'మా నాన్న కల నెరవేర్చడానికి.. కార్ల మీదే సముద్రాన్ని దాటేశాం' అంటున్న యువకుల కథ

ఫొటో సోర్స్, Autonauti
- రచయిత, విబెకే వెనెమా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
అది 1999 ఆగస్టు 17.
అట్లాంటిక్ మహాసముద్రంలో బార్బడోస్‌కు 1200 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ సిబ్బందికి ఒక వింత దృశ్యం కనిపించింది. నీటిపై తేలుతున్న రెండు చిన్న కార్లు (ఒకటి వోక్స్‌వ్యాగన్ పస్సాట్, మరొకటి ఫోర్డ్ టానస్), వాటిపై ఇద్దరు యువకులు కూర్చుని ఉన్నారు.
ఆ ఇద్దరూ ఇటలీకి చెందిన 23 ఏళ్ల మార్కో అమోరెట్టి , 21 ఏళ్ల మార్కో డి కాండియా. వారు దాదాపు నాలుగు నెలల కిందట కానరీ దీవుల్లోని 'లా పాల్మా' నుంచి బయలుదేరారు.
ఆ కార్ల వైపు వచ్చిన ట్యాంకర్ కెప్టెన్, అసలు అవి ఏ రకమైన వాహనాలని ఆశ్చర్యంగా అడిగారు.
"మాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆయన మా కార్ల నెంబర్ ప్లేట్లు అడుగుతున్నారా అనిపించింది" అని మార్కో అమోరెట్టి అన్నారు. ఆ ఓడ సిబ్బంది వారికి కొన్ని నీళ్లు, పండ్లు ఇచ్చి పంపగా, ఆ ఇద్దరు యువకులు నవ్వుతూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు.

తండ్రి కల
అసలు వారు ఈ ప్రయాణాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
కార్ల ద్వారా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటాలనేది మార్కో అమోరెట్టి తండ్రి జార్జియో అమోరెట్టి చిరకాల కోరిక. ఫోటో జర్నలిస్టు, ఇంకా సాహస యాత్రలంటే ఇష్టపడే జార్జియో... గతంలో కారుకు పారాచూట్ కట్టి సహారా ఎడారిని దాటడం లాంటి వింత సాహసాలు చేసి ప్రసిద్ధి చెందారు. చిన్నప్పుడు మార్కోకు తన తండ్రి ఒక సూపర్ హీరోలా కనిపించేవారు.
జార్జియో ఇటలీలో తన విప్లవాత్మక ఆలోచనల ద్వారా వార్తల్లో నిలిచేవారు. ఆ రోజుల్లోనే ఆయన తన ఆరుగురు పిల్లలకు ఇంట్లోనే చదువు చెప్పించారు. అలాగే పిల్లలను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండే తల్లులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాలనీ పోరాడారు.

ఫొటో సోర్స్, Autonauti
ఈ సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఆయన వినూత్న ప్రచారాలు చేసేవారు. అందులో భాగమే ఈ సముద్ర ప్రయాణం. సముద్రంలో ప్రయాణించడానికి వీలుగా ఒక పాత కారును మార్చడానికి ఆయన ఎన్నో ఏళ్లు శ్రమించారు. తోటలో ఆ కారు నమూనాను తన తండ్రి తయారు చేస్తుండగా చూస్తూ పెరిగారు మార్కో.
"ఆ కారు ఒక ఫాంటసీ కథలోని పాత్రలా ఉండేది. అది మా కల" అని మార్కో అన్నారు.
1978లో ఈ 'సముద్రపు కారు'ను కానరీ దీవుల దగ్గర జార్జియో నడపడానికి ప్రయత్నించినప్పుడు అధికారులు అడ్డుకున్నారు. అయితే, 1988లో ఫ్రాన్స్‌లోని డు మిడీ కాలువలో దీనిని నడిపారు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడమే లక్ష్యంగా పెట్టుకున్నా, ఆర్థిక ఇబ్బందుల వల్ల అది సాధ్యం కాలేదు.

