You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్‌లో సరికొత్తగా శాటిలైట్ బస్ టెర్మినల్: ప్రెస్ రివ్యూ
ఎల్బీ నగర్ కూడలి వద్ద సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులతో రద్దీగా ఉండకుండా హెచ్‌ఎండీఏ సరికొత్తగా శాటిలైట్ టెర్మినల్‌ను నిర్మించనుందని ఆంధ్రజ్యోతి కథనంలో తెలిపింది.
హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వనస్థలిపురంలో మహావీర్ హరిణ వనస్థలి జింకల పార్కు సమీపంలోని 1.2 కిలోమీటర్ల పరిధిలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఈ టెర్మినల్‌ను నిర్మించనుంది. ఈ శాటిలైట్ బస్‌బే ఏర్పాటు పనులను తొలుత ఆటోనగర్‌లోని క్రిడా వద్ద 750 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టనుంది. ఇందు కోసం హెచ్‌ఎండీఏ అధికారులు టెండర్లను ఆహ్వానించారు.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాద్‌కు వచ్చే వాహనాల రద్దీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉంటుండగా, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల రద్దీ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఉంటోంది. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా శాటిలైట్ బస్‌బేల ఏర్పాటుపై హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి డిజైన్లను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టిందని ఈ కథనంలో పేర్కొన్నారు.
అక్రమ నిర్మాణాలతో పరిస్థితి చెయ్యి దాటిపోతుంది: తెలంగాణ హైకోర్టు
అక్రమ నిర్మాణాలను ఇలాగే కొనసాగిస్తే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఈనాడు ఒక కథనంలో తెలిపింది.
గతంలో చెరువుల్లో నిర్మాణాలు చేపట్టాలంటే భయపడేవారని, ఇప్పుడూ లేక్ వ్యూ అంటూ నిర్మాణాలు చేపడుతున్నారని, చెరువులు, నాలాల్లో నిర్మాణాల కారణంగానే వరదలు వస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
జీవో 111కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవ్వవని, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అంటూ పదే పదే అవకాశాలిస్తే భవిష్యత్తులో మానవ మనుగడకే ముప్పు ఏర్పడుతుందని హై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది తీవ్రమైన అంశమని, పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్తూ జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిందని ఈనాడు కథనంలో రాశారు.
ఏపీలో నూతన ఇసుక విధానం
కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో మెరుగైన ఇసుక విధానానికి ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపిందని సాక్షి ఒక కథనంలో తెలిపింది.
అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఆఫ్‌లైన్‌లోనే ఇసుక పొందే అవకాశం కల్పించనుంది. రాజకీయ జోక్యానికి తావులేకుండా పారదర్శకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది.
గురువారం సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నూతన ఇసుక విధానంపై చర్చిస్తూ.. రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలను, ఎన్‌ఎండీసీ వంటి వాటిని సంప్రదించామని, ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకుంటే 13 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి, పారదర్శక పద్ధతిలో టెండర్లు నిర్వహించాలనే నిర్ణయానికి కేబినెట్ వచ్చింది.
ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఓ భాగం.. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం రెండో భాగం.. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు మూడో భాగంగా టెండర్లు జరుగుతాయి. ఇసుక సరఫరా కూడా పూర్తి పారదర్శకంగా జరగాలని సీఎం ఆదేశించారని ఈ కథనంలో రాశారు.
పదేళ్లు దాటిన వాహనాలకు ఇకపై తిరుమలలో నో ఎంట్రీ
పదేళ్లు దాటిన వాహనాలతో తిరుమలకు రావొద్దని ఏఎస్పీ మునిరామయ్య కోరినట్లు ఈనాడు ఒక వార్తలో పేర్కొంది.
ఏఎస్పీ గురువారం మాట్లాడుతూ తిరుమలలో నో హార్న్ జోన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాలపరిమితి దాటిన వాహనాలను కొండపైకి రాకుండా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే నిలిపివేసి అవగాహన కల్పిస్తామని, మంచి కండిషన్‌లో లేని వాహనాలతో ఘాట్ రోడ్‌పై ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- జో బైడెన్, డోనల్డ్ ట్రంప్: ఏడు దశాబ్దాల వీరి జీవిత ప్రయాణాలు ఎలా సాగాయంటే...
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజేత ఎవరో కోర్టులు నిర్ణయించగలవా?
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఆరిజోనాలో ముందంజలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిరాల్ తిపిర్నేని ఎవరు?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)