ఉంది" అని విజయ్ త్రివేది అన్నారు.
అయినప్పటికీ, తన అశాస్త్రీయ ప్రకటనల వల్ల రమేశ్ పోఖ్రియాల్ వివాదాల్లో చిక్కుకున్నారు. 'చరక మహర్షి అణు-పరమాణువులను కనుగొన్నారు' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
కోవిడ్ సమయంలో జేఈఈ-నీట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయనపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనికి వ్యతిరేకంగా పౌరులు కోర్టుకు కూడా వెళ్లారు, అక్కడ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. అయితే, అప్పట్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు, ఇది వివాదాస్పదమైంది.
నూతన విద్యా విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యపై నియంత్రణను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలు రమేశ్ పోఖ్రియాల్ కాలంలోనూ వచ్చాయి, అయితే వీటిని ఆయన ఖండించారు.
"విద్యపై రైట్ వింగ్ భావజాలం ఆధిపత్యం వల్లే, కొన్ని సందర్భాల్లో భారతీయ విద్యార్థులకు ఉపాధి పొందే నైపుణ్యాలు లేవని చెప్పడం జరిగింది" అని శరద్ గుప్తా అన్నారు.
కోవిడ్ బారిన పడిన తర్వాత, అనారోగ్య కారణాల వల్ల రమేశ్ పోఖ్రియాల్ తన పదవికి రాజీనామా చేశారని అంటారు. కానీ, ఆ తర్వాత ఆయన మోదీ క్యాబినెట్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఆ స్థానంలో ధర్మేంద్ర ప్రధాన్ 2021 నుంచి జూలై 2026 వరకు ఈ బాధ్యతలను నిర్వహించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