ఫొటో సోర్స్, Autonauti
చివరి ప్రయత్నం
1998 నవంబర్‌లో జార్జియో క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయన కొన్ని నెలలు మాత్రమే బతుకుతారని వైద్యులు చెప్పారు. ఇది చూసిన జార్జియో కొడుకులు మార్కో, మౌరో, ఫాబియో ఎలాగైనా తండ్రి కలను నిజం చేయాలనుకున్నారు.
వారు వెంటనే రెండు పాత కార్లను తీసుకుని, వాటికి మెటల్ కీల్స్ (పడవ అడుగుభాగంలో మధ్యగా ఉండే పొడవైన ఇనుప దిమ్మె, భారీ అలలు వచ్చినప్పుడు కారు/పడవ పక్కకు పల్టీ కొట్టకుండా, బరువును బ్యాలెన్స్ చేస్తుంది), తెరచాపలు కట్టే స్తంభాలు, సౌరశక్తితో పనిచేసే శాటిలైట్ ఫోన్‌ను అమర్చారు.
"ఆ మార్పులు చట్టబద్ధమో కాదో మాకు తెలియదు, అందుకే వాటిని సాధ్యమైనంత వరకు ఎవరికీ తెలియకుండా దాచాం" అని మార్కో చెప్పారు.
వాళ్లు ఆ కార్లను కానరీ దీవులకు నడుపుకుంటూ వెళ్లి, ఒక రహస్య ప్రదేశంలో తుది మార్పులు చేశారు. కార్లు నీటిపై తేలడానికి వీలుగా వాటిలో పాలీయురేథేన్ నింపారు. కారు పైన పడుకోవడానికి వీలుగా ఒక చిన్న టెంట్, ఆహారం, నీరు సిద్ధం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Autonauti
జార్జియో కూడా ఈ ప్రయాణంలో పాల్గొనాలనుకున్నారు. కానీ, ఆరోగ్యం క్షీణించడంతో, తన స్థానాన్ని ఫ్యామిలీ ఫ్రెండ్ మార్కో డి కాండియాకు ఇచ్చారు.
జార్జియో వారితో "మీరు ఇంకా యువకులు, నా ప్రాజెక్ట్‌ను మీకు బహుమతిగా ఇస్తున్నాను, ముందుకు తీసుకెళ్లండి" అన్నారు.

ఫొటో సోర్స్, Autonauti
సముద్ర ప్రయాణం ప్రారంభం
1999 మే 4న చీకటి పడ్డాక, నలుగురు సాహసికులు లా పాల్మా దక్షిణ సరిహద్దు నుంచి కార్లను సముద్రంలోకి దించారు. అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించడానికి చిన్న ఇంజిన్లను ఉపయోగించారు. ఇంధనం అయిపోయాక, గాలి తరంగాల సహాయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.
మొదటి రాత్రి ఎంతో ఉత్సాహంగా గడిచినా, కార్లు అనుకున్న సముద్ర ప్రవాహాన్ని అందుకోలేకపోయాయి. 11 రోజులపాటు ఒకేచోట గుండ్రంగా తిరుగుతూ ఉండిపోయాయి.
సముద్ర ప్రయాణం సరిపడక (మోషన్ సిక్‌నెస్ ), తీవ్ర అలసట చెందడంతో ఫాబియో, మౌరోలను హెలికాప్టర్ ద్వారా రక్షించాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Autonauti
మిగిలిన ఇద్దరు వెనక్కి తగ్గకుండా, ఒక్కొక్కరు ఒక కారులో ప్రయాణాన్ని కొనసాగించారు.
గాలిని అందుకోవడానికి తెరచాపలను పైకి లేపారు.
మొదటి నెలలో ఎండ, ఉప్పు నీరు, నిరంతర అలల కదలికలు, విపరీతమైన శబ్దానికి అలవాటు పడటం వారికి సవాలుగా మారింది. రెండు కార్లను కలిపి ఉంచే కేబుళ్లు తరచూ తెగిపోతుంటే, వాటిని మళ్లీ మళ్లీ కట్టాల్సి వచ్చేది.

