పాకిస్తాన్: మతపరమైన ఘర్షణల్లో 80మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హెన్రీ ఆస్టియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలో జరిగిన మతపరమైన హింసలో 80 మందికి పైగా మరణించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆందోళనకారులతో ఏడు రోజుల కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
అఫ్గానిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని గిరిజన జిల్లా కుర్రంలో మూడు రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో దాదాపు 156 మంది వరకు గాయపడ్డారు.
గురువారం పోలీసు ఎస్కార్ట్‌తో ప్రయాణిస్తున్న షియా ముస్లిం కాన్వాయ్‌లపై సాయుధులు దాడి చేయడంతో ఈ హింస మొదలైంది. ఆ దాడిలో 40 మందికి పైగా మరణించారు, ఇది ప్రతీకార దాడులకు దారితీసింది.


ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
ఎందుకీ దాడులు?
ఈ ప్రాంతంలోని షియా, సున్నీ ముస్లింలు కొన్నేళ్లుగా గొడవలు పడుతున్నారు. ఇరువర్గాల మధ్య తరచూ భూ వివాదాలు, మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునేవి. ఈ క్రమంలోనే ఈ దాడులు జరిగాయి.
హింసను ఆపేందుకు షియా, సున్నీ నేతలు అంగీకరించారని ప్రభుత్వ ప్రతినిధి ముహమ్మద్ అలీ సైఫ్ ఆదివారం చర్చల అనంతరం ప్రకటించినట్లు రాయిటర్స్, ఏఎఫ్‌పీ వార్తాసంస్థలు తెలిపాయి.
నవంబర్ 21, 22, 23 తేదీల్లో జరిగిన దాడుల్లో 82 మంది మరణించారని, 156 మంది గాయపడ్డారని స్థానిక అధికారి ఒకరు ఏఎఫ్‌పీకి చెప్పారు.
మృతులలో 16 మంది సున్నీలు, 66 మంది షియాలు ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి తెలిపారు.

పారిపోయిన బాధితులు..
షియా ముస్లిం కాన్వాయ్‌లపై సాయుధులు దాడి చేసినప్పుడు కాన్వాయ్‌లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. సయీదా బానో అనే ప్రయాణీకురాలు బీబీసీ ఉర్దూతో మాట్లాడుతూ.. ప్రాణ భయంతో తన పిల్లలతోపాటు కారులో సీట్ల కింద దాక్కున్నానని చెప్పారు.
ఈ హింస తీవ్రమవడంతో శుక్ర, శనివారాల్లో వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. సున్నీ గ్రామాలకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తన కుటుంబం సురక్షిత ప్రాంతానికి వెళ్లిందని, కానీ, తాను వెళ్లలేకపోయానని చెప్పారు.
"రాత్రంతా కాల్పుల శబ్దాలు వింటూనే ఉన్నాం. మా ఇంట్లోని మహిళలు, పిల్లలను కొండల్లో తలదాచుకోమని పంపాను. వాతావరణం చాలా చల్లగా ఉంది, కానీ నాకు వేరే మార్గం లేదు. ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు" అన్నారాయన.
ఈ ప్రాంతంలో కొన్ని నెలలుగా దాడులు జరుగుతున్నాయి, డజన్ల కొద్దీ మరణించారు. తాజా దాడి కూడా అలాంటిదే. దీంతో అక్కడి గిరిజన మండలి (ట్రైబల్ కౌన్సిల్) కాల్పుల విరమణను కోరింది.
షియా, సున్నీ నాయకులతో శనివారం స్థానిక అధికారులు చర్చలు ప్రారంభించారని ఏఎఫ్‌పీ తెలిపింది. మధ్యవర్తుల హెలికాప్టర్ ఈ ప్రాంతానికి రాగానే దానిపై కాల్పులు జరిగినట్లు పెషావర్‌లోని ఒక భద్రతా అధికారి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























