ఝార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ రాహుల్ గాంధీని ఇరకాటంలో పడేసిందా?

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఆయనపై విమర్శలు చేసింది.
దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని దీనికి హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ ఆరోపించారు.
దీనిపై స్పందించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.. ఝార్ఖండ్‌లో నిరసన చేస్తున్న విద్యార్థుల గొంతులను రాహుల్ గాంధీ ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు.
కాగా.. ఝార్ఖండ్ ఘటనకు సంబంధించి "శాంతియుత నిరసన చేసే వారిపై హింసకు మేం వ్యతిరేకం" అని రాహుల్ గాంధీ చెప్పారు.
విద్యార్థుల నిరసనపై పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రి సిద్ధంగా ఉన్నారని అయితే ప్రతిపక్షం సభ నుంచి పారిపోకుండా మొత్తం చర్చను వింటుందని హామీ ఇవ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.


ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images
రాహుల్ ఆరోపణలు - బీజేపీ సమాధానం
సోమవారం కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించింది.
దిల్లీలో విద్యార్థులపై హింస గురించి హోం మంత్రి అమిత్ షాను ప్రశ్నించింది.
"అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలని మేం కోరడం లేదు. దిల్లీలో యువతపై కాల్పులు జరపడానికి ఎవరు అనుమతి ఇచ్చారో ఆయన స్పష్టం చేయాలని మొదటి నుంచి మేం అడుగుతున్నాం" అని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు.
"రాహుల్ గాంధీ సభకు రావాలని సవాలు విసురుతున్నాను. మేం చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీకు తగిన సమాధానం లభిస్తుంది" అని ఆయన అన్నారు.
జంతర్‌మంతర్ వద్ద కాల్పులు జరిగాయన్న ఆరోపణలపై స్పందిస్తూ "రాహుల్ గాంధీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. జంతర్‌మంతర్ దగ్గర ఒక్క తూటా కూడా కాల్చలేదు. అలాగే అక్కడ కాల్పులకు ఆదేశాలేమీ ఇవ్వలేదు" అని నడ్డా చెప్పారు.
"విద్యార్థుల సమస్యపై హోం మంత్రి అమిత్ షా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. హోం మంత్రి స్పందన సమయంలో కాంగ్రెస్, ప్రతిపక్షాలు భయపడి పారిపోకూడదు. పూర్తి స్పందనను వినవలసి ఉంటుంది. రాహుల్ పారిపోవద్దు" అని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
ఝార్ఖండ్ నిరసనకు సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు
ఝార్ఖండ్‌లో నిరసన చేస్తున్న విద్యార్థుల గురించి ప్రస్తావించిన జేపీ నడ్డా.. "ఝార్ఖండ్‌లో విద్యార్థుల గొంతు రాహుల్ గాంధీకి వినిపించడం లేదా? నాకు తెలిసినంత వరకు ఆయన చెప్పడం మేరకే అక్కడ ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. పైగా ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆయన కూటమిలో అంతర్భాగం. అక్కడి విద్యార్థుల గొంతు ఆయనకు వినిపించడం లేదా?" అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. 81 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు 34 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 16 మంది ఉన్నారు.
రాంచీలో నిరసన సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జికి నిరసనగా బీజేపీ మంగళవారం ఝార్ఖండ్ బంద్ ప్రకటించింది.
సోమవారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో అసెంబ్లీకి తరలివెళ్తున్న నిరసనకారులకు పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు నిరసనకారులపై వాటర్ కానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేశారు.
విద్యార్థుల మార్చ్ అనంతరం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఒక బహిరంగ లేఖ రాసి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై ఝార్ఖండ్‌లోని విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
అమిత్ షా గురించి రాహుల్ గాంధీ ఏమన్నారు?
సోమవారం సాయంత్రం రాహుల్ గాంధీ అమిత్ షా గురించి మాట్లాడుతూ అనేక ఆరోపణలు చేశారు.
"ఆయన హోం మంత్రి, పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరిగాయి. విద్యార్థులను ముళ్ళ కర్రలతో కొట్టారు. దీనికి ఆయన ఆదేశాలు ఇచ్చారా లేదా అనే విషయాన్ని అమిత్ షా స్పష్టం చేయాలి" అని రాహుల్ అన్నారు.
"ఆదేశాలు ఇచ్చి ఉంటే మన పిల్లలపై కాల్పులు జరిపినందుకు ఆయనే దోషి. ఒకవేళ అక్కడ ఏం జరుగుతోందో ఆయనకు తెలియకపోతే హోం మంత్రిగా కొనసాగడానికి అర్హుడు కాదు. ఆయన రాజీనామా చేయాలి" అన్నారు.
"ఇప్పుడు అకస్మాత్తుగా మాట్లాడేందుకు సిద్ధమని అమిత్‌షా చెబుతున్నారు. ఆయన కల్పిత ప్రకటనలపై మాకు ఆసక్తి లేదు. పిల్లలపై కాల్పులు జరపడానికి ఆయన అనుమతి ఇచ్చారా లేదా అనేది మేం తెలుసుకోవాలనుకుంటున్నాము. ఆయన ముందుగా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఆ తర్వాతే చర్చ జరుగుతుంది" అని రాహుల్ స్పష్టం చేశారు.
అదే విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీని ఝార్ఖండ్ అంశంపై కూడా ప్రశ్నించారు.
"శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై హింసకు మేం వ్యతిరేకమని స్పష్టం చేస్తున్నాను" అని రాహుల్ గాంధీ అన్నారు
"ఇది ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం. మేము అటువంటి చర్యకు వ్యతిరేకం. మేం దానిని సమర్థించం" అని చెప్పారు.
దిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన సంఘటనలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
"హోంమంత్రి సమాధానం ఇచ్చే సమయంలో భయపడాల్సిన, పారిపోవలసిన అవసరం లేదు" సభలో ప్రతిపక్ష పార్టీలతో కిరణ్ రిజిజు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