ఫొటో సోర్స్, Autonauti
"రెండో నెల వచ్చేసరికి సముద్రం మాకేం శత్రువులా అనిపించలేదు. మేం ఆ నీటి ప్రపంచంలో భాగమైపోయాం" అని డి కాండియా చెప్పారు.
వాళ్లు రోజంతా కార్ల మరమ్మతులు చేయడం, చేపలు పట్టడం, వంట చేయడం, సంగీతం వినడం, డైరీలు రాయడంతో గడిపేవారు. విటమిన్ ‘సి’ కోసం సముద్రపు నాచును సేకరించేవారు.

ఫొటో సోర్స్, Autonauti
ఒక సాయంత్రం మార్కో తన కారు వైపు ఈదుకుంటూ వెళ్తుండగా, ఒక పెద్ద షార్క్ చేప రావడం డి కాండియా చూశారు. ఆ రోజు నుంచి ఒకరు ఈదుతున్నప్పుడు మరొకరు కాపలా కాయడం అలవాటు చేసుకున్నారు.
ప్రతిరోజూ ఇంటికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవారు.
ఒక జర్నలిస్ట్ వీరికి "ఆటోనాటి"(కార్లలో ప్రయాణించే వ్యోమగాములు) అని పేరు పెట్టారు.

ఫొటో సోర్స్, Autonauti
పాడైన శాటిలైట్ ఫోన్
మే 25న శాటిలైట్ ఫోన్ పాడైపోయింది. అయితే దీనివల్ల వారికి ఒక రకమైన స్వేచ్ఛ దొరికింది. సాంకేతికత లేని పాత కాలపు నిజమైన సాహసాన్ని అనుభవించడానికి ఆ ఫోన్ కాల్స్ ఒక అడ్డంకిగా అనిపించాయని మార్కో చెప్పారు.
కానీ, ఇటలీలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు వారు చనిపోయారని ఆందోళన పడ్డారు. మార్కో అమోరెట్టి తల్లి సెరెనెల్లా వియానెల్లో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కానీ, మంచంపై ఉన్న జార్జియో కోపంగా, "ఆ కారును ముక్కలుగా కోసినా అది నీటిపై తేలుతుంది, నమ్మకం ఉంచు" అని భార్యకు ధైర్యం చెప్పారు.

ఫొటో సోర్స్, Autonauti
సెరెనెల్లాకు ఇబ్బందులు తగ్గలేదు. కొందరు విలేఖరులు ఇదంతా ఒక నాటకం అని అనుమానించారు. ఎలాంటి రక్షణ లేకుండా పిల్లలను సముద్రంలోకి పంపినందుకు ఆ కుటుంబాన్ని విమర్శించారు. ఫోన్ పాడైన మూడు రోజులకే జార్జియో కన్నుమూశారు. జార్జియో మరణంతోనే వారితో సంబంధాలు తెగిపోవడం ఒక వింత అనుభవంలా అనిపించిందని సెరెనెల్లా చెప్పారు.
కాగా, ఫోన్ బ్యాటరీలోకి ఉప్పు నీరు చేరినట్లు మార్కో, కాండియాలు గుర్తించారు. దీంతో వారు ఒక కారులోని సోలార్ ప్యానెళ్లను తీసుకుని, రెండో కారు వరకు ఈదుకుంటూ వెళ్లి దాన్ని రిపేర్ చేశారు. ఆ కనెక్షన్లను సరిచేసి, బ్యాటరీని మళ్లీ చార్జ్ చేయడానికి వారికి వారాల సమయం పట్టింది. ఆరు వారాల నిశ్శబ్దం తర్వాత ఎట్టకేలకు ఇంటికి ఫోన్ చేయగలిగారు.
కొడుకు గొంతు వినగానే సెరెనెల్లా సంతోషపడ్డారు. కానీ, మార్కో బాధపడి ప్రయాణాన్ని ఆపేస్తాడేమోనని తండ్రి మరణవార్త చెప్పలేదు. మార్కోకి అప్పటికే అనుమానం వచ్చింది, కానీ ఎక్కువగా అడగలేదు.

