కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల్లో 92 మంది చిన్నారులకు పాజిటివ్ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఇప్పటివరకు వృద్ధులనే భయపెట్టిన కరోనావైరస్‌.. ప్రస్తుతం యువతతోపాటు చిన్నారుల పాలిట శాపంగా మారుతోందంటూ నమస్తే తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది.

చిన్నారులకు కరోనా మహమ్మారి ప్రాణాంతకంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యాధి బారినపడ్డ 52 మంది చిన్నారులు గాంధీ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.

వైరస్‌ సోకిన ఈ చిన్నారులంతా 12 ఏళ్ల లోపువారే. వారిలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన 23 రోజుల పసికందుతోపాటు మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

ఇటీవల నిర్ధరణైన కేసుల్లో వృద్ధులే అధికంగా ఉన్నారని చెప్పిన అధికారులు, మొన్నటికి మొన్న యువతను కూడా వదలడంలేదని తేల్చారు. కానీ తాజాగా చిన్నారులకు కూడా సోకుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.

హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లో కూడా కరోనావైరస్‌ చిన్నారులకు సంక్రమిస్తున్నట్టు నిర్ధరణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, వైద్యులు వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం ప్రాంతాలకు చెందిన చిన్నారులకు వైరస్‌ సోకింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ 40 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. 3 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న వారంతా దిల్లీలోని మర్కజ్‌కు హాజరైనవారి కుటుంబసభ్యులేనని తేలింది.

కరోనా బారినపడిన 124 మంది మహిళల కుటుంబాల్లో ఎవరో ఒకరు తబ్లీగీ జమాత్‌కు హాజరైనవారేనని నమస్తే తెలంగాణ పత్రిక ఈ కథనంలో తెలిపింది.

గడపదాటిన 3 వేలమంది

ఆంధ్రప్రదేశ్‌లో హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న వ్యక్తులు పదే పదే గడప దాటుతున్నారంటూ ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది, ఆ వివరాలు ఇవి.

విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి గృహ నిర్బంధంలో ఉంటున్న వారిలో అనేక మంది పదే పదే ఆంక్షలు ఉల్లంఘించి బయటకు వస్తున్నారు.

హౌస్ క్వారంటైన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఏపీ పోలీసులు మొత్తం 21,175 మందిని పర్యవేక్షణలో ఉంచగా... వారిలో 3,008 మంది ఆంక్షలను ఉల్లంఘించారు. పదే పదే ఇంటి నుంచి బయటకు వస్తూ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు.

వారిలో కొంత మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా, మరి కొంత మందికి కౌన్సెలింగ్ ఇచ్చి బయటకు రాకుండా స్వీయ నిర్బంధంలోకి పంపుతున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌లో సరిగ్గా ఉంటున్నారో, లేదో పర్యవేక్షించేందుకు పోలీసులు హౌస్ క్వారంటైన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారి ఇళ్లను జియో ఫెన్సింగ్ చేశారు. క్వారంటైన్‌లో ఉన్న వారు హద్దుల నుంచి 50 మీటర్లు దాటి బయటకు వస్తే ఆ సమాచారం వెంటనే కంట్రోల్ రూమ్‌కి చేరి పోతుంది. అలా పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వారు ఎక్కడెక్కడ తిరిగారో గుర్తించి ఆ ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు.

ఇలా ఉల్లంఘనలకు పాల్పడ్డ వారిలో కడప జిల్లాలో అత్యధికంగా 635మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 424, తూర్పు గోదావరి జిల్లాలో 352, చిత్తూరు జిల్లాలో 185, రాజమండ్రి అర్బన్‌లో తక్కువగా 27 మంది ఉన్నారని ఈనాడు తన కథనంలో వివరించింది.

తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా

మొదట రాజధాని హైదరాబాద్‌ నగరంలో మాత్రమే కనిపించిన వైరస్‌.. విజృంభించి అనేక జిల్లాలకు పాకుతోందంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.

కోవిడ్-19 మహమ్మారి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ నుంచి సూర్యాపేట వరకు చాలా జిల్లాల్లో విశ్వరూపం చూపుతోంది.

నిజానికి.. ఏప్రిల్‌ ఏడు నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య సున్నాకు చేరుతుందని ప్రభుత్వం భావించింది. కానీ.. మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిత్యం కొత్తగా పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతూ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 766కు చేరింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 20 కేసులు నమోదు కాగా.. అందులో 19 కేసులు ఒక్క సూర్యాపేట జిల్లాలోనివే కావడం గమనించదగ్గ విషయం.

వికారాబాద్ జిల్లాలోనూ 21 మందికి కరోనా సోకింది. అక్కడ వైరస్ వ్యాప్తికి కూడా ఒక్కరే కారణమయ్యారు. ఈ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదైన ఓ కాలనీలో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి మొత్తం 311 నమూనాలను సేకరించారు. ఫలితాలు ఇవాళ వచ్చే అవకాశం ఉంది.

ఆదిలాబాద్‌ జిల్లాలో శుక్రవారం ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 14కు చేరింది.

ఇక.. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఆ జిల్లాలో 52 మంది వైరస్‌ బారిన పడ్డారు.

నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు 58 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 417 మందికి వైరస్‌ సోకగా.. నిజామాబాద్‌, రంగారెడ్డి, గద్వాల, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, సూర్యాపేట జిల్లాల్లో 192 కేసులు నమోదయ్యాయి.

అంటే.. ఇప్పటిదాకా పాజిటివ్‌గా తేలిన 766 మందిలో 609 మంది ఈ ఏడు జిల్లాలవారే. దీంతో ఆయా జిల్లాలపై వైద్య ఆరోగ్యశాఖ ఎక్కువగా దృష్టిపెట్టింది.

అక్కడ కట్టడి చేస్తే వైరస్‌ ఉధృతి తగ్గుతుందని.. మిగిలిన జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి అంత తీవ్రంగా లేదని అధికారులు చెబుతున్నట్టు ఆంధ్రజ్యోతి ఈ కథనంలో వివరించింది.

అక్కడ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గ్రీన్‌ సిగ్నల్

ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర ‘ఈ–కామర్స్‌’సంస్థల కార్యకలాపాలకు కొన్ని రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

నిత్యావసర వస్తువులతో పాటు, అన్ని ఉత్పత్తుల అమ్మకాలకు ఈ-కామర్స్ సంస్థలకు అనుమతినిస్తున్నట్లు మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు తెలిపాయి.

అయితే, ఆయా ఉత్పత్తుల సరఫరా సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి.

ఈ-కామర్స్‌ సంస్థలు అమ్మకాలు జరుపుకోవచ్చంటూ అనుమతినిచ్చిన కేంద్రం.. స్థానిక పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించింది.

ఆహారం, ఔషధాలు, సహా అన్ని నిత్యావసర, గృహావసర వస్తువుల అమ్మకాలకు అనుమతిస్తున్నట్లు మహారాష్ట్ర పేర్కొంది. అయితే, ‘ఈ –కామర్స్‌’ అమ్మకాలపై తెలంగాణ, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని సంస్థలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించడంతో లాప్‌టాప్స్, వైఫై రౌటర్స్, స్మార్ట్‌ ఫోన్స్‌ తదితర వస్తువులకు భారీ డిమాండ్‌ ఏర్పడిందని ఈ–కామర్స్‌ సంస్థల ప్రతినిధులు తెలిపారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే, వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తామని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు ప్రకటించినట్టు సాక్షి ఈ కథనంలో తెలిపింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)