ఫొటో సోర్స్, Autonauti
తుపాను సవాలు
ఆగస్టు నాటికి వారు కరేబియన్ తీరానికి చేరువయ్యారు, కానీ అదే సమయంలో ఒక పెద్ద తుపాను ముంచుకొచ్చింది. వారు 40 రోజుల్లో చేరాలనుకున్న ప్రయాణం, తప్పుడు అంచనాల వల్ల నాలుగు నెలలు పట్టడంతో, అప్పటికే తుపానుల కాలం మొదలైంది.
సమీపంలోని మార్టినిక్ కోస్ట్‌గార్డ్ అధికారులు ప్రయాణాన్ని ఆపేయాలని హెచ్చరించినా, ఆటోనాటిలు నిరాకరించారు. తాము సముద్రంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని అనుభవజ్ఞులుగా మారామని, రక్షణ కోరబోమని మార్కో చెప్పారు.
తుపాను వచ్చినప్పుడు భారీ వర్షం, బలమైన గాలులకు కార్లలోని వస్తువులన్నీ కొట్టుకుపోయినా, ఆ కార్లు మాత్రం మునగలేదు.

ఫొటో సోర్స్, Autonauti
ప్రయాణం ముగిసే కొద్దిరోజుల ముందు, తండ్రి చనిపోయిన విషయాన్ని సెరెనెల్లా తన కొడుకుకు చెప్పారు. ఆ రోజు సముద్రం వింతగా ప్రశాంతంగా మారిపోయిందని కాండియా గుర్తుచేసుకున్నారు.
కాండియా తన డైరీలో, "నా స్నేహితుడా, ధైర్యంగా ఉండు, బాధ అనే సముద్రంలో మునిగిపోకు. మనం ఒక కలని నిజం చేస్తున్నాం" అని రాశారు.
త్వరలోనే వారికి మార్టినిక్ ద్వీపం కనిపించింది.

ఫొటో సోర్స్, Autonauti
1999 ఆగస్టు 31న, సముద్రంలో 119 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారు మార్టినిక్ తూర్పు తీరంలోని టార్టేన్‌కు చేరుకున్నారు. అక్కడి ప్రజలు, విలేఖరులు, ఇటలీ నుంచి వచ్చిన మార్కో సోదరులు వారికి ఘనస్వాగతం పలికారు.
ఎన్నో నెలల తర్వాత మనుషులను చూడటం వారికి వింతగా అనిపించింది. పెరిగిన గడ్డాలు, నల్లబడిన శరీరం, సన్నబడిన కాళ్లతో వారు గ్రహాంతరవాసుల్లా కనిపించారు. కొన్నివారాల తర్వాత వారు కార్లను అక్కడే వదిలేసి ఇటలీకి తిరిగి వచ్చారు. ఆ కార్లను న్యూయార్క్ వరకు తీసుకెళ్లాలని అనుకున్నా, అది సాధ్యం కాలేదు.
తిరిగి సాధారణ జీవితానికి అలవాటు పడటం వారికి అంత సులభం కాలేదు. సముద్రంలో అనుభవించిన ఆ ఒంటరితనాన్ని, ప్రశాంతతను మళ్లీ పొందడానికి కాండియా ధ్యానం చేయడం ప్రారంభించారు. మార్కో అమోరెట్టి ఈ ప్రయాణపు డైరీలను పుస్తక రూపంలో తెచ్చారు. దీనిపై ఒక సినిమా రావాలని ఆయన ఆశిస్తున్నారు.
ఈ ఇద్దరు కుర్రాళ్లు వేరే ప్రపంచానికి చెందిన ప్రత్యేకమైన వ్యక్తులని వాళ్ల అమ్మ సెరెనెల్లా గర్వంగా చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























